ఏసుక్రీస్తు: శిలువ వేయడమనే క్రూరమైన శిక్ష ఎప్పుడు మొదలైంది... ఎందుకు వేసేవారు?

వీడియో క్యాప్షన్, శిలువ వేయడం ఎప్పుడు మొదలైంది? ఈ శిక్షఎంత క్రూరంగా ఉండేది?
    • రచయిత, మార్గరీటా రోడ్రీగ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

శిలువపై మరణించిన వారిలో ఏసు క్రీస్తు ప్రముఖులు. అయితే, ఆయన జననం కంటే కొన్ని శతాబ్దాల ముందు కూడా ఈ దారుణ శిక్ష అమలులో ఉండేది.

‘‘ప్రాచీన కాలంలో అత్యంత దారుణమైన మూడు మరణ శిక్షల్లో శిలువ వేయడం మొదటిది. బతికుండగానే నిప్పు పెట్టడం, తల నరికేయడం ఆ తర్వాతి స్థానాల్లో ఉంటాయి’’అని దక్షిణాఫ్రికాలోని ఫ్రీస్టేట్ యూనివర్సిటీ పరిశోధకురాలు, రచయిత లూసీ సిలీర్స్ చెప్పారు.

‘‘క్రూరత్వానికి ఇది ప్రతీక. అంతేకాదు చూసేవారిలోనూ ఇది భయాన్ని పుట్టిస్తుంది’’ అని స్పెయిన్‌లోని నవరా యూనివర్సిటీ థియోలజీ ప్రొఫెసర్ డీగో పెరేజ్ గోడార్ వ్యాఖ్యానించారు.

చాలా కేసుల్లో బాధితులు శిలువ వేసిన తర్వాత కొన్ని రోజులకు మరణిస్తారు. అటువైపుగా వెళ్లేవారికి వీరు శిలువపై అలా వేలాడుతూ కనిపిస్తారు.

శిలువ వేయడంతో శరీరం నుంచి రక్తం బయటకు పోతుంది. శరీరంలో నీటి స్థాయులు పడిపోతాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. నెమ్మదిగా ఒక్కో అవయవం విఫలం అవుతూ వస్తుంది.

ఇంతకూ శిలువ వేయడాన్ని ఎప్పుడు, ఎక్కడ మొదలుపెట్టారు?

శిలువ

ఫొటో సోర్స్, Getty Images

ఏసుకు 500 ఏళ్లకు ముందు నుంచే ఉందా?

శిలువ వేయడం పశ్చిమ ఆసియాలోని అస్సిరియా, బాబిలోనియా నాగరికతల్లో పుట్టి ఉండొచ్చని సిలీర్స్ చెప్పారు.

‘‘క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో పర్షియాలో శిలువ వేయడం ద్వారా మరణ శిక్ష విధించినట్లు చరిత్ర చెబుతోంది’’ అని ఆమె వివరించారు.

అస్సిరియా పురాతన భవనాలపై అలంకరణల్లో శిలువ వేసిన బొమ్మల చిత్రాలు కూడా కనిపించేవని ప్రొఫెసర్ పెరేజ్ చెప్పారు.

‘‘ఆ భవనాల్లోని గోడలపై మనకు బొమ్మలు కనిపిస్తాయి. వీటిలో యుద్ధాలు, విజయాల ఘటనలను బొమ్మలుగా వేశారు. యుద్ధ ఖైదీలకు ఎలా మరణ శిక్ష విధించారో కూడా వీటిలో మనం చూడొచ్చు. శిలువ వేయడంతోపాటు మలద్వారం గుండా కర్రలను చొప్పించిన బొమ్మలు కూడా మనకు కనిపిస్తాయి’’ అని ఆయన చెప్పారు.

శిలువ చరిత్ర, విధానాలపై 2003లో సిలీర్స్ ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. ఇది దక్షిణాఫ్రికా మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.

పర్షియన్లు రెండు చెక్కలతో కనిపించే శిలువకు బదులుగా చెట్లు లేదా స్తంభాలపై శిలువ వేసేవారని ఆ పరిశోధన పత్రంలో సిలీర్స్ రాశారు.

శిలువ

ఫొటో సోర్స్, Getty Images

శిక్షను ఇతర ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన అలెగ్జాండర్

క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో తూర్పు మధ్యదరా ప్రాంతంలోని దేశాలకు ఈ దారుణమైన మరణ శిక్షను అలెగ్జాండర్ తీసుకొచ్చారు.

‘‘శత్రు దుర్భేధ్యంగా చెప్పుకునే టైర్ నగరాన్ని (నేటి లెబనాన్) అలెగ్జాండర్ బలగాలు క్రీ.పూ. నాలుగో దశాబ్దంలో చుట్టుముట్టాయి. ఎట్టకేలకు వారు ఆ నగరాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు 2,000 మందికి అక్కడ శిలువ వేశారు’’ అని సిలీర్స్ చెప్పారు.

ఈజిప్టు, సిరియాలకూ ఈ శిక్షను అలెగ్జాండర్ తీసుకెళ్లారు. ఫ్యూనికన్లు స్థాపించిన ఉత్తర ఆఫ్రికా మహా నగరం కార్తేజ్‌కూ శిలువను ఆయనే తీసుకెళ్లారు.

ప్యూనిక్ యుద్ధాలు (క్రీ.పూ. 264 -146) కాలంలో ఈ విధానాన్ని రోమన్లు కూడా నేర్చుకున్నారు.

‘‘ఆ తర్వాత 500 ఏళ్లలో ఈ మరణ శిక్షను రోమన్లు మరింత క్రూరంగా మార్చారు’’ అని సిలీర్స్ చెప్పారు.

‘‘రోమన్ బలగాలు తాము యుద్ధానికి వెళ్లిన ప్రతి చోటా అక్కడి ఖైదీలకు శిలువ వేసేవి’’ అని ఆమె వివరించారు. కొన్నిచోట్ల వీరిని చూసి స్థానిక రాజ్యాలు కూడా శిలువ వేయడం మొదలుపెట్టాయని తెలిపారు.

క్రీ.శ. 9లో ట్యూటోబరో యుద్ధంలో విజయం తర్వాత రోమన్ సైనికులకు జర్మన్ జనరల్ ఆర్మీనియస్ కూడా శిలువ వేశారు. జర్మనీ సేనల చేతుల్లో రోమన్లకు దీన్ని దారుణమైన ఓటమిగా చరిత్రకారులు చెబుతుంటారు.

క్రీ.శ. 60లో పురాతన బ్రిటిష్ రాణి బౌదికా కూడా రోమన్లపై దండెత్తారు. అప్పుడు కూడా ఆమె భారీగా రోమన్ సైనికులకు శిలువ వేసి మరణ శిక్షలు అమలు చేశారు.

శిలువ

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్‌లో రోమన్లు రాక ముందు నుంచే..

పురాతన ఇజ్రాయెల్‌లో రోమన్ల రాకకు ముందు నుంచే ఈ మరణ శిక్ష అమలులో ఉండేది.

‘‘ఈ పవిత్ర భూమి రోమన్ల చేతుల్లోకి వెళ్లే ముందే ఇక్కడ శిలువలు వేసినట్లు చరిత్ర చెబుతోంది’’ అని ప్రొఫెసర్ పెరేజ్ చెప్పారు.

మొదటి శతాబ్దంలో జన్మించిన రోమన్-యూదు చరిత్రకారుడు, రాజకీయ నిపుణుడు, సైనికుడు ఫ్లేవియస్ జోసెఫస్ రచనల్లో ఈ శిలువ గురించి ప్రస్తావన ఉంది.

అలెగ్జాండర్ జెన్నీయస్ (క్రీ.పూ.125-76) పాలనా కాలంలో క్రీ.పూ.88లో భారీగా ప్రజలకు శిలువవేసి మరణ శిక్షలు విధించినట్లు ఆయన రచనల్లో ఉంది.

‘‘దాదాపు 800 మంది యూదులకు జెన్నీయస్ మరణ శిక్ష విధించారు. పిల్లలు, భార్యల ముందే వారికి బహిరంగంగా శిలువ వేశారు’’ అని ఫ్లేవియస్ రాసుకొచ్చారు.

ఫ్లేవియస్ జోసెఫస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్లేవియస్ జోసెఫస్

ఆ నొప్పిని ఊహించుకోలేం

ఈ మరణ శిక్షలో భిన్న రకాల శిలువలను ఉపయోగించడం అనేది రోమన్లతోనే మొదలైందని సిలీర్స్ చెప్పారు.

‘‘ఎక్స్ ఆకారంలో శిలువలను కూడా వారు ఉపయోగించేవారు. కానీ, ఎక్కువగా టీ ఆకారం శిలువలు కనిపించేవి. వీటిలో కొన్ని చాలా పొడుగ్గా ఉండేవి’’ అని ఆమె చెప్పారు.

కొన్నిసార్లు మరణ శిక్ష విధించే చోటుకు ఆ శిలువను ఆ వ్యక్తే భుజాలపై మోసుకుని వెళ్లాల్సి ఉంటుంది.

‘‘ఆ వ్యక్తికి బట్టలను తొలగించి, వీపు కర్రకు ఆనుకునేలా, చేతులను పక్కకు చాపించి శిలువ వేసేవారు’’ అని సిలీర్స్ వివరించారు.

సాధారణంగా వారి చేతులను అడ్డంగా ఉండే కర్రకు తాడుతో కడతారు. కొన్నిసార్లు మణికట్టులోకి మేకులు కూడా వేస్తారు.

సాధారణంగా బాధితుల అరచేతుల్లోకి మేకులు వేయరు. ఎందుకంటే శరీరం బరువు వల్ల కండరాలు చీలిపోయే అవకాశం ఉంటుంది. అదే మణికట్టులో అయితే, ఎముకలు గట్టిగా మేకులను పట్టుకోగలవు.

మేకులు 18 సెం.మీ.ల నుంచి ఒక సెం.మీ. మందం వరకూ ఉంటాయి.

అడ్డంగా ఉండే స్తంభాన్ని అప్పటికే ఆ వ్యక్తికి కడితే.. ఆయన్ను లేదా ఆమెను కాస్త పైకిలేపి, భూమిలో ఇదివరకే పాతిన మరో నిలువు స్తంభానికి అమరుస్తారు. అప్పుడు అది శిలువలా కనిపిస్తుంది.

ఆ నిలువు స్తంభానికి కాళ్లను కడతారు లేదా మేకులు వేస్తారు. ఒక్కోసారి ముందు వైపు మాత్రమే మేకులు వేస్తారు. అప్పుడు కూడా కాళ్లలోని ఎముకల గుండా మేకులు వెళ్లేలా చూసుకుంటారు.

దీని నుంచి వచ్చే నొప్పిని కనీసం మనం ఊహించుకోలేం.

ఏసుప్రభు

ఫొటో సోర్స్, Getty Images

‘‘చాలా నరాలపై ఒత్తిడి పడుతుంది’’ అని ప్రొఫెసర్ పెరేజ్ చెప్పారు.

‘‘శిలువపై అలా ఉండే మీరు కష్టం మీద శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన వివరించారు.

‘‘చాలా రక్తం పోతుంది. విపరీతమైన నొప్పి వస్తుంది. చాలా కేసుల్లో మరణం చాలా నెమ్మదిగా వస్తుంది. వరుసగా శరీరంలో అవయవాలు విఫలం అయిన తర్వాత చనిపోతారు’’ అని ఆయన చెప్పారు.

ఇలాంటి కేసుల్లో ఎక్కువగా శరీరంలో రక్తం తగ్గిపోవడం (హైపోవోలెమియా), నీటి స్థాయులు పడిపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టం అవుతుందని డాక్టర్ సిలీర్స్ చెప్పారు.

ఎక్కువ మంది ఊపిరి అందక చనిపోతారని వివరించారు.

గంటలు.. రోజులు..

ఇక్కడ అతి క్రూరమైన విషయం ఏమిటంటే, శిలువ వేసిన తర్వాత కొందరు మరణించడానికి కొన్ని రోజులు పడతుంది. మరికొందరు కొన్ని గంటల్లో కూడా చనిపోవచ్చు. ఏసు ఆరు గంటల తర్వాత మరణించినట్లు బైబిల్ చెబుతోంది.

‘‘కొన్ని కేసుల్లో వేగంగా మరణించడానికి బాధితుల మోకాళ్లను చితక్కొడతారు. దీంతో కాస్త వేగంగా చనిపోయే అవకాశం ఉంటుంది’’ అని పెరేజ్ చెప్పారు.

ఏసుతోపాటు మరణ శిక్ష విధించిన ఇద్దరికీ ఇలా మోకాళ్లను రోమన్ సైనికులు చితక్కొట్టారు. కానీ, ఏసుకు ఏమీ చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన మరణించారు.

‘‘అప్పటికే లోహపు ముక్కలు, పదునైన ఎముకలతో కూడిన కొరడాలతో ఏసును విపరీతంగా కొట్టారు. ఆయన చాలా రక్తం కోల్పోయారు. నిజానికి ఇలా కొట్టినప్పుడే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది’’ అని సిలీర్స్ వివరించారు.

వీడియో క్యాప్షన్, గుణదల: మేరీ మాతకు భక్తులు తలనీలాలు అర్పించే చర్చి ఇది

శిలువ వేయడాన్ని ఎవరు రద్దు చేశారు?

దోషులు చేసిన తప్పును అందరికీ తెలిసేలా చేసేందుకు, దారుణమైన శిక్ష విధించేందుకు శిలువను ఎంచుకుంటారని పెరేజ్ చెప్పారు.

‘‘శత్రువులకు ఎక్కువగా ఈ శిక్ష విధించేవారు. నేరాలు చేసేవారిని వదిలిపెట్టబోమని చెప్పడానికి కూడా దీన్ని ఎంచుకునేవారు’’అని వివరించారు.

సాధారణంగా రోమన్ పౌరుల కంటే విదేశీయులు, బానిసలకు ఎక్కువగా దీన్ని విధించేవారు.

‘‘అయితే, దోపిడీ, సైనిక తిరుగుబాటు, ఉగ్రవాదం, రక్తపాతానికి కారణమయ్యే కొన్ని నేరాలకూ శిలువ వేసేవారు’’ అని పెరేజ్ చెప్పారు.

‘‘ఏసును వారు ముప్పుగా భావించారు. ప్రపంచంలో మార్పును కోరుకోని వారే ఆయన్ను అంతం చేయాలని చూశారు. అంతేకాదు, ఆయనకు శిలువ వేయడం ద్వారా ఇలాంటి మార్పును తాము సహించబోమని సందేశం ఇవ్వాలని భావించారు’’ అని ఆయన చెప్పారు.

క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రోమన్ చక్రవర్తి కాన్‌స్టెంటైన్ 1 శిలువ వేయడాన్ని రద్దు చేశారు. క్రైస్తవంలోకి మారిన తొలి రోమన్ చక్రవర్తి కూడా ఆయనే.

ఆయన క్రైస్తవాన్ని చాలా ప్రోత్సహించారు. ఆ మతాన్ని అనుసరించేవారికి ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించారు.

అయితే, చాలా శతాబ్దాల వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఈ మరణ శిక్ష కొనసాగింది. జపాన్‌లో 1597లో కూడా 26 మంది క్రైస్తవులకు శిలువపై మరణ శిక్ష విధించారు.

అత్యంత క్రూరమైన చరిత్ర ఉన్నప్పటికీ, నేడు ప్రేమ, త్యాగాలకు ప్రతిరూపంగా శిలువ నిలుస్తోంది.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్: కాథలిక్ చర్చికి కార్డినల్‌గా ఎంపికైన తొలి దళితుడు పూల ఆంథోని

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)