కేరళ ఆదివాసీ యువకుడి హత్య కేసులో 5ఏళ్ల తరువాత తీర్పు

- రచయిత, మోహన్
- హోదా, బీబీసీ కోసం
కేరళలోని అట్టప్పాడిలో 2018లో చోటుచేసుకున్న గిరిజన యువకుడి హత్య కేసులో దోషులకు శిక్ష పడింది.
ఈ కేసులో దోషులుగా తేలిన 13 మందికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. మరో వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష పడింది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోగల మన్నార్‌గట్‌లో ముక్కాలి, సిందకి అనే గ్రామాలు ఉంటాయి. 2017 చివర్లో, 2018 ప్రారంభంలో ఈ గ్రామాల్లో వరుస దొంగతనాలు జరిగాయి.
ముతుగ అనే గిరిజన తెగకు చెందిన 30ఏళ్ల మధు మానసిక వికలాంగుడు.
తండ్రిని కోల్పోయిన మధు... తల్లి మల్లి, సోదరి సరస్వతితో కలిసి నివసిస్తూ ఉండేవాడు.
మధు ఉండే అట్టప్పాడి పరిధిలోని ఆకాలి, ముక్కాలి వంటి చోట్ల మానసిక వ్యాధిగ్రస్తుల ప్రభావం ఎక్కువగా ఉండేది, ఇష్టానుసారం వ్యవహరించేవారు.
దుకాణాల్లో యజమాని అనుమతి లేకుండానే ఆహార పదార్థాలను తీసుకోవడం వారికి అలవాటు.
అయితే, వరుస చోరీల బాధ్యులకు బుద్ధి చెప్పాలని పలువురు పథకం రచించారు.

మధుపై ఎంతమంది దాడి చేశారు?
2018 ఫిబ్రవరి 22న వండిక్కడౌ టీ ఎస్టేట్ సమీపంలోని అజ్ముడి అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన 16 మంది మధుపై తీవ్రంగా దాడి చేశారు.
ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఆహారం, మద్యం దొంగిలించాడని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే మధు శరీరంపై బలమైన గాయాలున్నాయి.
పోలీస్టేషన్‌కు తీసుకెళ్లేలోపే మధు స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
మానసిక వికలాంగుడైన ఈ గిరిజన యువకుడి మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మధు శరీరంపై 15 చోట్ల తీవ్రంగా కొట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా మధు కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇన్వెస్టిగేషన్ అధికారులు 2018 మార్చిలో హత్య, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి, 3,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు .
అయితే ఛార్జిషీటు దాఖలైనప్పటికీ నాలుగేళ్లు దాటినా ఈ కేసులో విచారణ ప్రారంభం కాలేదు. మరోవైపు 2018 మే 31 ఈ కేసులో అరెస్టయిన వారికి బెయిల్ మంజూరైంది.
మన్నార్‌గాడు ప్రత్యేక ఎస్సీ/ఎస్సీ/డీ కోర్టులో ఈ కేసు ఉంది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినా విచారణ జరగడం లేదన్న ఆరోపణలు వినిపించాయి.
శాశ్వత న్యాయమూర్తి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి అడ్డంకులను అధిగమించి నాలుగేళ్ల తర్వాత 2022 ఏప్రిల్ 28న ఈ కేసు విచారణ ప్రారంభమైంది.
గతేడాది ఆగస్టులో నిందితులు సాక్షులను బెదిరించేందుకు ప్రయత్నించడంతో కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది.
ఆ తర్వాత పరారీలో ఉన్న కొందరిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఇక కోర్టులో విచారణ 2023 జనవరి 10న ముగిసింది.

విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
మృతిచెందిన మధు గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి. 16 మంది నిందితులు గిరిజనేతరులు.
విచారణ సమయంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుల్లో 10 మంది మధును బట్టలతో కట్టేసి, కర్రలతో ముఖం, శరీరం వెనక భాగంలో దారుణంగా కొట్టారు.
మధుపై దాడి చేస్తున్న దృశ్యాలను 8వ దోషి అయిన ఉబైద్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలు ప్రాసిక్యూషన్‌లో కీలక సాక్ష్యాలుగా నిలిచాయి.
మధును తీవ్రంగా కొట్టి... బియ్యం, ఇతర వస్తువులు ఉన్న బ్యాగును అతని వీపుపై పెట్టారు.
మధు చేతులు కట్టేసి అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు అర్ధనగ్నంగా తీసుకొచ్చారు.
అంతేకాకుండా మధుపై దాడికి పాల్పడిన దృశ్యాలను అతడిని కించపరిచే ఉద్దేశంతో సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు నిందితులు.
కాగా, పోలీసులకు అప్పగించే ముందు మధు ఛాతీపై హుస్సేన్ (ఏ1 నిందితుడు) కాలితో తన్నాడు. దీంతో పక్కనే ఉన్న గోడకు మధు తల తగిలింది.
ఈ కేసులో హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునేలోపు మద్యం మత్తులో చనిపోయి కనిపించాడు. ఈ సంఘటన మొత్తం 2018 ఫిబ్రవరి 22న జరిగింది.

కోర్టు ఏం తీర్పు ఇచ్చింది?
అయితే, ఈ కేసులో మొదటి దశలో వాంగ్మూలం ఇచ్చిన అటవీ శాఖ సిబ్బందితో పాటు మరికొందరు ఆ తర్వాత మాట మార్చారు.
మొత్తం 122 మంది సాక్షుల్లో 10 మంది తమ వాంగ్మూలాలను ఉపసంహరించుకున్నారు. పోలీసుల ఒత్తిడి వల్లే అలా సాక్ష్యమిచ్చామని వ్యాఖ్యానించారు.
మన్నార్‌గాడు ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న 16 మంది నిందితుల్లో 14 మందిని దోషులుగా, ఇద్దరిని (అనీష్, అబ్దుల్ కరీమ్) నిర్దోషులుగా ప్రకటించింది.
మధుపై దాడి సంబంధిత వీడియోను మాత్రమే తీశాడన్న కారణంతో మునీర్‌కు మూడు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.
హుస్సేన్, మరకర్, షంషుద్దీన్, రాధాకృష్ణన్, అబూబకర్, సిద్దిఖీ, ఉబైద్, నజీబ్, జైజుమోన్, సజీవ్, సతీష్, హరీష్, బిజుతో పాటు మరో 13 మందికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.లక్ష జరిమానా విధించారు.
జరిమానాలో 75 శాతం మధు కుటుంబానికి, ఆయన చట్టపరమైన వారసులకు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
మధు హత్య కేసును 'దేవుళ్లకు నిలయమైన దేశంలో మొదటి మూక హత్య కేసు (ఫస్ట్ మాబ్ లిన్చింగ్ కేస్ ఇన్ గాడ్స్ ఓన్ కంట్రీ) 'గా కోర్టు తన తీర్పులో తెలిపింది.
ఈ కేసులో తప్పుడు సాక్షులుగా మారిన పది మందిపై ఐపీసీ సెక్షన్ 193 కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
సీసీటీవీ ఫుటేజీలు ఉన్నప్పటికీ మధు సమీప బంధువు సహా పలువురు సాక్షులు తమ స్టేట్‌మెంట్స్ మార్చుకోవడం జుగుప్సాకరంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ప్రాథమిక సాక్ష్యాలను ఈ విధంగా మార్చడాన్ని అనుమతించలేమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
అంతేకాకుండా ఈ కేసుపై క్రమం తప్పకుండా రిపోర్ట్ చేసినందుకు మీడియాను కోర్టు అభినందించింది.
మీడియా ఈ కేసుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి కారణమైందని అభిప్రాయపడింది.
మధుకు న్యాయం చేయడంలో మీడియా పాత్రను గుర్తించామని కోర్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














