అస్లాం బలోచ్: హనుమంతుడిపై పాకిస్తాన్ జర్నలిస్ట్ వివాదాస్పద పోస్టు, అరెస్టు చేసిన పోలీసులు

ఫొటో సోర్స్, SINDH POLICE
- రచయిత, షుమైలా ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిందువులు ఆరాధించే హనుమాన్‌ను అవమానించినందుకు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ పోలీసులు ఓ జర్నలిస్టును అరెస్ట్ చేశారు.
ఆయనపై మిర్‌పుర్‌ఖాస్ నగరంలోని శెటెలాయిట్ పోలీస్ స్టేషన్‌లో దైవదూషణ చట్టం కింద కేసు నమోదైంది.
అక్కడి లుహానా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా రమేశ్ కుమార్ మాట్లాడుతూ- ''మార్చి 19న అస్లాం బలోచ్ అనే స్థానిక జర్నలిస్ట్ తన ఫేస్‌బుక్ పేజీ, వాట్సాప్ గ్రూప్‌లో భగవాన్ హనుమంతుని చిత్రాన్ని షేర్ చేయడాన్ని చూశాను'' అన్నారు.
ఆ సమయంలో తాను తన స్నేహితులతో ఉన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఈ చర్యతో అస్లాం బలోచ్ తనతో పాటు ఇతర హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ చిత్రాన్ని షేర్ చేయడం ద్వారా మతాల మధ్య అనైక్యతను చాటేందుకు, శాంతిభద్రతలను చెడగొట్టేందుకు అస్లాం ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
రమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అస్లాం బలోచ్‌పై పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని 295ఎ, 153ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఉద్దేశపూర్వకంగా రెండు మతాల మధ్య అనైక్యతను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారిని పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295ఎ ప్రకారం శిక్షించే నిబంధన ఉంది.
మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తే ఈ సెక్షన్ కింద పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.
పాకిస్థాన్‌లో సాధారణంగా మైనారిటీ మతాలకు చెందిన వారిపై దైవదూషణ కేసులు నమోదు అవుతుంటాయి.
మెజారిటీ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులపై కూడా ఈ తరహా కేసులు నమోదైన సందర్భాలూ ఉన్నాయి.
అస్లాం సోషల్ మీడియాలో ఏం షేర్ చేశారు?
అస్లాం బలోచ్ తన ఫేస్‌బుక్, వాట్సాప్ అకౌంట్‌లలో "కెప్టెన్ శ్రీ రామ్ పార్క్ వాలే" అని ఒక పోస్టు షేర్ చేశారు.
ఈ సోషల్ మీడియా పోస్టును పాకిస్థాన్‌లోని హిందూ సమాజానికి చెందిన ప్రజలు వ్యతిరేకించారు. అదే సమయంలో సింధీ ముస్లింలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి జ్ఞాన్‌చంద్ ఇస్రానీ సింధ్ ప్రావీన్సు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను సంప్రదించారు. మిర్‌పుర్‌ఖాస్ జిల్లా ఎస్ఎస్పీతో కూడా మాట్లాడారు. ఆ జర్నలిస్టును వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎవరి మతాన్ని కించపరచడాన్నీతాము అనుమతించబోమని, అలాంటి చర్యలను సహించబోమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
హిందువుల దేవుడిని అవమానించారని, దీని వల్ల హిందువుల మత మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. పాకిస్తాన్‌లో మత సహనానికి కేంద్రంగా కూడా సింధ్‌ను పరిగణిస్తారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఏదో ఒక కుట్రతో ఈ పని చేసి ఉండొచ్చని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.

హిందూ సమాజానికి 'అస్లాం క్షమాపణ'
అదే సమయంలో అస్లాం బలోచ్ వీడియో స్టేట్‌మెంట్ బయటికొచ్చింది. అందులో అస్లాం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాడు. తాను హనుమాన్ పోస్ట్ చేయలేదని, తనకు ఎవరో షేర్ చేశారని, దానిని తాను మరింతగా షేర్ చేశానని అస్లాం అందులో
హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో తరుచుగా పాల్గొంటున్నానని అస్లాం బలోచ్ గుర్తుచేశారు.
మరోవైపు ఇది కుట్ర అయి ఉండొచ్చని ఫిర్యాదుదారు రమేశ్ వాదిస్తున్నారు.
పాకిస్తాన్‌లో అత్యధిక శాతం హిందువులు సింధ్ ప్రావిన్స్‌లో మాత్రమే నివసిస్తున్నారు. ఆ ప్రావిన్స్‌లోని హిందూ జనాభాలో 70 శాతం మంది కేవలం మిర్‌పుర్‌ఖాస్‌లోనే ఉన్నారు.
మిర్‌పుర్‌ఖాస్ సరిహద్దు జిల్లాలుగా తార్‌పార్కర్, ఉమర్‌కోట్, సంఘర్‌లు ఉన్నాయి. ఈ జిల్లాలు భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














