ఘోస్ట్ సిటీ: అందమైన పెద్ద పెద్ద భవనాల్లో వృద్ధులు మాత్రమే ఉంటున్నారు, ఎందుకంటే?

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE
చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించిన భారత్‌లోనూ జనాలు లేని ప్రాంతాలు ఉన్నాయి. అవి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంతానోత్పత్తి స్థాయి అట్టడుగుకు పడిపోవడం, వలసల కారణంగా వృద్ధులు మాత్రమే మిగిలిపోయారు.
కేరళలోని కుంబనాడ్ పట్టణంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడికి వెళ్లిన బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ అందించిన కథనం ఇది.
కొన్నేళ్లుగా కేరళ రాష్ట్రం కుంబనాడ్ పట్టణంలోని పాఠశాలలు అసాధారణ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
అక్కడ విద్యార్థుల కొరత ఉంది. ఉన్న కొంతమందిని పాఠశాలల వరకు తీసుకురావడానికి టీచర్లు తమ జేబులో నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
కుంబనాడ్‌లో 150 సంవత్సరాల పురాతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ప్రస్తుతం 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఏడో తరగతిలో ఎక్కువగా ఏడుగురు విద్యార్థులు ఉన్నారు.
తరగతిలో విద్యార్థుల సంఖ్య పరంగా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నది ఏడో తరగతిలోనే. 2016లో అయితే కేవలం ఒక విద్యార్థితోనే ఏడో తరగతి నడిచింది.
ఇప్పటి పరిస్థితి ఇలా ఉంటే, 1980ల చివరి వరకు ఆ పాఠశాలలో 700 మంది విద్యార్థులు చదివేవారు. ఇక్కడ చదివే వారిలో ఎక్కువ మంది పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. వారు పాఠశాలకు చాలా దూరంలో నివసిస్తుంటారు.
విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడం అక్కడి టీచర్లకు పెద్ద సవాలుగా మారింది. ఇళ్ల నుంచి పాఠశాలకు విద్యార్థుల రాకపోకల కోసం ఆ స్కూలులోని ఎనిమిది మంది టీచర్లు నెలకు రూ. 2,800లను ఆటో రిక్షాలకు చెల్లిస్తారు.
పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం కోసం ప్రతీ ఇంటికి వెళ్తారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే కాదు ప్రైవేటు టీచర్లు కూడా విద్యార్థుల వెదుకులాటలో ఉంటారు. అక్కడ ప్రైవేట్ పాఠశాలలో గరిష్ట విద్యార్థుల సంఖ్య 70.

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE
‘‘మేం ఏం చేయగలం. ఈ పట్టణంలో పిల్లలు లేరు. ఎందుకంటే ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రమే నివసిస్తున్నారు’’ అని ప్రిన్సిపల్ ఆర్. జయదేవి చెప్పారు.
కుంబనాడ్ పట్టణం పథనంతిట్ట జిల్లా మధ్యలో ఉంటుంది. ఇక్కడి జనాభా క్షీణిస్తోంది. పైగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది.
భారత్ జనాభాలో 47 శాతం 25 ఏళ్ల లోపు వారే. 1990ల తర్వాతే మూడింట రెండొంతుల మంది భారత్‌లో జన్మించారు.
కుంబనాడ్‌తో పాటు దాని చుట్టుపక్కల ఆరు గ్రామాల్లో దాదాపు 25 వేల మంది నివసిస్తుంటారు.
అక్కడి 11,118 ఇళ్లలో 15 శాతం ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. వాటి యజమానులు వలస వెళ్లడం లేదా పిల్లలతో నివసించడానికి విదేశాలకు వెళ్లారని గ్రామ మండలి చీఫ్ ఆషా చెప్పారు.
అక్కడ మొత్తం 20 పాఠశాలలు ఉండగా, విద్యార్థులు చాలా స్వల్ప సంఖ్యలో ఉంటారు.
ఒక ఆసుపత్రితో పాటు, ప్రభుత్వ క్లినిక్, 30కి పైగా డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు, మూడు వృద్ధాశ్రమాలు, 20కి పైగా బ్యాంకులు ఉన్నాయి.
గత సెన్సస్ ప్రకారం 2001 నుంచి 2011 మధ్య కేరళలో జనాభా వృద్ధి 4.9 శాతంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇదే అత్యల్పం.
భర్తీ చేయలేని స్థాయికి ఇక్కడ సంతానోత్పత్తి స్థాయిలు దిగజారాయి. ఒక మహిళ సంతానోత్పత్తి రేటు 1.7 నుంచి 1.9కి పడిపోయింది.
చిన్న కుటుంబాలు, తమ పిల్లలు బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తాయి. తద్వారా బాగా విద్యావంతులైన యువతరం, తమ తల్లిదండ్రులను ఇక్కడే ఉంచి, మెరుగైన అవకాశాలను వెదుక్కుంటూ పక్క రాష్ట్రాలకు లేదా విదేశాలకు వలస వెళ్తారు.
‘‘విద్యావంతులైన పిల్లలు మంచి జీవితం, ఉద్యోగాన్ని కోరుకుంటారు. వలస వెళ్తారు. వారి తల్లిదండ్రులు మాత్రమే ఇళ్లలో మిగిలిపోతారు. ఇలా చాలామంది తల్లిదండ్రులు ఒంటరిగానే జీవిస్తుంటారు’’ అని ముంబైకి చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ప్రొఫెసర్ కేఎస్ జేమ్స్ అన్నారు.

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE
రెండు అంతస్థుల ఇంటిలో 74 ఏళ్ల అన్నమ్మ జాకబ్ చాలా ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నారు.
ఆమె భర్త మెకానికల్ ఇంజనీర్. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలో పనిచేసేవారు. 1980ల ప్రారంభంలో ఆయన మరణించారు. ఆమెకు 50 ఏళ్ల వయస్సు ఉన్న కుమారుడు ఉన్నారు.
ఆయన గత 20 ఏళ్లకు పైగా అబుదాబిలో ఉంటూ అక్కడే పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అక్కడికి కొన్ని మైళ్ల దూరంలోనే ఉంటారు. కుమార్తె భర్త కూడా 30 ఏళ్లుగా దుబయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
ఆమె పొరుగు ఇళ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. మరో ఇంట్లో వృద్ధ దంపతులు ఉంటున్నారు.
అక్కడి వృద్ధుల ఒంటరితనానికి ఆ పరిసరాలు నిదర్శనంగా కనబడుతున్నాయి. టాపియోకా, అరటి, టీక్ వంటి పచ్చని వృక్షాల మధ్య అందమైన ఇళ్లు ఖాళీగా ఉన్నాయి.
ఆ ఇళ్ల వాకిళ్లు ఎండిపోయిన ఆకులతో, కార్ల అద్దాలు దుమ్ముతో నిండిపోయాయి. ప్రతీ ఇంటికి సీసీటీవీ పహారా ఉంది.
భారత్‌లో కిక్కిరిసిన జనాలతో బిజీగా ఉండే చాలా పట్టణాల్లోని పరిస్థితికి భిన్నమైన పరిస్థితులు కుంబనాడ్‌లో కనిపిస్తాయి.
జనాలు లేనప్పటికీ వారు తిరిగి వస్తారనే ఆశతో అక్కడి ఇళ్లకు తరచుగా రంగులు వేస్తారు. కానీ, వారు చాలా అరుదుగా అక్కడికి వస్తుంటారు.
‘‘నేను చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా. నా ఆరోగ్యం కూడా బాగాలేదు’’ అని జాకబ్ చెప్పారు.
ఆమెకు గుండెజబ్బుతో పాటు ఆర్థరైటిస్ ఉన్నప్పటికీ తన మనవళ్లు, మనవరాళ్లతో గడపడానికి విదేశాలకు వెళ్లొచ్చారు. జోర్డాన్, అబుదాబి, దుబయ్, ఇజ్రాయెల్‌లో ఉన్న తన పిల్లల వద్ద కొన్ని రోజులు ఆమె ఉన్నారు.

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE
ఒక్కరే నివసించడానికి 12 గదుల ఇంటిని ఎందుకు కట్టుకున్నారని నేను ప్రశ్నించగా ఆమె బదులిచ్చారు.
‘‘ఇక్కడ అందరూ పెద్ద ఇళ్లనే కట్టుకుంటారు. హోదాను బట్టి ఇళ్ల నిర్మాణం ఉంటుంది’’ అని ఆమె నవ్వుతూ చెప్పారు.
రోజులో ఎక్కువ సమయాన్ని ఆమె పెరట్లోనే గడుపుతారు. టాపియోకా, అరటి, అల్లం, యామ్, పనస వంటి మొక్కలను ఆమె పెంచుతారు.
ధ్యానం చేయడంతో పాటు వార్తాపత్రికలు చదువుతారు. ఆమె వద్ద డయానా అనే ఒక పెంపుడు కుక్క కూడా ఉంది.
‘‘ఒక్కోసారి నేను కేవలం డయానాతో మాట్లాడతాను. దానికి నేను మాట్లాడేదంతా అర్థం అవుతుంది’’ అని ఆమె చెప్పారు.
ఆమె ఇంటికి కొన్ని వీధుల తర్వాత చాకో మమెన్ అనే వ్యక్తి నివసిస్తారు. ఆయనకు గుండె జబ్బుతో పాటు డయాబెటిస్ కూడా ఉన్నప్పటికీ ప్రతిరోజూ పెరట్లో నాలుగు గంటల పాటు పనిచేస్తారు. 64 ఏళ్ల చాకో మమెన్ ముప్పై ఏళ్ల పాటు ఒమన్‌లో పనిచేసి వచ్చారు.
భారత్‌కు తిరిగి వచ్చాక ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే, పనిచేయడానికి మనుషుల కొరత ఏర్పడటంతో ఆరేళ్ల తర్వాత ఆ వ్యాపారాన్ని మూసేశారు.
ఇప్పుడు చాలా కష్టపడుతూ అరటిని సాగు చేస్తున్నారు. ప్రతీరోజూ తన పెరట్లో పండిన 10 కేజీల అరటి కాయలను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.
రోజూవారీ కూలీకి దాదాపు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉండటంతో వర్కర్‌ను నియమించుకునే స్థోమత తనకు లేదని చాకో మమెన్ అన్నారు.
బయట నుంచి వలస వచ్చినవారిని నమ్మలేమని, వారిని పనిలో పెట్టుకోలేమని జాకబ్ కూడా అన్నారు.
‘‘నేను ఒంటరిగా ఉంటా. ఒకవేళ వాళ్లు నన్ను చంపితే ఎలా?’’ అని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE
ఖాళీ ఇళ్లు, వృద్ధ జనాభా నివసించే ఈ పట్టణంలో నేరాల రేటు చాలా తక్కువ అని పోలీసులు చెబుతున్నారు.
ఇళ్లలో విలువైన వస్తువులు, ఎక్కువగా నగదును పెట్టుకోకపోవడం వల్ల ఇక్కడ దొంగతనాలు పెద్దగా జరగవని పోలీసులు అన్నారు.
ఇక్కడ చివరిసారిగా హత్య ఎప్పుడు జరిగిందో కూడా గుర్తులేదని వారు చెప్పారు.
‘‘ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు మాత్రమే మాకు వస్తుంటాయి. ఇక్కడ నివసించే వృద్ధుల సంబంధీకులు లేదా వారి ఇళ్లలో పని చేసే వారు వృద్దుల సంతకాలను ఫోర్జరీ చేసి బ్యాంకుల నుంచి డబ్బును స్వాహా చేస్తుంటారు’’ అని స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ సజీశ్ కుమార్ తెలిపారు.
పెద్దగా నేరాలు లేకపోవడం వల్ల పోలీసులు వారి సమయాన్ని వృద్ధుల సంక్షేమానికి కేటాయిస్తున్నారు.
అనారోగ్యంతో ఉన్న ఒంటరిగా నివసించే 160 మంది ఇళ్లను పోలీసులు తరచుగా తనిఖీ చేస్తుంటారు. ఎమర్జెన్సీ సమయంలో పొరుగువారిని అప్రమత్తం చేయడం కోసం వారికి ప్రత్యేక అలారమ్‌లను ఇచ్చారు.
2020లో ఒక ఇంట్లో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు రక్షించారు.
‘‘ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాం. తర్వాత ఆమె కోలుకున్నారు. అవసరమైన వారిని వృద్ధాశ్రమాలకు తరలించడం కూడా మా విధుల్లో ఒకటి. వృద్ధులను తరచుగా పరిశీలిస్తూ వారిని ఆసుపత్రులకు తీసుకెళ్తాం’’ అని కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE
కుంబనాడ్‌లో వృద్ధాశ్రమాన్ని నిర్వహించే ఫాదర్ థామస్ జాన్ మాట్లాడుతూ ఇక్కడ వృద్ధాప్యమే పెద్ద సమస్య అని అన్నారు.
పట్టణంలో వీల్ చెయిర్లు వెళ్లగలిగేలా విశాలమైన గుమ్మాలు, హాళ్లు, తగినంత ఖాళీ స్థలం ఉన్న ఓల్డేజ్ హోమ్స్ మూడు ఉన్నాయి. అలెగ్జాండర్ మెమోరియల్ గెరియాట్రిక్ సర్వీస్ అనే ఐదంతస్తుల భవనం 150 పడకల ఆస్పత్రిగా ఉండడమే కాకుండా, 85 నుంచి 101 ఏళ్ల వరకూ వయసున్న వంద మంది స్థానికుల ఆలనా పాలనకు ఉపయోగపడుతోంది.
ఇక్కడున్న వారిలో అందరూ దాదాపు మంచాన పడినవారే. వారి కుటుంబాలు వీరికి ప్రతి నెలా 50 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. 16 ఏళ్ల నుంచీ నిర్వహిస్తున్న ఈ కేంద్రానికి కొన్నిసార్లు వారి పిల్లలు వస్తుంటారు. అక్కడ ఉన్న తమ వారితో గడుపుతుంటారు.
“ఈ పిల్లల్లో చాలా మంది విదేశాల్లోనే ఉంటున్నారు. వారికి వృద్ధులైన తమ తల్లిదండ్రులను ఓల్డేజి హోమ్స్‌లో చేర్పించడం తప్ప వేరే దారి లేదు” అంటారు ఫాదర్ జాన్.
దానికి కాస్త దూరంలోనే 75 ఏళ్ల నాటి ధర్మగిరి ఓల్డేజ్ హోమ్ 60 మందికి ఆశ్రయం కల్పిస్తోంది. వాళ్లందరూ 60 ఏళ్లు పైబడినవారే. గత ఏడాది అక్కడ కొత్తగా 31 మందిని చేర్చారు. అక్కడ మహిళలకు, పురుషులకు వేరు వేరు భవనాలు కూడా ఉన్నాయి. అక్కడ చేర్పించడానికి వెయిటింగ్ లిస్టులో ఉన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో కొత్తగా వచ్చే 60 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించడానికి కొత్తగా మరో 30 గదుల భవనాన్ని నిర్మిస్తున్నారు.
“మాతో ఉన్నవారిలో చాలా మంది మహిళలే. వారిలో మోసపోయినవారు ఉన్నారు. కొంతమందిని వారి కుటుంబాలు తరిమేశాయి” అని దానిని నిర్వహిస్తున్న ఫాదర్ కేఎస్ మాథ్యూస్ చెప్పారు.
“ఇది ఏదైనా జనాభాలో వస్తున్న మార్పులకు సంబంధించిన కథ. మొత్తంగా చెప్పాలంటే, ఇది మొత్తం భారత దేశం కథ” అంటారు ప్రొఫెసర్ జేమ్స్.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















