అల్-అక్సా మసీదు: ఇక్కడ మేకను బలి ఇవ్వడం గురించి రెండు మతాల మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతోంది

ఫొటో సోర్స్, AFP
- రచయిత, మార్క్ షియా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ఘర్షణలకు సంబంధించి దాదాపు 350 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ మసీదులో కొందరు యూదు అతివాదులు ఒక మేకను బలి ఇవ్వబోతున్నారనే వార్తల నడుమ దీని పవిత్రతను కాపాడేందుకు రావాలంటూ పాలస్తీనియన్లకు ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ హమాస్ పిలుపునిచ్చింది.
అల్-అక్సాను యూదులు టెంపుల్ మౌంట్‌గా పిలుస్తారు.
అసలు యూదు అతివాదులు ఇక్కడ మేకను ఎందుకు బలి ఇవ్వాలని చూశారు? ఇప్పుడే ఎందుకు ఇది వివాదంగా మారింది.

ఫొటో సోర్స్, EPA-EFE
మేకను బలి ఇవ్వడం ఎందుకు?
యూదుల పవిత్ర గ్రంథం తోరాలో దీని ప్రస్తావన ఉంది.
తోరా ప్రకారం, ఈజిప్టులో బానిసలుగా ఉన్న యూదులను విడిపించేందుకు ప్రతి ఈజిప్టు కుటుంబంలోని తొలి మగబిడ్డను బలి తీసుకోవాలని దైవదూతలకు దేవుడు ఆదేశిస్తాడు.
అయితే, దైవదూతలు బలి కోసం వచ్చినప్పుడు యూదుల ఇళ్లను గుర్తు పట్టేందుకు ప్రత్యేక గుర్తులు వేయాలని దేవుడు సూచిస్తాడు. ఒక మేకను బలి ఇచ్చి, దాని రక్తంతో తలుపుపై ఆ సంకేతం వేయాలని చెబుతాడు.
ఇది ఈజిప్టులోని ఏడు ఊచకోతల్లో చివరిది. దీని తర్వాత ఈజిప్టు ప్రభువు యూదులను తమ భూభాగం నుంచి వెళ్లిపోవడానికి అనుమతిస్తారు. దీన్నే యూదుల వలస (ఎక్సోడస్)గా పిలుస్తారు.
ఆ తర్వాత యూదులు దేవుడు తమకు ఇస్తానని చెప్పిన ఇజ్రాయెల్ భూభాగానికి వస్తారు. అయితే, ఆ యూదుల వలసకు ప్రతీకగా ఏటా ఒక మేకను బలి ఇవ్వాల్సి ఉంటుంది.
నేడు కొన్ని మతపరమైన సంస్థలు మాత్రమే ఇంకా ఇలాంటి ఆచారాలను కొనసాగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, RAFFI BERG
ఇక్కడే ఎందుకు?
యూదులకు అత్యంత పవిత్రమైన స్థలం టెంపుల్ మౌంట్.
బైబిల్‌లో ప్రస్తావించి రెండు ప్రార్థనా మందిరాలు ఇక్కడ ఉన్నాయి. అయితే, మూడో ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ యూదులు నిర్మించాలని చూస్తున్నారు. అయితే, అక్కడే మసీదు గుమ్మటం ఉంది.
మేకను బలి ఇచ్చే ఆచారాన్ని ఇక్కడే పూర్తిచేయాలని కొన్ని యూదు అతివాద సంస్థలు ఎప్పటినుంచో పట్టుబడుతున్నాయి.
కానీ, ముస్లింలకు కూడా అల్-అక్సా మసీదు మూడో పవిత్రమైన స్థలం. ఇక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్లినట్లుగా ముస్లింలు భావిస్తారు. దీన్ని సందర్శించేందుకు యూదులకు అనుమతి ఉంది. అయితే, ముస్లిమేతరులు ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వీలులేదు.
1967లో జరిగిన యుద్ధంలో జెరూసలేంలోని ఈ ప్రాంతం ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయెల్, జోర్డాన్ కలిసి ఈ మసీదు ప్రాంగణాన్ని నియంత్రిస్తున్నాయి.
ఈ మసీదు లోపలకు యూదులను అనుమతించేటప్పటికీ, ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు వారికి అనుమతి లేదు.
అయితే, ఇక్కడకు యూదు పర్యటకులు, ఇజ్రాయెల్ భద్రతా దళాలు రావడాన్ని పాలస్తీనియన్లు మొదట్నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మసీదు పవిత్రతను కాపాడతామని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఇప్పుడు ఎందుకు?
ఏటా యూదుల వలస పర్వదినాలనాడు టెంపుల్ మౌంట్ దగ్గర మేకను బలిచ్చేందుకు తమను అనుమతించాలని కొన్ని యూదు అతివాద సంస్థలు డిమాండ్ చేస్తుంటాయి.
ఇలాంటి సంస్థలకు చెందిన యూదు ప్రతినిధులను ఇజ్రాయెల్ అధికారులు ముందస్తుగానే అరెస్టులు చేస్తుంటారు.
ఈ ఏడాది కూడా ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 13 వరకు యూదుల వలస పర్వదినాలు నిర్వహిస్తున్నారు. అంటే ఇది రమదాన్‌తో కలిసి వచ్చింది. దీంతో ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి.
దీని వెనుక ఎవరున్నారు?
అల్-అక్సా మసీదు దగ్గర మేకను బలి ఇవ్వాలని పట్టుబడుతున్న సంస్థల్లో ‘‘రిటర్న్ టు ద మౌంట్’’ ప్రధానమైనది. ఈ సంస్థకు చెందిన నాయకుడు రఫేల్ మోరిస్ గత ఏడాది బీబీసీతో మాట్లాడారు. ఒక ముస్లిం వ్యక్తిలా బట్టలు వేసుకొని అల్-అక్సా మసీదులో ప్రార్థనలు చేసేందుకు ఆయన ప్రయత్నించారు.
‘‘టెంపుల్ మౌంట్ యూదులది. దీన్ని మాకు ఇస్తామని దేవుడు చెప్పినట్లు బైబిల్‌లో రాసుంది. మా లక్ష్యం దీన్ని తీసుకోవడమే’’అని ఆయన వ్యాఖ్యానించారు.
శాంతి, భద్రతలకు విఘాతం కలిగించొచ్చనే ఆరోపణలపై మోరిస్‌ను సోమవారమే పోలీసులు అరెస్టు చేశారు. అయితే, టెంపుల్ మౌంట్‌లో మేకను బలిచ్చేవారికి లేదా ప్రయత్నించి అరెస్టయ్యే వారికి నజరానా ఇస్తామని రిటర్న్ టు ద మౌంట్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















