ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య మళ్లీ భీకర ఘర్షణ.. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో చిన్నారులు సహా 31 మంది మృతి

గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడుల దృశ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడుల దృశ్యాలు

పాలస్తీనాలోని గాజాలో.. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ బృందం నేతలు లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఆ గ్రూపు అగ్రనేతలు ఇద్దరితో పాటు 31 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్తున్నారు.

గాజా మీద శుక్రవారం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌కు చెందిన అగ్రనాయకులు ఖాలెద్ మన్సోర్, తాయిసీర్ జబారిలతో పాటు పలువురు మిలిటెంట్లు చనిపోయినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.

వీడియో క్యాప్షన్, వీడియో: గాజా మీద గగనతల దాడుల దృశ్యాలు

పీఐజే నుంచి తక్షణం ముప్పు పొంచి ఉండటం వల్ల 'బ్రేకింగ్ డాన్' పేరుతో ఈ ఆపరేషన్ మొదలు పెట్టినట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ మీద శుక్రవారం నుంచి 600 పాలస్తీనా రాకెట్లు, మోర్టార్లు పేల్చినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో ఎవరైనా గాయపడ్డట్లు వార్తలు రాలేదు.

ఇజ్రాయెల్ - గాజాల మధ్య 2021 మే నెలలో 11 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఘర్షణ అనంతరం.. అత్యంత తీవ్రమైన ఘర్షణ ఇప్పుడు మొదలైంది. గత ఏడాది జరిగిన ఘర్షణలో 200 మంది పాలస్తీనియన్లు, దాదాపు డజను మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణ గాజాలోని రాఫా శరణార్థి శిబిరంలో గల ఒక ఇంటి మీద ఇజ్రాయెల్ గగన తల దాడి చేసి.. పీఐజే సీనియర్ నేత ఖలేద్ మన్సూర్‌ను చంపటంతో తాజా ఘర్షణ రాజుకుంది. అతడు గాజా నుంచి మిలిటెంట్ కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నాడని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపిస్తోంది.

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఒకవైపు గాజా మీద వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. మరోవైపు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో సోదాలు, అరెస్టులు కొనసాగిస్తోంది. పీఐజే సభ్యులను పదుల సంఖ్యలో అరెస్ట్ చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది.

ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనియన్లు పదుల సంఖ్యలో చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే.. గాజా స్ట్రిప్‌లోని జబాలియాలో చిన్నారులు చనిపోవటానికి తాము కారణం కాదని, పీఐజే ప్రయోగించిన రాకెట్ అదుపుతప్పి ఆ పిల్లల మీద పేలటమే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది.

గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడుల దృశ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఘర్షణలో.. ఇస్లామిక్ జిహాద్ తరహా సిద్ధాంతాలే ఉన్న హమాస్ సంస్థ.. తన రాకెట్ ఆయుధాలను ఇజ్రాయెల్ మీద పేలుస్తున్నట్లు కనిపించటం లేదు.

హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్నట్లు కూడా వార్తలు అందటం లేదు. అదే జరిగితే హింస మరింతగా పెరిగిపోతుంది.

ఇజ్రాయెల్ - పాలస్తీనా మిలిటెంట్ల మధ్య తాజాగా మూడు రోజులుగా చెలరేగుతున్న హింసకు ముగింపు పలకటానికి చర్చలు జరుగుతున్నాయి.

ఈజిప్టు మధ్యవర్తిత్వం నెరపటంతో ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ శాంతికి అంగీకరించినట్లు చెప్తున్నారు. అయితే.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారిక సమాచారం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)