ఆంధ్రప్రదేశ్: “గుండెలు పిసికేసీ తలంతా అదిమినట్లు అనిపిస్తోంది. నాకు ఇంకేమి తెలియదు” అంటూ ఆ గ్రామస్థులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?

కిండలం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

పాడేరు ఏజెన్సీ పెదబయలు మండలంలోని మారుమూల గిరిజన గ్రామం కిండలం. వారం రోజుల వ్యవధిలో ఇక్కడ ఏడుగురు చనిపోయారు.

చనిపోయిన వారు తమని పిలుస్తున్నారంటూ ఈ గ్రామంలో మరికొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతోంది?

కిండలం గ్రామంలో బీబీసీ ఏప్రిల్ 4వ తేదీన పర్యటించింది. అప్పటికే ఆ గ్రామంలో వరస మరణాలు సంభవించి 10 రోజులైంది.

గ్రామంలోని కొన్ని ఇళ్లలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెడికల్ క్యాంపులో ప్రాథమిక వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. కానీ ఇంటి దగ్గరున్న సావిత్రి అనే వివాహిత పరిస్థితి భిన్నంగా కనిపించింది.

‘‘నన్ను ఎవరూ ఏమీ అడగకండి’’అంటూ సావిత్రి అందరి ముఖాల్లోకి కోపంగా చూస్తోంది. అప్పటికే రెండు గంటల ముందు వాళ్ల దగ్గరికి వెళ్లిపోతా(చనిపోయిన వాళ్ల దగ్గరికి ) అంటూ గ్రామంలో సావిత్రి పరుగులు పెట్టిందని, ముందు రోజు కూడా ఆమె అలాగే చేసిందని భర్త గంగరాజు బీబీసీతో చెప్పారు.

సావిత్రితో బీబీసీ మాట్లాడే ప్రయత్నం చేసింది. “గుండెలు పిసికేసీ తలంతా అదిమినట్లు అనిపిస్తోంది. నాకు ఇంకేమి తెలియదు” అని ఇంటి ముందు గట్టు మీద కూర్చున్న సావిత్రి చెప్పారు.

కిండలం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

కిండలంలో ఏం జరిగింది?

కిండలం గ్రామంలో మార్చి చివరి వారంలో వరుసగా ఏడు మరణాలు నమోదయ్యాయి. మరణించిన వారంతా తమకు గుండె పిసికేసినట్లుగా అనిపిస్తోందని చెప్పారని, వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తే.. కొందరు ఊరిలో, మరి కొందరు ఆసుపత్రిలో మరణించినట్లు గ్రామస్థులు చెప్తున్నారు.

వరుస మరణాలు సంభవించడంతో ఊరిలో ఏదో జరుగుతుందనే ఆందోళనతో చాలా మంది గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. మరి కొందరు తమ పిల్లల్ని బంధువులు ఇళ్ల వద్ద వదిలేసి, తిరిగి గ్రామానికి వచ్చారు.

ఊరిలో చాలా మంది అనారోగ్యంతో కనిపిస్తున్నారు. కిండలం గ్రామంలో 244 మంది నివసిస్తున్నారు. ఒక ప్రాథమిక పాఠశాల కూడా ఉంది.

“ముందు మా గ్రామంలో ఒక వృద్ధురాలు చనిపోయింది. ఆ తర్వాత రోజే 7 నెలల పాప, ఆ తర్వాత వరుసగా 40 నుంచి 50 ఏళ్ల వయసున్న మరో ఐదురుగు చనిపోయారు. దీంతో అందరికి భయం పట్టుకుంది. నేనైతే మా పిల్లల్ని తీసుకుని బంధువుల ఇంటికి కిర్లంకోట వెళ్లిపోయాను. పిల్లల్ని అక్కడే వదిలేసి నేను మాత్రమే వచ్చాను” అని కిండలం గ్రామానికి చెందిన రాణి బీబీసీతో చెప్పారు.

‘‘ఊర్లో అనారోగ్యంతో ఉన్నవారు మతిభ్రమించినట్లు అరుస్తూ తిరుగుతున్నారు. భూత వైద్యుల్ని కూడా తీసుకుని వచ్చాం. అయినా ఆ పట్టిన గాలి వదల్లేదు. మా గ్రామానికి ఏమవుతుందోనని భయంగా ఉంది’’ అంటూ రాణి అందోళన వ్యక్తం చేశారు.

గతంలో పెదబయలు మండలంలోని రూఢకోట, పాడేరు మండలంలోని గుర్రగరువు గ్రామాల్లో వరుస శిశుమరణాలు సంభవించాయి.

కిండలం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘వింత మాటలు... విచిత్ర ప్రవర్తన’

బీబీసీ గ్రామంలో పర్యటించినప్పుడు అనారోగ్యంతో బాధపడుతన్న సావిత్రి, విజయలక్ష్మిల ఇంటికి వెళ్లింది. వీరిద్దరూ ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. సావిత్రి భర్త గంగరాజు బీబీసీతో మాట్లాడారు.

“మేం మా ఇంటిపక్కనున్న దొర భార్య చనిపోతే చూసేందుకు వెళ్లాం. అప్పటి నుంచి నా భార్య సావిత్రికి ఆరోగ్యం దెబ్బతింది. ఆమె కూడా విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఊర్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా అకస్మాత్తుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నరాలు పీకేయడం, గొంతు బిగపట్టినట్టు ఉండడం, గుండె అదరడం లాంటివి జరుగుతున్నాయని చెప్తూ పిచ్చిగా ఏదో అరుస్తూ పరుగులు పెడుతున్నారు” అని గంగరాజు చెప్పారు.

ఇక్కడి ఆచారం ప్రకారం కొందరు భూతవైద్యుల్ని కూడా తీసుకుని వచ్చి చూపించామని, కానీ ఫలితం లేదని గంగరాజు అన్నారు.

బడికి వెళ్తున్న పిల్లల్ని కూడా బయటకు పంపడం లేదు. దాంతో గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఎవరూ వెళ్లడం లేదు.

ఊర్లో పరిస్థితి బాగుపడేవరకు పిల్లల్ని బడికి పంపలేమని తల్లిదండ్రులు చెప్పారు. గ్రామంలో నెలల పిల్లలు కనిపిస్తున్నారు కానీ, బడి వయసు పిల్లలు కనిపించడం లేదు.

కిండలం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘దెయ్యాలు, భూతాలు అంటున్నారు’

గ్రామంలోని మరణాలు విషయం తెలిసిన వెంటనే పెదబయలు నుంచి వైద్య సిబ్బంది కిండలం గ్రామానికి చేరుకుంది. గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు మెడికల్ క్యాంపుకి వచ్చి ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటున్నారు.

ముగ్గురు వైద్య సిబ్బంది ఈ మెడికల్ క్యాంపులో విధులు నిర్వహిస్తూ.. గ్రామస్థుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆకస్మాత్తుగా గ్రామంలో అలజడి మొదలవుతోందని మెడికల్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం వెంకటలక్ష్మి బీబీసీతో చెప్పారు.

“తమపై దెయ్యాలు, భూతాలు వచ్చి వాలుతున్నాయి అంటున్నారు. పిచ్చిగా అరుస్తూ రోడ్లపై పరుగులు పెడుతున్నారు కొందరు. చనిపోయిన వారు పిలుస్తున్నారంటూ కొందరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి లక్షణాలున్నవారిని వెంటనే పరీక్షిస్తున్నాం. వారిలో బీపీ తప్ప మరే లక్షణాలు కనిపించడం లేదు” అని ఏఎన్ఎం వెంకటలక్ష్మీ చెప్పారు.

ఊరికి గాలి పట్టిందనే భయంతో పిల్లలను కూడా పక్క ఊర్లకి పంపించేస్తున్నారని కిండలం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కోటేశ్వరరావు చెప్పారు. దీంతో కిండలం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు తప్ప విద్యార్థులు కనిపించడం లేదు.

కిండలం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

అంతా బాగానే ఉన్నారు: వైద్యుల రిపోర్ట్

వరుస మరణాలతో గత రెండు వారాలుగా గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. పెదబయలు నుంచి వైద్య బృందం వచ్చి గ్రామంలోనే ఉంటోంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఆరోగ్యం బాగానే ఉన్నవారి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే మెడికల్ క్యాంపులో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

విశాఖ, విజయవాడల నుంచి సీనియర్ వైద్యులు వచ్చి గ్రామంలో చాలా మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరిలోనూ ఎటువంటి విపరీతమైన అనారోగ్య పరిస్థితులు కనిపించలేదని వారు తమ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇక్కడ పరిస్థితులను, మెడికల్ రిపోర్టులను ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఐటీడీఏ అధికారులు చెప్పారు.

"ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియడం లేదు. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి తీసుకొని వెళ్తున్నాం. అక్కడ పరీక్షలు చేస్తున్నారు. కానీ సాధారణ అనారోగ్యమే తప్ప, ప్రమాదకరమైన లక్షణాలు లేవని చెప్తున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. కానీ గ్రామంలో ఉండాలంటే మాకు చాలా భయంగా ఉంది" అని కిండలం గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ చెప్పారు.

కిండలం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఒకరికి జరిగిందే, తమకి జరిగినట్లు అందోళన చెందుతారు’

కిండలం గ్రామంలో జరుగుతున్న పరిణామాలను, గ్రామంలోని ఇతర విషయాలని విశాఖకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధారాణికి బీబీసీ వివరించింది. డాక్టర్ రాధారాణి విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవి విరమణ పొందారు.

“గ్రామంలో వరుస మరణాలు సంభవించిన తర్వాత.. ఆ విషయాలపై ఆందోళన చెంది, తమకి కూడా అలా జరుగుతుందేమోననే భయపడుతున్నట్లు ఉన్నారు. ఇది సాధారణంగా భయంతో మొదలై.. చివరకు తమకి అదే జరుగుతుందనే భావన బలంగా ఏర్పడుతుంది. దీనినే పొసెషన్ సిండ్రోమ్ (Possession syndrome) అంటారు. ఇదే ప్రస్తుతం కిండలం గ్రామంలో జరుగుతున్నట్లుగా ఉంది” అని డాక్టర్ రాధారాణి చెప్పారు.

“ఎవరైతే చనిపోయారో ఆ మనిషి గ్రామస్థులతో మాట్లాడినట్లుగా భావించడం, వాళ్లు ప్రవర్తించినట్లుగా వీళ్లు ప్రవర్తించడం చేస్తుంటారు. అదే సమయంలో ఆ చనిపోయిన వ్యక్తులు వీళ్ల మీదకు వచ్చి.. వాళ్లేదో వీళ్లతో చెప్తున్నట్లు విపరీతమైన ఆందోళన చెందుతారు. అలాంటి లక్షణాలు ఒకరిలో కనిపించగానే, మిగతా వారు కూడా అలాగే ప్రవర్తించాలని అనుకుంటారు. ఇది ఒక రకమైన మాస్ హిస్టీరియా. ఒకరు మొదలు పెట్టగానే మిగతా వాళ్లు కూడా అదే చేయాలని ప్రయత్నిస్తూ తమకు అవే లక్షణాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తారు” అని డాక్టర్ రాధారాణి తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఇల్లు కట్టాలని దాచిన డబ్బుతో ఊరికి రోడ్డు వేయిస్తున్న గిరిజన మహిళ

‘ఇది సైకలాజికల్ సమస్య కాదు’

‘‘చనిపోయిన వ్యక్తులు తమతో మాట్లాడుతున్నట్లు భావించడం, వాళ్లు ఏదో చెప్పినట్లు అందరితోనూ చెప్పడం వంటి లక్షణాలను హలుసినేషన్(HALLUCINATION-భ్రాంతి) అని చెప్పవచ్చు. మనం చూసే పూనకాలు, చనిపోయిన వ్యక్తులు కనపడతున్నారని చెప్పడం వంటివి ఇందులోకే వస్తాయి. ఇది సైకలాజికల్ సమస్య కాదు. ఎమోషనల్‌గా ఫీలవ్వడం వలన వాళ్ల శరీరంలో రసాయనిక మార్పులు జరుగుతాయి. అవి కొన్నిసార్లు మరణాలకు దారి తీస్తాయి’’అని రాధారాణి వివరించారు.

“ఏదైనా సమస్య పూర్తిగా సైకలాజికల్ అయితే అవి మరణాలకు దారి తీయవు. కిండలం గ్రామంలో ప్రస్తుతం కనిపిస్తున్న విచిత్ర ప్రవర్తనలు హిస్టిరియాలాగేనే భావించాలి. ఈ లక్షణాలు రోజులో రెండు, మూడు సార్లు కనిపించే అవకాశం ఉంది. అది కూడా ఎక్కువ సేపు ఉండదు. కొద్ది సేపటికే సాధారణ స్థితికి వస్తారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు వీరికి తోడుగా ఉండి, వారిని సాధారణ స్థితికి తీసుకుని రావొచ్చు”అని రాధారాణి బీబీసీతో చెప్పారు.

కిండలం గ్రామాన్ని విడిచి వెళ్లిపోయిన వారు కాకుండా, గ్రామంలో ఉన్నవారిలో భయం, ఆందోళన కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాల గురించి అధికారుల వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. “ఆ గ్రామంలో చనిపోయిన ఏడుగురులో ఒకరు ప్రమాదవశాత్తు, మిగతా ఆరుగురు గుండె, ఊపిరితిత్తులు సమస్యలతో చనిపోయినట్లు మా పరీక్షల్లో తేలింది. పొగాకు, ఖైనీ అలవాటు, జీడిగకల్లు అతిగా సేవించడం, నాటు వైద్యం వల్ల కూడా వీరి ఆరోగ్యం ప్రభావితం అవుతోంది. అలాగే గ్రామంలో కొందరు వింతగా ప్రవర్తించడాన్ని కూడా పరిశీలించాం. కిండలం గ్రామానికి ఒక సైకాలజిస్ట్, సైకియాట్రిస్టులను కూడా పంపుతున్నాం. ఇక్కడ పరిస్థితుల మీద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్‌కు నివేదిక పంపించాం” అని అల్లూరి సీతారామరాజు జిల్లా డీఎంహెచ్ఓ జమాల్ బాషా బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఏటా శ్రీరామ నవమి నాడు భక్తులు తమ పిల్లలను దేవుడికి ఇచ్చేస్తారు. తర్వాత కొనుక్కుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)