ఎయిర్ ఇండియా: ‘విమానంలో సిగరెట్ తాగినందుకు రూ. 250 జరిమానా కడతా’ - జడ్జితో ప్రయాణికుడి వాగ్వాదం.. ఆ తర్వాత ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
విమానంలో సిగరెట్ తాగడంతో పాటు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారన్న కేసులో.. నిందితుడు రత్నాకర్ ద్వివేది జెయిలుకు వెళ్లారు.
ఈ కేసులో ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా.. రూ. 25,000 పూచీకత్తుతో బెయిలు పొందేందుకు జడ్జి అవకాశం ఇచ్చారు.
కానీ, ఐపీసీ ప్రకారం తనకు రూ. 250 జరిమానా విధిస్తే సరిపోతుందని.. తాను ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి ఈ విషయం తెలుసుకున్నానని నిందితుడు వాదించారు.
బెయిల్ కోసం 25,000 రూపాయల పూచీకత్తు చెల్లించేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్చ్ 10న లండన్ నుంచి ముంబయి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో రత్నాకర్ ద్వివేది ప్రయాణించారు. అయితే, ఆయన ప్రయాణ సమయంలో టాయిలెట్లోకి వెళ్లి సిగరెట్ తాగినట్లు సిబ్బంది ఆరోపించారు.
సిగరెట్ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్న తరువాత వారితో ఆయన దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.
ఈ ఘటనలో రత్నాకర్‌పై ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం కేసు పెట్టారు. ఇతరుల వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం, ప్రాణాలకు ప్రమాదం కలిగించడం అనే నేరారోపణలతో ఆయనపై కేసు పెట్టారు.
ఈ కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు.. రత్నాకర్ ద్వివేది విమానంలో గొడవ చేశారని, ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చే తరహాలో ప్రవర్తించారని.. గొడవ చేయొద్దని పైలట్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని.. రాతపూర్వకంగా పైలట్ కోరినా ఆయన లెక్కచేయలేదని ఎఫ్ఐఆర్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం నాడు ముంబై లోని అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
నిందితుడు రత్నాకర్ ద్వివేదిని రూ. 25,000 పూచీకత్తు మీద విడుదల చేసేందుకు మెజిస్ట్రేట్ అవకాశం ఇచ్చారు.
అయితే.. ఐపీసీ 336 కేసులో జరిమానా రూ. 250 ఉంటుందని, ఆ మొత్తమైతే తాను చెల్లించడానికి సిద్ధమని నిందితుడు చెప్పారు.
ఈ విషయాన్ని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి తెలుసుకున్నానని కూడా పేర్కొన్నారు.
అంతేకానీ బెయిల్ కోసం పూచీకత్తుగా రూ. 25,000 కట్టడానికి తాను అంగీకరించనన్నారని పీటీఐ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది.
దీంతో నిందితుడిని జైలుకు పంపిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ 2023: ‘‘నాటునాటు పాటను తరాల పాటు గుర్తుంచుకుంటారు...’’ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనల వెల్లువ
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
- స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావొచ్చా? ఇందులో నిజమెంత?
- చైనా: జాక్ మా, బావో ఫ్యాన్, మరికొందరు.. బిలియనీర్ల వరుస అదృశ్యాల వెనుక మిస్టరీ ఏంటి?
- 2023 DW: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం.. 2046 'వాలెంటైన్స్ డే నాడు భూమిని తాకవచ్చు'














