10 నిమిషాలు లేటుగా వచ్చిందని విమానాన్ని 16 గంటలు చక్కర్లు కొట్టించారు...ఏం జరిగిందంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫాన్ వాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు విమానం ల్యాండింగ్‌కు ఎయిర్‌పోర్ట్ వర్గాలు అనుమతులు ఇవ్వలేదు.
ల్యాండింగ్‌కు నిరాకరించడంతో ప్రయాణీకులతో కూడిన ఆ విమానం బయల్దేరిన చోటుకే తిరిగి వెళ్లింది. ఈ ఘటన జపాన్‌లో జరిగింది.
జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఎల్ 331 విమానం, ఫిబ్రవరి 19న టోక్యో నుంచి ఫుకుయోకాకు బయల్దేరింది.
విమానాన్ని మార్చాల్సి రావడం వల్ల ఆ ప్రయాణం 90 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది.
రాత్రి 10 గంటల్లోగా ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ, కటాఫ్ సమయం దాటిన కొన్ని నిమిషాల తర్వాత ఆ విమానం రావడంతో విమానాశ్రయ వర్గాలు ల్యాండింగ్‌కు అనుమతించ లేదు.
తర్వాత ల్యాండింగ్ కోసం అనుమతించే మరో ఎయిర్‌పోర్ట్‌ను గుర్తించే వరకు ఆ విమానం చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
తొలుత ఆ విమానం, పుకుయోకాకు సమీపంలోని కిటక్యుషు ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి ప్రయత్నించింది.
అయితే, విమానంలోని 335 మంది ప్రయాణీకులను హోటల్‌కు తీసుకెళ్లడానికి బస్సులను ఏర్పాటు చేయలేనందున కిటక్యుషు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ను తిరస్కరించారని తర్వాత ఎయిర్‌లైన్స్ సంస్థ వివరించింది.
అలాగే, ఇంధనం నింపడం కోసం ఒసాకాలోని కన్సాయ్ ఎయిర్‌పోర్ట్‌కు విమానాన్ని మళ్లించినప్పుడు కూడా ప్రయాణీకులు కిందకు దిగలేకపోయారు.
చివరకు ఆ విమానం టోక్యోకు తిరిగి వెళ్లింది. ఆ మరుసటి రోజు పాసింజర్లు మళ్లీ ప్రయాణించాల్సి వచ్చింది.
తమ రెండు గంటల ప్రయాణం కాస్తా ల్యాండింగ్‌కు అనుమతి దొరక్కపోవడంతో 16 గంటలుగా మారిందని ప్రయాణీకులు చెప్పారు.
కానీ, తమకు కలిగిన అసౌకర్యానికి గానూ, ఎయిర్‌లైన్స్ సంస్థ మంచి పరిహారం అందజేసిందని తెలిపారు.
బోర్డింగ్ పాస్‌తో పాటు 20 వేల యెన్‌ల (రూ. 12,152) నగదును ఇచ్చినట్లు ఒక ప్రయాణీకుడు ట్వీట్ చేశారు.
అసలు గమ్యస్థానమైన ఫుకుయోకా విమానాశ్రయ వర్గాలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించారు.
సమీపంలోని నివాస ప్రాంతాల కారణంగా ఈ నిషేధాన్ని వారు అమలు చేస్తున్నారు.
వాతావరణంలో ఇబ్బందులు (బ్యాడ్ వెదర్), రన్‌వేకు సంబంధించిన అనివార్య ఇబ్బందుల కారణంగా ఆలస్యంగా వచ్చిన విమానాలను, షట్‌డౌన్ సమయం తర్వాత కూడా ల్యాండింగ్‌కు అనుమతించామని అధికారులు చెప్పినట్లు అసహి షింబున్ వార్తా పత్రిక తెలిపింది.
అయితే, ఈ విమానం ఆలస్యానికి అనివార్యమైన కారణాలు ఉన్నట్లుగా అధికారులు భావించడం లేదని పేర్కొంది.
కటాఫ్ సమయం దాటిన తర్వాత కూడా ఇతర విమానాలను ల్యాండ్ చేయడానికి అనుమతించినట్లు ఫ్లైట్ డేటా చూపిస్తోంది.
బలమైన గాలుల కారణంగా టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో కూడా ఇతర విమానాలు ఆలస్యంగా నడిచాయి.
జేఎల్ 331 విమానానికి మాత్రమే అనుమతి నిరాకరించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










