‘‘యుక్రెయిన్, రష్యాల యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి’’ జిన్‌పింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడి వినతి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, టెస్సా వాంగ్ , హ్యూ స్కోఫీల్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
యుక్రెయిన్, రష్యాల యుద్ధం ఆపడానికి సహాయం చేయాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కోరారు.
"రష్యాను దారిలోకి తీసుకురావడానికి, అందరినీ తిరిగి చర్చలకు తీసుకురాగలరని మీ మీద నాకు విశ్వాసం ఉంది" అని జిన్‌పింగ్‌తో మేక్రాన్ అన్నారు.
మేక్రాన్ బీజింగ్ పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతిని కాపాడే "సామర్థ్యం, బాధ్యత" తమ రెండు దేశాలకు ఉందని ఈ సందర్భంగా జిన్‌పింగ్ తెలిపారు.
మరోవైపు రష్యా మాత్రం "శాంతియుత పరిష్కారానికి అవకాశాలు లేవని, దాడి కొనసాగుతుందని'' అంటోంది.
పశ్చిమ దేశాలు, చైనా మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు ఏమంత బాగాలేవు. అందులోనూ యుక్రెయిన్ మీద రష్యా దాడిని ఖండించడానికి నిరాకరించింది చైనా.
ఈ నేపథ్యంలో నాటో కూటమిలోని ఫ్రాన్స్ అధినేత మేక్రాన్ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫొటో సోర్స్, EPA
చైనా ఏమంటోంది?
మేక్రాన్ చైనాతో తమ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.
యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో కలిసి మేక్రాన్ వచ్చారు.
ఆయనను చైనీస్ నాయకులతో పాటు భారీ వ్యాపార ప్రతినిధుల బృందంతో చర్చలలో పాల్గొనడానికి ఆహ్వానించారు.
గురువారం మధ్యాహ్నం బీజింగ్‌లో జిన్‌పింగ్‌తో మేక్రాన్ చర్చలు జరిపారు.
ఇది "స్పష్టమైన, స్నేహపూర్వక" భేటీగా చైనీస్, ఫ్రెంచ్ అధికారులు అభివర్ణించారు.
అనంతరం జిన్‌పింగ్ మీడియాతో మాట్లాడుతూ "చైనా శాంతి చర్చల కోసం వాదనలు వినిపిస్తుంది. రాజకీయ పరిష్కారాన్ని కోరుకుంటుంది" అని అన్నారు.
అంతర్జాతీయ సమాజం సంయమనం పాటించాలని జిన్ పింగ్ పిలుపునిచ్చారు. ఘర్షణలో అణ్వాయుధాలను ఉపయోగించరాదని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

ఫొటో సోర్స్, Reuters
'భద్రతామండలి సభ్యుడై ఉండి ఉల్లంఘించడమా?'
యుక్రెయిన్‌ను ఆక్రమించినంత కాలం "మాకు సురక్షితమైన, స్థిరమైన యూరప్ ఉండబోదు" అని మేక్రాన్ అన్నారు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యుదేశమై ఉండి కూడా రష్యా నిబంధనలు ఉల్లంఘించడం "ఆమోదయోగ్యం కాదు" అని ఆయన అన్నారు.
అయితే ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో విలేకరుల ప్రశ్నలను ఎదుర్కోకుండా వాన్ డెర్ లేయన్‌తో చర్చలకు కదిలారు.
మేక్రాన్ అంతకుముందు విలేకరులతో ''యుద్ధంతో ప్రేరేపితం అయిన పశ్చిమ, చైనాల మధ్య తొలగించలేని ఉద్రిక్తతలపై ఆందోళన పెరుగుతోంది.
అయితే చైనా శాశ్వత యుద్ధంపై ఆసక్తి ప్రదర్శించబోదు, దానిని ముగించడంలో బీజింగ్ ప్రధాన పాత్ర పోషించగలదు'' అని అన్నారు.
మరోవైపు యుక్రెయిన్‌లో శాంతి కోసం చైనా 12-పాయింట్ల ప్రణాళికను విడుదల చేసింది.
గతంలో అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో భాగంగా పెద్దన్న పాత్ర పోషించడానికి జిన్ పింగ్ మాస్కోను సందర్శించారు.
అయితే జిన్ పింగ్ పర్యటించిన సమయం యుద్ధంపై డ్రాగన్ దేశం తటస్థత వాదనలను బలహీనపరిచింది.
మరోవైపు పాశ్చాత్య దేశాలు చైనీస్ ప్రతిపాదనలను తోసిపుచ్చుతున్నాయి.
జిన్ పింగ్‌తో ప్రత్యక్ష చర్చలకు యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్ స్కీ పిలుపునిచ్చారు. అయితే జిన్‌పింగ్ ఇప్పటికీ స్పందించలేదు.
"యుక్రెయిన్‌తో పరిస్థితి సంక్లిష్టంగా ఉంది, శాంతియుత పరిష్కారానికి ఇప్పటివరకైతే అవకాశాలు లేవు" అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అంటున్నారు.
రష్యాకు యుద్ధంలో కొనసాగడం తప్ప మరో ఆలోచన లేదని ఆయన స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














