రిలయన్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ఎగుమతి చేయకూడదని ప్రభుత్వం ఎందుకు కోరుకుంటోంది?

పెట్రోల్, డీజిల్ ఎగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను భారత ప్రభుత్వం ఏప్రిల్ 1న పొడిగించింది. దేశీయ అవసరాలకు సరిపడా శుద్ధి చేసిన ఇంధనం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్ ఎగుమతులపై పరిమితులు విధించింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత కూడా వీటిని ఎత్తివేయలేదు.

శనివారం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో ఆంక్షలు ఎప్పుడు ముగుస్తాయో స్పష్టం చేయలేదని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

తాజా నిబంధనల ప్రకారం, రిఫైనరీలు వార్షిక పెట్రోలియం విక్రయాల్లో 50 శాతం, డీజిల్ విక్రయాల్లో 30 శాతం దేశీయ మార్కెట్‌లో విక్రయించాల్సి ఉంటుంది.

దేశంలోని ప్రైవేట్ రిఫైనరీలు రష్యా నుంచి ఇంధనాన్ని కొని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా ఆంక్షల పొడిగింపు నిరుత్సాహపరుస్తుంది.

యుక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేశాయి. ఆ దేశాలకు భారత కంపెనీలు చమురును ఎగుమతి చేయగలవు. కానీ, ప్రస్తుత ఆంక్షలు అందుకు అడ్దంకిగా నిలుస్తాయి.

ఇంతకుముందు, రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి భారతీయ ప్రైవేట్ కంపెనీలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దాన్ని దేశీయ మార్కెట్‌లో విక్రయించకుండా భారీ సబ్సిడీ ధరలకు ఎగుమతి చేయడం ద్వారా అధిక లాభాలను ఆర్జించాయి.

ఈ నేపథ్యంలో, గత ఏడాది భారత ప్రభుత్వం పెట్రోలియం, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

ప్రైవేట్ కంపెనీల తీరు వల్ల దేశీయ మార్కెట్‌లో సరఫరా భారం మొత్తం ప్రభుత్వ రిఫైనరీ కంపెనీలపై పడుతోంది.

పెట్రోల్, డీజిల్

ఫొటో సోర్స్, Getty Images

చమురు చౌకగా వస్తే ఎవరికి లాభం?

దేశంలోని ప్రైవేట్ కంపెనీలు చౌకగా రష్యా నుంచి భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

2022 మే, నవంబర్ మధ్య ఏడు నెలల్లో భారత్ చమురు కోసం రష్యాకు 20 బిలియన్ డాలర్లు (రూ. 1,64,361 కోట్లు) చెల్లించిందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇది గత పదేళ్లలో భారతదేశం చేసిన చెల్లింపుల కంటే చాలా ఎక్కువ.

జాతీయ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పినప్పుడు, ప్రజలు తమకు మేలు కలుగుతుందని ఆశిస్తారు.

కానీ, సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం దక్కట్లేదు. యుక్రెయిన్ యుద్ధానికి ముందు దిల్లీలో డీజిల్ ధర రూ. 87 ఉండగా, ప్రస్తుతం రూ. 90కి చేరింది.

రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురులో మూడొంతులు రిలయన్స్, నయారా ఎనర్జీ సంస్థలే కొనుగోలు చేశాయి.

రిలయన్స్ కొనుగోలు చేసే ముడిచమురులో మూడో వంతు రష్యా నుంచి వస్తుంది. ఇది యుక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు కేవలం 5 శాతమే ఉండేది.

అంటే, ప్రభుత్వ అధీనంలోని చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలకు చౌకగా లభించే రష్యా చమురులో తక్కువ వాటా వస్తున్నట్టు లెక్క.

అయితే, ఈ ప్రభుత్వ కంపెనీలే దేశీయంగా 90 శాతం చమురును సరఫరా చేస్తున్నాయి.

రష్యా నుంచి ముడిచమురును దిగుమతి చేసుకొని, శుద్ధి చేసి తిరిగి ఎగుమతి చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు లాభాల్లో ఎక్కువ వాటా పొందుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని అంటున్నారు.

గత ఏడాది ఏడు నెలల్లో భారత్ చమురు కోసం రష్యాకు చెల్లించిన 20 బిలియన్ డాలర్ల మొత్తం సాధారణ ప్రజల ప్రయోజనం కోసం కాదని, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టడం కోసమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆర్థికవేత్త ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యానించారు.

యుక్రెయిన్ పౌరుల శవాల మీదుగా భారతీయ ప్రైవేట్ కంపెనీలకు లాభాలు దక్కాయని ఆయన అన్నారు.

పెట్రోల్, డీజిల్ ఎగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

రష్యా నుంచి చమురు దిగుమతి భారీగా పెరిగింది

"మొన్నటి వరకు రష్యా నుంచి భారతదేశంఒక శాతం ముడిచమురును దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఈ దిగుమతి 20 శాతానికి పైగా పెరిగింది" అని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ అమితాబ్ సింగ్ బీబీసీతో అన్నారు.

రష్యా నుంచి భారత్ రోజుకు సుమారు 12 లక్షల బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేస్తోంది. దీనితో పాటు రష్యా నుంచి వంటనూనె, ఎరువులను కూడా దిగుమతి చేసుకుంటోంది.

దిగుమతులు పెరుగుతున్నాయి కానీ, ఎగుమతులు తగ్గుతున్నాయి. ఇది దేశానికి ఆందోళన కలిగించే విషయం. ఒక అధ్యయనం ప్రకారం, దిగుమతులు సుమారు 400 శాతం పెరిగాయి, ఎగుమతులు సుమారు 14 శాతం తగ్గాయి.

మరోవైపు, భారత్, రష్యా స్థానిక కరెన్సీ (రూపాయి, రూబుల్)లో వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాయి.

భారత రిజర్వ్ బ్యాంక్ 2022 జులైలో ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాకుండా, రష్యా బ్యాంకులు దేశంలో వోస్ట్రో అకౌంట్ తెరవడానికి అనుమతించింది.

పెట్రోల్, డీజిల్ ఎగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

రష్యన్ బ్యాంకుల్లో పేరుకుపోయిన భారతీయ రూపాయలు

వోస్ట్రో ఖాతా తెరవడం వల్ల భారత్‌తో వ్యాపారం చేసే దేశాలు దిగుమతులు లేదా ఎగుమతులకు డాలర్లకు బదులుగా రూపాయల్లో ధర చెల్లించే సౌలభ్యం ఉంటుంది.

దేశంలో వోస్ట్రో ఖాతాలు తెరుచుకున్నాయిగానీ, ఇప్పటివరకు రష్యాతో రూపాయల్లో పెద్దగా లావాదేవీలు జరగలేదు.

మరోవైపు, ముడిచమురు దిగుమతులు పెరగడంతో భారతీయ రూపాయలు భారీగా రష్యాకు చేరుతున్నాయి.

అయితే, కుప్పలుతెప్పలుగా రూపాయలు జమ కావాలని రష్యా బ్యాంకులు కోరుకోకపోవచ్చు.

భారత్ ఇప్పటివరకు సుమారు 30 బిలియన్ డాలర్ల ముడిచమురు కొనుగోలుచేసిందని, ఈ సొమ్ము మొత్తం రష్యా బ్యాంకుల్లో పడి ఉందని ప్రొఫెసర్ అమితాబ్ సింగ్ అన్నారు.

"రష్యా ఆ డబ్బును (రూపాయిలను) అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగించలేదు. ఎందుకంటే, దానిపై ఆంక్షలు ఉన్నాయి. అందుకే, రష్యాలో పోగుపడిన రూపాయి విలువ తగ్గుతోంది. డాలర్‌తో పోలిస్తే రూబుల్ విలువ కూడా తగ్గుతోంది" అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి: