పుతిన్‌ను అరెస్టు చేయడం సాధ్యమేనా, అయితే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు?

ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను అరెస్ట్ చేయాలంటూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) 2023 మార్చి 17వ తేదీన వారెంట్‌ను జారీ చేసింది.
ప్రపంచ రాజకీయాల్లో దీన్నొక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.
రష్యా ఆక్రమిత యుక్రెయిన్ ప్రాంతాల నుంచి పిల్లలను పుతిన్ అక్రమంగా తరలించారని ఐసీసీ ఆరోపించింది.
రష్యా బాలల హక్కుల కమిషన్ అధిపతి మరియా ల్వోవా-బెలోవాపై కూడా ఐసీసీ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.
గత ఏడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై దాడి చేస్తూ దురాగతాలకు పాల్పడిందంటూ తమపై వచ్చిన ఆరోపణలను రష్యా ఖండించింది. ఐసీసీ నిర్ణయానికి తాము ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వబోమని పేర్కొంది.
యుక్రెయిన్‌లో పాల్పడ్డ యుద్ధ నేరాల విషయంలో పుతిన్‌ను విచారించగలరా? అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం.

ఫొటో సోర్స్, SPUTNIK/PAVEL BEDNYAKOV/POOL VIA REUTERS
యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలు
యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి సంవత్సర కాలం దాటింది. దాడి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రష్యాపై యుద్ధ నేరాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
అయితే, పుతిన్‌పై ఐసీసీ ఇప్పుడెందుకు యుద్ధ నేరాల అభియోగాలు మోపి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది?
దీని గురించి హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ యూరప్, మధ్య ఆసియా డిప్యూటీ డైరెక్టర్ రాచెల్ డాన్‌బర్‌తో బీబీసీ మాట్లాడింది .
"రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా బాలల హక్కుల కమిషన్ అధిపతి మరియా ల్వోవా-బెలోవాలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు, యుద్ధ నేరాలకు సంబంధించిన తగిన సాక్ష్యాధారాలు లభ్యమయ్యాయని అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొంది. రష్యా ఆక్రమిత యుక్రెయిన్ ప్రాంతాల నుంచి అక్రమంగా పిల్లలను రష్యాకు లేదా యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. అందుకే వారెంట్ జారీ చేసినట్లు ఐసీసీ తెలిపింది.
ఆ సాక్ష్యాల గురించి ఐసీసీ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ, యుద్ధ నేరాలకు సంబంధించిన చాలా సాక్ష్యాలను సేకరించి వాటిని హ్యుమన్ రైట్స్ వాచ్, కోర్టుకు అందజేసినట్లు రాచెల్ చెప్పారు.
తమ సంస్థకు అందిన సాక్ష్యాల్లో చాలా వరకు ఫోన్లు లేదా కెమెరాల ద్వారా చేసిన రికార్డింగులు ఉన్నాయని రాచెల్ తెలిపారు.
"మేం ఒక కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించాం. ఆ కేసులో మరియుపోల్‌కు చెందిన ఒక కార్యకర్త, పదిహేడు మంది యుక్రెయిన్ పిల్లలను చికిత్స కోసం యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, రష్యా తరఫున పనిచేస్తోన్న వ్యక్తులు అతన్ని అడ్డుకొని పిల్లలను వేరే చోటికి పంపించారు’’ అని రాచెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా, ఈ ఘటనను ఖండించలేదు. కానీ, మానవత్వం కారణంగానే యుక్రెయిన్ పిల్లలను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపించామని చెప్పింది. నివేదికల ప్రకారం, ఇలా పిల్లలను అక్రమంగా రవాణా చేసే ఘటనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
రాచెల్ డాన్‌బర్ దీని గురించి మాట్లాడుతూ, ‘‘వాళ్లు ఏదైనా చెబుతారు. కానీ, రష్యా ఇటీవల తన చట్టాలను మార్చింది. ఇలాంటి పిల్లలను రష్యా పౌరులు దత్తత తీసుకోవడాన్ని సులభతరం చేసేలా చట్టాల్లో సవరణలు చేసింది. ఇలా చేయడం వల్ల ఆ పిల్లలు రష్యన్లుగా మారతారు. రష్యా ఉద్దేశం ఏమైనప్పటికీ, ఇది జెనీవా ఒప్పందానికి విరుద్ధం, యుద్ధ నేరం కూడా" అని అన్నారు.
బహుశా, రానున్న రోజుల్లో ఐసీసీ కొత్త అభియోగాలను కూడా రష్యాపై మోపవచ్చు అని చెప్పారు.
‘‘సాక్ష్యాధారాల కొరత లేదు. ప్రజల్ని చంపడం, బాంబులు వేయడం, యుద్ధ ప్రాంతాల్లోకి ప్రజల్ని ఈడ్చుకెళ్లడం వంటి ఘటనలకు సంబంధించి మా వద్ద వీడియో ఫుటేజీ ఉంది. మేం ఆ వీడియోలను చూసిన తర్వాత ఆయా ప్రదేశాలకు వెళ్లి వాటిని నిర్ధారించుకున్నాం. వీడియోలో ఉన్న సంఘటనలను అక్కడి ప్రత్యక్ష సాక్షులు ధ్రువీకరించారు’’ అని రాచెల్ వివరించారు.
రష్యాపై చాలా పటిష్టమైన కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, పుతిన్‌ను కోర్టు మెట్లు ఎక్కించడానికి ఏం చేయాల్సి ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు దారి
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఇంటర్నేషనల్ లా ప్రొఫెసర్‌గా ఉన్న గ్యారీ సింప్సన్‌తో ఈ అంశం గురించి బీబీసీ మాట్లాడింది.
ఈ కేసు పోరాటాన్ని సులభంగా ఎదుర్కొనేందుకు ఐసీసీ ప్రాసిక్యూటర్లు బాగా ఆలోచించిన తర్వాతే నిర్దిష్టమైన, పరిమితమైన అంశాలను ఎంచుకున్నట్లు తాను భావిస్తున్నానని సింప్సన్ అన్నారు. కానీ, ఈ దారి చాలా క్లిష్టమైనదని, సుదీర్ఘమైనదని చెప్పారు.
‘‘దురదృష్టవశాత్తూ, అరెస్టులకు సంబంధించినంతవరకు పెద్దగా ఏమీ జరగదు. ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు వ్లాదిమర్ పుతిన్‌ను అరెస్ట్ చేయాలని అనుకుంటూ ఉండొచ్చు. కానీ, ఆయనను ఎవరు అరెస్టు చేస్తారు. రష్యన్లు అయితే ఎలాగూ అరెస్ట్ చేయరు. రష్యా యుద్ధంలో ఓడిపోయి దాన్ని మరొక దేశం ఆక్రమించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. కానీ, ఇదంతా జరగడం అసంభవం" అని సింప్సన్ వివరించారు.
ఇప్పటి వరకు పుతిన్, రష్యా ఆక్రమిత ప్రాంతాలకు మాత్రమే వెళ్లారు. ఒకవేళ ఆయన అంతర్జాతీయ న్యాయస్థానం ఒప్పందంపై సంతకం చేసిన దేశానికి వెళితే, ఆ దేశానికి చట్టబద్ధంగా పుతిన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, ఇది జరగదు. అంటే, ప్రస్తుతం ఐసీసీఎస్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్ సింబాలిక్ మాత్రమే అని సింప్సన్ అన్నారు.
‘‘యుక్రెయిన్‌లో యుద్ధ నేరాల కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చూసిన ఐసీసీ వాటికి వ్యతిరేకంగా ఏదో చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల వల్ల పుతిన్‌పై కాస్త ప్రభావం ఉంటుంది. ఆయనకు కొన్ని సమస్యలు పెరుగుతాయి’’ అని గ్యారీ సింప్సన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ నేరాలను మోపిన తర్వాత యుద్ధాన్ని ముగించడం కోసం చర్చలకు పుతిన్‌ను ఒప్పించడంలో సమస్యలు ఎదురుకావా?
వ్లాదిమిర్ పుతిన్‌ను యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత యుద్ధానికి ముగింపు పలికేందుకు ఒప్పించడంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
దీనికి గ్యారీ సింప్సన్ మాట్లాడుతూ,‘‘అన్నింటికంటే ముందు, ఐసీసీతో ఒప్పందం ఉన్న దేశాలకు వెళ్లడానికి పుతిన్ వెనకాడుతారు. దీనివల్ల యుక్రెయిన్ కోసం అమెరికా లేదా ఇతర పశ్చిమ దేశాలతో సమావేశం కోసం పుతిన్‌ను పిలవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత యుద్ధాన్ని కొనసాగించాలని పుతిన్ మరింత దృఢంగా నిశ్చయించుకుంటారనే మరో పెద్ద ఆందోళన కూడా ఉంది.
ఇలాంటి కేసుల్లో యుద్ధ నేరాల కోర్టుల ప్రమేయం తర్వాత, నిందితులు యుద్ధాన్ని ముగించడానికి వెనుకాడతారు.
యుద్ధ నేరస్థుడిగా పరువు పోగొట్టుకోవడం కంటే చనిపోవడమే మంచిదని వారు భావిస్తారు. అందుకే యుద్ధంలో ఎలాగైనా గెలవాలని వారు అనుకుంటారు.
పుతిన్ ఎలాంటి వ్యక్తి అంటే అరెస్ట్ అయి పరువు పోగొట్టుకోవడం కంటే చివరివరకు పోరాడటానికి ఇష్టపడే వ్యక్తి అని నేను అనుకుంటున్నా’’ అని గ్యారీ సింప్సన్ వివరించారు.
సవాళ్లు
ఇప్పుడు మన ప్రధాన ప్రశ్నను మరోసారి చూద్దాం. యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు గానూ పుతిన్‌ను విచారించగలరా?
పుతిన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల ముందు హాజరుపరచడం చాలా సెద్ద సవాలు. రష్యా, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అధికారికంగా గుర్తించదు.
ఒకవేళ ఐసీసీ ఒప్పందంపై సంతకం చేసిన ఏ దేశానికైనా పుతిన్ వెళితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, అది జరగడానికి చాలా సమయం పట్టవచ్చు.
పుతిన్‌కు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు సేకరించినప్పటికీ, ఇటువంటి చట్టపరమైన ప్రక్రియలకు చాలా సమయం పడుతుంది.
ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో నెమ్మదిగానైనా చట్టం అనేది పనిచేస్తోందనే నమ్మకం ప్రజల్లో కలిగించిందనేది మాత్రం నిజం.
ప్రస్తుతం పుతిన్‌ను అరెస్టు చేయడం చాలా కష్టమైన పనిగా అనిపించొచ్చు. కానీ, అసాధ్యమని అనిపించిన విషయాలు గతంలో చాలా జరిగాయని క్లాస్ క్రెసోవిచ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















