రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్టు వారెంట్... జారీ చేసిన ఐసీసీ

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, EPA

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) అరెస్టు వారెంటు జారీ చేసింది.

'యుద్ధనేరాల'కు వ్లాదిమిర్ పుతిన్ బాధ్యుడు అంటూ ఐసీసీ ఆరోపించింది. అలాగే యుక్రెయిన్ నుంచి 'చట్టవ్యతిరేక' పద్ధతిలో పిల్లలను రష్యాకు గెంటివేస్తున్నారని అది తెలిపింది.

2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రకు దిగింది. నాటి నుంచి 'యుద్ధనేరాలు' జరుగుతున్నాయని ఐసీసీ అంటోంది.

అయితే ఐసీసీకి అరెస్టు చేసే అధికారాలు లేవు. సభ్యదేశాల్లో మాత్రమే ఐసీసీకి విచారణ అధికారాలు ఉంటాయి. కానీ ఐసీసీ సభ్యదేశాల జాబితాలో రష్యా లేదు.

అయితే ఐసీసీ అరెస్టు వారెంటు వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర దేశాలకు ప్రయాణాలు చేయలేక పోవచ్చు.

వ్లాదిమిర్ పుతిన్‌తో మారియా బెలోవా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్లాదిమిర్ పుతిన్‌తో మారియా బెలోవా

''యుద్ధనేరాల్లో మిస్టర్ పుతిన్ పాత్ర ప్రత్యక్షంగా ఉన్నట్లు నమ్మడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి'' అని తన ప్రకటనలో ఐసీసీ పేర్కొంది.

''మిస్టర్ పుతిన్ యుద్ధనేరాలకు పాల్పడ్డారు. అది స్పష్టంగా తెలుస్తోంది. అది(అరెస్టు వారెంట్) న్యాయబద్ధమే అని అనుకుంటున్నా'' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

రష్యా కమిషనర్ ఫర్ చిల్ట్రన్ రైట్స్ మారియా ల్వోవా బెలోవాకు కూడా ఐసీసీ అరెస్టు వారెంటులు జారీ చేసింది.

రష్యా అధ్యక్షుడి గురించి చెడుగా మాట్లాడటం, యుక్రెయిన్ జాతీయ గీతం పాడినందుకు కొందరు పిల్లను మరియుపూల్ నుంచి బయటకు తీసుకుపోయినట్లు బెలోవా గతంలో ప్రకటించారు. అలాగే మరియుపూల్‌కు చెందిన 15ఏళ్ల అబ్బాయిని దత్తత తీసుకున్నట్లు కూడా ఆమె తెలిపారు.

తొలుత అరెస్టు వారెంట్‌ను రహస్యంగా ఉంచాలని అనుకున్నామని, కానీ మరిన్ని నేరాలు జరగకుండా ఉండేందుకు దాన్ని బహిర్గతం చేస్తున్నామని ఐసీసీ తెలిపింది.

ఐసీసీ అరెస్టు వారెంట్ మీద రష్యా ఘాటుగా స్పందించింది.

''నల్ అండ్ వాయిడ్'' అంటే ఆ అరెస్టు వారెంట్లు పనికిరానివి, వాటికి ఎటువంటి విలువ ఉండదూ అని రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు.

రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ అయితే వాటిని ''టాయిలెట్ పేపర్''తో పోల్చారు.

అయితే రష్యాలోని ప్రతిపక్ష నేతలు మాత్రం ఆ అరెస్టు వారెంటులను స్వాగతించారు.

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు

ఫొటో సోర్స్, Reuters

ఐసీసీ తీసుకున్న నిర్ణయం మీద యుక్రెయిన్ ఆనందం వ్యక్తం చేసింది. ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ.

ఐసీసీ సభ్యదేశాల్లో రష్యా లేనందున పుతిన్ కానీ బెలోవా కానీ ది హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కొనే అవకాశాలు దాదాపుగా లేవు.

అయితే యుద్ధ నేరాలను ఖండిస్తూ వస్తున్న పుతిన్‌కు అరెస్టు వారెంటులు 'అవమానకరం' అనుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)