ఆంధ్రప్రదేశ్: ఒడిశా నుంచి భద్రాద్రి వరకు కొత్త రైల్వే లైన్ వస్తే ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Facebook/SCR
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
అడవులు, కొండలు, నదులు దాటుకుంటూ కొత్త రైల్వే రానుంది.
ఒడిశాలోని మల్కన్ గిరి నుంచి తెలంగాణాలోని భద్రాచలం వరకు రైల్వే లైన్ వేయడానికి సర్వేను వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర రైల్వేశాఖ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలను కలుపుతూ మన్యం ప్రాంతంలో రైల్వే లైను వస్తే, అది అనేక మార్పులకు దారితీస్తుందని భావిస్తున్నారు.
ఒడిశాలోని మల్కన్ గిరి, అటవీ ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో ఉన్న చింతూరు మీదుగా భద్రాచలం వరకూ కొత్త రైల్వే లైనుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో ఈ లైన్ నిర్మాణం జరగనుంది.
ఈ రైల్వే లైను పొడవు 173.416 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.2,800 కోట్లు. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండే ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం 213 వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. అందులో 48 భారీ వంతెనలు కూడా ఉన్నాయి.
ఆదివాసీ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈ మార్గం దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. దానికి తగ్గట్టుగా రూ. 3 కోట్లు విడుదల చేశారు. ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) ప్రారంభించారు. ఈ సర్వే జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది.
సర్వే నివేదిక సిద్ధమయిన తర్వాత దానిని పరిశీలించి, రైల్వేబోర్డు తుది అనుమతినివ్వగానే నిర్మాణ పనులు మొదలవుతాయి.


మూడు రాష్ట్రాలకు ప్రయోజనం
ఒడిశాలోని జేపూర్ నుంచి ప్రస్తుతం రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. దానిని మరింత విస్తరించి ఏపీ, తెలంగాణాలను కలిపేందుకు ఈ మార్గానికి అనుమతించారు.
కొత్త లైన్ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లూనిమన్‌గూడల మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంది.
కూనవరం, ఎటపాక మండలాల్లోని గ్రామాల మీదుగా కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది.
అటవీ ప్రాంతంలో రవాణా సదుపాయాలు మెరుగుపరిచే లక్ష్యంతో, ప్రయాణీకుల కోసమే ఈ మార్గం అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. సరుకు రవాణాకి కూడా ఈ లైనును అనువుగా మలచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సింగరేణి కార్పొరేషన్‌తో కలిసి భద్రాచలం–సత్తుపల్లి మధ్య రైల్వే లైన్ వేస్తున్నారు. భధ్రాచలం- పాడురంగాపురం లైన్‌కు దీనిని అనుసంధానించే అవకాశాలున్నాయి. తద్వారా ప్రయాణీకులు, విలువైన ఖనిజాల రవాణాకు కొత్త మార్గం మేలు చేస్తుందని ఇండియన్ రైల్వేస్‌లో సీనియర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఎల్ ప్రసాద్ అన్నారు.
"మల్కన్ గిరి- భద్రాచలం కొత్త లైన్ ద్వారా పలు మార్పులు జరుగుతాయి. గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపరచడం అంటే వారి జీవన విధానం మార్పునకు దోహదపడుతుంది.
రైల్వేలు ఇటీవల సరుకు రవాణా ద్వారా భారీగా ప్రయోజనం పొందుతున్న తరుణంలో కొత్త మార్గంఅనేక రకాల సరుకుల రవాణాకి ఉపయోగపడుతుంది. మల్కాన్ గిరి ప్రాంతంలో విలువైన ఖనిజాలు లభిస్తాయి.
వాటిని అటు విశాఖకు గానీ, ఇటు తెలంగాణా వైపు గానీ తరలించేందుకు ఈ మార్గం ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది" అని ప్రసాద్ వివరించారు.
రైల్వేశాఖ మంత్రి ఒడిశా నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున అక్కడి మారుమూల ప్రాంతాల్లో రైల్వే లైన్లకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని ఆయన అన్నారు.

పెండింగ్ ప్రాజెక్టుల మాటేమిటి?
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్చి 10న మల్కన్‌గిరి ప్రాంతంలో పర్యటించారు. మల్కన్‌గిరి–భద్రాచలం లైన్ పురోగతిని సమీక్షించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తమ ప్రతిపాదనలను మంత్రి ముందుంచారు.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనల దశలోనే ఉంది. కొన్ని నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని డబ్లింగ్ పనులు సాగుతున్నాయి.
ఓవైపు రైల్వే జోన్ అందుబాటులోకి రాకపోగా, రైల్వే ప్రాజెక్టులు కూడా ఆశించిన వేగంతో సాగకపోవడం పట్ల ఏపీ వాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
దీర్ఘకాలిక ప్రతిపాదనగా ఉన్న భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2021-22 బడ్జెట్‌లో ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 5,812 కోట్లు కేటాయించినట్లు పార్లమెంట్‌కు రైల్వే శాఖ తెలిపింది.
కానీ, అందులో రూ. 2,155 కోట్ల నిర్మాణ అంచనా వేసిన కొవ్వూరు- భద్రాచలం మార్గం పనులకు మాత్రం మోక్షం లేదు.
దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున వాటాతో నిర్మించాల్సి ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉందని కేంద్రం రాతపూర్వకంగా తెలిపింది.
1965 నుంచి ఈ రైల్వే లైన్ నిర్మించాలనే డిమాండ్ ఉంది.
కొవ్వూరు, పంగిడి, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వారావుపేట, రాయవరం మీదుగా 155.6 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మించి మార్గమధ్యంలో 16 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ లైన్ నిర్మాణం జరిగితే కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును నేరుగా రైల్వే ద్వారా విశాఖకు, హైదరాబాద్‌కు పంపడానికి వీలుంటుంది.

కోనసీమ రైల్వే లైన్ కూడా అంతే
ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలో ఉన్న కోనసీమ ప్రాంతానికి రైల్వే సదుపాయం కూడా సుదీర్ఘకాల డిమాండ్. దానికి కేంద్రం కూడా అనుమతించింది.
పనులు కూడా మొదలయ్యి రెండు దశాబ్దాలు దాటిపోయింది. లోక్ సభ స్పీకర్‌గా పనిచేసిన జీఎంసీ బాలయోగి హయంలో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురం వచ్చి 1999లో రైల్వే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మొత్తం 57 కిలోమీటర్లు పొడవునా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా కొబ్బరి ఎగుమతులకు మార్గం సుగమం అవుతుంది.
పాతికేళ్లు గడుస్తున్నా నేటికీ కోనసీమలో రైల్వే కూత వినిపించలేదు. రూ.2,120 కోట్లతో నిర్మించాల్సిన ఈ లైన్ ద్వారా కాకినాడ- నరసాపురం అనుసంధానం అవుతాయి.
కానీ, ఇప్పటి వరకూ కోటిపల్లి వరకూ మాత్రమే రైల్వే లైన్ పూర్తయ్యింది. అక్కడ గోదావరి మీద వంతెన నిర్మాణ పనులు చాలాకాలంగా సాగుతున్నాయి. అందులో ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 25శాతం నిధులు వెచ్చించాల్సి ఉంది.
అందులో ఇంకా రూ.358 కోట్లు పెండింగులో పెట్టిందని రైల్వే శాఖ తెలిపింది. 2021లో కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేస్తే రైల్వే పనులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి వివరించింది.
"చాలా జాప్యం జరుగుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ పనులు ముందుకు సాగడం లేదు. గోదావరి పాయల మీద వంతెనల నిర్మాణం జరగాలి. అందుకు నిధులు విడుదల కాకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి.
కేంద్రం, రాష్ట్రం సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి" అంటూ కోనసీమ రైల్వే సాధన సమితి ప్రతినిధి అడబాల వీరేష్ అన్నారు.

వివిధ దశల్లో ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 33 రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం చెబుతోంది.
అందులో 16 కొత్త లైన్లు కాగా, 17 లైన్లు డబ్లింగ్ పనులుగా పేర్కొంది. సుమారుగా 5,706 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.63,731 ఖర్చు అవుతుందని అంచనా వేసింది.
అందులో నడికుడి లైన్ సిద్ధం అవుతోంది. గుడివాడ, భీమవరం మీదుగా విజయవాడ-నరసాపురం మార్గం డబ్లింగ్ పనులు, విద్యుద్దీకరణ కూడా దాదాపు పూర్తి అయ్యింది.
నడికుడి- శ్రీకాళహస్తి లైన్, కడప -బెంగళూరు లైన్ వంటివి నిర్మాణ దశలో ఉన్నాయి.
అమరావతి రాజధాని ప్రాంతానికి రైల్వే లైన్ ప్రతిపాదనకి కేంద్రం ఆమోదం తెలిపింది. కాకినాడను మెయిన్ లైన్లో కలపాలన్న ప్రతిపాదన కూడ ముందుకు సాగలేదు.
"రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల మీద కేంద్రంతో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తున్నాం. రైల్వే అధికారులతో మాట్లాడుతున్నాం. నిధుల కేటాయింపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దాని మూలంగానే కొత్త రైళ్లు సాధించే అవకాశం వస్తోంది.
నడికుడి- శ్రీకాళహస్తి మార్గంలో సర్వీసులు మొదలయ్యాయి. త్వరలోనే గుంటూరు మీదుగా తిరుపతికి వందేభారత్ ఎక్స్ ప్రెస్ కూడా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా చెల్లించి పనులు పూర్తిచేసేందుకు సహకారం అందిస్తున్నాం" అంటూ నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు.
ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యతనివ్వాలనే విషయంలో తాము పోరాడుతున్నామని ఆయన బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















