సినిమా రివ్యూ: ఫ‌లానా అబ్బాయి.. ఫ‌లానా అమ్మాయి ఏం చేశారంటే..

Phalana Abbayi Phalana Ammayi

ఫొటో సోర్స్, Phalana Abbayi Phalana Ammayi

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

`నేను ఇప్పుడు తాజ్ మ‌హ‌ల్ క‌డుతున్నా చూడండి` అని ముందే చెప్పేయ‌కూడ‌దు. అది తాజ్ మ‌హలో.. తాటాకుల ఇల్లో... చూసిన‌వాళ్లు చెప్పాలి.

ఫర్ సపోజ్ ఎంత బ్ర‌హ్మాండ‌మైన పాల‌రాతి మందిరం క‌ట్టినా.. `ఇదేంట్రా.. తాజ్ మ‌హ‌ల్‌లా లేదు` అనేస్తారు. ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌చ్చే ఇబ్బందే అది. ప్రేక్ష‌కుల్ని `ఫ‌లానా సినిమా లాంటి సినిమా చూడ‌బోతున్నారు` అని ప్రిపేర్ చేయ‌డం ఎప్పుడూ మంచిది కాదు.

ఈ ఉపోద్ఘాత‌మంతా ఎందుకంటే.. `ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి` సినిమా ప్ర‌మోష‌న్ల‌లో `నేను బిఫోర్ స‌న్‌సెట్ లాంటి సినిమా తీస్తున్నా` అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్‌. `బిఫోర్ స‌న్‌సెట్` హాలీవుడ్ క్లాసిక్‌! ఎవ‌ర్ గ్రీన్ ఫిల్మ్‌. దాని మోహంలో ప‌డిపోయిన ద‌ర్శ‌కులెంతోమంది. వాళ్లంతా ఆ సినిమా చూసి ర‌సాస్వాద‌న పొందారే త‌ప్ప‌... అలాంటి సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌లేదు. ప్ర‌య‌త్నంచ‌కూడ‌దు అనేం లేదు. కానీ.. ఇది అలాంటి సినిమా అంటూ స్టేట్‌మెంట్లు ముందే గుప్పించేయ‌కూడ‌దు. అలా చేస్తే... అంచ‌నాల భారం మోయ‌డం క‌ష్టం అవుతుంది. `బిఫోర్ స‌న్‌సెట్`తో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ పోల్చిన `ఫ‌లానా అబ్బాయి - ఫ‌లానా అమ్మాయి` ఇప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి, ఈ సినిమా ఎలా ఉంది? అవ‌స‌రాల పోలికకు స‌రితూగిందా? ఈ సినిమాలో అవ‌స‌రాల మార్క్ ఉందా, లేదా?

Phalana Abbayi Phalana Ammayi

ఫొటో సోర్స్, Twitter/IamNagashaurya

కథేంటి?

అవ‌స‌రాల శ్రీ‌నివాస్ సినిమాల్లో క‌థేం పెద్ద‌గా ఉండ‌దు. ఆయ‌న‌వ‌న్నీ ట్రీట్‌మెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమాలే. ఇక్క‌డ కూడా ద‌ర్శ‌కుడు పెద్ద‌గా క‌థేం అనుకోలేదు. ఓ ఫ‌లానా అబ్బాయి. అత‌ని పేరు సంజ‌య్ (నాగ‌శౌర్య‌). ఓ ఫ‌లానా అమ్మాయి అనుప‌మ (మాళ‌వికా నాయ‌ర్‌) ల క‌థ ఇది.

విశాఖ‌ప‌ట్నంలో ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న‌ప్పుడు సంజ‌య్‌కి అనుపమ ఓ సంవ‌త్స‌రం సీనియ‌ర్‌. ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరుగుతుంది. ఆ త‌ర‌వాత‌ స్నేహం. ఆ త‌ర‌వాత ప్రేమ. లండ‌న్‌లో చ‌దువుకొంటున్న‌ప్పుడు స‌హ‌జీవ‌నం చేస్తారు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ విడిపోతారు. విడిపోయిన వీళ్లిద్ద‌రూ క‌లిశారా? లేదా? అస‌లు వీళ్లిద్ద‌రూ ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చింది? అనేదే ఈ సినిమా.

Phalana Abhayi Phalana Ammayi

ఫొటో సోర్స్, Twitter/IamNagashaurya

ఎలా ఉంది?

ఈ మాత్రం క‌థ‌ల‌తో సినిమాలెలా తీస్తారు? అని ఆశ్చ‌ర్య‌పోయేంత చిన్న లైన్ ఎంచుకొన్నాడు అవ‌స‌రాల‌. ముందే చెప్పిన‌ట్టు త‌న సినిమాల్లో క‌థ బ‌లంగా ఉండక‌పోవొచ్చు. కానీ ఎమోష‌న్స్‌, మూమోంట్స్, సంగీతం.. అన్నీ గ‌ట్టిగానే ఉంటాయి. అందుకే ఊహ‌లు గుస‌గుస‌లాడే లాంటి సినిమాలు వ‌చ్చాయి. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌లో మంచి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉంది. ప్ర‌తీ సీన్‌లోనూ అది క‌నిపిస్తుంటుంది. చాలా చిన్న సీన్‌. చాలా రెగ్యుల‌ర్ సీన్‌లో కూడా.. త‌న మార్క్ ఉంటుంది. దాంతో.. ఆయా స‌న్నివేశాలు ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ సినిమాలో కూడా ద‌ర్శ‌కుడు న‌మ్మింది అదే. ఓ అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య ప‌రిచ‌యం, స్నేహం, ప్రేమ‌, అల‌క‌లు, చిరుకోపాలు.. ఇవ‌న్నీ చూపిద్దామ‌నుకొన్నాడు. ఇలాంటి మూమెంట్స్ న‌డిపించ‌డానికి ఓ ఆస‌రా కావాలి. అదే క‌థ‌. అందుకే, మూమెంట్స్‌కి ఇచ్చిన ప్రాధాన్యం క‌థ‌కు ఇవ్వ‌లేదు.

2010 నేప‌థ్యంలో క‌థ మొద‌ల‌వుతుంది. విడిపోయిన‌ హీరో హీరోయిన్లు మ‌ళ్లీ క‌లుసుకొంటారు. ఒక్క‌సారిగా ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌ని చాప్ట‌ర్ల‌లా విడ‌గొట్టుకొన్నాడు ద‌ర్శ‌కుడు. చాప్ట‌ర్ 1లో కాలేజీ స్నేహం, చాప్ట‌ర్ 2లో ఆ స్నేహం ప్రేమ‌గా మార‌డం, చాప్ట‌ర్ 3లో లండ‌న్ క‌థ‌... ఇలా ఒక్కోక్క చాప్ట‌ర్‌లో ఒక్కో ఎమోష‌న్ చెప్పాల‌నుకొన్నాడు. ఆలోచ‌న బాగుంది. ఇలాంటి ఐడియాల‌తోనే రెగ్యుల‌ర్ క‌థ‌ల‌కు సైతం కొత్త క‌ల‌రింగ్ వ‌స్తుంది. అయితే చాప్ట‌ర్ 1కీ 2కీ 3కీ పెద్ద‌గా తేడా అనిపించ‌దు. హీరో నాగ‌శౌర్య గెట‌ప్పులు త‌ప్ప‌, అందులోని ఎమోష‌న్ ఏమాత్రం మార‌లేద‌నిపిస్తుంది. ప్ర‌తీ చాప్ట‌ర్‌లోనూ హీరో, హీరోయిన్ల బాండింగ్ చూపించే ప్ర‌య‌త్నం చేశారంతే! ఇంటర్వెల్ బ్యాంగ్ వేసుకోవ‌డానికో, బ్రేక‌ప్ చెప్పుకోవ‌డానికో ఓ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ప‌ట్టుకోవాలి కాబ‌ట్టి, క‌థ‌లో దాన్ని తీసుకొచ్చి విశ్రాంతి కార్డు వేశారు. అయితే ఆ పాయింట్ చాలా అస‌హ‌జంగా, చిన్న‌దిగా ఏమాత్రం బ‌లం లేకుండా అనిపిస్తుంది.

ఆ త‌ర‌వాత బ్రేక‌ప్ ఎపిసోడ్. మూవ్ ఆన్ అయిపోవాల‌నుకొన్న జంట‌లోని ఇబ్బందులు, గ‌త జ్ఞాపకాలు పిల్ల తెమ్మెరలా వెంటాడ‌డాలూ, పేథాస్ సాంగ్ లూ, మ‌ధ్య మ‌ధ్య‌లో ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిరావ‌డాలూ జ‌రిగిపోతుంటాయి. అయితే.. ఏ సీన్ చూసినా ఒకేలా ఉండ‌డం, ఒకే లాంటి ఫీలింగ్ క‌లిగించ‌డ‌లో తెర‌పై హీరో, హీరోయిన్లు క్వింటాళ్ల లెక్క‌న ఎమోష‌న్ ఫీల‌వుతున్నా.. దాన్ని ఆడిటోరియం ఓన్ చేసుకోలేదు.

Phalana Abbai Phalana Ammai

ఫొటో సోర్స్, Insta/malvikanairofficial

ఈ క‌థ‌ని అత్యంత స‌హ‌జంగా చెప్పాల‌న్న‌ది అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ప్ర‌య‌త్నం. సినిమాటిక్ సంభాష‌ణ‌లు, డ్రామా ఉండ‌కూడ‌ద‌ని జాగ్ర‌త్త ప‌డ్డాడు. నేటివిటీకి అత్యంత ద‌గ్గ‌ర‌గా స‌హ‌జంగా సినిమా తీయాల‌నుకొన్నాడు. త‌న తాప‌త్ర‌యం, ప్ర‌య‌త్నం హ‌ర్షించ‌ద‌గిన‌దే. అయితే ఆ స‌హ‌జ‌త్వం మోజులో స‌న్నివేశాన్ని లాగుతూ.. లాగుతూ.. ల్యాగ్ అనే ప‌దానికి ల్యాండ్ మార్క్ లాంటి సీన్లు తీసుకొంటూ వెళ్లాడు. ఓ పాట‌ హీరో, హీరోయిన్ల మ‌ధ్య అపార్థానికి కార‌ణం అవుతుంది. ఈ విష‌యం చెప్ప‌డానికి ద‌ర్శ‌కుడు తీసుకొన్న స‌మ‌యం.. స‌రిగ్గా 15 నిమిషాలు. దాని కోసం నాలుగు సీన్లు వాడుకొన్నాడు. ఇలా అయిన దానికీ, కాని దానికీ.. స‌న్నివేశాన్ని సాగ‌దీసిన సంగ‌తులు సినిమా నిండా చాలా క‌నిపిస్తాయి. కేవ‌లం 130 నిమిషాల సినిమా ఇది. అంటే చిన్న‌దే అనుకోవాలి. అయిన‌ప్పటికీ 3 గంట‌ల సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. దానికి కార‌ణం ఈ ల్యాగే.

సినిమాటిక్ డ్రామా ఉండ‌కూడ‌ద‌ని అవ‌స‌రాల భావించాడు కానీ, క‌థ‌కు డ్రామా ఎంతో కొంత అవ‌స‌రం. ఎమోష‌న్స్ పండించ‌డానికి అప్పుడే స్కోప్ ఉంటుంది. కానీ.. డ్రామా లేకుండా సినిమాని న‌డ‌పాల‌ని ఎప్పుడు అనుకొన్నాడో ఆ ఎమోష‌న్స్‌ని కూడా వ‌దులుకోవాల్సివ‌చ్చింది. చిన్న సారీ చెబితే.. అతుక్కుపోయే బంధం.. హీరో, హీరోయిన్ల‌ది. ఆ సారీ చెప్ప‌డానికి క్లైమాక్స్ వ‌ర‌కూ ఎందుకు ఆగాడు? హీరో - హీరోయిన్ల మ‌ధ్య ఈగో స‌మ‌స్య లేన‌ప్పుడు.. `సారీ` చెప్ప‌డానికి హీరోకి వ‌చ్చే ఇబ్బంది ఏముంటుంది? పైగా ఆసుప‌త్రికి రాలేదన్న చిన్న‌కార‌ణం... ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమాలోని సంఘ‌ర్ష‌ణ‌కు బ‌ల‌మైన కార‌ణం అవ్వ‌దు. దానికి హీరో ఎలాంటి స‌మాధానం చెబుతాడో ప్రేక్ష‌కుడు ఈజీగా ఊహించ‌గ‌లిగే అవ‌కాశం ఉన్న‌ప్పుడు అస్స‌లు కాదు. ఆ పాయింట్ ని న‌మ్ముకొని ద‌ర్శ‌కుడు ఇంత `పెద్ద‌` సినిమా తీశాడు.

అలాగ‌ని ఈ సినిమాలో అవ‌స‌రాల మార్క్ లేదా...;? అంటే అక్క‌డ‌క్క‌డ కొంచెం ఉండీ లేన్న‌ట్టు క‌నిపిస్తూ వెళ్తుందంతే. ప‌డ‌మ‌టి సంధ్యారాగం సినిమా చూస్తూ.. ఐస్ క్రీమ్, ఆవ‌కాయ్ పాట కోట్ చేస్తూ.. హీరో స్నేహితుడు చేసే ప్ర‌య‌త్నాలు స‌ర‌దాగా న‌వ్విస్తాయి. క్లైమాక్స్‌కి ముందు అన‌వ‌స‌రంగా వ‌చ్చిన‌ `నీలిమ‌` పాత్ర అనుకోకుండా కావ‌ల్సినంత ఫ‌న్ ఇస్తుంది. `సంజూని మార్చుకొంటా` అని ఓ పాత్ర అంటే.. `మార్చుకోవ‌డానికి చిన్న‌గా చిరిగిన వంద నోటా వాడు..` అని కౌంట‌ర్ ఇవ్వ‌డం బాగుంది. ఇప్పుడు ఉద్యోగం ఏమీ చేయ‌డం లేదు అని చెప్ప‌డానికి `ఉద్యోగానికీ ఉద్యోగానికీ మ‌ధ్య విరామం వ‌చ్చింది` అని స‌ర్దిచెప్పుకోవ‌డం ఇంకా బాగుంది.

Phalana Abbai Phalana Ammai

ఫొటో సోర్స్, Insta/malvikanairofficial

ఎవరెలా నటించారు?

క‌ల్యాణీ మాలిక్ త‌న స్వ‌రాల‌తో ఈ సినిమాకి బ‌లం ఇవ్వ‌డానికి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశాడు. `క‌నుల చాటు మేఘ‌మా` పాట ఇది వ‌ర‌కే హిట్ అయ్యింది. థియేట‌ర్లో ఈ పాట ఎప్పుడొస్తుందా? అని సంగీత ప్రియులు ఆశ‌గా ఎదురు చూస్తారు. కానీ.. సినిమా ఫ‌లితం ఏమిటో ప్రేక్ష‌కుడు ఆల్రెడీ ఫిక్స‌యిపోయి, బోర్ ఫీలై, సీట్లో అటూ ఇటూ క‌దులుతున్న‌ప్పుడు ఈ పాట వ‌స్తుంది. దాంతో.. ఆడియో ప‌రంగా ఉన్న ఫీల్‌... దృశ్య రూపంలోకి త‌ర్జుమా అవ్వ‌లేక‌పోయింది. న‌టీన‌టుల ప‌రంగా.. నాగ‌శౌర్య‌, మాళ‌విక‌కు మంచి మార్కులు ప‌డ‌తాయి. ఈ జంట తెర‌పై చూడ్డానికి బాగుంది.

వివిధ చాప్ట‌ర్ల‌లో, వివిధ వ‌య‌సుల వారిగా.. నాగ‌శౌర్య మేకొవ‌ర్ ఆక‌ట్టుకొంటుంది. అందుకోసం తాను ప‌డిన క‌ష్టం క‌నిపిస్తుంది. మాళ‌విక న‌ట‌న‌లోనే కాదు, ఆ పాత్ర బిహేవ్ చేసిన తీరులోనూ మెచ్యూరిటీ క‌నిపిస్తుంది. త‌న డ్ర‌స్సింగ్ మోల్డ్ర‌న్‌గా ఉంటూనే, హుందాగా సాగింది. వేలెంటైన్ పాత్ర‌లో హీరో స్నేహితుడు కాస్త సంద‌డి చేశాడు. ఇవి త‌ప్ప‌. తెర‌పై చెప్పుకోద‌గిన పాత్ర‌లేం లేవు.

Phalana Abbayi Phalana Ammayi

ఫొటో సోర్స్, Phalana Abbayi Phalana Ammayi

సాంకేతికంగా ఎలా ఉంది?

సాంకేతికంగా సినిమా బాగుంది. ఫొటోగ్రఫీ నీట్ గా ఉంది. సంగీతం స‌రే స‌రి. అయితే... బిర్యానీ తింటున్న‌ప్పుడు ప్లేట్ ఎంత బాగున్నా, ఎంత కొత్త‌గా ఉన్నా.. రుచిగా ఉండాల్సింది బిర్యానీనే. ప్లేటు కాదు. సినిమా కూడా అంతే. క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌లు, వాళ్ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఇవే సినిమాల‌కు మూలం. సాంకేతిక హంగులు ఆ త‌ర‌వాత అద‌న‌పు బ‌లాన్నిస్తాయంతే.

ఫ‌లానాలో సాంకేతిక విభాగం ఎంత బాగా ప‌నిచేసినా.. సినిమాకు ప్రాణ‌మైన పునాది క‌థ బ‌లంగా లేదు. దాంతో సంఘ‌ర్ష‌ణ పుట్ట‌లేదు. అలాంట‌ప్పుడు తెర‌పై ఎన్ని పాత్ర‌లొచ్చినా, ఎంత సంద‌డి చేసినా వాటిలో జీవం క‌నిపించ‌దు. ఇక్క‌డా అదే జ‌రిగింది. అవ‌స‌రాల బ‌లం.. క‌లం. దాన్ని స‌రిగా వాడుకొంటే త‌ప్ప‌కుండా మంచి సినిమాలు తీస్తాడు. త‌న స్థాయికి, త‌న‌లోన క్రియేటివిటీకి `ఫ‌లానా...` చాలా దూరంలోనే నిలిచిపోయింది.

వీడియో క్యాప్షన్, ఉత్తరాదిని ఊపేస్తున్న తెలుగు సినిమా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)