రష్యా: అలెక్సీ నావల్నీ, ఇల్యా యాషిన్.. పుతిన్ ప్రత్యర్థులంతా ఏమయ్యారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విటాలి షెవ్చెన్కో
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేడు రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ పాలనకు తిరుగులేదు. ఒకప్పుడు పుతిన్‌ను ఎదిరించినవారంతా బహిష్కరణకు గురయ్యారు. కొందరు ప్రత్యర్థులు జైలు పాలయ్యారు. మరికొందరిని చంపేశారు.
గత ఏడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ముందే, రెండు దశాబ్దాలుగా రష్యాలో అసమ్మతిని అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయి. దాంతో, రష్యాలో ప్రతిపక్షం అన్నదే లేకుండా పోయింది.
అధ్యక్షుడిగా పుతిన్ పగ్గాలు చేపట్టిన తొలిరోజుల్లోనే రష్యాలో అత్యంత శక్తిమంతులైన ఓలిగార్క్‌లను మోకాళ్ల మీదకు తీసుకొచ్చారు. 1991లో సోవియట్ యూనియన్ పతనమయ్యాక, ఆర్ధికంగా ఎదిగిన బడా వ్యాపారులను ఓలిగార్క్‌లు అని పిలుస్తారు. వీరికి రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉంటుంది.
రష్యాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీలలో ఒకటైన 'యుకోస్'కు ఒకప్పుడు అధిపతిగా వ్యవహరించిన మిఖాయిల్ ఖోడోర్కోవ్స్కీ (ఓలిగార్క్)ని 2003లో అరెస్ట్ చేశారు.
మిఖాయిల్ రష్యాలో ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇచ్చేవారు. వాటికి నిధులు సమకూర్చారు. దాంతో, పన్ను ఎగవేత, దొంగతనం నేరాలతో 10 ఏళ్లు ఆయన్ను జైల్లో పెట్టారు. విడుదలైన తరువాత మిఖాయిల్ రష్యాను విడిచిపెట్టారు.
మరొక ఓలిగార్క్ బోరిస్ బెరెజోవ్స్కీ.. పుతిన్ అధికారంలోకి రావడానికి సహాయపడిన వ్యక్తి. తరువాత వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. దాంతో, బోరిస్ బహిష్కారానికి గురయ్యారు. 2013లో బ్రిటన్‌లో చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నట్టు రిపోర్టులు వచ్చాయి.
క్రమంగా కీలకమైన మీడియా సంస్థలన్నీ పుతిన్ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. క్రెమ్లిన్ పాడిన పాటకు తాళం వేయడం ప్రారంభించాయి.

ఫొటో సోర్స్, Getty Images
అలెక్సీ నావల్నీ
రష్యా ప్రతిపక్షంలో అత్యంత ప్రముఖ వ్యక్తి అలెక్సీ నావల్నీ. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. పుతిన్ వేల మందిని మభ్యపెట్టి "నేరపూరిత, దూకుడు" యుద్ధంలో పాల్గొనేలా చేస్తున్నారని ఆరోపించారు.
2020 ఆగస్టులో నావల్నీపై విషప్రయోగం జరిగింది. దీనికోసం నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్ (నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపే పదార్థం)ను ఉపయోగించారని దర్యాప్తులో తేలింది.
ఆయన సైబీరియా నుంచి మాస్కో తిరిగివస్తుండగా విమానంలో స్పృహ కోల్పోయారు. చికిత్స కోసం ఆయన్ను అత్యవసరంగా జర్మనీకి తరలించారు. నావల్నీ చావు అంచుల వరకూ వెళ్లివచ్చారు.
2021 జవనవరిలో నావల్నీ రష్యాకు తిరిగిరావడం ప్రతిపక్ష వర్గాలకు కొంత ఊరటనిచ్చింది. కానీ, వెనువెంటనే పుతిన్ ప్రభుత్వం మోసం, కోర్టు ధిక్కారం కేసులో నావల్నీని అరెస్ట్ చేసింది.
గత తొమ్మిదేళ్లుగా నావల్నీ జైల్లోనే ఉన్నారు. ఆయన జీవితకథ కేంద్రంగా చిత్రీకరించిన 'నావల్నీ' సినిమా ఈ ఏడాది ఉత్తర డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది.
2010వ దశంకంలో నావల్నీ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలలో చురుకుగా పాలుపంచుకున్నారు. నావల్నీ ప్రధాన రాజకీయాస్త్రం 'యాంటీ-కరప్షన్ ఫౌండేషన్' (ఎఫ్‌బీకే) సంస్థ బహిర్గతం చేసిన పలు అంశాలను ఆన్‌లైన్‌లో లక్షల మంది వీక్షించారు.
2021లో రష్యా ప్రభుత్వం ఎఫ్‌బీకేను అతివాద సంస్థగా పేర్కొంది. నావల్నీపై అవినీతి కేసులు వేసింది. అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అవినీతి ఆరోపణలని నావల్నీ చాలాసార్లు ఖండించారు.
నావల్నీ సహచరులు పలువురు భద్రతాధికారుల ఒత్తిడికి లొంగిపోయారు. ఎఫ్‌బీకే మాజీ హెడ్ ఇవాన్ జ్దానోవ్, ఎఫ్‌బీకేలో ప్రముఖ లాయర్ లియుబోవ్ సోబోల్ సహా కొందరు విదేశాలకు పారిపోయారు. రష్యావ్యాప్తంగా నావల్నీ కార్యాలయాల అధిపతుల్లో చాలా మంది రష్యా విడిచిపెట్టి వేరే దేశాలకు వెళ్లిపోయారు.
నావల్నీ కుడి భుజం లియోనిడ్ వోల్కోవ్ కూడా 2019లో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొన్నప్పుడు రష్యా విడిచిపెట్టి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధానికి వ్యతిరేకంగా గొంతు విప్పినవారు జైలుపాలు
పుతిన్‌ను గట్టిగా వ్యతిరేకించిన మరొక కీలక వ్యక్తి ఇల్యా యాషిన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన 2022 ఏప్రిల్‌లో ఒక యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాంలో 'రష్యా యుద్ధనేరాలపై విచారణ చేయాలని' పిలుపునిచ్చారు. పుతిన్‌ను "యుద్ధంలో అతిచెడ్డ కసాయివాడుగా" పేర్కొన్నారు.
రష్యా సైన్యం గురించి "ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం" వ్యాప్తిచేశారన్న అభియోగంతో ఓ కొత్త చట్టం కింద ఇల్యా యాషిన్‌కి జైలుశిక్ష విధించారు. ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై దాడి చేసిన కొద్ది రోజులకే అత్యవసరంగా ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
యాషిన్ 17 ఏళ్లకే 2000లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది పుతిన్ అధికారంలోకి వచ్చారు.
ప్రతిపక్షంలో క్రియాశీలకంగా ఉండేవారు యాషిన్. 2017లో మాస్కోలోని క్రాస్నోసెల్స్కీ జిల్లా కౌన్సిల్‌కు అధిపతిగా ఎన్నికయ్యారు. తరువాత కూడా రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.
2019లో మాస్కో నగర మండలి ఎన్నికలలో స్వతంత్ర, ప్రతిపక్ష అభ్యర్థులు పోటీచేయడానికి అధికారులు అంగీకరించపోవడంతో నిరసనలు వెల్లువెత్తాయి. అందులో చురుకుగా పాల్గొన్న కారణంగా యాషిన్‌ను నెలకు పైగా జైల్లోపెట్టారు.
రష్యాలో ప్రముఖ యాక్టివిస్ట్, కేంబ్రిడ్జ్‌లో చదువుకున్న జర్నలిస్ట్ వ్లాదిమిర్ కారా-ముర్జా పై 2015, 2017లలో రెండుసార్లు అంతుచిక్కని రీతిలో విషప్రయోగం జరిగింది. 2015లో ఆయన కొంతకాలం కోమాలోకి వెళ్లిపోయారు కూడా.
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని విమర్శించినందుకుగాను 2022 ఏప్రిల్‌లో కారా-ముర్జాను అరెస్ట్ చేశారు. రష్యా ఆర్మీపై "తప్పుడు ప్రచారాలు" చేస్తున్నారని, అవాంఛనీయమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, రాజద్రోహానికి పాల్పడ్డారని అభియోగాలు మోపారు. నేరం రుజువైతే 25 ఏళ్ల జైలుశిక్ష పడుతుందని యాషిన్ తరపు లాయర్ చెబుతున్నారు.
యాషిన్ రష్యా పత్రికల్లో, విదేశీ మీడియాలో పుతిన్‌పై పలు విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. 2011లో రష్యాలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నవారిపై పశ్చిమదేశాలు విధించిన ఆంక్షలను సమర్థిస్తూ యాషిన్ పలు వ్యాసాలు రాశారు.
వివిధ దేశాలు విధించిన ఈ ఆంక్షలను 'మాగ్నిట్స్కీ యాక్ట్స్' అంటారు. 2009లో రష్యాలో ప్రముఖ న్యాయవాది సెర్గీ మాగ్నిట్స్కీ మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో జైలుశిక్ష ఎదుర్కొన్నారు. జైల్లోనే ఆయన మరణించారు. దాంతో, రష్యాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ప్రపంచం దృష్టికి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజాస్వామ్యం కోసం పోరాటం
కారా-ముర్జా, ఓపెన్ రష్యా అనే సంస్థకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఉండేవారు. పరారీలో ఉన్న మాజీ ఓలిగార్క్ మిఖాయిల్ ఖోడోర్కోవ్‌స్కీ ఏర్పాటు చేసిన ప్రముఖ ప్రజాస్వామ్య అనుకూల సమూహం ఇది.
ఓపెన్ రష్యా ఒక "అవాంఛనీయ సంస్థ" అని రష్యా ప్రభుత్వం తీర్మానించింది. 2021లో దాన్ని మూసివేసింది. ఆ సంస్థ హెడ్ ఆండ్రీ పివోవరోవ్ "అవాంఛనీయ సంస్థ" కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు నాలుగు సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తున్నారు.
కారా-ముర్జా దీర్ఘకాలంగా జైల్లో ఉన్నారు కానీ, బతికే ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, ప్రతిపక్ష నేత బోరిస్ నెమ్త్సోవ్ ప్రాణాలతో లేరు.
పుతిన్ అధికారంలోకి రాక ముందు, నెమ్త్సోవ్.. నిజ్నీ నొవ్‌గోరోడ్ ప్రాంతానికి గవర్నర్‌గా, ఇంధన మంత్రిగా, ఆ తరువాత ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించారు. రష్యా పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు.
ఆపై ఆయన క్రెమ్లిన్‌కు వ్యతిరేకంగా గొంతు విప్పారు. పుతిన్‌ను విమర్శిస్తూ ఎన్నో వ్యాసాలు రాశారు. నిరసనలు చేపట్టారు.
2015, ఫిబ్రవరి 27న నెమ్త్సోవ్ క్రెమ్లిన్ వెలుపల వంతెన దాటుతుండగా దుండగులు కాల్చి చంపారు.
చెచెన్ ప్రాంతానికి చెందిన అయిదుగురు వ్యక్తులను ఈ హత్య కేసులో దోషులుగా నిర్థరించారు. అయితే, ఎందుకు చంపారు, ఎవరు చంపమన్నారన్న విషయాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలీవు.
నెమ్త్సోవ్ మరణించిన ఏడేళ్ల తరువాత, ఆయన్ను చంపడానికి కొన్ని నెలల ముందు నుంచి ఒక ప్రభుత్వ అధికారి ఆయన్ను ఫాలో అవుతూ వచ్చారని, ఆ అధికారికి ఓ రహస్య హంతక సమూహంతో సంబంధం ఉందని ఒక దర్యాప్తులో తేలింది.
పైన చెప్పిన వ్యక్తులు, కేసులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అసమ్మతి గొంతు నొక్కడానికి రష్యా ప్రభత్వం ఇలా ఎంతో మంది మీద జూలు విదిలించింది.
యుక్రెయిన్ యుద్ధం మొదలు రష్యాలో స్వతంత్ర మీడియా చానళ్లన్నీ విదేశాలకు పయనమయ్యాయి. మెడుజా, నోవాయా గెజిటా, టీవీ రైన్ లాంటి చానెళ్లకు సొంత దేశంలో చోటులేకపోయింది. ఎఖో మాస్క్వీ లాంటి రేడియో స్టేషన్లూ మూతబడ్డాయి.
లెక్కలేనంత మంది వ్యాఖ్యాతలు దేశం నుంచి పారిపోయారు. సీనియర్ జర్నలిస్ట్ అలెగ్జాండర్ నెవ్జోరోవ్ పై "విదేశీ ఏజెంట్" అని ముద్రవేశారు. రష్యా ఆర్మీకి వ్యతిరేకంగా "నకిలీ" వార్తలను ప్రచారం చేస్తున్నరన్న అభియోగం మోపారు. ఆయన విచారణకు గైర్హాజరు కావడంతో ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారు.
కేసులు మోపడానికి, అరెస్ట్ చేయడానికి ప్రముఖులే కానక్కర్లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సామాన్య ప్రజలకైనా శిక్షలు తప్పవు.
2023 మార్చిలో డిమిత్రి ఇవనోవ్ అనే గణిత విద్యార్థి టెలిగ్రాంలో యుద్ధ వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు ఎనిమిదిన్నరేళ్ల జైలుశిక్ష విధించారు. మళ్లీ అదే 'ఆర్మీకి వ్యతిరేకంగా నకిలీ వార్తల' చట్టం కింద అభియోగాలుమోపారు.
అలెక్సీ మోస్కలెవ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ రెండేళ్ల జైలుశిక్ష వేశారు. ఆయన 13 ఏళ్ల కూతురు స్కూల్లో యుద్ధ వ్యతిరేక నినాదంతో ఒక బొమ్మ వేసింది. దాని ఆధారంగా దర్యాప్తు జరిపి మోస్కలెవ్‌ను జైల్లో పెట్టారు.
తనకు ప్రత్యర్థులే లేకుండా చేయడానికి పుతిన్‌కు రెండు దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు ఆయన్ను సవాలు చేసేవారే లేరు. అదే పుతిన్ ప్రణాళిక అయితే, అది ఫలించినట్టే.
ఇవి కూడా చదవండి:
- వియత్నాం యుద్ధంలో అమెరికా ఓటమికి ఏడు కారణాలు ఇవీ
- వెర్టిగో : కళ్లు మసకబారి, తల తిరుగుతూ, చెవుల్లో ధ్వనులు వినిపిస్తున్నాయా?
- 'మాకు పెళ్లి అవసరం లేదు, ప్రేమ చాలు' - సహజీవనంలో ఉన్న ఓ మహిళ అనుభవాలు
- హైదరాబాద్: ఆ 35 ముస్లిం కుటుంబాలు రోడ్డుపైనే రంజాన్ దీక్షలు ఎందుకు చేస్తున్నాయి?
- బంగ్లాదేశ్: 'బియ్యం కొనుక్కునే పరిస్థితి లేదు' అని రాసిన జర్నలిస్టును జైల్లో పెట్టారు














