అలెక్సీ నావల్నీ: రష్యా విపక్ష నేత ప్రాణాలు ఎలా నిలిచాయి.. విమానంలో ఆ రెండు గంటల్లో ఏం జరిగింది?

నావల్నీ

ఫొటో సోర్స్, Reuters

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ ప్రస్తుతం బెర్లిన్‌లోని ఓ ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు. నొవిచోక్ అనే నర్వ్ ఏజెంట్ (నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపే పదార్థం)తో ఆయనపై విషప్రయోగం జరిగినట్లు జర్మనీ నిర్ధరించింది.

ఆగస్టు 20న విమానంలో సైబీరియా నుంచి మాస్కోకు వస్తుండగా నావల్నీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో విమానాన్ని ఓమ్స్క్‌లో అత్యవసరంగా దించి, ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రెండు రోజులకు జర్మనీకి ఆయన్ను తీసుకువెళ్లేందుకు రష్యా అధికారులు అనుమతించారు.

నావల్నీ విమానంలో సైబీరియా గగనతలంలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన ప్రాణాలను కాపాడేందుకు విమాన సిబ్బంది, వైద్య సిబ్బంది ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఆ సమయంలో రెండు గంటల పాటు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే విషయాలపై ‘బీబీసీ రష్యన్’ పరిశోధించి, అందిస్తోన్న కథనం...

ప్రయాణానికి ముందు నావల్నీతో ఇల్యా అగీవ్ తీసుకున్న సెల్ఫీ

ఫొటో సోర్స్, ILYA AGEEV

ఫొటో క్యాప్షన్, ప్రయాణానికి ముందు నావల్నీతో ఇల్యా అగీవ్ తీసుకున్న సెల్ఫీ

ఆ రోజు ఏం జరిగిందంటే...

ఆగస్టు 20న అలెక్సీ నావల్నీ ఎస్7 ఎయిర్‌లైన్స్ విమానంలో టోమ్స్క్ నుంచి మాస్కోకు బయల్దేరారు. టోమ్స్క్ బొగాషెవో విమానాశ్రయంలో ఒక కప్ టీ మినహాయిస్తే, ఆ రోజు ఉదయం నావల్నీ ఏమీ తీసుకోలేదని ఆయన ప్రెస్ సెక్రటరీ కిరి యర్మిష్ చెప్పారు.

విమానం బయల్దేరడానికి గంట ముందు ఇల్యా అగీవ్ అనే తోటి ప్రయాణికుడు నావల్నీని చూసి గుర్తుపట్టారు. అగీవ్ సహా ఇతర ప్రయాణికులతో నావల్నీ సరదాగా నవ్వుతూ మాట్లాడారు.

టోమ్స్క్‌లో సమయం: ఉదయం 08:01 (జీఎంటీ 01:01)

విమాన ప్రయాణం మొదలైన తొలి అర గంట నావల్నీ ఇబ్బందిపడుతూ కనిపించారు. విమాన సిబ్బంది ప్రయాణికులకు తాగు నీళ్లు ఇస్తున్నారు. నావల్నీ నీళ్లను తీసుకోలేదు. టాయిలెట్‌కు వెళ్లేందుకు లేచారు.

టోమ్స్క్‌లో సమయం: ఉదయం 08:30 (జీఎంటీ 01:30)

అదే సమయంలో మరో ప్రయాణికుడు కూడా టాయిలెట్‌కు వెళ్లేందుకు వచ్చారు. నావల్నీ దాదాపు 20 నిమిషాలపాటు టాయిలెట్ లోపలే ఉండిపోయారు. టాయిలెట్ డోర్ బయట జనం పోగయ్యారు.

టోమ్స్క్‌లో సమయం: ఉదయం 08:50 (జీఎంటీ 01:50)

విమానంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అందులో ఉన్న నలుగురు అంటెండెంట్స్‌కీ తెలిసింది.

టోమ్స్క్‌లో సమయం: ఉదయం 09:00 (జీఎంటీ 02:00)

కొన్ని నిమిషాల తర్వాత విమాన సిబ్బందిలో ఒకరు ప్రయాణికుల్లో వైద్యులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తూ ప్రకటన చేశారు. పరిస్థితి తీవ్రంగా ఉందని అప్పుడే మిగతా ప్రయాణికులకు అర్థమైంది.

మిగతా సిబ్బంది సమాచారాన్ని పైలట్‌కు చేరవేశారు. నావల్నీకి ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రయత్నించారు.

నావల్నీ అసిస్టెంట్ ఇల్యా పఖొమోవ్ విమానంలో ఒక చివరి నుంచి మరో చివరికి తిరుగుతూ వైద్య సాయం కోసం అభ్యర్థించారు.

ప్రయాణికుల్లో నుంచి ఓ మహిళ ముందుకు వచ్చారు. తానో నర్సుని అని ఆమె చెప్పారు.

ఆ తర్వాత గంట పాటు ఆమె, విమానంలోని అటెండెంట్స్... విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యేవరకు నావల్నీని స్పృహ కోల్పోకుండా చూడటంపై దృష్టి పెట్టారని ఎస్7 ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ప్రయాణానికి ముందు నావల్నీతో ఇల్యా అగీవ్ తీసుకున్న సెల్ఫీ

ఫొటో సోర్స్, ILYA AGEEV

ఫొటో క్యాప్షన్, ప్రయాణానికి ముందు నావల్నీతో ఇల్యా అగీవ్ తీసుకున్న సెల్ఫీ

‘మాటలు కాదు... కేకలు పెట్టారు’

నావల్నీకి చికిత్స అందిస్తున్న చోటుకు దగ్గర వెనుక వరుసల్లో ఉన్న సీట్లలో సెర్జీ నెజెనెట్స్ అనే వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడారు.

‘‘జరుగుతున్నదంతా నేను దగ్గరగా గమనిస్తున్నా. కొంత సేపటి తర్వాత ఓమ్స్క్‌లో అత్యవసరంగా విమానం దింపుతున్నట్లు పైలట్ ప్రకటించారు. ల్యాండ్ అయిన తర్వాత ట్విటర్‌లో చూశాక ఆ వ్యక్తి నావల్నీ అని నాకు తెలిసింది’’ అని నెజెనెట్స్ చెప్పారు.

‘‘విమానంలో నావల్నీ మూలుగుతూ, కేకలు పెడుతూ ఉన్నారు. ఆయన విపరీతమైన బాధలో ఉన్నట్లు కనిపించారు. విమాన సిబ్బందికి మాత్రమే అనుమతి ఉన్న ప్రాంతంలో ఆయన కింద పడుకుని ఉన్నారు. ఏమీ మాట్లాడలేదు. కేకలు పెడుతూ ఉన్నారు. అప్పుడే ఆ నర్సు వచ్చారు. వాళ్లేం చేశారో నేను చూడలేదు. ‘అలెక్సీ ఇది తాగండి. ఊపిరి పీల్చుకోండి’ అని పదేపదే అనడం విన్నా. ఆయన మూలుగుతుంటే, కనీసం ప్రాణాలతోనైనా ఉన్నారని అర్థమైంది. కానీ, అప్పటికి ఆ వ్యక్తి నావల్నీ అని నాకు అసలు తెలియదు’’ అని ఆయన వివరించారు.

విమానంలో నావల్నీ పక్కనే ఆయన ప్రెస్ సెక్రటరీ కిరా యర్మిష్ కూడా ఉన్నారు.

‘‘ఆమె చాలా ఆందోళనగా కనిపించారు. నర్సు ఏం జరిగిందని అడిగనప్పుడు... ‘తెలియదు. ఆయనపై విషప్రయోగం జరిగిందేమో’ అని ఆమె చెప్పారు’’ అని నెజెనెట్స్ వివరించారు.

ఓమ్స్క్‌లో సమయం: ఉదయం 08:20 (జీఎంటీ 02:20)

విమాన సిబ్బంది వేగంగా స్పందించి, ఓమ్స్క్‌లో విమానాన్ని అత్యవసరంగా దింపేందుకు అనుమతి కోరారని, వెంటనే వారికి అనుమతి లభించిందని ఎస్7 ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ఆ విమానం ల్యాండ్ అయ్యేందుకు అరగంటకుపైగా సమయం పట్టింది. ప్రయాణికులకు అత్యవసరంగా విమానాన్ని దించుతున్నట్లు సమాచారం ఇచ్చారు.

విమానాశ్రయంలో

ఫొటో సోర్స్, ILYA AGEEV

‘‘విమాన సిబ్బంది కిటికీల నుంచి బయటకు చూస్తూ ఉన్నారు. మేఘాలు ఎక్కువగా ఉండటంతో, ల్యాండ్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. ఆయనకు ఏదో ఒకటి తాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాంతులు చేసుకుంటున్న శబ్దాలు వినిపించాయి’’ అని నెజెనెట్స్ చెప్పారు.

నావల్నీ కడుపును శుభ్రం చేశారా?

ఈ ప్రశ్నకు ఔనని గానీ, లేదని గానీ ఓమ్స్క్ విమానాశ్రయం చీఫ్ డాక్టర్ వసిలీ సిడోరస్ సమాధానం ఇవ్వలేదు.

ఒకవేళ ఫుడ్ పాయిజనింగ్ లాంటిది జరిగిందని అనుమానిస్తే, సిబ్బంది కడుపు శుభ్రం చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చని ఇజ్రాయెల్‌కు ఇంటెన్సివ్ కేర్ నిపుణుడు మిఖాయిల్ ఫ్రెండర్మన్ అభిప్రాయపడ్డారు.

‘‘ఒకవేళ అలా చేసినా, విష ప్రయోగంలో ఆర్గానోఫాస్పరస్ పదార్థాలు వాడి ఉంటే ప్రయోజనం ఉండదు’’ అని అన్నారు. జర్మనీ చెబుతున్న నోవిచోక్ ఆర్గానోఫాస్పరస్ పదార్థమే.

ఒకవేళ నావల్నీ తీసుకున్న ఆహారంలో గానీ, డ్రింక్‌లో గానీ ఇలాంటి విషపదార్థాలు కలిపి ఉంటే, ఆయన వాంతి చేసుకున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నవారికి, ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసినవారిపై కూడా ప్రభావం ఉండేది.

ఓమ్స్క్‌లో సమయం: ఉదయం 09:01 (జీఎంటీ 03:01)

ఓమ్స్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం 9:01కి విమానం దిగింది.

ఓమ్స్క్‌లో సమయం: ఉదయం 09:03 (జీఎంటీ 03:03)

విమానం ల్యాండ్ అయిన రెండు నిమిషాల్లోనూ వైద్య సిబ్బంది లోపలికి వచ్చేశారు.

నావల్నీని పరీక్షించిన వెంటనే, ఇది తాము చికిత్స చేసే కేసు కాదని, ఇంటెన్సివ్ కేర్ అవసరమని వైద్య సిబ్బంది అన్నారని నెజెనెట్స్ చెప్పారు.

అంబులెన్స్ నేరుగా ఓమ్స్క్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నెం.1కు వెళ్లింది

ఫొటో సోర్స్, Sibir realii

ల్యాండింగ్ ప్రాంతంలోకే నేరుగా ఓ ఐసీయూ అంబులెన్స్‌ను పిలిపించారని, బాధితుడు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారని నెజెనెట్స్ వివరించారు.

‘‘అంబులెన్స్ కోసం మరో పది నిమిషాలు వేచి చూడక తప్పలేదు. ఈ సమయంలో వైద్యులు నావల్నీ బ్లడ్ ప్రెజర్ చూశారు. సెలైన్ పెట్టారు’’ అని ఆయన చెప్పారు.

నావల్నీకి తాను వైద్యం చేయలేదని, తన సహచరులు చేశారని ఓమ్స్క్ విమానాశ్రయం చీఫ్ డాక్టర్ వసిలీ సిడోరస్ అన్నారు. నావల్నీ ప్రాణాలు కాపాడేందుకు వారు శాయశక్తులా ప్రయత్నించారని చెప్పారు.

‘‘ఆయన మాట్లాడలేకపోతుండటంతో అసలేం జరుగుతుందో తెలుసుకోవడం కష్టమైంది. వాళ్లు చేయగలిగిందంతా చేశారు. ఆయన ప్రాణాలను కాపాడారు. తగిన ఆసుపత్రికి చేర్చేలా చూశారు’’ అని సిడోరస్ అన్నారు.

విమానంలో నావల్నీని పరీక్షించేందుకు వైద్య సిబ్బంది 15 నుంచి 20 నిమిషాల సమయం తీసుకున్నారని ఇతర ప్రయాణికులు చెప్పారు.

ఓమ్స్క్‌లో సమయం: ఉదయం 09:37 (జీఎంటీ 03:37)

ఓ స్ట్రెచర్‌పై అంబులెన్స్‌లోకి నావల్నీని తీసుకువెళ్లారు. ఆ వాహనం నేరుగా ఓమ్స్క్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నెం.1కు వెళ్లింది.

విమానం తిరిగి ఇంధనం నింపుకుని, అరగంట తర్వాత మళ్లీ మాస్కోకు పయనమైందని నెజెనెట్స్ బీబీసీతో చెప్పారు.

‘‘మేం మాస్కోలోని డొమోడెడోవో విమానాశ్రయంలో దిగగానే కొందరు పోలీసులు, మామూలు దుస్తుల్లో ఉన్న ఇంకొందరు విమానంలోకి వచ్చారు. నావల్నీకి దగ్గరగా ఉన్న సీట్లలో కూర్చున్నవారు ఉండాలని, మిగతావారు వెళ్లిపోవాలని సూచించారు. నావల్నీ 10 లేదా 11వ వరుసలో కూర్చున్నారనుకుంటా’’ అని నెజెనెట్స్ వివరించారు.

పోలీసులు విమానంలోకి రావడం విచిత్రంగా అనిపించిందని, అప్పటికి దాని వెనుక నేర కోణం ఉన్నట్లుగా అనిపించలేదని నెజెనెట్స్ అభిప్రాయపడ్డారు.

విమానంలో

ఫొటో సోర్స్, DJPavlin

రెండు రోజుల తర్వాత బెర్లిన్‌కు...

ఓమ్స్క్‌లోని ఆసుపత్రిలో రెండు రోజుల పాటు నావల్నీని ‘తీవ్ర విషప్రయోగ విభాగం’లో ఉంచారు.

జర్మనీకి నావల్నీని తరలించేందుకు ఆయన సన్నిహితులు ప్రయత్నాలు చేశారు. అయితే, ఆయన పరిస్థితి స్థిరంగా లేదంటూ, అధికారులు ఈ అభ్యర్థనలను తిరస్కరిస్తూ వచ్చారు.

చివరికి ఆగస్టు 22న అనుమతి మంజూరైంది. విమాన మార్గంలో జర్మనీ రాజధాని బెర్లిన్‌కు నావల్నీని తరలించారు.

నావల్నీపై విషప్రయోగం జరిగిందని రెండు రోజుల అనంతరం జర్మనీ వైద్యులు ప్రకటించారు.

అయితే ఓమ్స్క్‌లోని ఎమర్జెన్సీ హాస్పిటల్ నెం.1 చీఫ్ డాక్టర్, చీఫ్ టాక్సికాలజిస్ట్ సహా అక్కడ నావల్నీకి చికిత్స అందించిన వైద్యులు... నావల్నీ శరీరంలో విష పదార్థాల ఆనవాళ్లు కనిపించలేదని పదేపదే చెప్పారు.

ఆయన పరిస్థితికి జీవక్రియ సమస్య కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

నావల్నీ ఓమ్స్క్‌లో ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఏమేం జరిగిందనే వివరాలు తెలుసుకునేందుకు ఓమ్స్క్ ఆరోగ్యశాఖ అధికార వర్గాలను ‘బీబీసీ రష్యన్’ సంప్రదించింది. అయితే, వారి నుంచి స్పందన రాలేదు.

రిపోర్టింగ్: అన్నా పుష్కరస్క్యా, ఎలెనా బెర్డ్నికోవా, టిముర్ సజోనోవ్, ఆండ్రీ సోష్నికోవ్, క్సెనియా చర్మనోవా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)