అలెక్సీ నావల్నీ: రష్యా ప్రతిపక్ష నేత విడుదల కోరుతూ నిరసనలు

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

జైల్లో నిర్బంధించి ఉంచిన రష్యా ప్రతిపక్ష పార్టీ నాయకుడు అలెక్సీ నావల్నీని విడుదల చేయాలంటూ వేలాదిమంది రష్యన్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

ఇప్పటివరకు 3,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని ఒక పర్యవేక్షణ బృందం తెలిపింది.మరోవైపు నిరసనలను అడ్డుకోవడానికి గాను రష్యన్ పోలీసులు మాస్కోలోని పలు మెట్రో స్టేషన్లను, నగరంలోని సెంట్రల్ ఏరియాను మూసివేశారు.

నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

2020 ఆగస్ట్‌లో నావల్నీపై విష ప్రయోగం జరిగిన తరువాత ఆయన బెర్లిన్‌లో కొన్ని నెలలపాటూ చికిత్స పొందారు.

అనంతరం రష్యాకు చేరుకున్న నావల్నీని అధికారులు నిర్బంధించారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాలనలోని భద్రతా దళాల అధికారులే తనపై విష ప్రయోగం జరిపారని నావల్నీ ఆరోపించారు.

నావల్నీపై విష ప్రయోగం వెనుక రష్యన్ ఎఫ్ఎస్‌బీ ఏజెంట్ల హస్తం ఉందని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అనుమానిస్తున్నారు.అయితే, రష్యా ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరించింది.నిధుల దుర్వినియోగం ఆరోపణపణలతో సస్పెండ్ అయిన నావల్నీ క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్‌లో హాజరు కావలసి ఉందని రష్యా అధికారులు తెలిపారు. తనను చట్ట విర్దుద్ధంగా అరెస్ట్ చేసారని, బెర్లిన్‌లో చికిత్స పొందేందుకు అధికారులే తనకు అనుమతి ఇచ్చారని నావల్నీ తెలిపారు. కాగా, నల్ల సముద్రంపైనున్న విశాలమైన కోటకు పుతిన్ యజమాని అని నావల్నీ ఒక వీడియోలో ఆరోపించారు.

ఈ వీడియో రష్యాలో వైరల్ అయ్యింది.. 10 కోట్ల కన్నా ఎక్కువ మంది వీక్షించారు. అయితే, నావల్నీ వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు.

నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

తాజా పరిణామాలేంటి?

మాస్కోలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఇప్పుడు జరుగుతున్నదంతా పిల్లి-ఎలుక చెలగాటంలా ఉందని బీబీసీ ప్రతినిధి వివరించారు.

నిరసనకారులు పోలీసులకు దగ్గరగా వెళ్లడం, వెంటనే పారిపోవడం చేస్తున్నారని అన్నారు. పోలీసులు అనేకమంది నిరసనకారులను బలవంతంగా లాక్కెళ్లి బస్సుల్లోకి ఎక్కిస్తున్నట్లు వీడియో ఫుటేజీలలో కనిపించింది.నావల్నీని నిర్బంధించి ఉంచిన మాట్రోస్కాయ టిషినా జైలుకు చేరుకోవడానికి నిరసనకారులు ప్రయత్నించారు. నావల్నీ భార్య యూలీ నావల్నీని కూడా ఆదివారం జరిగిన నిరసనల సందర్భంగా నిర్బంధించారని సమాచారం. అంతకుముందు, తాను ర్యాలీకి వెళుతుండగా తీసుకున్న ఫొటోను యూలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘పుతిన్ రాజీనామా చేయాలి’ అని రాసి ఉన్న మాస్క్ ధరించిన నిరసనకారుడు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 'పుతిన్ రాజీనామా చేయాలి' అని రాసి ఉన్న మాస్క్ ధరించిన నిరసనకారుడు

నిరసనకారులు చట్టవిరుద్ధంగా ర్యాలీలు చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. వీరి నిరసనల వలన కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. "చట్టం, న్యాయం లేని ఒక వ్యవస్థలో మేము జీవిస్తున్నాం. పోలీసుల అధికారం కింద, స్వత్రంత్ర్య కోర్టులు లేని వ్యవస్థలో ఉన్నాం. అవినీతితో నిండిపోయిన దేశంలో ఉన్నాం. మేము ఇలా బతకాలని అనుకోవట్లేదు" అని నిరసనల్లో పాల్గొంటున్న ఒక 40 ఏళ్ల మహిళ తెలిపారు.పుతిన్ స్వస్థలం అయిన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని సెంట్రల్ స్క్వేర్ వద్ద జనం గుమికూడి "డౌన్ విత్ ది జార్" అంటూ నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)