వియత్నాం యుద్ధంలో అమెరికా ఓటమికి ఏడు కారణాలు ఇవీ

వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్ సైనికులు,1966

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్ సైనికులు,1966
    • రచయిత, మార్క్ షీయా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా నిస్సందేహంగా ప్రపంచంలో అగ్రగామి రాజ్యంగా ఎదిగింది.

ఆర్థికంగానే కాక సైనిక పరంగా కూడా శక్తిమంతమైన దేశంగా అవతరించిందని నిపుణులు భావిస్తారు. అయినప్పటికీ, వియత్నాంపై సుమారు ఎనిమిదేళ్ల పాటు సాగిన యుద్ధంలో అమెరికా ఓడిపోయింది.

భారీగా డబ్బు ఖర్చు చేయడంతోపాటు పెద్ద సంఖ్యలో సైన్యం పాల్గొన్నప్పటికీ ఉత్తర వియత్నాం దళాలు, వారి గెరిల్లా మిత్ర బృందం వియత్ కాంగ్ ఆ దేశాన్ని తరిమికొట్టాయి. చివరికి, 1973 మార్చి 29న అమెరికా సైన్యం వియత్నాం నుంచి వెనుదిరిగింది. సుదీర్ఘ పోరాటం, భారీ వనరులు ఖర్చు పెట్టిన తరువాత కూడా అమెరికా ఎందుకు ఓడిపోయింది? వియత్నాం ఎలా గెలిచింది? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

అప్పటి ప్రపంచ పరిస్థితి ఏమిటి?

అప్పటికి ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయిలో ఉంది. కమ్యూనిస్ట్ దేశాలు ఒకవైపు, పెట్టుబడిదారీ దేశాలు మరొకవైపు.

రెండవ ప్రపంచ యుద్ధంతో ఫ్రాన్స్ దివాలా తీసింది. ఇండోచైనా (వియత్నాం, లావోస్, కంబోడియా ప్రాంతాలు)పై పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ దేశాలు ఫ్రెంచ్ వలసరాజ్యాలుగా ఉండేవి.

ఫ్రాన్స్ అధికారానికి స్వస్తి పలుకుతూ జరిగిన శాంతి ఒప్పందంలో ప్రస్తుత వియత్నాం రెండు భాగాలుగా విడిపోయింది. కమ్యూనిస్ట్ పాలనలో ఉత్తర ప్రాంతం, అమెరికా అండదండలతో దక్షిణ ప్రాంతం మనుగడ సాగించాయి.

కానీ, అంతటితో వివాదం సద్దుమణగలేదు. వియత్నాం మొత్తం కమ్యూనిస్టు పాలన కిందకు వస్తే, దాని చుట్టుపక్కల దేశాలు కూడా కమ్యూనిస్టు రాజ్యాన్నే కోరుకుంటాయన్న భయం మొదలైంది. దాంతో, అమెరికా వియత్నాంపై యుద్ధం ప్రకటించింది. దాదాపు దశాబ్దకాలంగా సాగిన ఈ పోరులో లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చివరికి, అమెరికా ఓడిపోయింది.

ఒక అగ్రగామి దేశం, అప్పుడే పుట్టిన, అంతగా అభివృద్ధి చెందని చిన్న దేశం చేతిలో ఎలా ఓడిపోయింది? నిపుణులు వివరిస్తున్న ఏడు ముఖ్య కారణాలు ఇవీ.

దక్షిణ వియత్నాంలో హెలికాప్టర్ నుంచి కిందకు దూకుతున్న అమెరికన్ సైనికులు, 1971

ఫొటో సోర్స్, Corbis via Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ వియత్నాంలో హెలికాప్టర్ నుంచి కిందకు దూకుతున్న అమెరికన్ సైనికులు, 1971

చిన్నా చితకా పోరాటం కాదు..

ప్రపంచంలో మరో పార్శ్వంతో పోరాటం ఆషామాషీ వ్యవహారం కాదు. వియత్నాంతో యుద్ధం పతాకస్థాయిలో ఉన్నప్పుడు అమెరికా అయిదు లక్షలకు పైగా సైనికులను రంగంలోకి దింపింది. ఖర్చు తెలిస్తే గుండె ఆగిపోతుంది. 2008లో అమెరికా కాంగ్రెస్ సమర్పించిన ఒక నివేదికలో, వియత్నాం యుద్ధంపై పెట్టిన మొత్తం ఖర్చు 686 బిలియన్ డాలర్లు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకారం 1974-75లో ఒక అమెరికా డాలర్‌ విలువ సుమారు 8 రూపాయలుగా ఉంది. ఆ లెక్కన చూస్తే 686 బిలియన్ డాలర్లు అంటే సుమారు 5.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి.

నేటి లెక్కల్లో వియత్నాం యుద్ధం కోసం అమెరికా పెట్టిన ఖర్చు సుమారు 950 బిలియన్ డాలర్లు. రూపాయాల్లో చెప్పాలంటే సుమారు 78 లక్షల కోట్లు.

అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువే ఖర్చు పెట్టింది. గెలుపు వైపు నిలబడింది కూడా. దాని తరువాత కొరియా యుద్ధంలో దూరం నుంచి మద్దతు ఇచ్చింది. కాబట్టి వియత్నాంపై తప్పకుండా గెలుస్తుందన్న విశ్వాసం యుద్ధం తొలినాళ్లల్లో కనిపించిందని అమెరికా విదేశీ, రక్షణ విధానంలో నిపుణులు డాక్టర్ లూక్ మిడప్ చెప్పారు. బ్రిటన్‌లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారాయన.

"ఇది కొంచెం విచిత్రమే. అమెరికాకు ఎదురయ్యే సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది. అక్కడున్న వాతావరణంలో అమెరికా సైన్యం పోరాడగలదా, లేదా అనే సందేహం ఉంది. అయినప్పటికీ 1968 వరకు గెలుస్తామన్న నమ్మకంతోనే ఉంది" అని ఆయన వివరించారు.

ఆ నమ్మకం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ముఖ్యంగా 1968 జనవరిలో కమ్యూనిస్టు 'టెట్ అఫెన్సివ్' దళం చేతిలో దెబ్బతిన్న తరువాత గెలుస్తారన్న విశ్వాసం పోయింది. అంతే కాకుండా, యుద్ధానికి కావలసిన డబ్బు సమకూర్చే విషయంలో అమెరికా కాంగ్రెస్ వెనుకడుగువేసింది. దాంతో, 1973లో అమెరికా సైన్యం వెనుదిరగాల్సి వచ్చింది.

అయితే, అమెరికా దళాలు వియత్నాంలోకి అడుగుపెట్టడం ఎంతవరకు సబబు అని డాక్టర్ మిడప్ ప్రశ్నిస్తున్నారు. అమెరికాలోని ఒరెగాన్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ తుయాంగ్ వూ కూడా అదే ప్రశ్న వేస్తున్నారు.

కంబోడియా సరిహద్దుల్లో దట్టమైన అడవి వద్ద కాపలా కాస్తున్న అమెరికా సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కంబోడియా సరిహద్దుల్లో దట్టమైన అడవి వద్ద కాపలా కాస్తున్న అమెరికా సైనికులు

వాతావరణంలో పోరాటం కష్టం

యుద్ధానికి సంబంధించిన హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తుంటారు కదా.. అమెరికా సైనికులు అడవుల్లో సరిగ్గా కదల్లేక ఇబ్బంది పడుతుంటారు. కానీ, వియత్ కాంగ్ తిరుగుబాటుదారులు సులువుగా చొచ్చుకుపోతూ మెరుపుదాడి చేస్తారు.

"అమెరికా మాత్రమే కాదు ఎలాంటి పెద్ద సైన్యానికైనా అలాంటి వాతావరణంలో యుద్ధం చేయడం సులువు కాదు. కొన్నిచోట్ల చాలా దట్టమైన అడవులు ఉంటాయి. ఆగ్నేయ ఆసియాలో అవి సర్వసాధారణం. అయితే, ఉత్తర వియత్నామీస్, వియత్ కాంగ్ దళానికి అది అలవాటైన వాతావరణం కాబట్టి స్థానబలం ఉంటుంది.. కానీ, అమెరికాకు దాన్ని ఎదుర్కోవడం కష్టం అనుకుంటే పొరపాటే. ఉత్తర వియత్నాం దళాలు, వియత్ కాంగ్ కూడా ఆ వాతావరణంలో చాలా కష్టపడ్డాయి" అని డాక్టర్ మిడప్ వివరించారు.

కానీ, వియత్నాం తిరుగుబాటుదారులకే యుద్ధం సమయం, స్థానం ఎన్నుకునే అవకాశం ఎక్కువగా ఉండేది. ఇది ముఖ్యం. సరిహద్దుల వెంబడి లావోస్ లేదా కంబోడియాకు సులువుగా తప్పించుకోగలిగేవారు. ఆ దేశాల్లో వీరిని వెంబడించడం అమెరికా సైన్యానికి నిషేధమని డాక్టర్ మిడప్ చెప్పారు.

కాగా, వియత్ కాంగ్ గెరిల్లాలను ఎదుర్కోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అమెరికా ఓడిపోయిందని ప్రొఫెసర్ వూ అభిప్రాయడ్డారు.

"వీళ్లపై దృష్టి సారించడం వల్ల, ఉత్తర వియత్నాం దళాలు మెల్లమెల్లగా దక్షిణం వైపుకు చొచ్చుకువచ్చాయి. ఈ చొరబాటు దళాలే వియత్నాంకు విజయాన్ని తెచ్చిపెట్టాయి" అని వివరించారు.

యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు, వాషింగ్టన్ డీసీ, 1967 అక్టోబర్ 21

ఫొటో సోర్స్, Corbis via Getty Images

ఫొటో క్యాప్షన్, యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు, వాషింగ్టన్ డీసీ, 1967 అక్టోబర్ 21

సొంతదేశంలోనే మొదట ఓడిపోయింది

వియత్నాం యుద్ధాన్ని "తొలి టెలివిజన్ యుద్ధం" అని పేర్కొంటారు. దీనికి వచ్చిన మీడియా కవరేజీ చెప్పనలవి కాదు.

1966 నాటికి అమెరికాలో 93 శాతం కుటుంబాలకు టీవీ ఉందని యూఎస్ నేషనల్ ఆర్కైవ్స్ అంచనా వేసింది.

వియత్నాం యుద్ధ విశేషాలు టీవీలో నిరవధికంగా, ఎక్కువ సెన్సార్ లేకుండా ప్రసారం అయ్యాయి. ఎప్పటికప్పుడు యుద్ధ వార్తలు అమెరికా ఇళ్లల్లోకి చొచ్చుకొచ్చాయి.

అయితే, 1968 నుంచి టీవీ, వార్తాపత్రికల్లో యుద్ధంలో అమాయకులైన పౌరులను హింసించిన, చంపిన వార్తలు ఎక్కువగా కనిపించడం ప్రారంభమైంది. చాలామంది అమెరికన్లు భయాందోళనలకు గురయ్యారు. యుద్ధానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

1970 మే 4న ఒహియోలోని కెంట్ స్టేట్ యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న నలుగురు విద్యార్థులను జాతీయ భద్రతాదళాలు కాల్చి చంపాయి. దాంతో, మరింతమంది అమెరికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా గొంతువిప్పారు.

యుద్ధానికి వ్యతిరేకంగా నినదిస్తున్న వారిని అణచివేస్తున్న అమెరికా పోలీసులు, 1970

ఫొటో సోర్స్, Corbis via Getty Images

ఫొటో క్యాప్షన్, యుద్ధానికి వ్యతిరేకంగా నినదిస్తున్న వారిని అణచివేస్తున్న అమెరికా పోలీసులు, 1970

యుద్ధంలో చనిపోయిన సైనికుల శవపేటికలను స్వదేశానికి తీసుకొచ్చే దృశ్యాలు, పౌరుల మరణాలు, కెంట్ యూనివర్సిటీ ఘటన.. ఇవన్నీ ప్రజలను కలచివేశాయి. వియత్నాం యుద్ధంలో సుమారు 58,000 మంది అమెరికా సైనికులు మరణించారు లేదా కనిపించకుండా పోయారని అంచనా.

ఈ పరిస్థితి ఉత్తర వియత్నాంకు ప్రయోజనకరంగా మారిందని ప్రొఫెసర్ వూ అభిప్రాయపడ్డారు. అమెరికా కన్నా వియత్నాంకు తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడి మీడియాపై పాలకుల ఆధిపత్యం ఉంది. సమాచారం సెన్సార్ అయి బయటకు వచ్చేది. అయినప్పటికీ అమెరికాలో వెల్లువెత్తిన ఆగ్రహం ఉత్తర వియత్నాంకు మేలుచేసింది.

"ప్రజాభిప్రాయాన్ని అనుగుణంగా మార్చుకోవాలన్న కోరిక, సామర్థ్యం అమెరికాకుగానీ, దక్షిణ వియత్నాంకుగానీ లేవు. ఈ విషయంలో కమ్యూనిస్టులు పూర్తి పట్టుతో ఉన్నారు. వాళ్లకు పెద్ద ప్రోపగాండా వ్యవస్థ ఉంది. సరిహద్దులు మూసివేసి, అసమ్మతిని అణచివేశారు. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లను జైల్లో పెట్టారు" అని ప్రొఫెసర్ వూ వివరించారు.

వియత్ కాంగ్ సభ్యుడన్న అనుమానంతో నిర్బంధించిన దక్షిణ వియత్నాం సైనికులు. ఒక అమెరికన్ సైనికుడు కూడా ఉన్నాడు.

ఫొటో సోర్స్, Corbis via Getty Images

ఫొటో క్యాప్షన్, వియత్ కాంగ్ సభ్యుడన్న అనుమానంతో నిర్బంధించిన దక్షిణ వియత్నాం సైనికులు. ఒక అమెరికన్ సైనికుడు కూడా ఉన్నాడు.

దక్షిణ వియత్నాంలోనూ అమెరికాకు వ్యతిరేకత ఎదురైంది

ఇది చాల క్రూరమైన యుద్ధం అని చెప్పవచ్చు. అమెరికా భయంకరమైన ఆయుధాలను ఉపయోగించింది.

నపాం (2,700 డిగ్రీల వద్ద మండే ఒక పెట్రోకెమికల్ ఇన్సెండియరీ. అది తాకిన వెంటనే భగ్గుమంటుంది), ఏజెంట్ ఆరెంజ్ (శత్రుమూక అడవిని దాటకుండా ఉండేందుకు ప్రయోగించే ప్రమాదకర రసాయనం. ఇది ముఖ్యమైన పంటలను కూడా నాశనం చేసి, ఆకలి చావులకు దారితీసింది) వంటివి ఉపయోగించవల్ల దక్షిణ వియత్నాంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమెరికా పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది.

"వెతకడం, ధ్వంసం చేయడం" పద్ధతిగా సాగిన యుద్ధంలో లెక్కలేనంతమంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

1968లో జరిగిన 'మై లై' ఊచకోతను చరిత్ర మరచిపోదు. అమెరికా సైన్యం వందలాది వియత్నాం పౌరులను చంపివేసింది.

వియత్ కాంగ్‌తో విభేదించేవారు కూడా, పౌర మరణాల కారణంగా అమెరికాకు వ్యతిరేకంగా మారారు.

"దక్షిణ వియత్నాంలో అందరూ కమ్యూనిస్టులు కారు. చాలామంది సాధారణ జీవితాన్ని కోరుకునేవారు, యుద్ధాలను నివారించాలనుకునేవారు" అని డాక్టర్ మిడప్ చెప్పారు.

అమెరికా.. దక్షిణ వియత్నాం వాసుల హృదయాలను గెలుచుకోలేకపోయిందని ప్రొఫెసర్ వూ కూడా అంగీకరించారు.

భారీ మెషిన్ గన్‌తో కాల్పులు జరుపుతూ ముందుకు సాగుతున్న వియత్ కాంగ్ సైనికులు, సిర్కా 1968

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ మెషిన్ గన్‌తో కాల్పులు జరుపుతూ ముందుకు సాగుతున్న వియత్ కాంగ్ సైనికులు, సిర్కా 1968

కమ్యూనిస్టుల నైతికబలం, గట్టి సంకల్పం

దక్షిణ వియత్నాం వైపు నుంచి పోరాడే వారి కంటే ఉత్తర వియత్నాం వైపు నిల్చుని యుద్ధం చేస్తున్న కమ్యూనిస్టులలో ఎలాగైన గెలవాలన్న సంకల్పం కనిపించిందని డాక్టర్ మిడప్ అన్నారు.

"ఆ సమయంలో యుద్ధంపై అమెరికాలో పలు అధ్యయనాలు జరిగాయి. ఉత్తర వియత్నామీస్, వియత్ కాంగ్ ఎందుకు గెలిచాయన్న దానికి ఆ అధ్యయానాలు చెప్పిన జవాబు ఒక్కటే.. ఈ యుద్ధం దేశభక్తితో చేస్తున్నదని వారంతా విశ్వసించారు. దేశాన్ని సమైక్యపరచి ఒక్క పాలన కిందకు తీసుకురావాలన్న సంకల్పం బలంగా ఉన్నవారు. అందుకే గెలిచారు" అని డాక్టర్ మిడాప్ వివరించారు.

ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా, కమ్యూనిస్టులు యుద్ధాన్ని కొనసాగించిన తీరు వారి నైతిక బలాన్ని సూచిస్తుంది.

అమెరికా చనిపోతున్నవారి సంఖ్యపైనే దృష్టిపెట్టింది. ఎంత ఎక్కువమందిని చంపితే, అంతగా ప్రత్యర్థుల మనోబలంపై దెబ్బతీయవచ్చని భావించింది.

యుద్ధంలో సుమారు 11,00,000 మంది ఉత్తర వియత్నామీస్, వియత్ కాంగ్ తిరుగుబాటుదారులు ప్రాణాలు కోల్పోయారు. కానీ, కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు వారి సంఖ్యను భర్తీ చేసుకుంటూ వచ్చారు.

"కమ్యునిస్టులకు మెరుగైన నైతికస్థితి ఉందో, లేదో కచ్చితంగా తెలీదుగానీ, సైనికులకు చేసిన హితబోధలు ఒక్కొక్కరినీ ఒక్కో ఆయుధంగా మార్చాయి. వారంతా యుద్ధం వెనుక కారణాన్ని బలంగా విశ్వసించారు. కమ్యూనిస్టులు ప్రోపగాండా, విద్యా వ్యవస్థ ద్వారా బీజాలను బలంగా నాటారు. మనుషులను బుల్లెట్లుగా మార్చారు" అని ప్రొఫెసర్ వూ అన్నారు.

వియత్నాంలో 'సెర్చ్ అండ్ డిస్ట్రాయ్' పథకంలో భాగంగా ఆయుధాలతో కదులుతున్న అమెరికన్ సైనికులు, 1966

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, వియత్నాంలో 'సెర్చ్ అండ్ డిస్ట్రాయ్' పథకంలో భాగంగా ఆయుధాలతో కదులుతున్న అమెరికన్ సైనికులు, 1966

దక్షిణ వియత్నాం ప్రభుత్వంలో పేరుకున్న అవినీతి, దానిపై ప్రజావ్యతిరేకత

దక్షిణ వియత్నాంలో ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని, వలస రాజ్య పాలనతో సంబంధాలు తెంపేసుకుందని, అదే పరాజయానికి కారణమని డాక్టర్ మిడప్ అభిప్రాయపడ్డారు.

"ఉత్తర, దక్షిణ వియత్నాంల మధ్య విభజన కృత్రిమం. ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఏర్పడినది. ఈ రెండు ప్రాంతాల మధ్య జాతి, సంస్కృతి, భాషా భేదాలు లేవు. రెండుగా విడిపోవాల్సిన అవసరం లేదు" అంటూ ఆయన వివరించారు.

దక్షిణ ప్రాంతం కాథలిక్కుల ఆధిపత్యంలో ఉండేదని డాక్టర్ మిడప్ అన్నారు. అయితే, ఈ వర్గం మైనారిటీగా ఉండేది. మొత్తం జనాభాలో 10 నుంచి 15 శాతం మాత్రమే కాథలిక్కులు ఉండేవారు. వియత్నాంలో అధిక జనాభా బౌద్ధులు. కానీ, ఉత్తరం వైపు హింస నుంచి తప్పించుకోవడానికి చాలామంది దక్షిణం వైపుకు పారిపోయి వచ్చారు. దాంతో దక్షిణ వియత్నాం రాజకీయాల్లో కాథలిక్కుల పాత్ర పెరిగింది. దక్షిణాన రాజకీయ నాయకులకు కాథలిక్కులతో మంచి సంబంధాలు ఉండేవి. ఉదాహరణకు, దక్షిణ వియత్నాం మొదటి అధ్యక్షుడు ఎన్గో దిన్ డైమ్‌కు అమెరికాలో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ వంటి శక్తివంతమైన కాథలిక్ స్నేహితులు ఉండేవారు.

"దక్షిణ వియత్నాం రాజకీయాల్లో మైనారిటీ కాథలిక్కుల ఆధిపత్యానికి ప్రజామోదం కరువైంది. అక్కడి ప్రజల్లో అత్యధికులు బౌద్ధులు. వారంతా ప్రభుత్వాన్ని ఫ్రెంచ్ వలసరాజ్య వారసత్వంగా భావించారు" అని డాక్టర్ మిడప్ వివరించారు.

అయిదు లక్షల అమెరికా సైన్యం దక్షిణ వియత్నాంలో ఉందంటేనే, అక్కడి ప్రభుత్వం చాలా విషయాలలో విదేశీయులపై ఆధారపడిందన్నదానికి సూచన అని ఆయన అన్నారు.

"దక్షిణ వియత్నాంలో గట్టి, పటిష్టమైన రాజకీయాలు వేళ్లూనుకోలేదు. దేశం కోసం పోరాడేలా ప్రజలను పురికొల్పే సాధనాలు అక్కడ లేవు."

అలాంటి చోటుకు, అవినీతి నిండిన ప్రభుత్వం ఉన్న దేశానికి మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపడం ఎంత సమజసమైన నిర్ణయమని డాక్టర్ మిడప్ ప్రశ్నించారు.

"మొదటి నుంచీ వియత్నాం అవినీతి పేరుకుపోయిన దేశం. 1960 నుంచి 1975 వరకు అమెరికా సాయం అందడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాంతో, దక్షిణ వియత్నాం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అంటే, లంచం ఇవ్వకుండా ఎవరికీ, ఎక్కడా ఉద్యోగాలు రావు. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయాలంటే ఆర్మీలో చాలా ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు, నమ్మదగిన, సమర్థమైన దక్షిణ వియత్నాం సైన్యాన్ని తయారుచేయడం అమెరికాకు అసాధ్యం. అందుకే దక్షిణ వియత్నాంకు ఓటమి అనివార్యమని చాలామంది భావించారు. అమెరికా సైన్యం వియత్నాం నుంచి వైదలగిన వెంటనే దక్షిణ వియత్నాం పూర్తిగా కుప్పకూలుతుందని అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ కూడా భావించారు" అని డాక్టర్ మిడప్ వివరించారు.

దక్షిణ వియత్నాంలో ప్రత్యర్థులపై కాల్పులు జరుపుతున్న వియత్ కాంగ్ సైనికులు, 1968

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ వియత్నాంలో ప్రత్యర్థులపై కాల్పులు జరుపుతున్న వియత్ కాంగ్ సైనికులు, 1968

పరిమితులు ఉత్తర వియత్నాంకు లేవు

దక్షిణ వియత్నాంకు ఓటమి అనివార్యం అన్న భావనతో ప్రొఫెసర్ వూ అంగీకరించలేదు. అమెరికా కేవలం సాకులు వెతికిందని ఆయన అన్నారు.

"ఓటమికి నెపం కావాలి. ఎవరో ఒకరిపై తోసేయాలి. దక్షిణ వియత్నామీలపై నింద మోపడం సులువు. అవినీతి, కాథలిక్కుల ఆధిపత్యం గురించి అమెరికాలో మరీ అతిశయోక్తితో రిపోర్టులు వచ్చాయి. అవినీతి లేదని కాదు. కానీ, యుద్ధంలో ఓటమికి కారణమయ్యేంత స్థాయిలో అవినీతి లేదు. అవినీతి వల్ల సైన్యం సామర్థ్యం కుంటుపడిందన్నది వాస్తవమే. కానీ, మొత్తం మీద చూస్తే దక్షిణ వియత్నాం సైన్యం యుద్ధంలో బాగా పోరాడింది" అని ప్రొఫెసర్ వూ అభిప్రాయపడ్డారు.

దక్షిణ వియత్నాం నుంచి 2,00,000 నుంచి 2,50,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణ వియత్నాం నుంచి వెనుదిరుగుతున్న అమెరికా సైన్యం, 1975 ఏప్రిల్.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ వియత్నాం నుంచి వెనుదిరుగుతున్న అమెరికా సైన్యం, 1975 ఏప్రిల్.

ఉత్తర వియత్నాంకు ఉన్న సంకల్పం, ఏకాగ్రత, ప్రయత్నం దక్షిణ వియత్నాంకు లేకపోవడమే ఓటమికి కారణమని ప్రొఫెసర్ వూ భావిస్తున్నారు.

"ఉత్తర ప్రాంతంలో ప్రజలు యుద్ధమే పరిష్కారమని నమ్మారు. అదే వారి మెదళ్లలో నాటారు. చావుల గురించి వాళ్లు ఆలోచించలేదు. అమెరికా, దక్షిణ వియత్నాం ప్రజాభిప్రాయాన్ని తమకనుగుణంగా మార్చుకోలేకపోయాయి. ఉత్తర వియత్నాంలో ఎంతమంది చనిపోయినా, యుద్ధం కోసం కొత్త సైనికులు పుట్టుకొచ్చారు. మానవ తరంగాల్లా ఉవ్వెత్తున ఎగిశారు. దక్షిణ ప్రాంతంలో ఆ పరిస్థితి లేదు" అని ప్రొఫెసర్ వూ వివరించారు.

మరీ ముఖ్యంగా, ఉత్తర వియత్నాంకు సోవియట్ యూనియన్, చైనాల నుంచి స్థిరమైన సహాయం, మద్దతు అందిందని, దక్షిణానికి అమెరికా అందించిన మద్దతు తడబడుతూనే ఉందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)