నిఖత్, నీతూ, స్వీటీ, లొవ్‌లినా... ఈ నలుగురు బాక్సర్లు కొత్త చరిత్రను ఎలా లిఖించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీప్తి పట్వర్ధన్
- హోదా, బీబీసీ హిందీ స్పోర్ట్స్ రిపోర్టర్
నిఖత్ జరీన్ 12 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనేందుకు తెలంగాణలోని నిజామాబాద్ వెళ్లింది. అప్పుడు ఆమె యువ రన్నర్.
కానీ ఆమె కళ్లు మరో ఆటపై పడ్డాయి. చిన్నతనంలో ఆమె తండ్రి మహ్మద్ జమీల్ అహ్మద్‌తో కలిసి అక్కడికి వెళ్లింది.
"బాక్సింగ్ కేవలం అబ్బాయిల కోసమేనా? వాళ్లే చేస్తారా?" అని తండ్రిని అడిగింది చిన్నారి నిఖత్.
ఈ అమాయకమైన ప్రశ్నతోనే నిఖత్‌కు బాక్సింగ్‌తో బంధం మొదలైంది.
మార్చి 26న న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
మరో ముగ్గురు మహిళా బాక్సర్లు కూడా బంగారు పతకాలు సాధించి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 4 స్వర్ణ పతకాలు గెలుచుకుని సత్తా చాటారు.
50 కిలోల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో జరిగిన ఫైనల్లో నిఖత్ 5-0తో వియత్నాంకు చెందిన న్గుయం తి టామ్‌ను ఓడించింది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ బంగారు పతకం సాధించడం ఇది వరుసగా రెండోసారి.
అదే రోజు లొవ్‌లినా బోర్గోహైన్ స్వర్ణ పతకాన్ని సాధించింది. 75 కేజీల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌ను ఓడించి తొలిసారి బంగారు పతకం సాధించింది.
అంతకుముందు రోజు 48 కిలోల విభాగంలో నీతు ఘంఘాస్ బంగారు పతకాన్ని గెలుచుకోగా స్వీటీ బురా 81 కిలోల లైట్ హెవీవెయిట్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది.
ఈ బాక్సర్లకు బంగారు పతకంతో పాటు రూ.82.7 లక్షల చెక్కులను కూడా రివార్డుగా అందించారు.
ఈ నలుగురు స్వర్ణ పతకాలు సాధించడంతో భారత జట్టు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2023 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ విజయం తర్వాత ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ "ఇది చారిత్రాత్మక ప్రదర్శన. మేం నిరంతరం మెరుగ్గా రాణిస్తున్నాం.
కానీ, ఈరోజు కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం ఇంతకు ముందు కనిపించలేదు. కొంతమంది ఆటగాళ్లు కిందటి రౌండ్‌లో ఓడిపోయిన తర్వాత, తిరిగి వచ్చి చివరి శ్వాస వరకు పోరాటాన్ని కొనసాగించారు. అది భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోంది.
ఇక్కడ విజయం సాధించని బాక్సర్లలో కూడా ప్రపంచ ఛాంపియన్లు అయ్యే సామర్థ్యం ఉంది. రానున్న రోజుల్లో వాళ్లే ఒలింపిక్స్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో విజేతలు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2006 నుంచి కొత్త శకం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు నాలుగు బంగారు పతకాలు సాధించడం 2006 తర్వాత ఇదే తొలిసారి.
2006లో తొలిసారి భారత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. అప్పట్లో 46 కేజీల విభాగంలో మేరీ కోమ్, 52 కేజీల విభాగంలో సరితా దేవి, 63 కేజీల విభాగంలో జెన్నీ ఆర్ఎల్, 75 కేజీల విభాగంలో లేఖ కేసీ బంగారు పతకాలు సాధించారు.
ప్రపంచ స్థాయిలో భారత మహిళా బాక్సర్లు అత్యుత్తమంగా రాణించడం అదే తొలిసారి.
నిజానికి.. అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా బాక్సర్ల విజయానికి 2006లో ఆ నలుగురు ఛాంపియన్లు పునాది వేశారు.
ఆ తర్వాత, మేరీ కోమ్ ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలవడం భారత్‌లో మహిళా బాక్సింగ్‌కి ప్రాచుర్యం తెచ్చింది.
2012 లండన్ ఒలింపిక్స్‌లో తొలిసారి మహిళా బాక్సింగ్‌ను చేర్చారు. లండన్ ఒలింపిక్స్‌లో ఫ్లై వెయిట్ విభాగంలో మేరీ కోమ్ రజత పతకం సాధించి సత్తా చాటింది.
కానీ, భారత్ ఆ విజయ పరంపరని కొనసాగించలేకపోయింది. ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్‌లో ఇబ్బందులు మొదలయ్యాయి.
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులతో 2012 డిసెంబర్‌లో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపును వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ రద్దు చేసింది.
సుమారు నాలుగేళ్ల తర్వాత వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ నిబంధనలకు అనుగుణంగా భారత్ సొంతంగా స్పోర్ట్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసుకుంది.
అప్పటి వరకూ భారత బాక్సర్ల భవిష్యత్తుపై ఊగిసలాట కొనసాగింది. స్థానికంగానూ ఎలాంటి పోటీలు జరగలేదు. భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయింది.

ఫొటో సోర్స్, BFI MEDIA
మహిళా బాక్సింగ్‌కి మంచి రోజులు..
2016లో స్పైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ సీఈవో అజయ్ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటైంది. అప్పటి నుంచి మళ్లీ ఇండియన్ బాక్సింగ్ పట్టాలెక్కింది.
అజయ్ సింగ్ నేతృత్వంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాక్సర్లకు సౌకర్యాలను మెరుగుపరిచింది. ఫెడరేషన్‌లోనూ ప్రొఫెషనలిజమ్ పెరిగింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఛాంపియన్లు రావడం మొదలైంది.
ఛాంపియన్లు రావడం మొదలవడంతో అదే స్థాయిలో, వేర్వేరు విభాగాల్లో పోటీలు నిర్వహించడం కూడా పెరిగింది.
అంతర్జాతీయ స్థాయి కోచ్‌లు, సిబ్బందిని ఇండియన్ బాక్సింగ్ సమకూర్చుకుంది. బాక్సర్లు విదేశాల్లో పోటీల్లో పాల్గొనడం పెరగడంతో పాటు గుర్తింపు కూడా పొందారు.
విదేశాల్లో నిర్వహించిన క్యాంపులన్నీ సక్రమంగానే జరిగినప్పటికీ, అంతగా నమ్మదగినవి కావు. కానీ.. అవి బాక్సర్లకు అనుభవం పెరిగేందుకు మాత్రం సహకరించాయి. కొద్దిపాటి సహకారం అందిస్తే ఎంత చేయగలరో మహిళా బాక్సర్లు ప్రత్యేకంగా నిరూపించారు.

ఫొటో సోర్స్, BFI MEDIA
హేమాహేమీలను పక్కకు నెట్టిన భారత్
ప్రపంచ బాక్సింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.
ప్రపంచ బాక్సింగ్‌ను శాసిస్తున్న యూఎస్, తుర్కియే, క్యూబా, బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాల కంటే మెరుగైన స్థానంలో ఇండియా నిలిచింది.
2020 ఒలింపిక్స్‌కు భారత్ అత్యధిక సంఖ్యలో బాక్సర్లను పంపింది. ఐదుగురు పురుషులు, నలుగురు మహిళా బాక్సర్లు ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొన్నారు.
ఈ పోటీల్లో 69 కేజీల విభాగంలో లవ్‌లినా బొర్గొహైన్ రజత పతకం సాధించింది. ఆ తర్వాత, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత మహిళా బాక్సర్ల ప్రదర్శన మరింత మెరుగుపడింది.
2022 ఉమెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ఇండియా మూడు మెడల్స్ సాధించింది.
52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫెదర్‌వెయిట్ కేటగిరీలో మనీషా మౌన్, లైట్ వెల్టర్‌వెయిట్ విభాగంలో ప్రవీణ్ హుడా రజత పతకాలు సాధించారు. ఈ విజయాలు బాక్సర్లకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి.
బాక్సింగ్‌కి భారత్ ఆతిథ్యం
ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలతో ప్రపంచ బాక్సింగ్‌లో సత్తాచాటేందుకు భారత్‌కు అవకాశం దక్కింది.
భారత్‌లో ఇక్కడి అభిమానుల మధ్య పోటీల్లో పాల్గొనే అవకాశం బాక్సర్లకు వచ్చింది.
ఈ పోటీల్లో భారత్ 12 విభాగాల్లో బాక్సర్లను పోటీకి దింపింది.
జట్ల ఎంపికపై వివాదం తలెత్తడంతో 11 దేశాలు ఈ పోటీలను బాయ్‌కాట్ చేశాయి. రష్యా, బెలారుస్ బాక్సర్లను పోటీలకు అనుమతించడాన్ని పలు దేశాలు వ్యతిరేకించాయి. దీంతో ఈ టోర్నమెంట్‌కి ఒలింపిక్ క్వాలిఫికేషన్ హోదా దక్కలేదు. ఈ పరిణామాలు భారత మహిళా బాక్సర్ల అత్యుత్యమ ప్రదర్శనపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.

ఫొటో సోర్స్, BFI MEDIA
మొదట్నుంచి ధీటుగా ఆడిన నీతూ
బాక్సింగ్‌కు హార్ట్ ల్యాండ్ లాంటి భివాని నుంచి వచ్చిన నీతూ ఘంఘాస్ 2022 కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుందని అంతా భావించారు. రెండుసార్లు వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న నీతూకి మెడల్ తప్పకుండా వస్తుందని భావించారు.
కానీ, సెమీ ఫైనల్స్‌లో టాప్ సీడ్ అలువా బుల్కెకోవా చేతిలో నీతూ ఓటమి పాలైంది. 2023 బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తొలి నుంచీ ధీటుగా ఆడుతున్న నీతూ, సెమీ ఫైనల్స్‌లో తన పాత ప్రత్యర్థి బుల్కెకోవాపై సత్తాచాటింది. సెమీఫైనల్ మ్యాచ్ లో 3-2 తేడాతో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.
బాక్సింగ్‌లో తన హీరో, ఇండియన్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రేక్షకునిగా కూర్చుని చూస్తుండగా మంగోలియన్ లుత్సైకన్‌ను మట్టికరిపించింది. 5 - 0 తేడాతో నీతూ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
''గతేడాది పోటీల్లో నేను మెడల్ సాధించలేకపోయాను. నా లోపాలను సరిచేసుకుని ఈ ఏడాది సొంత అభిమానుల మధ్య మెడల్ గెలుచుకున్నా'' అని నీతూ అన్నారు.
స్వీటీ బూరా, లొవ్‌లినా బొర్గొహైన్ విక్టరీ
ఈ గోల్డ్ మెడల్ స్వీటీ బూరా జీవితంలో ప్రత్యేకం. తొమ్మిదేళ్ల పోరాటం తర్వాత దక్కిన విజయమిది. ఆమె కెరీర్‌లో సాధించిన అత్యంత ముఖ్యమైన గోల్ ఇది. 2014లో జరిగిన జెజూ సిటీ ఛాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది స్వీటీ.
కరోనా కష్టకాలంలో స్వీటీ బాక్సింగ్‌ని వదిలి, స్కూల్ డేస్‌లో ఆడిన కబడ్డీ వైపు మళ్లింది. కొద్దినెలల తర్వాత బాక్సింగ్‌పై ఉన్న ప్రేమను వదులుకోలేక తిరిగి మళ్లీ రింగ్‌లోకి అడుగు పెట్టింది స్వీటీ.
నూతనోత్సాహంతో తిరిగి బాక్సింగ్‌లో అడుగుపెట్టిన స్వీటీ బూరా, ఫిట్‌నెస్ సాధించేందుకు గట్టిగా శ్రమించింది. 2018 వరల్డ్ ఛాంపియన్ వాంగ్ లినాను ఓడించి స్వీటీ బూరా గోల్డ్ మెడల్ సాధించింది.
' నేను థ్రిల్ ఫీల్ అవుతున్నాను. వరల్డ్ ఛాంపియన్ కావాలన్న నా కలను నెరవేర్చుకున్నాను. పోటీ చాలా బాగుంది. పక్కా ప్రణాళిక ప్రకారం సాధన చేశాను. టోర్నమెంట్ పోటీలు జరుగుతున్న కొద్దీ నా ఆట కూడా మెరుగుపడింది. నా శరీరం కూడా ఈసారి బాగా సహకరించింది'' అని 30 ఏళ్ల స్వీటీ బూరా అన్నారు.
వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో లొవ్‌లినా బొర్గొహైన్‌కి కూడా ఇది తొలి గోల్డ్ మెడల్. అస్సాంకు చెందిన లొవ్‌లినా గతంలో మూడు మేజర్ టోర్నమెంట్లలో రజత పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడంతో పాటు 2018, 2019 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రజత పతకాలు గెలిచింది లొవ్‌లినా.
ఈ సారి న్యూఢిల్లీలో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పతకం రంగు మార్చాల్సిందేనన్న పట్టుదలతో లొవ్‌లినా పోరాడింది.
టోక్యో ఒలింపిక్స్ తర్వాత లొవ్‌లినా ఫామ్ కొద్దిగా తగ్గింది. 2022 వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ప్రీమియర్ క్వార్టర్ రౌండ్‌లోనే వెనుదిరిగింది. బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్‌లోనూ క్వార్టర్ ఫైనల్స్ దాటలేకపోయింది.
ఈసారి హైయ్యర్ వెయిట్ కేటగిరీలో తలపడిన లొవ్‌లినా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అది అంత సులభం కాకపోయినప్పటికీ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఒక రౌండ్ కోల్పోయినా తిరిగి పుంజుకుని విజేతగా నిలిచింది.
''ఇది టఫ్ ఫైట్. అందుకు అనుగుణంగానే ప్లాన్ చేసుకున్నాం. తొలి రెండు రౌండ్లు అగ్రెసివ్‌గా ఆడాను. చివరి రౌండ్‌లో కౌంటర్ ఎటాక్ మీద ఫోకస్ చేశా. 2018, 2019లో రజత పతకాలు గెలిచా. ఇప్పుడు పతకం రంగు మారడం సంతోషంగా ఉంది '' అని లొవ్‌లినా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిఖత్ ఛాలెంజ్
నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కేవలం పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రమే ఆమె ఈ విభాగంలో పోటీ పడింది.
గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్, కామన్ వెల్త్ గేమ్స్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన తర్వాత అందరి దృష్టి 26 ఏళ్ల నిఖత్ జరీన్ మీద పడింది. కానీ ఆమెకు అత్యంత కఠినమైన సవాళ్లు ఎదురయ్యాయి.
నిఖత్ తను పోటీ చేస్తున్న వెయిట్ కేటగిరీని మార్చుకుంది. ఆ విభాగంలో ఆమె అన్ సీడెడ్ ప్లేయర్. పైగా 12 రోజుల్లోనే 6 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.
తన కెరీర్ తొలినాళ్లలో మేరీ కోమ్ ప్రభావంతో నిఖత్‌కు అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ తనకు వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ రాటుదేలింది.
నిఖత్ వరుసగా రెండో ఏడాది ఫైనల్స్‌కి చేరింది. సెకండ్ రౌండ్‌లో గ్యూమ్ విసిరిన పంచ్‌కి నిఖత్ పైపెదవికి గాయమైనా పోరాడింది.
''పై పెదవి నుంచి రక్తం కారుతోంది. అలాంటి సమయంలో డాక్టర్‌ను పిలవాల్సి ఉంది. గేమ్‌ను కూడా కొద్దిసేపు ఆపాల్సి ఉంటుంది. కానీ, నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. చల్ నిఖత్, శక్తి హై.. ఔర్ జాన్ లగా అని నాకు నేనే చెప్పుకున్నా. ఇదే చివరి మ్యాచ్. నాకు ఊపిరి ఉంటే ఏం చేయాలనుకుంటున్నానో అదే చేశాను" అని మ్యాచ్ పూర్తయిన తర్వాత నిఖత్ అన్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ వెనుదిరిగి చూసుకోలేదు. విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.
నిఖత్ జరీన్ వరుసగా రెండుసార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఒకప్పుడు బాక్సింగ్ బాయ్స్ కేనా అని తండ్రిని అమాయకంగా అడిగిన నిఖత్, ఇంతకంటే మంచి సమాధానం ఏం ఇస్తుంది.?
ఇవి కూడా చదవండి:
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














