‘‘దేశం కోసం ఫుట్‌బాల్ ఆడాను.. కానీ, ఇప్పుడు సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్నాను’’ - పౌలమి అధికారి

వీడియో క్యాప్షన్, స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేస్తున్న అండర్-19 ఫుట్‌బాల్ ప్లేయర్
    • రచయిత, మేఘ మోహన్
    • హోదా, బీబీసీ న్యూస్

పౌలమి అధికారి డబుల్ షిఫ్టు డ్యూటీ మధ్యలో ఉండగా సామాజిక కార్యకర్త అతీంద్ర చక్రబర్తి ఆమెను కలిశారు. కోల్‌కతాలో సామాన్యుల జీవితంపై అతీంద్ర వీడియోలు చేస్తుంటారు. దీనిలో భాగంగానే పౌలమిని ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు.

ఉదయం ఆరు గంటల నుంచి పౌలమి పనిచేస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటవరకు ఆమె పనిచేయాల్సి ఉంటుంది. అయితే, మధ్యలో అతీంద్రతో మాట్లాడేందుకు ఆమె ఒప్పుకున్నారు.

ఆమె టీ షర్టుపై ‘‘జొమాటో’’ అనే తెల్లని అక్షరాలు కనిపిస్తున్నాయి. భారత్‌లోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ యాప్ కోసం తాను పనిచేస్తున్నట్లు 24 ఏళ్ల ఆమె అతీంద్రతో చెప్పారు. కానీ, ఫుట్‌బాల్ అంటే తనకు చాలా ఇష్టమని వివరించారు.

ఒకప్పుడు అండర్-16 జాతీయ విమెన్స్ ఫుట్‌బాల్ టీమ్‌లో ఆమె ఆడారు. అంతర్జాతీయ టోర్నమెంట్లలోనూ భారత్‌ తరఫున పాల్గొన్నారు. కానీ, అన్నీ అనుకున్నట్లుగా జరగలేదు. ఆమె కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి. దీంతో ఆమె సంపాదన కోసం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొద్దిసేపు మాత్రమే ఆమె అతీంద్రతో మాట్లాడారు. ఆ తర్వాత సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేసేందుకు ఆమె వెళ్లిపోయారు.

అయితే, మరుసటి రోజు ఈ వీడియో వైరల్ అయ్యింది. అసలు ఫుట్‌బాల్ ఆడే అమ్మాయి అన్ని గంటలు ఫుట్ ప్యాకెట్లను డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నలు సంధించారు.

పౌలమి అధికారి కథను వారు తెలుసుకోవాలని అనుకున్నారు.

పౌలమి అధికారి

అల్పాదాయ వర్గాలు ఎక్కువగా జీవించే శిబరామ్‌పుర్‌లో పౌలమి పెరిగారు. ఈ ప్రాంతం కోల్‌కతాలోని హుగ్లీ నదికి దక్షిణాన ఉంటుంది. ఆమెను అందరూ బుల్టీ అని పిలుస్తుంటారు. అంటే ‘‘దేవుడి బిడ్డ’’ అని అర్ధం.

పౌలమికి రెండు నెలల వయసున్నప్పుడే ఆమె తల్లి చనిపోయారు. దీంతో పెద్దమ్మ దగ్గరే ఆమె పెరిగారు. పౌలమి తండ్రి పార్ట్‌టైమ్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. కుటుంబ పోషణకు ఆయన ఆదాయం సరిపోని పరిస్థితి వీరిది.

ఒక సారి తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు తమ ఇంటికి సమీపంలో కొంతమంది అబ్బాయిలు ఫుట్‌బాల్ ఆడటాన్ని పౌలమి చూశారు. ఆమె కూడా వారితో కలిసి ఆడటానికి వెళ్లారు. ఆమె షార్ట్స్ వేసుకోవడంతో వారు కూడా పౌలమిని అబ్బాయిగానే భావించారు.

‘‘అయితే, నేను అమ్మాయినని తెలిసిన తర్వాత, ప్లేగ్రౌండ్ అథారిటీకి, మా పెద్దమ్మకు అక్కడుండేవారు ఫిర్యాదు చేశారు’’ అని బీబీసీతో పౌలమి చెప్పారు. ‘‘అబ్బాయిలతో కలిసి ఒక అమ్మాయి షార్ట్స్‌ వేసుకొని ఎలా ఫుట్‌బాల్ ఆడుతుంది? అని వారు ప్రశ్నించారు’’ అని పౌలమి వివరించారు.

పౌలమి అధికారి

మొదట్లో పౌలమి చాలా బాధపడ్డారు.

‘‘నాకు వారితో కలసి ఆడాలని అనిపించేది. కానీ, వారు ఆడనిచ్చేవారు కాదు. దీంతో రోజూ ఏడ్చేదాన్ని’’ అని ఆమె వివరించారు.

అయితే, ఫుట్‌బాల్ ఆడేలా తను సాయం చేస్తానని పెద్దమ్మ తనకు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ఫుట్‌బాల్ నేర్పించే క్లాసులకు ఆమెను పంపించారు. అక్కడే స్థానిక ఫుట్‌బాల్ కోచ్ అనిత సర్కార్ దృష్టి పౌలమిపై పడింది.

సర్కార్ మార్గదర్శకంలో కోల్‌కతా ఫుట్‌బాల్ లీగ్ బాలికల జట్టులో ఆడే అవకాశాన్ని పౌలమి సంపాదించింది. అప్పటికి తన వయసు 12 ఏళ్లు. ఆ తర్వాత అండర్-16 జట్టులోనూ ఆడేందుకు ఆమె అర్హత సాధించింది.

అక్కడ ఆమెకు చాలా మంది కొత్త స్నేహితులు కలిశారు. తను ఊహించని రీతిలో కొత్తకొత్త అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. తన కుటుంబంలో ఎవరూ ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. అయితే, తన ఆప్తమిత్రులతో కలిసి తనకు నచ్చిన గేమ్స్‌ ఆడేందుకు విమానంలో వెళ్లే అవకాశం పౌలమికి వచ్చింది.

‘‘అంత చిన్న వయసులోనే ఇండియన్ జెర్సీ వేసుకొని భారత్ కోసం ఆడటం అనేది.. నా కెరియర్‌లో ఎప్పటికీ మరచిపోలేని ఘట్టం లాంటిది’’ అని పౌలమి చెప్పారు.

‘‘మొదటిసారి జెర్సీ వేసుకున్నప్పుడు, ఒళ్లంతా గగుర్పొడించింది. చాలా సంతోషంగా అనిపించింది’’ అని ఆమె చెప్పారు.

2013లో ఆమె శ్రీలంక కూడా వెళ్లారు. సౌత్ ఏసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ విమెన్స్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అర్హత సాధించిపెట్టే మ్యాచ్‌లో ఆమె ఆడారు. 2016లో హోమ్‌లెస్ వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఆమె గ్లాస్గో కూడా వెళ్లారు. ఇది ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ టోర్నమెంటు. ఒక్కో మ్యాచ్ కోసం ఆమెకు వంద డాలర్లు (రూ. 8,000) ఇచ్చేవారు. అప్పుడు కూడా ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉండేది.

‘‘మా కుటుంబ పరిస్థితి వల్ల నేను ఎప్పుడూ సరైన ఫుట్‌బాల్ గేర్‌ను కొనుక్కోలేకపోయాను. మరోవైపు రోజుకు మూడు పూట్ల తినడం కూడా గగనంలా ఉండేది’’అని ఆమె చెప్పారు.

పౌలమి అధికారి

2018లో పౌలమికి ఊహించని ఎదురుదెబ్బ ఎదురైంది. ఆమె మోకాళ్లకు దెబ్బ తగిలింది. దీని కోసం ఆమెకు వరుస ఆపరేషన్లు, విశ్రాంతి అవసరమయ్యాయి. వీటి నుంచి ఆమె కోలుకొని, మళ్లీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింద దిగజారింది.

తన అక్కకు పెళ్లి జరిగింది. ఇప్పుడు కుటుంబ భారం పౌలమిపై కూడా పడింది.

దీంతో ఫుట్‌బాల్ కలను పౌలమి పక్కన పెట్టేయాల్సి వచ్చింది. తన కుటుంబానికి సాయం అందించేందుకు ఆమె చిన్నచిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు.

2020లో కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఉపాధి కోల్పోయిన వారిలో చాలా మంది ఫుడ్ డెలివరీ సర్వీస్‌లో చేరారు. అలానే పౌలమి కూడా ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారారు.

అయితే, రోజూ ఉద్యోగం ముగిసేసరికి దాదాపు ఒంటి గంట అవుతోంది. ఫలితంగా ఫుట్‌బాల్ ఆడేందుకు సమయమే దొరకడం లేదు. రోజు మొత్తం పనిచేసినా ఆమెకు రూ.300 మాత్రమే వస్తున్నాయి. ఒక్కోసారి డబుల్ షిఫ్టులు అంటే 15 గంటలకుపైనే ఆమె పనిచేయాల్సి వస్తోంది.

‘‘రోజుకు పది గంటలు పనిచేసేలా ఏదైనా ఉద్యోగం దొరికితే బావుండేది. అప్పుడు మూడు, నాలుగు గంటలను నేను ఫుట్‌బాల్‌కు కేటాయించొచ్చు’’ అని ఆమె చెప్పారు.

పౌలమి అధికారి

తాజా వీడియో వైరల్ కావడంతో ఒక వ్యక్తి కోచింగ్ జాబ్‌ను ఇస్తానని ముందుకు వచ్చారు. అయితే, ఆ ఉద్యోగం కూడా తన ఇంటి నుంచి 40 కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు జొమాటోలో వస్తున్న జీతంలో సగం మాత్రమే ఆమెకు వస్తోంది.

స్పోర్ట్స్‌లో మహిళలను ప్రోత్సహించేందుకు మన దేశంలో, కాదు ప్రపంచంలోనే, చొరవ, సంకల్పం కనిపించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘మీరు భారత్‌నే ఉదాహరణగా తీసుకోండి. పురుషుల, మహిళల ఫుట్‌బాల్‌లను పోల్చిచూడండి. మహిళ ఫుట్‌బాల్‌ను చాలా మంది చూడరు, అక్కడ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోరు’’ అని ఆమె అన్నారు.

‘‘క్రికెట్ విషయంలోనూ అదే జరుగుతోంది. కొంతమంది అయితే, ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ పురుషుల క్రికెట్ చూస్తుంటారు. కానీ, మహిళల క్రికెట్‌పై అంత ఆసక్తి కనిపించదు. మొత్తంగా మహిళ స్పోర్ట్స్‌పై ఒక రకమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది’’ అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, ‘నేను గోల్ఫ్ ఆడుతుంటే అబ్బాయిలు ఏడిపించారు, మా నాన్న ధైర్యం చెప్పారు’

సరైన మద్దతు లభిస్తే, తను మళ్లీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడతానని పౌలమి చెబుతున్నారు.

విమెన్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు తమ టీవీలో ఇంటర్నేషనల్ చానెల్స్ రావని, కానీ, తనకు అమెరికన్ ప్లేయర్ అలెక్స్ మోర్గాన్ అంటే చాలా ఇష్టమని చెప్పారు.

ఈ ఏడాది జనవరి 7న విజన్ 2047 పేరుతో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఒక రోడ్ మ్యాప్‌ను విడుదల చేసింది. దేశంలో ఫుట్‌బాల్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దీనిలో ప్రోత్సాహకాలు ఉన్నాయి.

2026 నాటికి విమెన్స్ ఫుట్‌బాల్‌లో అందరికీ కనీస వేతనంతోపాటు పెట్టుబడులను కూడా పెంచాలని కూడా దీనిలో పిలుపునిచ్చారు.

ఆ విజన్‌లోని లక్ష్యాలను భారత్ చేరుకోవాలని పౌలమి ఆకాక్షించారు.

‘‘ఇక్కడ నాలాంటి పౌలమిలు చాలా మంది ఉన్నారు. వారు నాలానే బాధపడుతున్నారు’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)