వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్: స్వర్ణ పతకం కోసం పోరాడుతున్న ఈ నలుగురు భారత బాక్సర్ల కథేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తొలిసారిగా 4 బంగారు పతకాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అగ్రశేణి బాక్సర్ మేరీకోమ్ కలను ఛిద్రం చేసిన బాక్సర్‌ను ఈ ఛాంపియన్‌షిప్ సెమీఫైనల్లో నిఖత్ జరీన్ ఓడించి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.
నిఖత్‌తో పాటు, లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), నీతు ఘన్‌ఘాస్ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) కూడా ఫైనల్స్‌కు చేరి నాలుగు బంగారు పతకాలపై భారత్ ఆశలను పెంచారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు గెలిస్తే, అది అతని అత్యుత్తమ ప్రదర్శన అవుతుంది.
కాగా, భారతీయ బాక్సింగ్ ముఖచిత్రాలుగా ఉన్న నిఖత్ జరీన్, నీతూ ఘంఘాస్‌లు ప్రస్తుతం భారత కీర్తిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఇద్దరూ 2024 పారిస్ ఒలింపిక్స్‌కు పోటీ పడనున్నారు. ప్రస్తుతం నిఖత్ 50 కేజీలు, నీతు 48 కేజీల కేటగిరీలలో పోరాడుతున్నారు.
అయితే ఒలింపిక్స్‌లో పోటీకి 51 కిలోల వెయిట్ కేటగిరీ ఉంది. భారత్ తరఫున ఒక్కరే వెళ్లాల్సి ఉండటంతో ఇందులో పాల్గొనేందుకు ఇద్దరూ పోటీపడాల్సి రావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మేరీకోమ్ బాటలో నిఖత్ జరీన్
మేరీకోమ్ మాదిరిగా నిఖత్ జరీన్ వరుసగా ప్రపంచకప్‌లో రెండో స్వర్ణ పతకం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
మేరీకోమ్ ప్రపంచంలోని విజయవంతమైన మహిళా బాక్సర్లలో ఒకరు. ఆమె ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆరు బంగారు పతకాలతో సహా మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు.
సెమీస్‌లో కొలంబియా బాక్సర్ వాలెన్సియాపై నిఖత్ అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది.
ఇదే మాదిరిగా రెండుసార్లు ఆసియా ఛాంపియన్ అయిన న్గుయెన్ తీ టామ్‌పై విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే సాంకేతికంగా బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్నప్పుడు నిఖత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని నమ్ముతుంటారు. వాలెన్సియాపై మెరుగైన ప్రదర్శనే దీనికి కారణం.
బలాబలాలు పరిశీలిస్తే న్గుయెన్ కూడా వాలెన్సియాతో సమానమైన బాక్సర్, కాబట్టి నిఖత్ నుంచి మరో ఉత్తమ ప్రదర్శన ఆశించొచ్చు.
నిఖత్ జరీన్ బలం ఏమిటంటే ఆమె ఎక్కడున్నా ఆ పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకుంటుంది.
నిజామాబాద్‌లో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడిన ఆమె తండ్రి తన నలుగురు అమ్మాయిల్లో ఒకరు క్రీడలను కెరీర్‌గా తీసుకోవాలని కోరుకున్నారు. దీంతో నిఖత్ స్ప్రింటర్‌గా మారింది.
అయితే తన బంధువుల్లో ఒకరి సలహా మేరకు బాక్సింగ్ రంగంలోకి అడుగుపెట్టింది నిఖత్. ఒక అమ్మాయి బాక్సర్‌గా మారడం అంత సులభం కాదు.
నిఖత్ బాక్సింగ్ చేస్తే ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని కూడా అన్నవారున్నారు.
కానీ ఆమె తండ్రి సమాజంతో సంబంధం లేకుండా తన కుమార్తెను ఆదరించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆమెను కొనియాడుతోంది.
వరుసగా రెండో బంగారు పతకం సాధించడమే నిఖత్ లక్ష్యం. అయితే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే ఆమె అసలు కల.
సెలెక్షన్ ట్రయల్స్‌లో మేరీకోమ్ చేతిలో ఓడిపోవడంతో ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోయింది.
ఇపుడు, ఆమెకు పారిస్ ఒలింపిక్స్ మార్గం తెరిచే ఉంది. నిఖత్ కలను నిజం చేసుకునే శక్తి కూడా ఆమెకు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
స్వర్ణం కోసం లవ్లీనా పోరు
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గోహైన్, అంతకుముందు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఆమె ఈ సారి తన పతకం రంగు మార్చడానికి వేచి చూస్తోంది. సెమీఫైనల్‌లో చైనీస్ బాక్సర్ లీ కియాన్‌ను ఓడించి పతకం రంగు మార్చగలిగింది.
అయితే ఈసారి ఆ పతకం రంగు రజతమా లేదా స్వర్ణమా అనేది ఫైనల్‌లో కైట్లిన్ పార్కర్‌తో జరిగే మ్యాచ్ తర్వాత తెలుస్తుంది. కైట్లిన్ పార్కర్ 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతక విజేత.
కెరీర్ ప్రారంభంలో లవ్లీనా పోరాడిన పరిస్థితులు ఆమెను మానసికంగా దృఢంగా మార్చాయి. ఈ బలమే సెమీఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిపెట్టింది.
సెమీస్‌లో మొదటి రౌండ్ ఆమెకు అనుకూలంగా చేసుకుంది. అయితే రెండో రౌండ్‌లో ఓడిపోయింది. ఈ స్థితిలో మూడో రౌండ్‌లో ఒత్తిడి పెరిగింది.
ఆమెకు పోటీగా నిలబడిన చైనీస్ బాక్సర్ ఈ విభాగంలో దిగ్గజం. అయితే మూడో రౌండ్ ఫలితంపైనే విజయం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులూ భావించారు.
''ఫలితం మన చేతుల్లో లేకపోయినా ప్రయత్నించడం మన చేతుల్లోనే ఉందని నాకు తెలుసు’ అని మ్యాచ్ అనంతరం లవ్లీనా వ్యాఖ్యానించింది.
మ్యాచ్‌లో అదే ధైర్యంతో లవ్లీనా పంచ్‌లతో అద్భుతమైన ప్రదర్శన చేసి, గెలిచింది.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో పుట్టిన లవ్లీనా.. కిక్ బాక్సింగ్‌లో అక్కాచెల్లెళ్లను చూసి బాక్సింగ్ రంగంలోకి వచ్చింది.
ఆమె తండ్రి తికెన్ చిన్న వ్యాపారి. కూతుర్ని బాక్సర్‌గా మార్చేంత ఆదాయం ఆయనకు లేదు.
అయితే లవ్లీనా దృఢంగా ఉంటూ కష్టాలు ఎదురించి ఈ స్థాయికి చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
విజేందర్ స్ఫూర్తిగా నీతూ
నీతూ ఘంఘాస్. కజకిస్థాన్ బాక్సర్ అలువా వల్కిబెకోవాతో పోరాడి గెలవడం ద్వారా నీతు ఫైనల్ చేరుకుంది.
మొదటి రెండు రౌండ్లు ఒకరికొకరు పంచుకున్న తర్వాత మూడో రౌండ్‌లో కూడా ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది.
చివరికి నీతూనే పైచేయి సాధించింది. నీతు తను ఆరాధించే మాజీ బాక్సర్ విజేందర్‌లానే మానసికంగా దృఢమైన బాక్సర్ అని చెబుతారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడం చూసి నీతు స్ఫూర్తి పొందారు.
ఆమె తండ్రి జై భగవాన్ తన కుమార్తెను విజేందర్ కోచ్ జగదీష్ వద్ద శిక్షణ కోసం భివానీకి తీసుకువెళ్లారు.
ఆమెలాంటి బాక్సర్లతో కలిస్తే నీతూ ఎదుగుదల కష్టమని తండ్రి భావించాడు.
అందుకే అబ్బాయిలతో కలిపి ప్రాక్టీస్ చేయించేవారు. అది ఆమె ప్రతిచర్యలు వేగవంతం చేసింది. ఇదే ఈ రోజు ఆమెకు ఉపయోగపడుతోంది.
నీతూ కృషి 2016 నుంచి ఫలించడం ప్రారంభించింది. ఆమె 2018లో ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకుంది.
అయితే ఆ తర్వాత ఆమె భుజానికి గాయం కావడంతో కెరీర్‌కు ఇబ్బందిగా మారింది.
నీతు భుజం గాయం నయం కావడానికి చాలా సమయం పట్టింది. దీని కారణంగా ఆమె 2021లో మాత్రమే బరిలోకి దిగింది.
అనంతరం భుజం గాయం ప్రభావం తనపై లేదని నీతూ తన ప్రదర్శనతో చూపించింది.
ఫైనల్లో లుత్సాయ్ ఖాన్‌ను ఓడించి స్వర్ణ పతకం గెలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లలో ఆమె నుంచి పతకం ఆశించొచ్చు.
అయితే ఇందుకోసం నీతు 51 కిలోల కేటగిరీలో సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నాన్న కోసం బాక్సింగ్ రింగ్‌లో స్వీటీ
తొమ్మిదేళ్ల తర్వాత స్వీటీ బూర కనీసం రజత పతకమైనా సాధించేలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన స్యూ ఎమ్మా గ్రీన్‌ట్రీని సెమీస్‌లో ఓడించింది స్వీటీ.
అయితే స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకోవాలంటే 2018 ప్రపంచ ఛాంపియన్ వాంగ్ లీనాపై ఆమె మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
గేమ్ అనేది స్వీటీకి తన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి మహీందర్ సింగ్ రైతు. జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ ఆటగాడు.
స్వీటీ మొదట కబడ్డీలో ప్రయత్నించి రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా కూడా నిలిచింది. కానీ ఆమె తండ్రికి ఈ క్రీడ ఇష్టం లేదు. దీంతో పట్టుదలతో బాక్సింగ్ రంగంలో ప్రయత్నించింది.
ఆమె తొలిసారి బరిలోకి దిగినప్పుడు మొదటి రౌండ్‌లో ఓడింది. దీనిపై సోదరుడు నీ బాక్సింగ్ అయిపోయిందని చెప్పాడు. స్వీటీ దెబ్బలు తిని మొదటి రౌండ్ ముగించింది.
అనంతరం రెండో రౌండ్‌లో స్వీటీ ప్రదర్శన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆ తర్వాత స్వీటీ వెనుదిరిగి చూడలేదు. 2014లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వీటీ బురా తొలి ప్రయత్నంలోనే రజత పతకం సాధించింది.
అయితే, ఆమె చాలా కాలం పాటు ఈ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది.
ఇవి కూడా చదవండి
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














