జమున బోరో: కూరగాయలు అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చి భారత నెం.1 బాక్సర్‌గా...

జమున బోరో
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

మహిళల బాక్సింగ్‌లో 54 కేజీల విభాగంలో భారత నెం.1 బాక్సర్ జమున బోరో. అంతర్జాతీయంగా ఆమెది ఐదో ర్యాంకు.

బోరోది అసోంలోని దేకియాజులి అనే చిన్న పట్టణానికి సమీపంలో ఉన్న బెల్సిరి గ్రామం. చిన్నప్పుడు ఆమె బాగా ఉత్సాహంగా ఉండేవారు. ఓరోజు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా, ఆమె ఓ యువ బృందం వుషు మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తుండటం చూశారు. ఈ క్రీడను నేర్చుకోవాలని ఆమెకు కూడా అనిపించింది.

కొన్ని రోజులు వుషు నేర్చుకున్నాక బోరో బాక్సింగ్‌కు మారిపోయారు. బాక్సింగ్‌లో మెరుగైన అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

బాక్సింగ్‌లోకి రావడానికి వుషు బోరోకు ఓ మెట్టులా ఉపయోగపడింది.

జమున బోరో

ఫొటో సోర్స్, NurPhoto

మారుమూల ప్రాంతం నుంచి వచ్చినవారికి కొన్ని అవరోధాలుంటాయి. ముఖ్యంగా వనరులు సరిగ్గా అందుబాటులో ఉండవు. ఆరంభంలో బోరోకు కూడా అదే సమస్య. మొదట్లో సరైన కోచింగ్ లేకుండానే బోరో ఈ క్రీడను ఆడారు. బాక్సింగ్‌పై ఇష్టమున్న అమ్మాయిలు కొందరు ప్రొఫెషనల్ కోచ్ లేకుండానే ప్రాక్టీస్ చేసేవారు. బోరో కూడా వారితో చేరారు.

వ్యక్తిగత జీవితంలోనూ బోరో అనేక సవాళ్లు ఎదుర్కున్నారు. ఆమె తండ్రి త్వరగానే చనిపోయారు. బోరో తల్లి ఒంటరిగా వ్యవసాయం చేస్తూ... టీ, కూరగాయలు అమ్ముతూ కుటుంబ భారాన్ని మోశారు.

క్రీడావసతుల లేమితోపాటు ఇతర సమస్యలు కూడా బోరో ఎదుర్కోవాల్సి వచ్చింది. వారి బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆమెను నిరుత్సాహపరిచేలా మాట్లాడేవారు. బాక్సింగ్ అమ్మాయిలకు సరిపడదని, గాయాలపాలై అందం దెబ్బతింటే పెళ్లి కష్టమవుతుందని... ఇలా రకరకాలుగా చెప్పేవారు.

అదృష్టవశాత్తు ఇలాంటి సమయంలో బోరోకు ఆమె కుటుంబం అండగా నిలిచింది. దీంతో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, బాక్సింగ్‌ను మరింత అంకిత భావంతో ఆమె ప్రాక్టీస్ చేశారు.

జమున బోరో

ఫొటో సోర్స్, NurPhoto

2010లో తమిళనాడులో జరిగిన సబ్ జూనియర్ వుమెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో బోరో స్వర్ణం గెలిచారు. ఆమె, ఆమె కుటుంబం అన్నాళ్లు పడిన శ్రమకు ఆ విజయంతో ఫలితం దక్కినట్లైంది. ఈ ప్రదర్శన బోరో కెరీర్‌లో చాలా కీలకమైంది. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో బోరోకు మెరుగైన శిక్షణ పొందేందుకు, మరిన్ని పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది.

2015లో తైపీలో జరిగిన వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బోరో కాంస్యం గెలిచారు. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని తట్టుకుని ప్రదర్శన చేయడం ఎలాగో అనుభవపూర్వకంగా ఇక్కడ నేర్చుకున్నారామె.

2018‌లో 56వ బెల్‌గ్రేడ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల 54 కేజీల విభాగంలో బోరో రజతం సాధించారు. 2019లో రష్యాలో జరిగిన ఏఐబీఏ వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచారు.

అసోంలోని మారుమూల ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బోరోకు అనేక పురస్కారాలు కూడా దక్కాయి.

2019లో అసోంలోని సాదిన్-ప్రతిదిన్ మీడియా గ్రూప్ క్రీడల్లో రాణించినందుకుగానూ బోరోకు అచీవర్ అవార్డు ప్రదానం చేసింది.

ఏదో ఒక రోజు ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని బోరో ఆశపడుతున్నారు. క్రీడలు మహిళలకు సరిపడవని భావించేవారి వైఖరిలో మార్పు రావాలని కూడా ఆమె కోరుకుంటున్నారు.

దేశంలోని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో సరైన క్రీడా వసతులు ఉండటం లేదని, కానీ అలాంటి చోట్ల చాలా మంది నైపుణ్యవంతులు ఉన్నారని బోరో అంటున్నారు. దేశంలోని క్రీడా సంఘాలు, సంస్థలు అన్వేషకులను పంపి అలాంటి వారిని గుర్తించాలని ఆమె సూచిస్తున్నారు.

(జమున బోరో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)