సుశీల్ కుమార్: ఒలింపిక్ పతకాలు సాధించిన రెజ్లర్ వరుసగా వివాదాల్లో ఎందుకు చిక్కుకున్నారు

ఫొటో సోర్స్, SushilKumar/FB
- రచయిత, ఆదేశ్ కుమార్ గుప్త
- హోదా, బీబీసీ కోసం
ఒలింపిక్ విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్‌ను దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్లీలోని ముండ్కాలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
సుశీల్ కుమార్ గత కొద్ది రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఆచూకీ చెబితే లక్ష రూపాయల బహుమతి ఇస్తామనీ పోలీసులు ప్రకటించారు.
రెజ్లర్ సాగర్ రాణా కిడ్నాప్, హత్య వంటి సెక్షన్లతో సుశీల్ కుమార్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎస్పీ అత్తర్ సింగ్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్లు శివకుమార్, కరమ్‌వీర్ సింగ్ నేతృత్వంలో దిల్లీ పోలీసుల స్పెషల్ టీమ్ సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసింది.
38 ఏళ్ల రెజ్లర్ సుశీల్ కుమార్‌తోపాటూ 48 ఏళ్ల అజయ్‌ను కూడా అరెస్ట్ చేశారు. సుశీల్ కుమార్ మీద లక్ష రూపాయలు, అజయ్ మీద రూ.50 వేల రివార్డ్ ఉంది.

ఫొటో సోర్స్, ANAND SINGH, SONIPAT
‘‘సుశీల్ కుమార్‌కు నాకు(సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆదేశ్ కుమార్ గుప్తా) మధ్య చాలా కాలం నుంచీ సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో ఆయన చాలా మర్యాదగా ప్రవర్తించేవారు’’.
"నేను ఆహ్వానించడంతో 2010లో సుశీల్ కుమార్ బీబీసీ స్టూడియోకు కూడా వచ్చారు. కానీ చూస్తుండగానే ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు" అన్నారు.
మొదట రెజ్లర్ ప్రవీణ్ రాణా, సుశీల్ కుమార్ మద్దతుదారుల మధ్య దిల్లీలోని ఒక స్టేడియంలో గొడవ, తర్వాత ఒలింపిక్‌కు క్వాలిఫై కావడం గురించి జరిగిన పోటీపై రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్‌తో వివాదం, ఇప్పుడు సాగర్ రాణా హత్య కేసులో ఇరుక్కున్నారు.

ఫొటో సోర్స్, Delhi Police
అఖాడాలపై ప్రశ్నలు
సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చారు. అఖాడాలపై తీవ్రంగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్న సమయంలో గత మూడు నాలుగు నెలల్లో ఇలా జరగడం ఇది మూడో ఘటన.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రోహ్తక్‌లోని జాట్ కాలేజీలోని అఖాడాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు చనిపోయారు. వారిలో ఒక కోచ్, ఆయన భార్య కూడా ఉన్నారు. ఆమె మహిళా రెజ్లర్.
అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో భారత్‌కు కుస్తీలో కామన్వెల్త్, ఏషియన్, శాఫ్, ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ పతకాలు అందించడంలో ఈ అఖాడాల పాత్ర చాలా కీలకంగా నిలిచింది.
వీటి సాయంతో భారత మహిళా రెజ్లర్లు కూడా విజయ పతాకం ఎగరవేశారు.
ఇటీవలి ఘటనలతో అఖాడాల్లోని గురుశిష్య సంప్రదాయం.. రెజ్లర్ల కుట్రలు, ఒత్తిడి, డబ్బులకు సంబంధించిన వివాదాల్లో చిక్కుకుందనేది స్పష్టం అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మొదట్లో వివాదాలకు దూరంగా
గత 20 -25 ఏళ్లుగా ప్రముఖ అఖాడాలు, మల్లయోధులు వివాదాలకు దూరంగానే ఉన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవడం మొదలైన తర్వాత రెజ్లర్లకు రైల్వే, పోలీస్, మిగతా విభాగాల్లో సులభంగా ఉద్యోగాలు వచ్చేవి. దీంతో వారి వ్యక్తిగత, సామాజిక జీవితంలో భారీ మార్పులు వచ్చాయి.
ఒక రెజ్లర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే అతడు అంతర్జాతీయ స్థాయి పోటీలను పక్కనపెడితే, కనీసం రాష్ట్ర స్థాయి గేమ్స్‌లో పాల్గొనడం గురించి కూడా ఆలోచించలేడు.

ఫొటో సోర్స్, Getty Images
పేరు సంపాదించడానికి యువత వీధుల్లో కుస్తీలు పట్టే కాలం పోయింది.
సుశీల్ కుమార్ కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత సత్‌పాల్ సింగ్ ఒక విషయం చెప్పారు.
ఆయన చిన్నప్పుడు కొంతమంది పిల్లలు ఆయన్ను కొడుతుండడంతో, తండ్రి ఆయన్ను కుస్తీ నేర్చుకోడానికి గురు హనుమాన్ దగ్గర వదిలారు.
కొన్ని రోజుల తర్వాత కొడుతూ వచ్చిన పిల్లలే ఆయనతో చేయి కలపడానికి తన చుట్టూ తిరిగేవారట.
అఖాడా ఘంటా ఘర్ దగ్గరుండేది. అక్కడ నుంచి అంబా థియేటర్ పెద్ద దూరం కాదు. కానీ ఎవరైనా ఆ థియేటర్లో కనిపిస్తే గురు హనుమాన్ వాళ్లను చెప్పులతో చితకబాదేవారని సత్‌పాల్ సింగ్ చెప్పారు.
గురు హనుమాన్ శిష్యుల్లో కర్తార్ సింగ్, సత్‌పాల్, జగ్‌మిందర్, సుదేశ్ కుమార్, ఇంకా ఎంతోమంది రెజ్లర్లు ఉన్నారు. వారంతా విజయాలతోపాటూ మిగతా రెజ్లర్లకు ఒక ఉదాహరణగా నిలిచారు.
రియల్ ఎస్టేట్ గొడవలు పరిష్కరించడానికే పోరాడతారని, నేతల కోసం పనిచేస్తారని పహిల్వాన్లకు ఉన్న ఇమేజిని వాళ్లు మార్చి చూపించారు.
ఇక దిల్లీ విషయానికే వస్తే గురు హనుమాన్ అఖాడా, ఛత్రసాల్ స్టేడియం అఖాడా, మాస్టర్ చందగీ రామ్ అఖాడా, జగదీశ్ కాలీరమణ్ అఖాడా, సంజయ్ అఖాడా, ప్రేమనాథ్ అఖాడా, కాప్టెన్ చాంద్‌రూప్ అఖాడా లాంటివి ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ జూనియర్, సీనియర్ స్థాయిలో పోటీపడడానికి మల్లయోధులకు శిక్షణ ఇస్తుంటాయి.

ఫొటో సోర్స్, SUSHIL KUMAR/FB
మౌనం పాటిస్తున్న అఖాడాలు
సాగర్ ధన్ఖడ్ హత్య కేసులో సుశీల్ కుమార్ పేరు బయటికి రావడంతో చాలా అఖాడాలు మౌనం పాటిస్తున్నాయి. సుశీల్ కుమార్ వల్ల కుస్తీకి మంచి పేరు కూడా వచ్చిందని అనధికారిక సంభాషణల్లో చాలామంది చెబుతున్నారు. కానీ రెజ్లర్ లేదా కుస్తీ ఇమేజ్ పాడయ్యేలా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు.
సుశీల్ కుమార్ స్వర్ణ పతకం గెలిచిన సమయంలో రామ్ సోంధీ మహిళా, పురుష కుస్తీ చీఫ్ కోచ్‌గా పనిచేస్తున్నారు.
"2010లో ప్రపంచ చాంపియన్ అయితే రెజ్లర్‌కు 10 లక్షల రూపాయలు లభించేవని, ఇప్పుడు కామన్వెల్త్, ఏషియన్, ఒలింపిక్ పతకం గెలిచిన వారికి కోట్ల రూపాయలు దక్కుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిస్తే చాలు డబ్బు వస్తుందనే విషయం రెజ్లర్లకు బాగా అర్థమైంది" అని సోంధీ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సంఘ వ్యతిరేక శక్తుల అడ్డాలుగా అఖాడాలు
"గురు హనుమాన్ శిష్యులు ప్రారంభించిన అఖాడాల్లో పెద్దగా విషయం లేదు. తర్వాత మెల్లమెల్లగా కుస్తీలోకి సంఘ వ్యతిరేక శక్తులు కూడా చొచ్చుకొచ్చాయి. ఇప్పుడు అఖాడాలను స్వాధీనం చేసుకోడానికి రెజ్లర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి" అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రాజేంద్ర సజ్వాన్ చెప్పారు.
అఖాడాల్లో కాస్త పాత ఇమేజ్ కూడ కనిపిస్తోందని చెప్పిన సజ్వాన్, ఒకప్పుడు ఆ ఇమేజిని మార్చిన అఖాడాలు ఇప్పుడు సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారాయన్నారు. గురు హనుమాన్ మీద రాజేంద్ర సజ్వాన్ ఒక పుస్తకం రాస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వివాదాలకు కారణం ఏంటి
కుస్తీలో గెలిచినందుకు తమకు ఒక రూపాయి, పది రూపాయలు ఇచ్చేవారని పహిల్వాన్లు చంద్గీరామ్, సత్‌పాల్, కర్తార్, సుదేశ్, జగ్‌మిందర్, ప్రేమ్‌నాథ్ లాంటి వారు తనకు చెప్పేవారని సజ్వాన్ పాత రోజులు గుర్తు చేసుకున్నారు.
70-80వ దశకంలో భారత్ కేసరి, భారత్ భీమ్, హింద్ కేసరి పేరున లక్షల రూపాయల కుస్తీ పోటీలు జరిగేవి. ఇప్పుడు కుస్తీ లీగ్ నుంచి కూడా భారీగా డబ్బులు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిస్తే కోట్లు వస్తున్నాయి.
కానీ, మంచి పహిల్వాన్లు కాలేకపోయినవారు పెద్ద రెజ్లర్లకు అనుచరులుగా మారిపోతారు లేదా దారితప్పుతారు. అలా డబ్బు సంపాదన కోసం తప్పుడు దారుల్లో వెళ్తారు. అఖాడాల్లో గందరగోళాలకు అదే ప్రధాన కారణం అవుతోంది.
ఒక్కొక్క అఖాడాలో ఇద్దరు ముగ్గురు పోటీదారులు ఉంటారు. ఇది రెజ్లర్ల మధ్య అసూయ, ద్వేషానికి కారణం అవుతోంది. ప్రతి చోటా ఈ పరిస్థితికి డబ్బు ప్రధాన కారణం అవుతోంది.
కొన్ని రోజుల క్రితం భారత కుస్తీ మహాసంఘ్ అధ్యక్షుడు బృజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను కలిసి, కుస్తీని జాతీయ క్రీడగా ప్రకటించాలంటూ వస్తున్న డిమాండ్ల గురించి మాట్లాడానని రాజేంద్ర సజ్వాన్ చెప్పారు.
"కానీ, ఇప్పుడు ఈ సిగ్గుచేటు ఘటనల వల్ల ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. మొత్తం అఖాడాలను ప్రభుత్వ పర్యవేక్షణలో నడపాలని ఇప్పుడు ఆయన భావిస్తున్నారు" అన్నారు.
ప్రస్తుతం దిల్లీ ఛత్రసాల్ స్టేడియంలోని అఖాడాను దిల్లీ ప్రభుత్వం సాయంతో నడుపుతున్నారు.
గురు హనుమాన్ అఖాడా మొదట బిర్లా కుటుంబం మద్దతుతో నడిచేది, ఇప్పుడు గురు హనుమాన్ శిష్యులు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా నడుస్తోంది.
మిగతా అఖాడాల్లో కొన్ని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయంతో, స్వచ్ఛంద సంస్థల విరాళాలతో చాలా కష్టంగా నడుస్తున్నాయి.
పురాతన గురువులు, ఇప్పటి కోచ్‌లు కుస్తీలో గురుశిష్యుల సంప్రదాయం చాలా ముఖ్యమైనదని భావిస్తున్నారు. మహాభారత్ సమయం నుంచీ కుస్తీలో ఆ సంప్రదాయం ఉందంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుశీల్ కుమార్ కొత్త చరిత్ర...
భారత్ ప్రభుత్వం క్రీడా గురువులకు ద్రోణాచార్య, క్రీడాకారులకు అర్జున అవార్డు అందిస్తుంది.
సుశీల్ కుమార్ గురించి ఇటీవల వినిపిస్తున్న వార్తలపై మాట్లాడిన ప్యారా రామ్ సోంధీ అది డబ్బుల విషయమే అయ్యుండచ్చు అన్నారు. అతడు చాలా సిగ్గరి అని, నెమ్మదస్తుడని సోంధీ చెప్పారు.
2008 బీజింగ్ ఒలింపిక్ పోటీలను గుర్తు చేసుకున్న సోందీ సుశీల్ కుమార్ మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలై నిరాశతో తన గదిలో కూర్చున్న సమయంలో, రెండు సార్లు ఏషియన్ గేమ్స్ విజేతగా నిలిచిన కర్తార్ అతడిలో ధైర్యం నింపాడని చెప్పారు.
"ఏ రెజ్లర్‌తో నువ్వు ఓడిపోయావో, అతడు ఫైనల్ చేరుకోవచ్చేమో, రాప్‌చేజ్‌తో నువ్వు పతకం గెలిచే అవకాశం ఉందేమో.. అన్నాడు. అదే జరిగింది. ఆ తర్వాత సుశీల్ కుమార్ చరిత్ర లిఖించాడు" అన్నారు.

ఫొటో సోర్స్, dpa
వివాదాల్లో సుశీల్ కుమార్
2017లో సుశీల్ మొదటిసారి 2018 కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫై అయ్యాడు. కానీ ఆ సమయంలో అతడు దిల్లీలో ప్రవీణ్ రాణాతో తలపడ్డాడు.
పోటీలో సుశీల్ కుమార్ గెలిచినా, గేమ్ తర్వాత అతడి మద్దతుదారులు, ప్రవీణ్ రాయ్ మద్దతుదారుల మధ్య భారీ గొడవ జరిగింది. అప్పుడు సుశీల్ కుమార్ మొదటిసారి వివాదాల్లో చిక్కుకున్నాడు.
2016లో రియో ఒలింపిక్ క్రీడల సమయంలో 74 కిలోల వెయిట్ కేటగిరీలో పాల్గొనాల్సిన రెజ్లర్ నరసింహ్ యాదవ్ సుశీల్ కుమార్ తనను డోపింగ్‌లో ఇరికించాడని ఆరోపించడంతో ఆయన మరోసారి వివాదాల్లో పడ్డాడు.
ఆ సమయంలో సుశీల్ కుమార్ గాయం కారణంగా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో పాల్గొనలేకపోయాడు.
తాజాగా ఇప్పుడు రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో పరారీలో ఉన్న సుశీల్ కుమార్ చివరికి పోలీసులకు దొరికాడు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








