'మంగళవారం నన్ను అరెస్ట్ చేయవచ్చు' అన్న డోనల్డ్ ట్రంప్.. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ కేసు ఏంటి?

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సారా ఫౌలర్, ఆంథోనీ జర్చర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మంగళవారం తనను అరెస్ట్ చేయవచ్చని, తన మద్దతుదారులంతా భారీ నిరసనలు చేయాలని డోనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.

అయితే, ఈ విషయంలో ఎలాంటి అధికారం సమాచారం రాలేదని, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ట్రంప్ అలా చెబుతున్నారని ఆయన తరపు లాయర్ అన్నారు.

ట్రంప్‌పై అభియోగాలు నిరూపణ కావొచ్చని, వచ్చే వారం తీర్పు వెలువడవచ్చని కథనాలు చెబుతున్నాయి. నేరం రుజువైతే, అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడిపై రుజువైన తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది.

2016 అధ్యక్ష ఎన్నికల ముందు, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు, ట్రంప్‌కు ఉన్న సంబంధంపై ఆమె నోరు తెరవకుండా ఉండేందుకు, ట్రంప్ తరఫు లాయరు ఆమెకు పెద్ద మొత్తం చెల్లించారనే అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో ఐదేళ్లుగా ట్రంప్‌పై విచారణ కొనసాగుతోంది.

76 ఏళ్ల ట్రంప్‌పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. అయితే, ఇప్పటివరకూ ఏ కేసులోనూ నేరం రుజువు కాలేదు. తాను ఏ తప్పూ చేయలేదని ప్రతి కేసులోనూ ట్రంప్ వాదిస్తున్నారు.

ప్రస్తుతం ట్రంప్ 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నేరం రుజువైనా సరే, ప్రచారాలు కొనసాగిస్తానని ఆయన చెబుతున్నారు.

ఆయనపై క్రిమినల్ కేసు రుజువవుతుందా, లేక ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంలో స్పష్టత రాకముందే, ట్రంప్ తన అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. మద్దతుదారులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ట్రంప్‌కు భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటోల్‌ భవనంపై ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున దాడి చేసిన సంగతి తెలిసిందే.

స్టార్మీ డేనియల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

శనివారం ట్రంప్ తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ 'ట్రూత్ సోషల్' లో తన అరెస్ట్ గురించి రాశారు.

మాన్‌హాటన్ జిల్లా న్యాయవాది కార్యాలయం నుంచి తనకు "రహస్య సమాచారం" వచ్చిందని, తన అరెస్ట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

దీనిపై ఆ జిల్లా న్యాయవాది కార్యాలయం స్పందించలేదు. తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని ట్రంప్ లాయర్ సుసాన్ నెచెలెస్ చెప్పారు.

"ఇది రాజకీయాలకు సంబంధించిన కేసు కాబట్టి జిల్లా న్యాయవాది కార్యాలయం ప్రతి విషయాన్ని మీడియాను లీక్ చేస్తోంది. నిజానికి, ఏ విషయమైనా ముందు ట్రంప్ న్యాయవాదుల బృందానికి తెలియజేయాలి" అన్నారామె.

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనాల్డ్ ట్రంప్

తరువాత ఏం జరుగుతుంది?

ట్రంప్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు అన్నీ కోర్టుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ట్రంప్ విచారణకు హాజరు కావడానికి నిరాకరించారు. కాబట్టి, ఈ కేసు దాదాపు ముగిసినట్టేనని నిపుణులు అంటున్నారు. సోమవారం ఆఖరి సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టవచ్చు.

విచారణ పూర్తయిన తరువాత, ట్రంప్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై గ్రాండ్ జ్యూరీ ఒక అభిప్రాయానికి వస్తుంది. అయితే, అది ఫైనల్ కాదు. మాన్‌హాటన్ జిల్లా న్యాయవాది ఆల్విన్ బ్రాగ్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇందులో రాజకీయ అంశాలు కూడా ఉండవచ్చు.

సాధారణంగా నేరం రుజువైతే దోషిని అరెస్ట్ చేస్తారు లేదా స్వయంగా లొంగిపోతారు. నేరం తీవ్రమైనది అయితే, చేతులకు సంకెళ్లు వేస్తారు. ఫొటోలు, వేలిముద్రలు తీసుకుంటారు. ఇలాంటి కేసుల్లో తొలి విచారణ తరువాత, తదుపరి విచారణ వరకు ప్రతివాదిని విడుదల చేస్తారు.

స్టార్మీ డేనియల్స్

ఫొటో సోర్స్, Reuters

కేసు ఏమిటి?

డోనల్డ్ ట్రంప్ 2006లో తనతో సెక్స్ చేశారని.. పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. ‘ఆ విషయాన్ని’ బయటపెట్టకూడదంటూ తనను బెదిరించారని ఆమె చెప్పారు.

2016 ఎన్నికలకు ముందు, ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ లాయరు తనకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

ఆ తరువాత, ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాదే డేనియల్స్ ఆరోపణలు నిజమేనంటూ సంచలన ప్రకటన చేశారు.

ట్రంప్ మాజీ లాయరు మైఖేల్ కోహెల్, డేనియల్స్‌కు 1,30,000 డాలర్లు ముట్టజెప్పారని, తరువాత, ట్రంప్ ఆ సొమ్మును కోహెన్‌కు అందజేశారన్న విషయన్ని న్యాయవాది రూడీ గియూలియానీ చెప్పారు. రికార్డులలో ఈ మొత్తాన్ని "లీగల్ ఫీజు" కింద చెల్లించినట్టు ఉంది.

ఈ నేపథ్యంలో, ట్రంప్ తప్పుడు రికార్డులు సృష్టించారని కోర్టు తీర్పు చెప్పవచ్చని పలువురు భావిస్తున్నారు.

ఈ చెల్లింపుల వ్యవహారం గురించి ఏమీ తెలియదని ట్రంప్ చెబుతూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి: