ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు: పులివెందుల్లో జగన్‌కు... కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారా?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
స్థానిక సంస్థలు, ఉపాధ్యాయుల కోటా ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్‌సీపీ హవా కొనసాగింది. పట్టభద్రుల స్థానాల్లో ఓటమి పాలయ్యింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తరుపున అక్కడ కూడా నామినేషన్ వేయడంతో పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది. ఈనెల 23న పోలింగ్ జరగనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టి పట్టభద్రుల తీర్పుపై ఉంది. మిగిలిన స్థానాలతో పోలిస్తే ఎక్కువ మంది ఓటర్లు ఉండటం, ప్రజల నాడి కనిపెట్టేందుకు కొలమానంగా వీటిని భావించడమే అందుకు కారణం.
పట్టభద్రుల స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా కొందరు చెబుతుంటే, ఏం జరిగిందన్నది సమీక్ష చేసుకుంటామని ఆ పార్టీ చెబుతోంది.
ఇక రాష్ట్రంలోనే రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల గురించి ఆసక్తికర ప్రచారం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులతోపాటు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం స్థానాల్లో ఓట్ల గురించి వెల్లువెత్తిన పోస్టులు, కొన్ని మీడియా సంస్థల్లో జరిగిన ప్రచారం మీద బీబీసీ ఫ్యాక్ట్ చెక్ చేసింది.

ఫొటో సోర్స్, UGC
సోషల్ మీడియాలో వైరల్
‘‘పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందులలో టీడీపీకి 4,323 ఓట్లు, వైసీపీకి 2,120 ఓట్లు.’’... అంటూ ఒక న్యూస్ చానెల్‌లో వచ్చినట్లుగా చెబుతున్న ఒక ఇమేజ్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
‘‘కుప్పంలో వైసీపీ హవా! జగన్ చెప్పి మరీ కొట్టాడు’’... అంటూ సుమన్ టీవీ యూట్యూబ్ చానెల్‌లో కనిపించింది.
ఇటువంటి వార్తలు మీడియా, సోషల్ మీడియాలలో కనిపించాయి.
కానీ సాధారణ ఎన్నికలకు, శాసనమండలి ఎన్నికలకు చాలా తేడా ఉంది. ఈ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసుకునే అవకాశం ఉంది.
కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ అవకాశం లేదు. ఈ ఎన్నికలు ప్రాధాన్యత ఓటింగ్ పద్ధతిలో జరుగుతాయి.
సాధారణ ఎన్నికల్లో పార్టీలు, ఇండిపెండెంట్లు పోటీ చేస్తారు. వారికి గుర్తులు కేటాయిస్తారు. నచ్చిన గుర్తుల దగ్గర నొక్కితే ఈవీఎంలో ఓటు నిక్షిప్తమవుతుంది. ఈవీఎంలు లేదా బ్యాలెట్ బ్యాక్సుల వారీగా ఓట్లు పడతాయి కాబట్టి ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో ఎన్ని ఓట్లు వచ్చాయన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా కాదు. బూత్‌ల వారిగా ఓట్లు తెలుసుకోలేం.

ఫొటో సోర్స్, Facebook

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, Facebook
కుప్పం, పులివెందుల సంగతేంటి
ఇంత సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది కాబట్టే ఓట్లు లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో గురువారం ఉదయం కౌంటింగ్ మొదలయితే శుక్రవారం రాత్రికి కూడా పూర్తి ఫలితాలు వెల్లడికాకపోవడం అందుకు నిదర్శనం.
ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల్లో పులివెందుల్లో టీడీపీకి మెజార్టీ వచ్చిందని స్క్రోలింగ్ వేశాయి. కొన్ని వెబ్ సైట్లు, చానెళ్లలో కుప్పంలో టీడీపీ వెనుకబడిందని కథనాలు ఇచ్చినట్టు బీబీసీ గమనించింది.
వాస్తవానికి శాసనమండలి ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల లెక్కింపు ఉండదు. బ్యాలెట్ బాక్సులు, నోట్ల కట్టలు అన్నీ కలగలిసిన తర్వాత సాధ్యం కాదు. కాబట్టి పులివెందులో జగన్‌కి ఎదురుదెబ్బ అనే ప్రచారంలో వాస్తవం లేదు. కుప్పంలో చంద్రబాబుకి వ్యతిరేకత అనే కథనాల్లో నిజం లేదు.
ఉమ్మడి చిత్తూరు- నెల్లూరు- ప్రకాశం జిల్లాల తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ ఓట్లను మూడు జిల్లాల ఓట్లతో కలిపి చిత్తూరులో కౌంటింగ్ నిర్వహించారు.
పూర్వపు అనంతపురం- కడప- కర్నూలు జిల్లాల పరిధిలోని పశ్చిమ రాయలసీమగా పిలిచే పట్టభద్రుల స్థానంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ ఓట్లను అనంతపురం జేఎన్టీయూలో లెక్కించారు. మూడు జిల్లాల ఓట్లను కలిపే లెక్కించడం తప్ప, అసెంబ్లీ స్థానాల వారీగా లెక్కగట్టే అవకాశం ఉండదు.
కౌంటింగ్ విధానం మీద అవగాహన లేకపోవడం గానీ రాజకీయ దురుద్దేశంతో గానీ ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువగా సాగుతున్నట్టుగా కనిపిస్తోంది.
మండలి ఎన్నికల భిన్నం
మండలి ఎన్నికలు ముఖ్యంగా పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికల్లో విజేతలను ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయిస్తారు.
అభ్యర్థుల పేర్లు మాత్రమే బ్యాలెట్ పేపర్ మీద ఉంటాయి. గుర్తులు ఉండవు. కాబట్టి అందరూ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు. కానీ అది ఓటు ముద్ర కాకుండా 1 అంకె వేయాల్సి ఉంటుంది.
ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ప్రాధాన్యతా క్రమంలో 1,2,3,4.. ఇలా అంకెలు వేయాలి.
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు, అందులో ప్రాధాన్యతా క్రమంలో ఓటింగ్ విధానం కారణంగా సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే తీరు పూర్తి భిన్నంగా ఉంటుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అర్థం కాని వారిలో టీచర్లు, పట్టభద్రులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధికంగా చెల్లని ఓట్లు నమోదు కావడానికి అదే ప్రధాన కారణం.

ఫొటో సోర్స్, UGC
ఓట్ల లెక్కింపు కూడా..
సాధారణ ఎన్నికల్లో ఈవీఎంల కారణంగా పోలింగ్ బూత్‌ల సంఖ్యను ఈవీఎంలలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది సులువుగా అర్థమవుతుంది. కానీ శాసనమండలి ఎన్నికల బ్యాలెట్ బ్యాక్సుల ఓట్ల లెక్కింపులో అది సాధ్యం కాదు.
మండలి ఎన్నిక అంచెల వారీగా జరుగుతుంది. మొదట పడిన ఓట్లన్నీ బ్యాలెట్ బ్యాక్సులు కౌంటింగ్ స్టేషన్లో టేబుళ్ల వారీగా తీసుకొచ్చి 50 చొప్పున కట్టలు కడతారు. అలా కట్టడం పూర్తయిన తర్వాత వాటిని ఓ డ్రమ్ములో వేస్తారు.
అభ్యర్థుల వారీగా లెక్కగట్టెక్కేందుకు ఆ డ్రమ్ముల్లోంచి ఓట్ల కట్టలను ఒక్కో టేబుల్‌కు పంచుతారు. ఆ టేబుల్ దగ్గర ఉన్న సిబ్బంది ఒక్కో కట్టని విడదీసి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది విభజిస్తారు.
అలా ఆయా ఓట్లలో 1 అంకె వేసిన మొదటి ప్రాధాన్యతా ఓట్లను బట్టి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది రౌండ్ల వారీగా ప్రకటిస్తూ ఉంటారు. అందులో మొదటి ప్రాధాన్యతా ఓటులో మొత్తం చెల్లిన ఓట్లలో 50 శాతం ఓట్లతో పాటు అదనంగా ఒక్క ఓటు వస్తే విజయం సాధించినట్టు ప్రకటిస్తారు.
మొదటి ప్రాధాన్యతా ఓటులో 50 శాతం ఓట్లు రాకపోతే రెండో నెంబర్ వేసిన ఓట్లను లెక్కిస్తారు. దానిని ఎలిమినేషన్ రౌండ్ అంటారు. అందులో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఓట్లను మొదట లెక్కిస్తారు.
10 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే 10వ స్థానంలో నిలిచిన వారికి దక్కిన మొదటి ప్రాధాన్యతా ఓట్లలో 2వ నెంబర్ ఎంతమందికి వేశారన్నది లెక్కిస్తారు. అందులో మ్యాజిక్ ఫిగర్ కి ఎవరైనా చేరితో విజయం సాధించినట్టు. లేదంటే మళ్లీ ఆ తర్వాత 9, 8, 7.. ఇలా ఒక్కో స్థానంలో ఉన్న వారికి దక్కిన ఓట్ల కట్టలను మళ్లీ విప్పి, వారికి దక్కిన రెండో ప్రాధాన్యతా ఓటుని లెక్కిస్తూ వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు.
మొదటి ప్రాధాన్యతా ఓటులో 3వ స్థానంలో ఉన్న వారి వరకూ లెక్కబెట్టినప్పుడు చివరికి మిగిలిన ఇద్దరిలో ఎవరికీ పూర్తి మెజార్టీ దక్కకపోతే ఎక్కువ ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














