పంజాబ్: 'వారిస్ పంజాబ్ దె' మీద పోలీస్ ఆపరేషన్.. పరారీలో అమృత్‌పాల్ సింగ్.. రాష్ట్రంలో ఇంటర్నెట్ బంద్

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

స్వయం ప్రకటిత అతివాద సిక్కు మతబోధకుడు, అనుమానిత ఖలిస్తాన్ అనుకూల సంస్థ ‘వారిస్ పంజాబ్ దె’ అధినేత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేయటానికి పంజాబ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు.

పలు క్రిమినల్ కేసులున్న ఆ సంస్థకు వ్యతిరేకంగా శనివారం రాష్ట్రమంతటా భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు.

సాయంత్రానికి 78 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజా భద్రత రీత్యా శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ పంజాబ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు, ఎంఎస్ఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పంజబా హోంశాఖ ప్రకటించింది.

పంజాబ్ పోలీస్ అధికార ప్రతినిధి కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం జలంధర్‌లోని మిహత్పూర్ జిల్లాలో వారిస్ పంజాబ్ దె కార్యకర్తలను పోలీసులు అటకాయించారు. అక్కడికక్కడే ఏడుగురిని అరెస్ట్ చేశారు.

అమృత్‌పాల్ సింగ్ సహా మరి కొందరు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు భారీ స్థాయిలో గాలింపు జరుపుతున్నారు.

అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసుల గాలింపు

ఫొటో సోర్స్, PUNJAB POLICE

ఫొటో క్యాప్షన్, జలంధర్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు

రాష్ట్ర వ్యాప్త ఆపరేషన్ల సందర్భంగా ఏడు రైఫిళ్లు సహా తొమ్మిది తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

వర్గాల మధ్య విద్వేషాలను వ్యాపింపజేయటం, హత్యా యత్నం, పోలీసులపై దాడి, ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణను అడ్డుకోవటం అనే నాలుగు క్రిమినల్ కేసుల్లో వారిస్ పంజాబ్ దె శక్తుల ప్రమేయం ఉందని పోలీస్ అధికార ప్రతినిధి చెప్పారు.

అజ్నాలా పోలీస్ స్టేషన్ మీద దాడికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీన ఈ సంస్థకు సంబంధించిన వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు.

ప్రజలు ఫేక్ న్యూస్ విషయంలోను, వదంతులను నమ్మరాదని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు.

శాంతి సామరస్యాలను దెబ్బతీయటానికి ప్రయత్నించే వారందరి మీదా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

పంజాబ్
ఫొటో క్యాప్షన్, అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు పలుచోట్ల ఆందోళనకు దిగారు

అమృత్‌పాల్ మద్దతుదారులు వేలాది మంది ఫిబ్రవరి 23న అమృత్‌సర్ శివార్లలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. అమృత్‌పాల్ సన్నిహిత సహాయకుడు లవ్‌ప్రీత్ తూఫాన్‌ను విడుదల చేయాలంటూ వారంతా ఖడ్గాలు, తుపాకులు ధరించి పోలీసులతో ఘర్షణకు దిగారు.

ఒక వ్యక్తి మీద దాడి చేసి, కిడ్నాప్ చేసిన ఆరోపణలపై పోలీసులు అప్పుడు లవ్‌ప్రీత్ తూఫాన్‌ను అరెస్ట్ చేశారు. ఆయనను తక్షణమే విడుదల చేయకుంటే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన అమృత్‌పాల్ మద్దతుదారులు హెచ్చరించారు.

ఆ తర్వాత.. తమకు సమర్పించిన ఆధారాల నేపథ్యంలో లవ్‌ప్రీత్ తూఫాన్‌ను విడుదల చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల వినతి మేరకు లవ్‌ప్రీత్ సింగ్ తూపాణ్‌ను విడుదల చేయాల్సిందిగా అజ్నాలా కోర్టు ఆదేశాలిచ్చింది. ఆయనను ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేశారు.

ఆ నాటి ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ స్పందిస్తూ.. ‘‘ఈ 1000 మంది జనం పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించరు. రాష్ట్రంలో శాంతికి భంగంగ కలిగించటానికి వారికి పాకిస్తాన్ డబ్బులు ఇస్తోంది’’ అని ఆరోపించారు.

పోలీస్ స్టేషన్ ముట్టడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 23న తన అనచురులతో కలిసి అమృత్‌పాల్ సింగ్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు

అమృత్‌పాల్‌ సింగ్ ఎవరు?

పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని జల్లుపుర్ ఖేరాకు చెందిన అమృత్‌పాల్ సింగ్ 2012లో దుబాయికి వెళ్లారు. అక్కడ వారి కుటుంబం ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తోంది.

అమృత్‌పాల్ సింగ్ బాల్యం గురించి పెద్దగా తెలియడం లేదు.

పంజాబ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసినట్లు తన లింక్డిన్ ప్రొఫెల్‌లో అమృత్‌పాల్ సింగ్ రాసుకున్నారు. ఒక కార్గో కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్‌గా పని చేసినట్లు ప్రొఫైల్ ఆధారంగా తెలుస్తోంది.

సిక్కుల ఐక్యత, సిక్కులకు ప్రత్యేక దేశం వంటి వాటి మీద మాట్లాడుతూ తొలుత సోషల్ మీడియాలో అమృత్‌పాల్ సింగ్ పాపులర్ అయ్యారు.

2022 ఆగస్టులో సింగ్ దుబాయి నుంచి భారత్‌కు వచ్చారు. గతంతో పోలిస్తే తన ఆహార్యాన్ని మార్చివేశారు. తలపాగా ధరించడం, గడ్డం పెంచడం వంటి వాటితో ఒక ఆధ్యాత్మిక సిక్కు మాదిరిగా ఆయన కనిపిస్తున్నారు.

భారత్‌కు వచ్చిన నెల తరువాత దీప్ సిద్ధు ప్రారంభించిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు అమృత్‌పాల్ సింగ్‌ను సారథిగా నియమించారు.

2021లో దిల్లీలో జరిగిన రైతుల నిరసన ప్రదర్శనలో భాగంగా హింసకు పాల్పడ్డారంటూ దీప్ సిద్ధును అరెస్టు చేశారు. ఆయన నటుడు కూడా. 2022లో జరిగిన కారు ప్రమాదంలో దీప్ చనిపోయారు.

జర్నైల్‌ సింగ్ భింద్రన్‌వాలే స్వస్థలమైన రోడ్ గ్రామంలో అమృత్‌పాల్ సింగ్‌కు సారథ్యం అప్పగించే వేడుక జరిగింది. వేల మంది దానికి హాజరయ్యారు.

వీడియో క్యాప్షన్, అమృత్‌పాల్ సింగ్ ఎవరు?

‘ప్రత్యేక దేశమే ఏకైక పరిష్కారం’

అమృత్‌పాల్ సింగ్ అనుచరులు ఆయనను ఖలిస్తాన్ ఉద్యమ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో పోలుస్తుంటారు. తనకు స్ఫూర్తి భింద్రన్‌వాలే అంటూ తరచూ అమృత్‌పాల్ సింగ్ చెబుతూ ఉంటారు.

తన ప్రసంగాలతో భింద్రన్‌వాలేను గుర్తుకు తెస్తుంటారు అమృత్‌పాల్ సింగ్. ఆయన బహిరంగంగానే సిక్కులకు ప్రత్యేక దేశం ఉండాలంటూ పిలుపునిస్తుంటారు. డ్రగ్స్, నీటి వివాదాలు, పంజాబ్ సంస్కృతి దిగజారడం వంటి సమస్యలకు ప్రత్యేక దేశమే ‘ఏకైక పరిష్కారం’ అన్నది సింగ్ అభిప్రాయం.

అయితే తనను జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో పోల్చడాన్ని అమృత్‌పాల్ సింగ్ అంగీకరించడం లేదు.

‘‘ఆయన కాలికి అంటుకున్న మట్టికి కూడా నేను సమానం కాదు. ఆయన చూపిన దారిలో నేను నడుస్తున్నాను’’ అని 2022లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ అన్నారు.

2022 నవంబరులో సిక్కులకు మత దీక్ష (అమృత్ వేడుక) ఇచ్చే కార్యక్రమాన్ని నెల రోజుల పాటు సింగ్ నిర్వహించారు.

డ్రగ్స్‌ వ్యసనానికి ప్రజలను దూరం చేయడంతోపాటు కట్నం, కులవివక్షలను నిర్మూలించేందుకు దీక్ష ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

గురు గ్రంథ్ సాహిబ్ ముందు ఎవరైనా కిందనే కూర్చోవాలని అమృత్‌పాల్ సింగ్ పిలుపునిచ్చారు. ఆ తరువాత ఒక గురుద్వారాలో ఉన్న కుర్చీలను ఆయన అనుచరులు ధ్వంసం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)