ఆంధ్రప్రదేశ్: పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా? ప్రాజెక్ట్ స్వరూపాన్ని బ్యారేజ్‌గా మార్చేస్తున్నారా?

జగన్

ఫొటో సోర్స్, Facebook/YSRCP, BBC

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అవుతుందని చెబుతోన్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే అంశంపై అస్పష్టత నెలకొంది. ఈ ప్రాజెక్టు పనులు ఎప్పటికి కొలిక్కి వస్తాయన్నదానిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు.

ఇప్పటికే నిర్మాణం పూర్తి చేయటానికి పెట్టుకున్న పలు గడువులు దాటిపోయాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇటీవల ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అటు పార్లమెంటులో జలశక్తి శాఖ తరఫున చెప్పిన సమాధానంలో.. ప్రాజెక్టులో తొలి దశ నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లుగా ప్రస్తావించడంతో ప్రాజెక్టు ఎత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో రూపొందించిన డిజైన్లకు విరుద్ధంగా ఎత్తు తగ్గించే అవకాశం ఉంటుందా? మరి 45.72 మీటర్ల మేర ఉండాల్సిన డ్యామ్‌లో 41.15 మీటర్ల మేర మాత్రమే నీటిని నిల్వ ఉంచబోతున్నట్టు ఎందుకు చెబుతున్నారు? నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో జరుగుతున్న జాప్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రయత్నం జరుగుతోందా? అంటూ అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

పోలవరం పర్యటనలో జగన్

ఫొటో సోర్స్, Facebook/YSCRCP SocialMedia

పోలవరం ప్రాజెక్ట్

కేంద్రం ఏమంటోంది..?

అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి అడిగిన ప్రశ్నకు మార్చి 23వ తేదీన లోక్‌సభలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానమిచ్చారు. రాతపూర్వక సమాధానంలో ఆయన పోలవరం ఫేజ్‌-1లో ఎత్తు 41.15 మీటర్లుగా ప్రస్తావించారు.

నిర్వాసితులకు అందించిన సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు గురించి సమాధానమిస్తూ రిజర్వాయర్ ఫేజ్-1లో 41.15 మీటర్లకు గానూ 20,946 కుటుంబాలు నిర్వాసితులవుతున్నట్టు గుర్తించామని మంత్రి తెలిపారు.

అందులో ఫిబ్రవరి 2023 నాటికి 11,677 కుటుంబాలకు ప్యాకేజీ అందించామని తెలిపారు. మిగిలిన వారికి మార్చి నెలాఖరులోగా పూర్తి చేస్తామని కూడా వెల్లడించారు.

పునరావాసం అందించడంలో కొంత ఆలస్యం జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఎప్పటికప్పుడు సమీక్ష చేసి దానిని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మొత్తం 1,27,263 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 1,13,119 ఎకరాల భూమి సేకరించినట్టు తెలిపారు. మిగిలినది 2023 చివరి నాటికి సేకరిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్ట్

అసెంబ్లీలో సీఎం ఏమన్నారు..?

పార్లమెంటులో పోలవరం అంశం ప్రస్తావనకు వచ్చిన నాడే మార్చి 23న ఏపీ అసెంబ్లీలో కూడా పోలవరం అంశం మీద స్వల్పకాల చర్చ జరిగింది. ఈ చర్చకు సమాధానంగా చివరిలో సీఎం జగన్ మాట్లాడారు.

‘‘పోలవరం ప్రాజెక్టు ప్లాన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో కట్టాల్సి ఉంది. అది కట్టేస్తాం. మొదటి దశలో 41.15 మీటర్ల వరకూ నిల్వ ఉంచుతాం. డ్యామ్ సేఫ్టీ, సెక్యూరిటీ కోసం సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారమే వెళ్లాలి. ఒకేసారి డ్యామ్ నింపకూడదు. మూడేళ్లలో మూడు స్థాయిల్లో నీటిని నిల్వ ఉంచాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్ అండ్ ఆర్ అందించేందుకు టైమ్ వెసులుబాటు ఉంటుంది.

కేంద్రాన్ని రూ.15 వేల కోట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. అది అందిస్తే డ్యామ్ పూర్తి చేయడంతో పాటుగా 41.15 మీటర్ల ఎత్తు వరకూ అవసరమైన ఆర్ అండ్ ఆర్ అవసరాలకు కూడా సరిపోతుంది’’ అంటూ సీఎం చెప్పారు.

పూర్తి రిజర్వాయర్ స్థాయి వరకూ నీటిని నిల్వ ఉంచడానికి మూడేళ్ల సమయం పడుతుంది కాబట్టి, కొంత సమయం ఉంటుందని ఆయన అన్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లుగా ఉంటుందని మార్చి 27న కేంద్రం రాజ్యసభకు తెలిపింది. టీడీపీ ఎంపీ కనమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎత్తు తగ్గించే ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నీటి నిల్వ ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు.

1980 నాటి గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారమే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు ఉంటుందన్నారు . పోలవరం డ్యాం ఎఫ్‌ఆర్‌ఎల్‌ తగ్గింపునకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేసినట్టు సమాచారం లేదని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017-18 సంవత్సరాల లెక్కల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా 2019లో సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సీసీ) చేసిన సిఫార్సును జలశక్తి సలహా కమిటీ ఆమోదించినా ఆ తరువాత వేసిన కమిటీ ఆ మొత్తాన్ని తగ్గిస్తూ సిఫార్సు చేశాయని తెలిపారు.

దాంతో 23వ తేదీన లోక్ సభలో మొదటి దశ 41.15 మీటర్ల గురించి ప్రస్తావించగా, తాజాగా అందుకు విరుద్ధంగా అలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్రం పేర్కొంది.

పోలవరం ప్రాజెక్ట్

పోలవరం పరిస్థితి ఏమిటి?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చివరి సారిగా 2004లో శంకుస్థాపన జరిగింది. ఐదేళ్లలో దానిని పూర్తి చేయాలని నాడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రెండు దశాబ్దాలు పూర్తవుతోంది. కానీ, నేటికీ పనులు మూడొంతులు కూడా పూర్తికాలేదు.

డిసెంబర్ 2022 చివరి నాటికి వివిధ పనుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కి ఇచ్చిన లెక్క ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

హెడ్ వర్క్స్...

  • ఎర్త్ వర్క్ - 74.46%
  • కాంక్రీట్ - 81.71%
  • స్టీల్ - 79.79%

కుడివైపు ప్రధాన కాలువ

  • ఎర్త్ వర్క్ - 100 %
  • లైనింగ్ - 93.61%
  • స్ట్రక్చర్స్ - 83.92%

ఎడమవైపు ప్రధానకాలువ

  • ఎర్త్ వర్క్ - 91.8%
  • లైనింగ్ - 71.91%
  • స్ట్రక్చర్స్ - 40.13%

పునరావాసం

  • ఆర్ అండ్ ఆర్ - 53.98%

2020, 21 సంవత్సరాల్లో వచ్చిన వరదల కారణంగా డయా ఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. స్పిల్ వే కూడా సిద్ధమయ్యింది.

కానీ, కీలకమైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తి కాకుండా నీటి నిల్వ సాధ్యం కాదు. నీటిని నిల్వ చేసేందుకు గానూ తొలుత డ్యామ్ నిర్మాణం జరగాలి. అదే సమయంలో ఆర్ అండ్ ఆర్ అందించాల్సి ఉంటుంది. దానికి అవసరమైన నిధులు అందించేందుకు పెరిగిన ధరలకు అనుగుణంగా డీపీఆర్ సవరించాలని ఏపీ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. కానీ కేంద్రం నుంచి సానుకూలత రాలేదు.

2023 ఫిబ్రవరి 20 నాటికి ఏపీ ప్రభుత్వం నుంచి రూ.3,779.5 కోట్ల రీయంబర్స్ మెంట్ కోసం బిల్స్ పంపించగా తాము రూ.3,431.59 కోట్లు రీయంబర్స్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ఆర్ అండ్ ఆర్ పేరుతో రూ.2,110.23 కోట్లు అందించామని కూడా వివరించింది.

ఇప్పుడు అనుమానాలు ఎందుకు?

పోలవరం ప్రాజెక్ట్

ఇప్పటికే గడువుల మీద గడువులు ముగుస్తున్నా పోలవరం పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి బ్యారేజ్ స్థాయిని మార్చేస్తున్నారనే విమర్శలు విపక్షం నుంచి వినిపిస్తున్నాయి. దానివల్ల పోలవరం లక్ష్యం దెబ్బతింటుందని ఏపీ జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా అంటున్నారు.

"రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు జాప్యం చేసి పోలవరం పరిస్థితి సందిగ్దంలోకి నెట్టింది జగన్ ప్రభుత్వమే. పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ మీద రూ.912 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం జీవో ఇచ్చారు. పోలవరం డ్యామ్‌ను 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారు. అంటే పోలవరం ప్రాజెక్ట్‌ను బ్యారేజ్‌గా మార్చేస్తున్నట్టే. ప్రజల ఆశలను తుంచేస్తున్నట్టే. రైతుల నమ్మకం మీద నీళ్లు జల్లుతున్నట్టే. ఇదంతా ఈ ప్రభుత్వ వైఫల్యమే" అంటూ దేవినేని ఉమా విమర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు నెరవేర్చాలని ఆశిస్తుంటే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమా బీబీసీతో అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో రాజీపడటం ప్రమాదకరమన్నారు.

‘అపోహలు అవసరం లేదు...’

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారనే ప్రచారం అపోహలు మాత్రమేనని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

‘‘రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వదలచుకున్నాం. పోలవరం డ్యామ్ ఎత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేది లేదు. నిబంధనల ప్రకారం 45.7 మీటర్ల ఎత్తులో ప్రధాన డ్యామ్ ఉంటుంది. డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంలో గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పిదాల వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణం ఆలస్యమవుతోంది.

నీటి నిల్వ విషయంలో కూడా సీడబ్ల్యూసీ నిబంధనలకు అనుగుణంగా దశల వారీగా జరుగుతుంది. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ ఉంచే స్థితికి తీసుకొస్తాం. డ్యామ్ ఎత్తు తగ్గిస్తున్నారనేది అపోహ మాత్రమే’’ అని వైఎస్ జగన్ అన్నారు.

‘‘అంత సులువు కాదు’’

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ప్రధాన డ్యామ్ నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి అనేక కారణాలున్నాయని రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్ ఆర్.రామేశ్వర రావు అన్నారు.

"వరుసగా ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుని ప్రచారం కోసమే వాడుతున్నారు. పూర్తి చేసేందుకు చిత్తశుద్ధి చూపడం లేదు. జాతీయ హోదా ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న జాప్యానికి నిధుల లేమి ప్రధాన కారణం. అలసత్వం కూడా కనిపిస్తోంది. కాఫర్ డ్యామ్‌లు పూర్తి కాకముందే డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి పూనుకోవడం సరైనది కాదు. అయినా పోలవరంలో అలా జరిగింది. ఇప్పుడు డిజైన్లు మార్చే ప్రయత్నం జరగకూడదు. మెయిన్ డ్యామ్ ఎత్తు 45.72 మీటర్లకు తగ్గకూడదు" అని ఆయన అన్నారు.

ఏ ప్రాజెక్టులోనయినా ఒకే సారి పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంచడం సాధ్యం కాదని, దశల వారీగా జరుగుతుందనే మాట వాస్తవమే గానీ 41.15 మీటర్ల వరకే పునరావాసం, మెయిన్ కెనాల్ కోసం లిఫ్ట్ స్కీమ్ ప్రతిపాదించడం వంటివి అనుమానాలకు కారణమవుతున్నాయని రామేశ్వరరావు అన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా శ్రద్ధ పెట్టాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)