ఆంధ్రప్రదేశ్: అంబానీ, అదానీల సౌరవిద్యుత్ ప్రాజెక్టుల కోసం 1.25 లక్షల ఎకరాలు ఇవ్వగలరా?

జగన్, ముకేశ్ అంబానీ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది.

అక్కడ జరిగిన ఒప్పందాల్లో 70శాతం రెన్యూవబూల్ ఎనర్జీ రంగానికి చెందినవి. అందులోనూ సోలార్ విద్యుత్‌దే మెజారిటీ వాటా.

సోలార్ విద్యుత్ రంగంలోనే 38 గిగావాట్లు మేరకు ఒప్పందాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.

ఒక మెగావాట్ సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే సుమారు 5 ఎకరాల భూమి కావాలని కేంద్రప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది.

మరి ఆ లెక్కన 38 గిగా వాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి ఎంత భూమి కావాలి? అంత భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉందా?

ఇవి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు.

సోలార్ ప్యానళ్లు

ఇప్పుడొక లెక్క చూద్దాం...

ఒక మెగావాట్‌ సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి సుమారు 5 ఎకరాలు కావాలి. ఇది కూడా క్రిస్టలీన్ సిలికాన్ టెక్నాలజీ వాడితేనే.

ఒకవేళ థిన్ ఫిలిం టెక్నాలజీ సోలార్ ప్యానెళ్లు వాడితే సుమారు 7 ఎకరాలు కావాల్సి ఉంటుంది.

1 గిగావాట్= 1,000 మెగావాట్స్

1,000 x 5= 5,000 ఎకరాలు

అంటే ఒక గిగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి 5వేల ఎకరాల భూమి కావాలి.

ప్రభుత్వం చెబుతున్న ప్రకారం సోలార్ ఎనర్జీ రంగంలో 38 గిగావాట్ల ఒప్పందాలు జరిగాయి.

పైన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే...

38x5,000= 1,90,000

అంటే 38 గిగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1.90 లక్షల ఎకరాల భూమి కావాలి.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అంబానీ ఏపీ ప్రభుత్వంతో 10 గిగావాట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.

10x 5,000= 50,000

అంటే ఒక్క అంబానీ సోలార్ పవర్ ప్రాజెక్టులకే 50 వేల ఎకరాలు కావాలి.

మరి ఇంత భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉందా?

సోలార్ పవర్ ప్లాంట్

ఫొటో సోర్స్, Adani Group/Facebook

ఫొటో క్యాప్షన్, రాయలసీమలో అదానీ కంపెనీ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇప్పటికే ఉన్నాయి.

‘‘రైతుల నుంచి సేకరిస్తాం’’

రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వం వివిధ జిల్లాల్లో ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేసింది.

ఇలా మొత్తం 46 వేల 555 ఎకరాలు భూమిని పరిశ్రమల కోసం ప్రభుత్వం ఉంచింది. అంటే ఈ భూమి ముకేశ్ అంబానీ సంస్థలకు మాత్రమే సరిపోతుంది.

అదానీ గ్రూప్ 15 గిగా వాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. అంటే అదానీకి 75,000 ఎకరాలు కావాలి.

అంబానీ, అదానీ పోను ఇంకా 13 గిగా వాట్ల ఉత్పత్తికి భూములు అంటే 65,000 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుంది.

సోలార్ ఎనర్జీని తయారు చేసే కంపెనీలకు కావాల్సిన భూమిని రైతుల నుంచి సేకరించి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు.

‘‘రైతులతో ఒప్పందాలు చేసుకుంటాం. సోలార్ పవర్ ప్లాంట్స్ నిర్మాణానికి భూమి అసవరం చాలా ఎక్కువ.

ఇప్పటికే ప్రభుత్వం వద్ద పారిశ్రామిక అవసరాల కోసం ఉన్న భూమి కాకుండా సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం భూమిని రైతుల వద్ద నుంచి సేకరించే పనిలో ఉంది.

నిరుపయోగమైన భూమి లభ్యత ఎక్కువగా ఉన్న రాయలసీమలో ఇప్పటికే లక్ష ఎకరాల పైగా భూమిని గుర్తించాం.

ప్రకాశంలో 9,630 ఎకరాలు, అనంతపురంలో 29,983 ఎకరాలు, కడప జిల్లాలో 29,549 ఎకరాలు, కర్నూలులో 31,450 ఎకరాలు ఇలా మొత్తం 1,00612 ఎకరాలు భూమిని ప్రభుత్వం గుర్తించింది.

రాయలసీమలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు, రైతులు ముందుకొచ్చి రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి భూమి ఇస్తే తీసుకుంటాం. దానికి లీజు ధర కూడా చెల్లిస్తాం.

ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తిదారులకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తుంది. ఏటా రూ. 31 వేలు భూ యాజమానులకు చెల్లిస్తాం. ప్రతి ఐదేళ్లకు 5 శాతం చొప్పున్న లీజు ధరను పెంచుతారు.

ఇలా క్రమంగా 5 లక్షల ఎకరాలను తొలి దశలో లీజుకు తీసుకుంటాం.

ప్రభుత్వం వద్ద ఉన్న ల్యాండ్ బ్యాంక్‌తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పరిశ్రమల కోసం ప్రభుత్వం రైతులతో చేసుకుంటున్న ఒప్పందాల ద్వారా కూడా భూమి లభ్యమవుతుంది.

అందువల్ల సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చే క్రమంలో భూమి లభ్యత సమస్య కాదు” అని మంత్రి తెలిపారు.

“ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ.5 కోట్ల పెట్టుబడి అవసరమవుతుంది.

సౌకర్యాలు, మానవ వనరులతో ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ నిర్మించాలంటే రెండు నుంచి 4 నెలల సమయం పడుతుంది’’ అని సోలార్ విద్యుత్ రంగంలో పదిహేనేళ్ల అనుభవం ఉన్న శివకుమార్ బీబీసీతో చెప్పారు.

గుడివాడ అమర్నాథ్

‘‘125 గిగావాట్లకు పెంచాలనే లక్ష్యం’’

ప్రస్తుతం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం (Installed Renewable Energy Capacity) 10.8 గిగావాట్లు. ఇందులో సోలార్ విద్యుత్ వాటా 4.5 గిగావాట్లు.

రాష్ట్ర సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 33 గిగావాట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2025 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 125 గిగావాట్లకు పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.

ఉత్పత్తయ్యే సోలార్ విద్యుత్‌ను స్టోర్ చేసేందుకు ఇంటిగ్రేటేడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ (ఐఆర్ఈఎస్పీ)ను కర్నూలులో నిర్మిస్తున్నారు.

దీని స్టోరేజ్ సామర్థ్యం 5,230 మెగావాట్లు అయితే, అందులో సోలార్ విద్యుత్ సామర్థ్యం 3 వేల మెగావాట్లు.

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు అని ప్రభుత్వం చెబుతోంది.

2015లో రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 279 మెగావాట్లు కాగా, ఇప్పుడది 4,390.48 మెగావాట్లకు చేరింది.

2020లో రాష్ట్రంలో సౌర విద్యుత్‌ సామర్థ్యం 3,744 మెగా వాట్లుగా ఉంది. దీనితో పాటు సోలార్‌ రూఫ్‌టాప్‌ ఇన్‌స్టలేషన్‌లతో కలిపి ప్రస్తుతం అది 4,390 మెగావాట్లకు చేరింది.

“2030 నాటికి థర్మల్‌ విద్యుత్‌ను 32 శాతానికి తగ్గించాలని, కర్బన ఉద్గారాలను 2070 నాటికి జీరోకి తేవాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. దీంతో అందరి దృష్టి సంప్రదాయ ఇంధన వనరులపై పడింది. ఇది వ్యాపారవేత్తలకు ఒక అవకాశం.

ప్రభుత్వాలు కూడా పర్యావరణానికి అనువైన వనరులని వాడి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో జరిగిన ఒప్పందాల్ని వాస్తవరూపంలోకి తీసుకురాగలిగితే అది పెద్ద మలుపే అని చెప్పవచ్చు” అని ఏయూ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ మాజీ ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)