వెర్టిగో : కళ్లు మసకబారి, తల తిరుగుతూ, చెవుల్లో ధ్వనులు వినిపిస్తున్నాయా?

వెర్టిగో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మేఘన్ లాటన్, పోలీ బేఫీల్డ్
    • హోదా, బీబీసీ న్యూస్‌బీట్

వెర్టిగో అంటే కేవలం హైట్ ఫోబియానే అనుకుంటారు. కానీ చాలా లక్షణాల్లో అదొకటి.

వెర్టిగో ఉన్నట్టుండి అలజడి రేపుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలు కదిలిపోతున్నట్టు.. తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది.

22 ఏళ్ల లియాన్నె బక్స్‌కి వెర్టిగో గురించి బాగా తెలుసు. ఆమెకు అలా ఎందుకు జరుగుతుందో కచ్చితమైన కారణం తెలియదు. కానీ, 14 ఏళ్లుగా ఆమె ఆ బాధను అనుభవిస్తున్నారు.

నిల్చొని ఉన్నప్పుడు ఏదో జరుగుతుందని అనిపిస్తుంటుంది. ఆమెకు ప్రతిరోజూ ఇలాంటి అనుభవం ఎదురవుతుంది.

''ఫిల్మింగ్, ఫొటో షూట్‌లతో ఎక్కువ సేపు గడపాల్సి ఉంటుంది. అది నా పనిలో భాగం. అందువల్ల రోజులో ఎక్కువ సేపు నిల్చుని ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను తరచుగా విశ్రాంతి తీసుకోవాలని అర్థమైంది '' అని ఆమె బీబీసీ న్యూస్ బీట్‌తో చెప్పారు.

తన సహోద్యోగులు తనకు సహకరిస్తారని, కానీ అది చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆమె అన్నారు.

'' నేను చాలా బ్రేక్స్ తీసుకుంటాను. నేను నా ఇరవైల్లో ఉన్నాను. ఇదే నా జీవితంలో అత్యంత విలువైన సమయం. ఇలా ఎందుకు జరుగుతోందని ఆలోచిస్తుంటాను''

ఒక రోజు చీకటి గదిలో అమాంతం పడిపోతున్నట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకున్నానని లియాన్నె చెప్పారు.

''కళ్లకు అంతా తెల్లగా కనిపిస్తుంది. చెవుల్లో ఏవో మాటలు గిర్రున తిరుగుతుంటాయి. ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది'' అని ఆమె చెప్పారు.

లియాన్నె

ఫొటో సోర్స్, LEANNE BUCK

ఫొటో క్యాప్షన్, లియాన్నె

వెర్టిగో నుంచి తప్పించుకోవడానికి లియాన్నె ఆల్కహాల్, కెఫేన్ నుంచి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేశారు.

కెల్లి బాయ్సన్‌ది కూడా ఇలాంటి సమస్యే. ఆమె ఎనిమిదేళ్లుగా వెర్టిగోతో బాధపడుతున్నారు.

మెనియర్స్ వ్యాధి కారణంగా ఆమెకు వెర్టిగో సమస్య మొదలైంది. మెనియర్స్ అంటే చెవి లోపలి భాగం ( ఇన్నర్ ఇయర్ )లో తలెత్తే అనారోగ్య సమస్య. దాని కారణంగా తల తిరిగిపోతున్నట్లు అనిపిస్తుందని కెల్లీ తెలిపారు.

‘‘వెర్టిగోతో చాలా ఇబ్బంది. అది కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. చుట్టూ తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. దాని నుంచి బయటికి వచ్చే వరకూ కనీసం నడవలేం. కంటిచూపు కూడా మసకబారుతుంది. దాన్ని ఆపేందుకు ఏమీ చేయలేం. వెయిట్ చేయడం తప్ప'' అని కెల్లీ తెలిపారు.

వెర్టిగో ఫలితంగా కెల్లీ తన వినికిడి శక్తిని కోల్పోయారు.

వెర్టిగో కారణంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. లండన్‌లో అండర్‌గ్రౌండ్‌లో గోడను పట్టుకుని అలా నిల్చుండిపోయానని, మద్యం తాగి ఉన్నాననుకుని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆమె గుర్తు చేసుకున్నారు.

కెల్లీ

ఫొటో సోర్స్, KELLY BOYSON

వెర్టిగో వస్తే ఏం చేయాలి?

వెర్టిగో ఎఫెక్ట్ కొన్ని సెకన్లు, లేదా నెలల పాటు కూడా ఉండొచ్చని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది.

తల తిరిగిపోతున్నట్టు ఉండటం, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు.

వ్యాధి తీవ్రతను బట్టి వైద్యసాయం అవసరవుతుందని సంబంధిత విభాగ నిపుణులు, ప్రొఫెసర్ సిమన్ లాయిడ్ తెలిపారు. తీవ్రమైన ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఒక గదిలోకి వెళ్లిపోవడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. సిమన్ లాయిడ్ బ్రిటిష్ అటొలాజికల్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

'' వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే అప్రమత్తత అవసరం. అది ఉత్తమ వైద్య సాయం పొందేందుకు సాయపడుతుంది'' అని లాయిడ్ అన్నారు.

జార్జ్ ఎజ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జార్జ్ ఎజ్రా

వెర్టిగో గురించి భయపడాల్సిన అవసరం లేదు. అందుకు తగిన వైద్య సాయం అందించే వాళ్లు ఉన్నారని ది బ్రెయిన్ చారిటీకి చెందిన న్యూరో వైద్య నిపుణుడు ననెట్ మెల్లర్ అన్నారు.

వైద్యుడిని సంప్రదించి అది ఎందుకు వస్తుందో కారణం తెలుసుకోవాలన్నారు.

''చెవి లోపల ఇన్ఫెక్షన్ లేదా మైగ్రెయిన్స్ కారణంగా వెర్టిగో వచ్చే అవకాశం ఉంది'' అని మెల్లర్ చెప్పారు.

కొన్నివారాల కిందట వెర్టిగో తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో బ్రిటిష్ మ్యుజీషియన్ జార్జ్ ఎజ్రా లండన్‌లో తన ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు. ఆయనకు మద్దతుగా ఎంతో మంది సందేశాలు పంపినప్పటికీ ఆయన వెళ్లలేకపోయారు.

''మ్యూజిక్ కాన్సర్ట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూసిన ప్రేక్షకుల ఫ్రస్ట్రేషన్‌ను అర్థం చేసుకోగలనని, కానీ వెర్టిగో తనను తీవ్రంగా ఇబ్బందిపెట్టింది'' అని జార్జ్ వివరణ ఇచ్చారు.

''గది మొత్తం తిరిగిపోతున్నట్టుగా అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వడం ఎవరికైనా సాధ్యమా? అలా ఎవరికీ జరగకూడదు'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)