క్యాండిడా ఆరిస్ : అమెరికా ఆసుపత్రులను గజగజ వణికిస్తున్న ఈ సూపర్‌బగ్ ఏమిటి?

క్యాండిడా ఆరిస్

ఫొటో సోర్స్, Getty Images

ఔషధాలకు లొంగని మొండి ఫంగస్ క్యాండిడా ఆరిస్ (సి. ఆరిస్)ను 15 ఏళ్ల క్రితమే తొలిసారిగా వైద్యులు గుర్తించారు. కానీ, నేడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆసుపత్రులను ఇది భయపెడుతోంది.

ఒకసారి ఇది శరీరంలోకి ప్రవేశిస్తే, ఈస్ట్ తరహాలో పనిచేసే ఈ ఫంగస్ రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థలు, అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకినవారిలో మరణాల రేటు 30 నుంచి 53 శాతం వరకు ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేస్తోంది.

ఇక్కడ ఆందోళనకర అంశం ఏమిటంటే.. ప్రస్తుతం అందుబాటులోనున్న సాధారణ యాంటీఫంగల్ ఔషధాలను తట్టుకొని ఈ ఫంగస్ నిలబడుతోంది. ఈ ఫంగస్‌లో కొన్ని రకాలపై ఏ ఔషధాలూ పనిచేయడంలేదని వైద్యులు చెబుతున్నట్లు బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గల్లఘెర్ వివరించారు.

30కిపైగా దేశాల్లో ఈ ఫంగస్ వ్యాపిస్తోందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేస్తోంది. 2009 నుంచి 2019 మధ్య ఈ ఫంగస్ కేసులు 4,750 ప్రపంచ వ్యాప్తంగా నమోదైనట్లు 2020లో నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.

క్యాండిడా ఆరిస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఆసుపత్రుల్లో 2020, 2021ల్లో ఈ ఫంగస్ ప్రమాదకర స్థాయిలో వ్యాపించిందని కొత్తగా సేకరించిన సమాచారం చెబుతోందని ఈ ఏడాది మార్చి 20న సీడీసీ వెల్లడించింది. ఆసుపత్రుల నుంచి వచ్చిన కేసులు 2019లో 476 ఉండగా, 2021లో ఇవి 1,471కు పెరిగినట్లు తెలిపింది.

క్యాండిడా ఆరిస్ ఇన్ఫెక్షన్‌లు వేగంగా విస్తరించడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా సాయం చేస్తున్నాయని 2019లో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.

ఈ ప్రాణాంతక సూపర్‌బగ్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాండిడా ఆరిస్

ఫొటో సోర్స్, Getty Images

క్యాండిడా ఆరిస్ అంటే ఏమిటి?

క్యాండిడా ఆరిస్ (సి. ఆరిస్) అనేది ఫంగస్ వర్గానికి చెందిన ఒక ఈస్ట్. నిజానికి ఇలాంటి ఫంగస్‌లు రొట్టెలు, బీర్‌ల తయారీలో ఉపయోగపడుతుంటాయి. అదే సమయంలో వీటిలో కొన్ని మనుషుల్లో ఇన్ఫెక్షన్లకు కూడా కారణం అవుతుంటాయి.

తరచూ కనిపించే ఇలాంటి ఇన్ఫెక్షన్లలో క్యాండిడా ఆల్బికన్స్ కూడా ఒకటి. దీని వల్ల థ్రష్ లాంటి నోటి ఇన్ఫెక్షన్‌లు వస్తాయి. అయితే, ఒక్కోసారి ఇవి తీవ్రంగా కూడా మారుతుంటాయి.

సి. ఆరిస్‌ను తొలిసారిగా 2009లో టోక్యో మెట్రోపాలిటన్ జేరియాట్రిక్ హాస్పిటల్‌లోని ఒక రోగి చెవిలో వైద్యులు గుర్తించారు. అందుకే దీని పేరులోనూ ఆరిస్ అనే పదం కనిపిస్తుంది. దీనికి లాటిన్‌లో చెవి అనే అర్థముంది.

క్యాండిడా ఈస్ట్‌లు మన చర్మంపై కనిపిస్తుంటాయి. సాధారణంగా వీటి వల్ల ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ, మనం ఏదైనా అనారోగ్యానికి గురైనా లేదా రక్త ప్రవాహం, ఊపిరితిత్తుల్లోకి ఇవి ప్రవేశించినా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.

క్యాండిడా ఆరిస్

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి?

సి. ఆరిస్ వల్ల ఎక్కువగా రక్త ప్రసరణకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అయితే, శ్వాస, నాడీ వ్యవస్థలతోపాటు అంతర్గత అవయవాలు, చర్మంపైనా ఇది ప్రభావం చూపించగలదు.

ఈ ఇన్ఫెక్షన్లు చాలా తీవ్రంగా ఉంటాయి.

సాధారణ ఔషధాలు దీనిపై పనిచేయవు. దీంతో చికిత్స చాలా కష్టం అవుతుంటుంది.

‘‘అన్నింటికంటే పెద్ద సమస్య ఏమిటంటే, మన దగ్గరున్న ఔషధాలకు ఈ ఫంగస్ లొంగడం లేదు’’అని బ్రిటన్‌లోని పోర్ట్‌మౌత్ యూనివర్సిటీలోని మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్, డాక్టర్ టీనా జోషి చెప్పారు.

‘‘ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సి. ఆరిస్ ఇన్ఫెక్షన్‌ను ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా వైద్యులు పొరబడుతుంటారు. ఫలితంగా వేరే చికిత్సలు దీనిపై ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల ఎలాంటి ప్రభావమూ కనిపించదు’’అని ఆమె వివరించారు.

అంటే, రోగులు మరిన్ని ఎక్కువ రోజులు అనారోగ్యంతో జీవించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు దీని వల్ల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రం కూడా అవుతుంది.

క్యాండిడా ఆరిస్

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఎలా వ్యాపిస్తోంది?

ఆసుపత్రుల్లో కలుషిత వాతావరణం వల్ల ఎక్కువగా ఈ ఫంగస్ వ్యాపిస్తుంది. రక్తం, ఇతర ద్రవాలు ఎక్కించే గొట్టాలు, లేదా రక్తపోటును పరిశీలించే మెషీన్లకు ఇది ఎక్కువగా అంటిపెట్టికుని ఉంటుంది. వీటిని శుభ్రం చేయడం చాలా కష్టమని యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన ట్రాపికల్ డిసీజెస్ హాస్పిటల్‌లోని ఫంగల్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ నీల్ స్టోన్ చెప్పారు.

ఈ ఫంగస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆ వార్డును పూర్తిగా సీల్ చేయాల్సి ఉంటుంది.

‘‘అత్యంత ఆందోళనకు గురిచేస్తున్న ఫంగస్‌ ఇది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే, మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లు’’అని డాక్టర్ స్టోన్ వివరించారు.

‘‘మొత్తంగా ఆసుపత్రులే మూతపడే పరిస్థితికి ఇది కారణం కాగలదు’’అని ఆయన అన్నారు.

అమెరికాలో ఈ ఫంగస్ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్నట్లు మార్చి 20న విడుదలచేసిన ఒక ప్రకటనలో సీడీసీ హెచ్చరించింది.

క్యాండిడా ఆరిస్

ఫొటో సోర్స్, Getty Images

సోకే ముప్పు ఎవరికి ఎక్కువ?

రోజువారీ పనులు చేసుకున్నప్పుడు సి. ఆరిస్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.

అయితే, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు గడపాల్సి వచ్చినా లేదా ఏదైనా నర్సింగ్ హోమ్‌లో ఎక్కువ సేపు ఉండాల్సి వచ్చినా లేదా ఇంటెన్సివ్ కేర్‌లో గడుపుతున్న రోగులతోపాటు ఉండాల్సి వచ్చినా ఈ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువ అవుతుందని సీడీసీ చెబుతోంది.

మీరు యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా వాడుతున్నా ఈ సూపర్‌బగ్ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మందులు సి. ఆరిస్‌పై పోరాడే మంచి బ్యాక్టీరియానూ నాశనం చేస్తాయి.

వీడియో క్యాప్షన్, కృత్రిమ అవయవాలతో స్పర్శ ఎలా కలుగుతుంది?

ఔషధాలకు తట్టుకొని ఎలా నిలబడుతోంది?

సి. ఆరిస్‌లో చాలా రకాలు సాధారణ యాంటీఫంగల్ ఔషధాలైన ఫ్ల్యూకనాజోల్ లాంటి ఔషధాలకు తట్టుకొని నిలబడుతున్నాయి.

అంటే ఈ ఔషధాలు సి. ఆరిస్‌పై పనిచేయడం లేదు. అందుకే కొన్ని అరుదైన ఔషధాలను దీనిపై వాడుతున్నారు. కానీ, ఇప్పుడు ఆ ఔషధాలను తట్టుకొని కూడా సి. ఆరిస్ నిలబడగలుగుతోంది.

డీఎన్ఏ విశ్లేషణలో సి. ఆరిస్‌లో యాంటీఫంగల్ రెసిస్టెన్స్ జీన్స్ కనిపించాయి. సాధారణంగా ఇలాంటి జన్యువులు సి. ఆల్బికన్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

అంటే ఔషధాలను తట్టుకొని నిలబడగలిగే జన్యువులు ఒక ఫంగస్ నుంచి మరొక ఫంగస్‌కు బదిలీ అయినట్లు దీని ద్వారా తెలుస్తోంది.

వాతావరణ మార్పులు కూడా కారణమా?

వాతావరణ మార్పుల వల్ల అధిక ఉష్ణోగ్రతలకు ఈ ఫంగస్‌లు అలవాటు పడుతున్నాయని, అందుకే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీకి చెందిన ఎంబయో జర్నల్‌లో 2019లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది.

సాధారణంగా ఫంగస్‌లు మట్టిలోని శీతల వాతావరణానికి అలవాటు పడుతుంటాయి. కానీ, వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరగడంతో కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఇవి మారుతున్నాయి.

ఫలితంగా 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలుంటే మన శరీరం లోపల పరిస్థితుల్లో మనుగడ సాగించడం వీటికి తేలిక అవుతోంది.

వీడియో క్యాప్షన్, దేశంలో గుండెపోట్లు పెరిగాయా? దీనికి కోవిడ్‌కు సంబంధం ఉందా?: వీక్లీ షో విత్ జీఎస్

ఇన్ఫెక్షన్లు తగ్గించాలంటే ఏం చేయాలి?

ఇన్ఫెక్షన్ల సంఖ్యను తగ్గించాలంటే మొదటగా సి.ఆరిస్ ఇన్ఫెక్షన్‌ సోకే ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి.

‘‘ఈ ఫంగస్‌పై పరిశోధనలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ విషయంలో మనం వేగం పెంచాలి’’అని డాక్టర్ జోషి అన్నారు.

ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో ఎక్కువ సమయం గడిపేవారితోపాటు వ్యాధి నిరోధక సమస్యలు ఉండేవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని మొదటగా వైద్యులకు అవగాహన కల్పించాలి.

మరోవైపు సి. ఆరిస్‌ను గుర్తించడంలోనూ అవగాహన అవసరం. కొన్నిసార్లు థ్రష్ లాంటి ఇతర ఇన్ఫెక్షన్లతో దీన్ని పొరబడుతున్నారు. ఫలితంగా సరైన చికిత్స అందించడం ఆలస్యం అవుతోంది.

అయితే, అన్నింటికంటే ముందుగా ఈ ఇన్ఫెక్షన్‌ను అడ్డుకునేందుకు నియంత్రణ చర్యలను మెరుగ్గా తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ జోషి వివరించారు.

‘‘దీనికి చికిత్స అందించడం ఎంత కష్టమో, రోగుల పరిస్థితిని ఇది ఎలా దిగజారుస్తోందో మనం చూస్తున్నాం. అందుకే ఇన్ఫెక్షన్ నియంత్రణపైనే మొదట మనం దృష్టిపెట్టాలి’’అని జోషి చెప్పారు.

‘‘డిస్‌ఇన్ఫెక్టెంట్లతో ఆసుపత్రులను తరచూ శుభ్రం చేయాలి’’అని జోషి సూచించారు.

ప్రమాదకర ఫంగస్ ఇది ఒకటేనా?

కాదు. ప్రమాదకర ఫంగస్‌ల జాబితాను గత అక్టోబరులో డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసింది. దీనిలో మన ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పులను తెచ్చిపెట్టే 19 ఫంగస్‌లు ఉన్నాయి.

దీనిలోని ‘‘క్రిటికల్ ప్రయారిటీ’’ గ్రూపులోని నాలుగు ఫంగస్‌లలో సి.ఆరిస్ కూడా ఒకటి. ఇవి మన దగ్గర అందుబాటులోనున్న చాలా ఔషధాలకు తట్టుకొని మనుగడ సాగించగలుగుతున్నాయి.

లీనా సిరిక్, జేమ్స్ గల్లఘెర్‌ల సాయంతో ఈ కథనం రాశాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)