అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, BBC / DARREN CONWAY

    • రచయిత, పాల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ డిప్లమాటిక్ కరస్పాండెంట్

అమెరికా రక్షణ విభాగానికి చెందిన డజన్లకొద్దీ కీలక డాక్యుమెంట్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మ్యాప్‌లు, చార్ట్‌లు, ఫోటోలు కూడా కనిపిస్తున్న ఈ పత్రాల్లో ఏముంది?

ఎప్పుడు ఏం జరిగిందో చెప్పే టైమ్‌లైన్లు, కొన్ని సైనిక కోడ్ భాషల పదాలు కనిపిస్తున్న ఈ పత్రాల్లో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన కొన్ని కీలకమైన వివరాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ‘‘టాప్ సీక్రెట్లు’’ కూడా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

రెండు వైపులా ఇప్పటివరకు ఎంత మంది మరణించారు? ఏ ప్రాంతాలు దాడులకు అనువుగా ఉన్నాయి? ఎవరి శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? లాంటి వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయి.

అయితే, డైనింగ్ టేబుల్‌ పైనుంచి ఫోటోలు తీసినట్లుగా కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్లలో వివరాలను ఎంతవరకు నమ్మొచ్చు? అసలు ఇప్పటివరకు మనకు తెలియని వివరాలు వీటిలో ఏమున్నాయి?

ట్యాంకర్‌ దాడి

ఫొటో సోర్స్, Reuters

అతిపెద్ద లీక్

14 నెలల క్రితం రష్యా దాడితో యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా సైన్యం నుంచి బయటకువచ్చి అతిపెద్ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ ఇది. వీటిలో కొన్ని డాక్యుమెంట్లు ఆరు వారాల క్రితం రూపొందించినవి కూడా కనిపిస్తున్నాయి. అయితే, వీటిలో చాలా కీలకమైన సమాచారం ఉంది.

ఆ డాక్యుమెంట్లు నిజమైనవేనని పెంటగాన్ అధికారులు కూడా చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

వీటిలో ఒక డాక్యుమెంట్లో చెప్పిన వివరాలు మరో డాక్యుమెంట్‌లో వివరాలతో పూర్తి భిన్నంగా ఉన్నాయి. అయితే, దాదాపు వంద డాక్యుమెంట్లలో ఇది పెద్ద విషయం కాకపోవచ్చు.

వాటిలో 20కిపైగా డాక్యుమెంట్లను బీబీసీ పరిశీలించిం. వీటిలో యుక్రెయిన్‌కు అందిస్తున్న పరికరాలు, సైనికుల శిక్షణకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. మరికొన్ని వారాల్లో మొదలుకాబోతున్న కొత్త దాడుల వ్యూహంలో భాగమైన కొన్ని బ్రిగేడ్ల వివరాలూ కూడా వీటిలో ఉన్నాయి.

ఆ బ్రిగేడ్లు ఎప్పుడు సిద్ధం అవుతాయి? ఏమేం ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఇతర సైనిక సామగ్రి అందుబాటులో ఉన్నాయో కూడా పత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలావరకు యుక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందించినవే ఉన్నాయి.

‘‘అయితే, ఈ సైనిక సామగ్రి అందించడం ఆలస్యమైతే, క్షేత్ర స్థాయిలో శిక్షణ, సన్నద్ధతపై ప్రభావం పడొచ్చు’’ అని పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

ఒక మ్యాప్‌లో క్షేత్రస్థాయిలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో టైమ్‌లైన్ కూడా ఇచ్చారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో తూర్పు యుక్రెయిన్‌లో క్షేత్ర స్థాయి పరిస్థితులు ఎలా ఉంటాయో వీటిలో అంచనా వేశారు.

కొన్ని వారాల ముందువరకు కొనసాగిన శీతాకాలం యుక్రెయిన్ వైమానిక దళానికి ఒక పరీక్షలా కొనసాగింది. ఆ తర్వాత యుక్రెయిన్ వైమానిక సామర్థ్యం ఎలా ఉంది అనే దానిపై పత్రాల్లో అంచనాలు ఉన్నాయి. పౌరులతోపాటు కీలకమైన మౌలిక సదుపాయాలు, ఫ్రంట్ లైన్ బలగాలను ఎలా కాపాడాలో వ్యూహాలున్నాయి.

ఈ లీకైన డాక్యుమెంట్లలో యుక్రెయిన్ సైన్యంతోపాటు అమెరికా మిత్రపక్షాల వివరాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో మొదలుపెట్టి దక్షిణ కొరియా వరకు యుక్రెయిన్‌పై ఎలాంటి చర్చలు జరిపాయి? అనే వివరాలతోపాటు కొన్ని సున్నితమైన అంశాల వివరాలు కూడా వీటిలో ఉన్నాయి.

వీటిలో కొన్ని డాక్యుమెంట్లను టాప్ సీక్రెట్‌గా మార్క్ చేశారు. మరికొన్నింటిని కేవలం అమెరికాకు అత్యంత మిత్రపక్షాలైన దేశాల నిఘా విభాగాలకే చూసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు.

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

వీటిలో కొత్త వివరాలు ఏమిటి?

వీటిలో చాలా వివరాలు చాలా మందికి తెలిసినవే. అయితే, ఆ వివరాలన్నీ ఇక్కడ ఒకేచోట కనిపిస్తున్నాయి.

ఉదాహరణకు మృతుల వివరాలు తీసుకోండి. యుద్ధంలో మరణించిన లేదా గాయపడిన రష్యా సైనికుల సంఖ్య 1,89,500 నుంచి 2,23,000 వరకు ఉండొచ్చని అమెరికా అంచనా వేయడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇక్కడ యుక్రెయిన్‌లో మృతులు లేదా గాయపడిన వారి సంఖ్యను 1,24,500 నుంచి 1,31,000గా పేర్కొన్నారు. ఈ గణాంకాలు ఇటీవల జర్నలిస్టులకు అందించిన వివరాలతో సరిపోలుతున్నాయి.

అయితే, ఈ రెండు వివరాల్లోనూ గణాంకాలపై పత్రాల్లో సందేహాలు వ్యక్తంచేశారు. ఎందుకంటే కొన్నిచోట్ల సమాచారం సేకరించడంలో లోపాలు, మరికొన్ని చోట్ల గణాంకాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

అయితే, యుక్రెయిన్ వైపు ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నట్లుగా చూపించేందుకు ఈ లీకైన డాక్యుమెంట్లలో కొన్ని మార్పులు చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి.

రష్యా అనుకూల టెలిగ్రామ్ సైట్‌లో ‘‘పోరాడుతూ మరణించిన యుక్రెయిన్ సైనికుల’’ వివరాలు వాస్తవంలో ఇలా ఉంటే.. "16k-17.5k".. మార్పులు చేసిన పత్రాల్లో "61k - 71.5k"గా పేర్కొన్నారు. నంబర్లను అటూఇటూ మార్చి యుక్రెయిన్ వైపు భారీగా నష్టం సంభవించినట్లుగా చూపిస్తున్నారు.

దీంతో అసలు ఈ పత్రాలను ఎవరు లీక్ చేశారు? ఎందుకు లీక్ చేశారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

వీడియో క్యాప్షన్, తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలో రెండు వైపులా భారీ నష్టాలు.. అయినా ఆగని పోరు

ఎలా బయటకు వచ్చాయి?

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ డిస్కార్డ్ నుంచి 4చాన్ వెబ్‌సైట్, ఆ తర్వాత టెలిగ్రామ్ చానెల్‌లోకి ఎలా వచ్చాయో ఇన్వెస్టిగేటివ్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గ్రూప్ బిల్లింగ్ క్యాట్‌కు చింన ఎరిక్ టోలర్ ఓ కథనం ప్రచురించారు.

మొదట ఎక్కడి నుంచి ఈ పత్రాలు లీక్ అయ్యాయో చెప్పడం కష్టమని ఆ కథనంలో టోలర్ వివరించారు. అయితే, తొలిసారి మార్చిలో గేమర్లు ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించినట్లు ఆయన తేల్చారు.

తొలుత మార్చి 4న కంప్యూటర్ గేమ్ మైన్‌క్రాఫ్ట్‌ గేమర్లు ఎక్కువగా ఉపయోగించే డిస్కార్డ్‌లో యుక్రెయిన్ యుద్ధంపై వాగ్వివాదం జరిగింది. అంనతరం ‘‘ఇదిగో కొన్ని లీకైన డాక్యుమెంట్లు..’’అని ఒక పది పత్రాలను ఒక యూజర్ పోస్ట్ చేశారు.

2019లోనూ బ్రిటన్ ఎన్నికల ముందు అమెరికా-బ్రిటన్ వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసే కీలక పత్రాలు ఇలానే రెడిట్, 4చాన్, ఇతర సైట్లలో ప్రత్యక్షం అయ్యాయి.

అయితే, ఆ డాక్యుమెంట్లు రష్యా నుంచి వచ్చాయని రెడిట్ అప్పట్లో తెలిపింది.

మరోవైపు గత ఏడాది ఆన్‌లైన్ గేమ్ వార్ థండర్‌లో కొందరు ప్లేయర్లు కొన్ని కీలకమైన సైనిక డాక్యుమెంట్లను ఇలానే పోస్ట్ చేశారు.

అయితే, తాజా లీక్ కాస్త సున్నితమైనది. దీని వల్ల ఊహించని పరిణామాలు ఉండొచ్చు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు త్వరలో ఏడాది

ఇలాంటి కీలకమైన పరిస్థితుల్లో సున్నితమైన సమాచారం బయటకు రావడంతో యుక్రెయిన్ ప్రశాంతంగా ఉండలేదు. త్వరలో యుక్రెయిన్ చేపట్టబోతున్న తొలి వేసవి దాడులు జెలియెన్‌స్కీ ప్రభుత్వానికి చాలా కీలకమైనవి. ఇవి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తారుమారు చేయొచ్చు. శాంతి చర్చల్లో కొత్త షరతులకూ ఇవి దారితీయొచ్చు.

ఇది రష్యా చేపడుతున్న దుష్ప్రచారంలో భాగమని కీయెవ్‌లో కొందరు అధికారులు చెబుతున్నారు.

అయితే, కొందరు మిలిటరీ బ్లాగర్లు దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. రష్యా కమాండర్లను తప్పుదోవ పట్టించేందుకు పశ్చిమ దేశాలే ఇలాంటి సమాచారాన్ని లీక్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

యుక్రెయిన్ సన్నద్ధతపై ఇప్పటికే రష్యాకు కొంత అవగాహన ఉండొచ్చు. అయితే, తమ విజయావకాశాలు మెరుగుపడాలంటే.. అసలు దాడులను ఎలా తిప్పికొడతారనే ఊహాగానాల్లోనే ప్రత్యర్థులను ఉంచుతూ యుక్రెయిన్ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)