శాపోర్ మోయినియాన్: 'అవును... నేను అమెరికా సెక్యూరిటీ సీక్రెట్స్‌ను చైనాకు దొంగతనంగా పంపించాను'

శాపోర్ మోయినియాన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా వైమానిక రంగానికి చెందిన కీలక టెక్నాలజీని చైనాకు దొంగతనంగా పంపించానని శాపోర్ మోయినియాన్ అంగీకరించారు. శాపోర్ అమెరికా సైన్యంలో పైలట్‌గా పనిచేశారు.

67 ఏళ్ల శాపోర్.. పైలట్‌గా రిటైర్ అయిన తర్వాత సైన్యానికి కాంట్రాక్టరుగా పనిచేయడం మొదలుపెట్టారని అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది.

మిలిటరీ ఏవియేషన్ టెక్నాలజీ సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా ఇతర కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆయన సేకరించేవారు. వేల డాలర్లకు దీన్ని చైనాకు అమ్మేవారు.

మరోవైపు అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులకు తన గురించి తాను తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కూడా రుజువైంది.

‘‘అమెరికా టెక్నాలజీతో చైనా తన రక్షణ సదుపాయాలను ఎలా మెరుగుపరుచుకుంటోందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ’’అని అమెరికా స్పెషల్ ఏజెంట్ స్టేసీ ఫాయ్ అభియోగపత్రంలో పేర్కొన్నారు.

1977 నుంచి 2000 మధ్య అమెరికా సైన్యంలో హెలికాప్టర్ పైలట్‌గా శాపోర్ పనిచేశారు.

శాపోర్ మోయినియాన్

ఫొటో సోర్స్, DEPARTMENT OF JUSTICE

ఎలా సేకరించారు?

ఎలాంటి నేరచరిత్రా లేనట్లు చూపించడంతో శాపోర్‌కు అమెరికా రక్షణ శాఖ నుంచి సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ లభించింది. దీంతో అమెరికా సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆయన సేకరించగలిగారు.

‘‘మొదట ఒక గుర్తుతెలియని చైనా వ్యక్తి శాపోర్‌ను కలిశారు. ఆయనే చైనా వైమానిక రంగం కోసం పనిచేసేందుకు శాపోర్‌ను ఒప్పించారు’’అని అధికారులు తెలిపారు.

‘‘ఒక చైనా వ్యక్తి సూచించడంతో అక్రిడెటెడ్ కాంట్రాక్టరుగా శాపోర్ మారారు. ఆ చైనా వ్యక్తి ఒక రిక్యూట్‌మెంట్ కంపెనీ కోసం పనిచేస్తున్నట్లుగా చెప్పి శాపోర్‌కు పరిచయం చేసుకున్నారు’’అని అమెరికా న్యాయ విభాగం అధికారులు చెప్పారు.

శాపోర్ మోయినియాన్

ఫొటో సోర్స్, Getty Images

పెయిడ్ ఏజెంట్..

శాపోర్‌ను చైనా ప్రభుత్వ పెయిడ్ ఏజెంట్ అని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికా ఏవియేషన్ టెక్నాలజీని ఆయన చైనా ప్రభుత్వానికి అమ్మేశారని ఆరోపిస్తున్నారు.

‘‘ఆయన చట్టాలను ఉల్లంఘించారు. అమెరికా భద్రతను ప్రమాదంలో పడేశారు. అతడికి శిక్ష విధించేటప్పుడు ఎలాంటి మినహాయింపులు దక్కకూడదు’’అని అధికారులు చెబుతున్నారు.

విదేశాల నుంచి తిరిగివచ్చిన తర్వాత అమెరికా ఏవియేషన్‌కు సంబంధించిన కీలక టెక్నాలజీని పెన్ డ్రైవ్‌లలోకి ఎక్కించడం శాపోర్ మొదలుపెట్టారు.

శాపోర్ మోయినియాన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘సెప్టెంబరు 2017లో షాంఘై ఎయిర్‌పోర్టులో చైనా అధికారులను శాపోర్ కలిశారు. ఒక పెన్‌ డ్రైవ్‌ను వారికి అప్పగించారు. కీలక సమాచారాన్ని బదిలీచేసేందుకు కొన్ని సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వారి దగ్గర నుంచి శాపోర్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన డబ్బులను తన భార్యకు పుట్టిన కుమార్తెకు చెందిన దక్షిణ కొరియా అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నారు’’అని అధికారులు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి

‘‘ఇది మోసం చేయడమే’’

‘‘ఇది మోసం చేయడమే. ఒక మాజీ సైనికుడే ఈ మోసం చేశాడు. దీన్ని అసలు సహించకూడదు’’అని దక్షిణ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ అటార్నీ ర్యాండీ గ్రాస్‌మన్ వ్యాఖ్యానించారు.

‘‘విదేశీ ప్రభుత్వాలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ అమెరికా టెక్నాలజీని దొంగచాటుగా తరలించుకెళ్తున్న ఎవరినీ వదిలిపెట్టకూడదు’’అని ఆయన అన్నారు.

శాపోర్ మోయినియాన్

ఫొటో సోర్స్, Getty Images

శాపోర్ ప్రయాణాల చరిత్రను అమెరికా న్యాయ విభాగం విశ్లేషించింది. దీంతో హాంకాంగ్, ఇండోనేసియాలకు వెళ్లి ఆయన చైనా ప్రతినిధులను కలిశారని వెలుగులోకి వచ్చింది.

మార్చి 2017లో శాపోర్ హాంకాంగ్ వెళ్లారు. అప్పుడే ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఒక చైనా ఏజెంట్‌కు ఆయన బదిలీ చేశారు.

ఆ సమయంలో ఆయనకు 7,000 డాలర్ల (రూ.5.49 లక్షల) నుంచి 10,000 (రూ7.84 లక్షలు)డాలర్లు దక్కింది. ఆ సమయంలో అటువైపు వారు చైనా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారన శాపోర్‌కు కచ్చితంగా తెలుసు.

వీడియో క్యాప్షన్, వ్లాదిమిర్ పుతిన్: ఒకప్పటి గూఢచారి.. ప్రపంచనేతగా ఎలా ఎదిగారు?

కఠిన శిక్షలు

తన కన్సల్టింగ్ వర్క్‌కు విదేశాల్లో డబ్బులు చెల్లిస్తారని శాపోర్ తన కుమార్తెతో చెప్పేవారు. భిన్న మార్గాల్లో తనకు డబ్బులు వస్తాయని వివరించారు.

కోర్టు పత్రాల ప్రకారం.. శాపోర్‌కు విదేశీ గూఢచారిగా పనిచేసినందుకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. 2,50,000 డాలర్లు (రూ.1.96 లక్షల కోట్లు) జరిమానా కూడా విధించొచ్చు. మరోవైపు భద్రతా పరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో పదేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశముంది.

ఈ కేసులో తుది తీర్పు ఆగస్టు 29న వెలువడే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)