తెలంగాణ: సింగరేణి ప్రైవేటు పరం అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు దేనికి?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో ప్రభుత్వం నడిపే పెద్ద కంపెనీల్లో సింగరేణి ముఖ్యమైనది. ఈ కంపెనీలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వం వాటా ఉంటే, మిగిలిన 49 శాతం కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది.
దానికి తోడు సామాజికంగా ఉత్తర తెలంగాణలో సింగరేణి ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఈ పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆందోళన చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతకీ సింగరేణి ప్రైవేటు అవుతుందా?
ఈ ప్రశ్నకు పెద్ద సమాధానం, సింగరేణి ఒకవేళ ప్రైవేటు అయ్యే పరిస్థితి ఉంటే ముందుగా సమాచారం వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికే. ఎందుకంటే, సింగరేణిలో కేంద్ర కంటే ఎక్కువ వాటా ఉన్న రాష్ట్రానికి ఆ విషయం తెలియకుండా పోదు.
మరి ఆ విషయం తెలిసే బీఆర్ఎస్ ఇప్పుడు ఆందోళన చేస్తుందా...అంటే అవునని చెప్పలేం. అసలింతకీ కంపెనీ ప్రైవేటు అవుతుందా లేదా?
సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని కేంద్రం ఇప్పటికే రెండుసార్లు చెప్పింది. సింగరేణిని ప్రైవేటు చేసే ఆలోచనలేదని 2022 నవంబరులో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే చెప్పారు.
ఆ తరువాత అంటే 2022 డిసెంబరులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో కూడా ఈ మాట చెప్పారు.
ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, సింగరేణిని ప్రైవేటు చేయబోమనీ, తమకు ఎక్కువ వాటా లేనందున ప్రైవేటు చేసే అధికారం కూడా తమకు లేదనీ ఆయన వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Getty Images
గొడవ ఏంటి?
కంపెనీని ప్రైవేటు పరం చేయబోము అన్నారు. సరే. కానీ కంపెనీకి అవసరమైన బొగ్గను తవ్వాల్సింది గనుల నుంచే. ఆ గనులను మాత్రం వేలం వేసి ఎవరికైనా అమ్ముతాం అని కేంద్రం అంటుంది. అలా కుదరదు తెలంగాణలో గనులను సింగరేణికే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
ఇప్పటి వరకూ భారత దేశంలో బొగ్గు అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే తవ్వేది. ప్రైవేటు కంపెనీలకు ఆ అవకాశం ఉండేది కాదు.
కేంద్రంలో బీజేపీ వచ్చిన తరువాత ప్రైవేటు కంపెనీలకు బొగ్గు తవ్వుకునే అవకాశం కల్పిస్తూ ఆ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు.
ఆ క్రమంలోనే దేశవ్యాప్తంగా 101 గనులను వేలం పెట్టారు. అందులో తెలంగాణకు చెందిన 4 గనులు కూడా ఉన్నాయి.
‘‘తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు వేలం వేయకుండా నేరుగా సింగరేణికి ఇవ్వాలనేది’’ బీఆర్ఎస్ డిమాండ్. తెలంగాణలోని కళ్యాణ ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి బ్లాకుల్లో మొత్తం 450 మిలియన్ టన్నుల బొగ్గు ఉుంటుందని అంచనా. ఈ గనులు సింగరేణికే ఉంచాలంటూ ఆ కంపెనీ కేంద్రాన్ని కోరింది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పట్లో కేంద్రానికి లేఖలు రాశారు. ప్రధానికి విన్నవించారు.
సరిగ్గా ఇక్కడే తేడా వచ్చింది. కేంద్రం ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాట వినడం లేదు. ఎవరైనా బొగ్గు గనులు వేలంలోనే కొనుక్కోవాలి అని పక్కాగా చెబుతోంది. 2022 డిసెంబరులో పార్లమెంటులో సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పనిలో పనిగా ఈ వేలం గురించి కూడా మాట్లాడరు. ‘‘సింగరేణిని అమ్మబోము. కానీ సింగరేణి కూడా గనులు వేలంలోనే కొనుక్కోవాలి. అలా చేస్తే రాష్ట్రాలకే లాభం’’ అంటూ ఆయన స్పష్టంగా చెప్పేశారు.

తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ప్రైవేటుకు ఇచ్చిన గని సంగతేంటి?
ఒకవైపు ఈ చర్చ జరుగుతూండగానే, కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరో అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఒక బొగ్గు గనిని ప్రైవేటు కంపెనీకి ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు.
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌ను ప్రైవేటుకు కట్టబెట్టింది. టీఎస్ జెన్కోకు కేటాయించిన ఈ బొగ్గు బ్లాక్‌ను.. సింగరేణికి బదులుగా ఏఎంఆర్ కంపెనీకి 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2005లో క్యాప్టివ్ మైనింగ్ కింద భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్‌ను జెన్ కో కు కేటాయించింది. ఆ గనిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పీఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ 2011లో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తాడిచెర్ల గనుల వ్యవహారం సంచలనం రేపింది. స్పందించిన అప్పటి సీఎం రోశయ్య పీఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేసి తాడిచర్ల బొగ్గు తవ్వకాలు చేపట్టాలని సింగరేణి సీఎండీకి లెటర్ రాశారు. కార్మికులకు ఉపాధితో పాటు సింగరేణి కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న తాడిచెర్ల బ్లాక్.. రాష్ట్రం వచ్చాక మళ్లీ ప్రైవేటు పాలైంది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే 2015లో జెన్‌కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి ఈ బ్లాక్‌ను ఏకంగా 30 ఏళ్ల కోసం అప్పగించటం సందేహాలకు తావిస్తోంది’’ అని బీజేపీ నాయకులు పేరాల శేఖర రావు బీబీసీతో అన్నారు.
‘‘నిజానికి తాడిచర్ల ఓసీ లాభదాయకమైనా, జెన్‌కో చేయలేమంటూ చేతులెత్తేసింది. అప్పుడు సింగరేణికి ఇవ్వాలి. కానీ ప్రైవేటు వారిని తెచ్చారు. సింగరేణితో పోలిస్తే ఈ ప్రైవేటు కంపెనీ సామర్థ్యం తక్కువ. జెన్ కో అవసరానికి సరిపడేంత బొగ్గును ఇప్పటికీ అందించలేకపోతోంది. బొగ్గు గ్రేడ్ మారితే డబ్బుల చెల్లింపు పెరిగేలా ఆ కంపెనీతో జెన్ కో ఒప్పందం చేసుకుంది. ఇలా ఏటా పేమెంట్ విషయంలో అగ్రిమెంట్ మార్చుకునేలా రెండు సంస్థల మధ్య ఒప్పందం ఉంది. గడిచిన నాలుగేళ్లలోనే ఆ కంపెనీ కోట్లల్లో దందా చేసింది. ఇక రాబోయే 26 ఏళ్లలో బొగ్గు దోపిడీ ఎంత మేరకు జరుగుతుందో ఊహించుకోవచ్చు’’ అని శేఖర రావు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రానికో పద్ధతా?
కేంద్రం దేశమంతా ఇదే పద్ధతిని అనుసరిస్తే పెద్ద సమస్య లేకపోయేది. కానీ తాజాగా ఈ విషయంలో రాష్ట్రాల వారీగా పాలసీలు మారుస్తోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్.
ఇటీవల తమిళనాడులో 3 లిగ్నైట్ గనులను వేలం నుంచి తప్పించారు. అదే పద్ధతిలో తెలంగాణలో నాలుగు గనులు వేలం నుంచి తప్పించాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఒక ఇంగ్లీషు వెబ్‌సైట్ వార్తను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్.
ఆ వార్త ప్రకారం తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ రాష్ట్రంలోని మూడు లిగ్నైట్ గనులను వేలం నుంచి తప్పించింది కేంద్రం.
అదే పద్ధతిలో ఇక్కడ కూడా తప్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్నామలై, ప్రహ్లాద్ జోషిని కలిసిన ఫోటో షేర్ చేశారు కేటీఆర్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

గనుల వేలానికి బీఆర్ఎస్ ఒకప్పుడు మద్దతు ఇచ్చిందా?
సింగరేణి ప్రైవేటు చేయకపోయినా, గనులను ప్రైవేటు చేస్తే తీవ్రం నష్టం కలుగుతుందనీ, అది క్రమంగా సంస్థ ప్రైవేటీకరణకు దారి తీస్తుందనీ, ఒక రకంగా పరోక్షంగా సంస్థను దెబ్బతీస్తూ ప్రైవేటైజ్ చేసే కుట్ర ఇదనీ బీఆర్ఎస్ ఇప్పటి వరకూ వాదిస్తూ వస్తోంది.
కానీ లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే బొగ్గు గనుల ప్రైవేటీకరణకు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతిచ్చినట్టు తెలుస్తోంది.
2015లో ఎంఎండీ చట్టం అంటే, మైన్స్ అండ్ మినరల్ డెవలెప్‌మెంట్ రెగ్యులేషన్ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. పార్లమెంటులో ఈ బిల్లుకు అనుకూలంగా బీఆర్ఎస్ ఓటేసింది.
2020వ సంవత్సరంలో ఈ చట్టంలో కమర్షియల్ మైనింగ్ విషయాన్ని చేర్చారు. ఆ చట్ట ప్రకారమే ఇప్పుడు బొగ్గు గనుల వేలం ప్రక్రియ మొదలు అయింది.
అంటే ఒక రకంగా బొగ్గు గనుల వేలానికి సంబంధించిన చట్టానికి ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీయే మద్దతిచ్చింది.
‘‘2015లో బొగ్గు గనుల వేలం సంబంధిత చట్టం చేసినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఆ చట్టానికి మద్దతు ఇచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైతే గనులు బ్లాక్ లిస్టులో ఉన్నాయో, ఆ రాష్ట్రాలు దరఖాస్తు చేసుకుంటే వారికే ఇస్తామన్నారు. అప్పటి నుంచి నిద్రావస్థలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, గడువు దాటిన తరువాత వేలం పాట వేస్తే కేంద్రాన్ని బదనాం చేస్తున్నారు. అసలు సింగరేణి ప్రైవేటీకరణ అని మొత్తుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం ఒడిశాలోని బొగ్గు గనులను ఎట్లా దక్కించుకుంది? ’’ అని బీజేపీ నేత శేఖర రావు ప్రశ్నించారు.
బొగ్గు గనులు ప్రైవేటులో కొంటే నష్టం ఏంటి?
నిజానికి ఈ బొగ్గు గనులను అభివృద్ధి చేయడానికి సింగరేణి కూడా కొంత సొమ్ము ఖర్చు పెట్టింది. ఒక చోట బొగ్గు ఉందా లేదా అన్నది నిర్ధారించి, ఉంటే ఎంత బొగ్గు ఉంది, ఎంత తవ్వాలి అనేది పరిశోధించి అనేక లెక్కలు వేసి నివేదికలు చేసి, క్షేత్ర స్థాయిలో పనులు చేయాలి. దీనికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
ఇందుకోసం తెలంగాణలోని నాలుగు గనులపై దాదాపు 59 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు సింగరేణికి చెందిన ఒక ఉన్నతాధికారి బీబీసీతో చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఇదంతా తమకు నష్టం అని సింగరేణి భావిస్తోంది.
‘‘ఇక్కడో ముఖ్యమైన పాయింట్ ఉంది. గని అంటూ చేతిలో ఉంటేనే బొగ్గు తవ్వడంలో లాభం వచ్చేది. కానీ చేతిలో గనే లేకుండా, వేలంలో కొనుక్కుంటే లాభాలు రావు. అది పరోక్షంగా సంస్థ దెబ్బతినడానికి కారణం అవుతుంది.’’ అని బీబీసీతో చెప్పారు కొందరు ఉన్నతాధికారులు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















