మిర్యాలగూడ - దళిత యువకుడి హత్య: 'తక్కువ కులపోడని చంపిండన్నరు' .. రోదిస్తున్న నవీన్ తల్లి - గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఏప్రిల్ 9న దళిత యువకుడు ఇరిగి నవీన్ (21) హత్యకు గురయ్యారు.
మాదిగ కులానికి చెందిన నవీన్‌పై ముదిరాజ్ కులానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసి చంపినట్లు ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి కులానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడని ఈ హత్య చేశారని వారు చెబుతున్నారు.
హత్య జరిగిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 10వ తేదీనే బీబీసీ మిర్యాలగూడ, నిడమనూరు, త్రిపురాం ప్రాంతాలకు వెళ్లింది.
బీబీసీ వెళ్లే సమయానికి మిర్యాలగూడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో నవీన్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది.
ఆసుపత్రికి వెనుక వైపున పోస్టుమార్టం చేసే గది ఉంది. ఆ సమయంలో బయట హడావుడి.. విషాదంతో కూడిన వాతావరణం ఉంది.
కాస్త దూరంలో పోలీసు వాహనం ఆగి ఉంది. పోలీసులు శవపంచనామా పూర్తి చేసి పోస్టుమార్టం వివరాలు ఆరా తీస్తూ కనిపించారు.
మరోపక్క ఆసుపత్రి భవనం పక్కనున్న చెట్టు కింద కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు, ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు ఉన్నారు.
నవీన్ తల్లి శారద కొడుకును తలచుకుంటూ గట్టిగా ఏడుస్తూ కనిపించారు.

నమ్మించి నా కొడుకు ప్రాణం తీశారు: తల్లి
‘‘నా కొడుకు మిర్యాలగూడలో కార్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం కాబట్టి మేం జీతానికి పనిచేస్తున్న ఎర్రబెల్లి వద్దామనుకున్నాడు.
మా సొంతూరు అన్నారం వెళ్లి కల్లు తాగి వస్తున్నాడు. అప్పుడే ఆ పిల్ల తరఫు వాళ్లు ఎక్కడున్నావు.. ఏం చేస్తున్నావురా అని ఫోన్ చేశారట. నేను ఫలానా స్టేజీ కాడ ఉన్నా అని చెప్పాడట. ముందుగా ఇద్దరు వచ్చి కింద పడేసి కొట్టారట.
మళ్లా తర్వాత పది మంది వచ్చిరట. తోడుగా ఉన్నోడు గుంటిపల్లి వైపు ఉరికిండు. మా వోడు చెట్లకెళ్లి ఉరికిండట. తప్పించుకోలేకపోయాడు. ఎక్కడ పడితే అక్కడ పొడిచి.. కొట్టారు’’ అంటూ శారద కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘మాకు విషయం తెలిసి మొత్తుకుంటూ తోటలోంచి ఉరికి వచ్చాం. మేం వెళ్లే సరికి సచ్చిపోయిండు. పోలీసులు వచ్చి చెక్ చేస్తున్నారు. నా కొడుకు ఏమైందంటే ఎక్కువ పిల్లను ప్రేమించిండట. తక్కువ కులపోడని చంపిండన్నరు.
నా కొడుకుకు జరిగిన అన్యాయం వాళ్లకు జరగాలి. మాకొచ్చిన శిక్ష వాళ్లకు పడాలి. నా కొడుకు ప్రాణం తీశారు. నమ్మించి ప్రాణం తీశారు.’’ అని రోదించారు తల్లి.
నవీన్ మృతదేహానికి దాదాపు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో పోస్టుమార్టం పూర్తయ్యింది.
అప్పటికే పోస్టుమార్టం గది బయట అంబులెన్సు సిద్ధంగా ఉంది.
కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీళ్ల మధ్య నవీన్ మృతదేహాన్ని పూర్తిగా చుట్టేసి అంబులెన్సులోకి ఎక్కించారు.
అక్కడి నుంచి నవీన్ స్వగ్రామం త్రిపురారం మండలం అన్నారం గ్రామానికి మృతదేహాన్ని తరలించారు.
‘‘నవీన్ శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. గొంతు కింద, ఛాతీపై, పొట్ట భాగం, వీపుపై.. ఇలా చాలాభాగాల్లో కత్తితో పొడిచారు’’ అని అన్నారం గ్రామానికి చెందిన సి.నరేష్ కొన్ని ఫొటోలు చూపించారు.
దీనిపై మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ అరవింద్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘పోస్టుమార్టం పూర్తయ్యింది. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాం. మృతదేహంపై కత్తి పోట్లు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని బయటకు చెప్పలేం. అది నివేదికలోనే ఉంటుంది’’ అని చెప్పారు.

హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా?
నవీన్ సొంతూరు త్రిపురారం మండలం అన్నారం గ్రామం. దాదాపు ఏడాది కాలంగా మిర్యాలగూడ పట్టణంలోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. అక్కడే చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారు.
నవీన్, అన్నారం గ్రామానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని ఆ యువకుడి బంధువులు చెబుతున్నారు.
వారిద్దరి మధ్య ఏదో గొడవ జరగడంతో రెండు వారాల కిందట నవీన్ పురుగుల మందు తాగాడని, దీంతో వారి ప్రేమ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందని నవీన్ స్నేహితుడు అనిల్ చెప్పారు.
ఈ విషయం తమకు ముందుగా తెలియదని, లేకపోతే తమ కొడుకును కాపాడుకునే వాళ్లమని నవీన్ తల్లి శారద బీబీసీతో చెప్పారు.
‘‘ఉగాది పండుగ నాడు మందు తాగిండు. ఎందుకు తాగావంటే నా ఫ్రెండు చచ్చిండు. ఆ బాధతో తాగినా అన్నాడు. పిల్ల వల్ల తాగిండా.. దేనివల్ల తాగిండో మాకు చెప్పలేదు. నిన్న చచ్చినంక ఇవన్నీ తెలిశాయి. ముందే తెలిసి ఉంటే జాగ్రత్త పడేవాళ్లం. నా కొడుకును కాపాడుకునేవాళ్లం’’ అని అంటున్నారు శారద.

ఆ రోజు ఏం జరిగింది?
మిర్యాలగూడ నుంచి సెలవు రోజు, ఆదివారాల్లో నవీన్ సొంతూరుకు వచ్చి వెళుతుండేవారు. అదే క్రమంలో ఏప్రిల్ 9 (ఆదివారం) వచ్చారు.
నవీన్ స్నేహితుడు అనిల్‌ను కలిసి అక్కడి నుంచి గుంటిపల్లికి చెందిన తిరుమల్ అనే మరో స్నేహితుడి వద్దకు వెళ్లారు.
అక్కడే మూడు బైకులపై వచ్చిన తొమ్మిది మంది వ్యక్తులు నవీన్ వెంట పడి కర్రలు, కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు మీడియాకు చెప్పారు.
ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని నవీన్ స్నేహితుడైన అనిల్ బీబీసీకి వివరించారు.
‘‘అన్నారంలో నేను, నవీన్ కలిసి కల్లు తాగాం. అప్పుడే శివప్రసాద్ అనే వ్యక్తికి నవీన్ ఫోన్ చేసి.. ఆ అమ్మాయి విషయం నీకు అనవసరం, నువ్ కలగజేసుకోవద్దు అని బెదిరించాడు. గతంలో నవీన్‌కు శివప్రసాద్ ఫోన్ చేసి బెదిరించాడట. అలా మాటమాట పెరిగి.. ఎక్కడున్నావ్ అని శివప్రసాద్ అడిగాడు. అన్నారంలోనే ఉన్నానని నవీన్ చెప్పాడు. రా చూసుకుందాం.. అని అన్నారు. వారు అన్నారం స్టేజీ వద్ద ఉండగా మేం ఆగకుండా వెళ్లిపోతున్నాం. అయితే శివప్రసాద్ మళ్లీ ఫోన్ చేసి అడిగాడు. గుంటిపల్లి వద్ద ఆగుతామని నవీన్ చెప్పాడు. అక్కడ ఇంకో అబ్బాయి తిరుమల్ కలిశాడు. ఎవరైనా ఇద్దరు వచ్చి మాట్లాడతారులే అనుకున్నాం. కానీ, వాళ్లు మూడు బైకులపై వచ్చారు. వస్తూ వస్తూనే కర్రలతో కొట్టారు. నవీన్ చేలల్లోకి ఉరికాడు. నేను ఊళ్లోకి పారిపోయా. నా వెంట ఇద్దరు పడ్డారు. మిగిలిన వాళ్లు నవీన్ వెంట పడ్డారు. కర్రలతో కొట్టి, కత్తితో పొడిచి చంపేశారు’’ అని అనిల్ చెప్పారు.
అనిల్ రెండు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో కట్లు కట్టారు. ప్రస్తుతం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సొంతిల్లు లేదు.. తోటలో కాపలాదారు జీవితం
హత్య జరిగిన నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామ ప్రధాన రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అన్నారం గ్రామం ఉంది.
‘‘ఊళ్లో దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. అందులో 40 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ముదిరాజ్ కుటుంబాలు ఐదారు ఉంటాయి.’’ అని అన్నారం ఉప సర్పంచి నరేష్ బీబీసీకి చెప్పారు.
ఎస్సీ కాలనీలోని మొదటి వీధిలో ఇళ్ల మధ్య దాదాపు 100 గజాల ఖాళీ స్థలం నవీన్ కుటుంబానికి ఉంది. వారికి సొంతిల్లు లేదక్కడ. ఆ కుటుంబం కూలీ పని చేసుకుని బతుకుతోంది.
నవీన్ తల్లిదండ్రులు ఇరిగి లక్ష్మయ్య, శారద అక్కడికి సమీపంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఉన్న ఒక తోటలో జీతానికి పని చేస్తున్నారు. అక్కడే ఇద్దరు యజమాని నిర్మించిన రేకుల షెడ్డులో ఉంటూ కాపలా కాస్తున్నారు.
అన్నారం గ్రామంలో ఉన్న వీరి ఇల్లు 8, 9 ఏళ్ల కిందట ప్రమాదవశాత్తూ కాలిపోయింది. అప్పట్నుంచి లక్ష్మయ్య కాపలాదారుగా పని చేస్తూ బతుకుతున్నారు.

అందరూ తిరిగే చోట.. హత్య
గుంటిపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన వంద మీటర్ల దూరంలోనే నవీన్ హత్య జరిగింది. సమీపంలో ఇళ్లు కూడా ఉన్నాయి. ఆ పక్కనే తెలంగాణ క్రీడా మైదానం ఉంది. ప్రధాన రహదారిపై గ్రామస్థులు ఎక్కువగా తిరుగుతున్నారు. అలాంటి చోట మధ్యాహ్న సమయంలో నవీన్ హత్య జరిగింది.
‘‘మేం తోటలో ఉంటే ఒకరు పిలుచుకుని వచ్చారు. మా అబ్బాయిని అన్నారానికి చెందిన తాళ్ల నాగయ్య, అతని తమ్ముడు, బంధువులు, ఇద్దరు వడ్డెర పిల్లలు కలిసి చంపారు. వారందరిపైన పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాం. పోలీసులు వాళ్ల పేర్లు రాసుకున్నారు’’ అని నవీన్ తండ్రి లక్ష్మయ్య బీబీసీతో చెప్పారు.
నవీన్ ప్రేమించారని చెబుతున్న యువతి కుటుంబం అన్నారం గ్రామంలో ఉండటం లేదు.
యువతి తండ్రి మాజీ నక్సలైటు. జనజీవన స్రవంతిలో కలిశాక కొన్నాళ్లు ఆటో నడుపుకొని జీవించారు. ఆ తర్వాత మిర్యాలగూడలో కూరగాయల దుకాణం పెట్టుకుని ఉంటున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదని గ్రామస్థులు చెప్పారు.
ఆయన ఫోన్ నంబరుకు బీబీసీ ఫోన్ చేసినప్పుడు ‘నంబరు ఉపయోగంలో లేదు’ అనే సందేశం వచ్చింది.
గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. దాడిలో పాల్గొన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లకు వెళ్లే వీధుల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున పోలీసులు గస్తీ కాస్తున్నారు.
చంపిన వ్యక్తులు ఎవరు?
నవీన్ హత్యపై అతని స్నేహితుడు అనిల్, కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
అన్నారం గ్రామానికి చెందిన కొడదల శివప్రసాద్, కొడదల మణితేజ, మర్రి రాజు, లింగంపల్లి రాజేష్, రామలింగం, ఇద్దరు బాలురు సహా మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులతో కలిపి తొమ్మిది మందిపై ఫిర్యాదు ఇచ్చినట్లు బంధువులు చెప్పారు.
ఈ విషయంపై ఎక్కువ వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు.
దీనిపై మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరితో బీబీసీ మాట్లాడింది.
‘‘మొత్తం తొమ్మిది మంది దాడి చేసి, చంపినట్లు గుర్తించాం. వారందరిపై కేసులు నమోదు చేశాం. ప్రస్తుతం వాళ్లు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందున ఇంతకు మించి వివరాలు చెప్పలేం’’ అని డీఎస్పీ అన్నారు.
నవీన్ హత్యపై దళిత సంఘాలు స్పందించాయి.
మహాజన సోషలిస్టు పార్టీ దేవరకొండ ఇన్‌ఛార్జీ మారుపాక గోపాల్ బీబీసీతో మాట్లాడుతూ- ‘‘నవీన్ కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి. లేని పక్షంలో మందకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం’’ అన్నారు.
గతంలో 2018 సెప్టెంబరు 14న ఇదే మిర్యాలగూడ ప్రాంతంలో ప్రేమ పెళ్లి వ్యవహారంలో ప్రణయ్ అనే మాల యువకుడి హత్య జరిగింది. అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆమె తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను చంపించినట్లు పోలీసులు ఛార్జిషీట్లో రాశారు. మారుతీరావు వైశ్య కులానికి చెందినవారు.
ఇప్పుడు అదే మిర్యాలగూడకు 26 కిలోమీటర్ల దూరంలో మరో దళిత యువకుడు నవీన్ హత్యకు గురయ్యాడు.
ఇవి కూడా చదవండి
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














