సీసీటీవీ: నిఘా కారణంగా భారతీయులు గోప్యతా హక్కును కోల్పోతున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఒక రోజు కూలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేసిన కొద్దిరోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.
సీసీటీవీలో కనిపించిన అనుమానితుడి పోలికలు దగ్గరగా ఉండటంతో మహహ్మద్ ఖదీర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయిదు రోజుల తర్వాత ఖదీర్‌ను పోలీసులు వదిలేశారు.
తాము అదుపులోకి తీసుకున్నది సరైన వ్యక్తిని కాదని భావించిన పోలీసులు ఆయన్ను విడిచిపెట్టారు.
ఆ తర్వాత కొద్దిరోజులకే ఖదీర్ చనిపోయారు. కస్టడీలో పోలీసులు తనను హింసించారని చనిపోయే ముందు ఆయన ఓ వీడియో రికార్డు చేశారు. అయితే, పోలీసులు ఆ ఆరోపణలను కొట్టిపారేశారు.
అస్పష్టంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఖదీర్ అరెస్టయ్యారు. '' సాయంత్రం వేళ కావడం, చీకటిగా ఉండటంతో సీసీటీవీ ఫుటేజీ స్పష్టంగా లేదు'' అని ఓ పోలీస్ అధికారి మనీ కంట్రోల్‌కి చెప్పారు.
సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీపై అధ్యయనం చేస్తున్న కంపారిటెక్ సంస్థ ప్రకారం, భారత్‌లోని 15 నగరాల్లో 1.5 మిలియన్ ( 15 లక్షలు ) సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయి. వెయ్యి మందికి 11 కెమెరాల చొప్పున, ఆయా నగరాల్లోని 138.5 మిలియన్ల (13.85 కోట్ల మంది) జనాభాకు 15 లక్షల నిఘా కెమెరాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇటుక బట్టీల మీద కెమెరాలు
భారత్‌లోని కొన్ని నగరాలు ఇతర నగరాల కంటే ఎక్కువగా నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి దాదాపు 42 నిఘా కెమెరాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అత్యధికంగా ప్రతి వెయ్యి మందికి 63 నిఘా కెమెరాలు పనిచేస్తున్నాయి.
దిల్లీలో ప్రతి వెయ్యి మందికి సగటున 26.7 కెమెరాలు, చెన్నైలో 24.53 కెమెరాలు ఉన్నాయి. నిఘా నీడలో ఉన్న నగరాల్లో ఇండోర్, హైదరాబాద్ ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉంటాయని కంపారిటెక్ అధ్యయనం చెబుతోంది.
భారత్‌లో సీసీటీవీ కెమెరాలకు డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగింది. గత జూలై లెక్కల ప్రకారం.. ఒక్క గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ సేల్స్ 2022లో 40 శాతం పెరిగాయి.
భారత్‌లో వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో పర్యటిస్తున్నప్పుడు, పొగలు వస్తూ కనిపించే ఇటుక బట్టీలపైన కూడా నిఘా కెమెరాలు కనిపించాయి. ఇటుకలు తయారు చేసే కూలీలను ఓ కంట కనిపెట్టేందుకు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కొన్ని ఇళ్ల బయట, ఇంటి ముఖద్వారాల వద్ద కూడా కెమెరాలు కనిపించాయి. ఇంకా నయం ధరలు ఎక్కువగా ఉన్నాయి. '' ఇప్పుడది స్టేటస్ సింబల్ '' అని ఓ గ్రామస్థుడు చెప్పారు.
కెమెరాలు నేరాలను ఛేదించడంలో సహాయపడతాయి కానీ, నేరాల నియంత్రణలో కాదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ వాటి వల్ల నేరాలు తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నారు.
అయితే, ఈ నిరంతర నిఘాతో ముప్పు పొంచి ఉందని పౌరహక్కుల సంఘాలు హెచ్చరికలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
'నిఘా' పేరుతో అత్యుత్సాహమా?
భారత్‌లో నిఘాపై పెరుగుతున్న అత్యుత్సాహాన్ని పున:సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ అభిప్రాయపడింది.
ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ నిఘాను సమర్థిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా కామన్ కాజ్ సంస్థ 12 రాష్ట్రాల్లో 9,700 మందిని అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది.
సంపన్నుల్లో ఇద్దరిలో కనీసం ఒకరు తమ నివాస ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకున్నారు. మురికివాడలు, పేద వర్గాలు నివసించే ప్రాంతాలతో పోలిస్తే, సీసీ కెమెరాల నిఘా అవసరమనే భావన సంపన్నుల్లో మూడురెట్లు అధికంగా ఉంది.
సీసీటీవీ నిఘా కారణంగా నేరాలు తగ్గుతాయని, ప్రజలకు భద్రత పెరుగుతుందని ఉన్నత విద్యావంతులు కూడా బలంగా నమ్ముతున్నారు.
నిరంతర పర్యవేక్షణ, నేరాలు తగ్గించడంలో సీసీటీవీ కెమెరాలు సహాయపడతాయని ప్రతి నలుగురిలో ముగ్గురు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే, క్రైమ్ రేట్‌కి.. కెమెరాల సంఖ్యకు పెద్దగా సంబంధం లేదని కంపారిటెక్ అధ్యయనం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అత్యధిక కెమెరాలున్న చోట క్రైమ్ రేటు ఎలా ఉంది?
సుమారు లక్ష మంది జనాభాకి కేవలం 0.05 నిఘా కెమెరాలు ఉన్న కేరళలోని కోళికోడ్ కంటే.. అత్యధికంగా నిఘా కెమెరాలు ఉన్న ఇండోర్‌లోనే క్రైమ్ రేట్ కొద్దిగా ఎక్కువగా ఉందని క్రైమ్ ఇండెక్స్ చెబుతోంది.
''ఎక్కువ సీసీ కెమెరాలు ఉన్నంత మాత్రన తక్కువ క్రైమ్ రేట్ ఉండాలని లేదని ఈ అధ్యయనం చెబుతోంది '' అని కంపారిటెక్‌కి చెందిన రెబెకా మూడీ అన్నారు.
ఉన్నత ఆదాయ వర్గాలు నివసించే ప్రాంతాలతో పోలిస్తే, మురికివాడలు, పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది.
అయితే, ఇళ్ల ద్వారాల వద్ద, ఇంటి లోపల, పని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై పేద వర్గాలు అంతగా ఆసక్తి చూపించడం లేదు.
''సీసీటీవీ కెమెరాల నిఘా అవసరమని భావిస్తున్న మధ్యతరగతి వర్గాలు, సంపన్న వర్గాల ఆలోచనల్లోనూ తేడాలున్నాయి. పేదవర్గాలు మాత్రం ఈ నిఘా కెమెరాలను ఇబ్బందిగా భావిస్తున్నాయి. అంతిమంగా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యేది వాళ్లే కాబట్టి అలాంటి అభిప్రాయాలుండొచ్చు'' అని అధ్యయనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
గోప్యతా హక్కును వదులుకుంటున్నారా?
సీసీటీవీ నిఘాపై భారతదేశంలో ప్రేమకు కారణమేంటి? తమపై నిఘా ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
అంటే, గోప్యతా హక్కును వదులుకుంటున్నారా? కెమెరాలు ప్రజా భద్రతకు సాయం చేయొచ్చు కానీ, అవి చిత్రీకరించిన డేటాపై నియంత్రణ లేకపోవడం మాత్రం ''పౌరుల గోప్యతకు తీవ్రమైన ముప్పు. మరీముఖ్యంగా ఫేసియల్ రికగ్నిషన్ వంటివి ఈ వ్యవస్థలు ఉపయోగించడం అనర్థాలకు దారితీయొచ్చు'' అని మూడీ చెప్పారు.
అలాగే, 2021లో బయటపడిన పెగాసస్ స్పైవేర్ విషయం గురించి ముగ్గురిలో ఇద్దరికి అవగాహన లేదు. దాని గురించి వినలేదని వారు చెప్పారు. ఇజ్రాయెల్‌కి చెందిన సంస్థ పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వానికి విక్రయించింది.
యాక్టివిస్టులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులపై నిఘా పెట్టేందుకు వారి ఫోన్లలోకి పెగాసస్ స్పైవేర్‌ను రహస్యంగా జొప్పించిందని.. భారత్‌లోనూ దాదాపు 30 మంది ఈ జాబితాలో ఉన్నారని బయటికొచ్చింది.
ఇజ్రాయెల్‌కి చెందిన సంస్థ నుంచి పలు ప్రభుత్వాలు ఈ పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
భారత్‌లో ఇప్పుడిప్పుడే గోప్యత హక్కుపై అవగాహన పెరుగుతోందని డిజిటల్ హక్కుల సంస్థ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్‌కి చెందిన అపర్ గుప్తా తెలిపారు.
''గోప్యతను కాపాడడంలో ఇంటర్నెట్‌ను నియంత్రిండచం, ఇంటర్నెట్ షట్‌డౌన్ చేయడానికి మా మద్దతు కొనసాగుతుంది'' అని గుప్తా అన్నారు.
దిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్(ఎస్ఎఫ్ఎల్‌సీ) లెక్కల ప్రకారం.. 700 కంటే ఎక్కువ సార్లు మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను భారత్ నిలిపివేసింది.
నిరసనలు, పరీక్షల్లో మోసపూరిత విధానాలను నియంత్రించడంలో భాగంగా 2012 నుంచి ఇప్పటి వరకూ మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. అందులో ఒక్క జమ్మూ కశ్మీర్‌లోనే సుమారు 400 సార్లు సేవలు నిలిపివేశారు.
''మనం టెక్నాలజీలో లోటుపాట్లు చూసుకోకుండా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. మనం దానిని ఎలా వాడుతున్నామనేదే సమస్య. ఆర్థిక, రాజకీయ, పౌర హక్కుల గురించి మరింత లోతుగా ఆలోచించాల్సి ఉంది'' అని గుప్తా అన్నారు.
ఇవి కూడా చదవండి
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















