కూల్ రూఫ్: వేడి, కరెంట్ బిల్లు రెండూ తగ్గుతాయని చెప్తున్న ఈ విధానం ఏమిటి? తెలంగాణలో అమలు ఎలా

Fan

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం కూల్ రూఫ్ పాలసీ 2023-28 తీసుకువచ్చింది.

ఈ విధానాన్ని తెలంగాణ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.

ఇకపై రాష్ర్టంలో ఈ విధానం అమలులో ఉండే ప్రాంతాలల్లో 600 గజాలు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు కూల్ రూఫ్‌ల ఏర్పాటు తప్పనిసరి.

అలా నిర్మిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ పాలసీ ప్రారంభించిన సందర్భంగా ప్రకటించారు. కూల్ రూఫ్‌ల ఏర్పాటుకు చదరపు మీటరుకు రూ. 300 ఖర్చవుతుందని వివరించారు.

వాస్తవానికి ఈ పాలసీ తీసుకువచ్చేందుకు నాలుగేళ్ల కిందటే తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది.

దీనిపై ప్రజల నుంచి మున్సిపల్ శాఖ అభ్యంతరాలు స్వీకరించింది.

ఆ తర్వాత పాలసీ అమలు ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు పాలసీని పట్టాలెక్కించింది.

అయితే.. ఈ పాలసీ విషయంలో ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో ప్రజలు ఏ మేరకు ముందుకు వస్తారనేది పెద్ద ప్రశ్న.

KTR

ఫొటో సోర్స్, BRS

ఏమిటీ ఈ విధానం

నగరాలు, పట్టణాల్లో కాంక్రీట్ నిర్మాణాలు రోజురోజుకీ ఎక్కవవుతున్నాయి.

కాంక్రీట్ నిర్మాణాలు ఎండ వేడిమి తీసుకోవడమే గానీ, పరావర్తనం(తిరిగి వెనక్కి పంపించడం) చేయడం లేదు.

దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాస్ర్తవేత్తలు చేస్తున్న హెచ్చరిక.

కూల్ రూఫ్ విధానంతో వేడిని తగ్గించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

ఇళ్లు, వాణిజ్య భవనాల పైకప్పు(రూఫ్)ల నిర్మాణ విధానంలో మార్పు చేయాలి.

రూఫ్‌లకు వాడే కాంక్రీట్ మెటీరియల్‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని రకాల కెమికల్స్‌తో కలిపి నిర్మిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.

దీనిపై ఆస్కీలోని సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ డైరెక్టర్ రాజ్ కిరణ్ బీబీసీతో మాట్లాడారు. ‘‘ఉష్ణోగ్రతలు పెరిగితే మనిషి మనుగడపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ రూఫ్ అనేది కీలకం.

ఒక ప్రాంతంలో అన్ని భవనాల పైకప్పులు కూల్ రూఫ్‌లుగా మారితే ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల వరకు తగ్గుతాయి. పైకప్పులను కూల్ రూఫ్‌లుగా మార్చేందుకు పెయింట్ వేసుకోవడం వంటి పద్ధతులు పాటిస్తే మంచిది. బస్తీలలో ఇళ్లలో పెయింట్ వేసేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావాలని ప్రభుత్వం సూచిస్తోంది.’’ అని చెప్పారు.

ఏసీలు

ఫొటో సోర్స్, Getty Images

కరెంటు వాడకం తగ్గుతుందా

ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీల వినియోగం పెరిగి విద్యుత్తు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది.

గతేడాది మార్చిలో 14160 మెగావాట్ల కరెంటు వినియోగం కాగా, ఈ ఏడాది మార్చిలో రికార్డు స్థాయిలో 15497 మెగావాట్ల కరెంటు వాడకం జరగినట్లు తెలంగాణ విద్యుత్తు శాఖ ప్రకటించింది.

కూల్ రూఫ్ విధానం అమల్లోకి వస్తే భవనాల లోపల ఉష్ణోగ్రతలు తగ్గి కరెంటు వాడకం తగ్గుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

దీనిపై మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పట్టణాలు, నగరాలలో ఓపెన్ స్పేస్ లు తక్కువగా ఉంటున్నాయి. కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కూల్ రూఫ్ పాలసీ 2023-28తో ఉష్ణోగ్రతలు తగ్గేందుకు అడుగు పడుతుంది.’’ అని చెప్పారు.

‘‘మొదటి విడతలో అన్ని ప్రభుత్వ భవనాలు, నాన్ రెసిడెన్షియల్ భవనాలకు కూల్ రూఫ్ పాలసీ తప్పనిసరి చేస్తున్నాం. అలాగే 600 గజాలు, ఆపై నిర్మించే రెసిడెన్షియల్ భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే టీఎస్ బీపాస్ వెబ్సైట్లోనే ఆప్షన్ ను ఉంచుతున్నాం.’’ అని అర్వింద్ కుమార్ వివరించారు.

కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

ఏయే ప్రాంతాలలో అమలు చేస్తారంటే

ఈ విధానం రాష్ర్టవ్యాప్తంగా అన్ని భవనాలకు వర్తింపజేయడం లేదు.

కొంత పరిధి మేరకే విస్తరింపజేస్తున్నారు.

తెలంగాణ 1.12 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా.. 3.5 కోట్ల మంది నివసిస్తున్నట్లు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇందులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత పరిధి 7వేల చదరపు కిలోమీటర్లలో ఉంది.

కూల్ రూఫ్ అమలుపై మంత్రి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని భవనాలకు విధానాన్ని వర్తింపజేయడం లేదు.

విడతల వారీగా అన్ని భవనాలకు వర్తింపజేస్తాం. మొదటి విడతలో తెలంగాణ వ్యాప్తంగా 2028 సంవత్సరం నాటికి 300 చదరపు కిలో మీటర్ల పరిధిలోనే అమలు చేస్తున్నాం.

ఇందులో హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు లోపల 200 చదరపు కిలోమీటర్లు, మిగిలిన రాష్ర్టంలో 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో విధానం వర్తింపజేయనున్నాం.’’ అని చెప్పారు. భవనాల లోపల

ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయని చెబుతున్నారు.

AC

ఫొటో సోర్స్, Getty Images

ఇంట్లో ఉష్ణోగ్రతలపై ప్రభావం ఎలా

రెగ్యులర్ సంప్రదాయ పైకప్పులు వాటిపై పడే సూర్యకిరణాలలో 20 శాతం వరకు పరావర్తనం చేయగలుగుతాయి.

అదే కూల్ రూఫ్ విధానంతో నిర్మించిన పైకప్పులు 80 శాతం వరకు సూర్యకాంతిని పరావర్తనం చేస్తాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

దీనివల్ల భవనాల లోపల ఉష్ణోగ్రతలు 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు తగ్గించవచ్చంటోంది.

దీనివల్ల ఐదేళ్ల తర్వాత 60 కోట్ల యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెబుతోంది.

కూల్ రూఫ్‌ల నిర్వహణ తక్కువగా ఉంటుంది. సంప్రదాయ పైకప్పులతో పోల్చితే 20శాతం తగ్గివచ్చని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇప్పటికే కట్టిన భవనాలకు ఎలా

ఇప్పటికే కట్టిన భవనాల యజమానులు టెర్రస్ పై కూల్ పెయింట్ వేసుకోవడం, వినైల్ షీట్స్ వేసుకోవడం, టైల్స్ వేసుకోవడం, టెర్రస్ గార్డెనింగ్ ఏర్పాటు చేయడం, సౌర విద్యుత్తు ఫలకాలు ఏర్పాటు చేయడం చేయవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని, స్వచ్ఛందమేనని చెబుతున్నారు మున్సిపల్ అధికారులు.

ఎక్కడైనా ఈ విధానం అమల్లో ఉందా..?

దేశంలోనే తొలిసారిగా కూల్ రూఫ్ పాలసీని తీసుకువస్తున్నట్లు.. ఈ పాలసీ విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఈ విధానం విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. ఇప్పటికే కూల్ రూఫ్ పాలసీని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అమలు చేస్తున్నారు.

2009లో ప్రారంభించి నాలుగేళ్లలో 0.53 చ.కిమీ భవనాల రూప్ లను కూల్ రూఫ్ లుగా మార్చారు. దీనివల్ల 1500 టన్నుల కర్బన ఉద్ఘారాలు తగ్గాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.

కెనడాలోని టోరోంటో, అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వంటి నగరాలతోపాటు వివిధ దేశాల్లో అమల్లో ఉంది.

Buildings

ఫొటో సోర్స్, Getty Images

2017లోనే పైలట్ ప్రాజెక్ట్‌గా..

కూల్ రూఫ్ విధానంపై 2016-17 లో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని దేవరకొండ బస్తీలో పైలెట్ ప్రాజెక్టును మున్సిపల్ శాఖ అమలు చేసింది.

తర్వాత రెండేళ్ల పాటు విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు.

బస్తీలో సరైన అవగాహన కల్పించకపోవడం, నిర్వహణ లోపంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

ఆ బస్తీలో వచ్చిన ఫలితాల ఆధారంగానే డ్రాఫ్ట్ పాలసీని ప్రభుత్వ తీసుకువచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)