రిషి సింగ్ : ఈ అయోధ్య గాయకుడు గుళ్లు, గురుద్వారాల్లో భజనల స్థాయి నుంచి 'ఇండియన్ ఐడల్' విజేత ఎలా అయ్యారు?

రిషి సింగ్

ఫొటో సోర్స్, SONYTVPR

ఫొటో క్యాప్షన్, రిషి సింగ్
    • రచయిత, సుప్రియా సోగ్లే
    • హోదా, బీబీసీ కోసం

ఇండియన్ ఐడల్ సీజన్-13 విజేతగా నిలిచిన అయోధ్య గాయకుడు రిషి సింగ్‌ది ఆసక్తికరమైన నేపథ్యం.

ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఈ రియాలిటీ షో ఫైనల్లో గెలుపొందిన రిషి సింగ్, టైటిల్ అందుకున్నారు. ఆయనకు రూ. 25 లక్షల ప్రైజ్‌మనీతోపాటు కారు బహుమానంగా లభించింది.

ప్రముఖ గాయకులు విశాల్ దద్లానీ, హిమేశ్ రేషమియా గాయని నేహా కక్కర్ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు పోటీదారులు ఫైనల్‌కు చేరుకున్నారు. వారిలో రిషితోపాటు కోల్‌కతా నుంచి బిదిప్తా చక్రవర్తి, సోనాక్షి కర్, దేబోస్మితా రాయ్‌, జమ్మూకు చెందిన చిరాగ్ కోత్వాల్, వడోదరా నుంచి శివమ్ సింగ్ ఉన్నారు.

పోటాపోటీగా సాగిన ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రిషి సింగ్ విజేతగా అవతరించారు.

దేబోస్మితా రాయ్ మొదటి రన్నరప్‌గా, చిరాగ్ కొత్వాల్ రెండో రన్నరప్‌గా నిలిచారు.

తల్లితో రిషి సింగ్

ఫొటో సోర్స్, SETINDIA

ఫొటో క్యాప్షన్, తల్లితో రిషిసింగ్

రిషి సింగ్ ఎవరు?

ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో 2003 జూలై 2వ తేదీన రిషి సింగ్ జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 19 ఏళ్లు. స్థానిక ‘‘ద కేంబ్రియన్’’ పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను ఆయన పూర్తి చేసుకున్నారు.

డెహ్రాడూన్‌లోని ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ మూడో సంవత్సరం చదువుతున్నారు.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన రిషి సింగ్ తండ్రి రాజేంద్ర సింగ్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా, తల్లి అంజలి సింగ్ గృహిణి.

తల్లిదండ్రులకు తానొక్కడినే సంతానం అని, చిన్నతనంలో వారు తనను దత్తత తీసుకున్నారని షో సందర్భంగా రిషి సింగ్ చెప్పారు.

తాను బాగా చదువుకొని ఏదైనా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని తన తల్లిదండ్రులు కోరుకున్నారని ఆయన తెలిపారు.

సంగీతంపై తన అభిరుచిని చూసి తల్లిదండ్రులు తనకు పూర్తిగా సహకరించారని అన్నారు.

గురుద్వారాలో రిషి సింగ్

ఫొటో సోర్స్, SETINDIA

గురుద్వారా, గుళ్లలో భజనలు

రిషి సింగ్, సంగీతంలో శిక్షణ తీసుకోలేదు. కానీ, చిన్నప్పటి నుంచి తన ఇంటి సమీపంలో ఉండే గురుద్వారా, దేవాలయాల్లో భజనలు పాడేవారు.

2019లో కూడా రిషి సింగ్, ఇండియన్ ఐడల్‌లో పాల్గొన్నారు. కానీ, నాలుగో రౌండ్‌లోనే ఆయన పోటీ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఇటీవల రిషి సింగ్ సంగీత ప్రతిభను ప్రశంసించడమే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనను ఫాలో కూడా అవుతున్నారు.

రిషి సింగ్‌కు దర్శక నిర్మాత అయిన రాకేశ్ రోషన్ ఒక మంచి ఆఫర్ కూడా ఇచ్చారు.

హృతిక్ రోషన్ తర్వాతి సినిమాలో ఆయనకు పాట పాడే అవకాశం ఇస్తున్నట్లు రాకేశ్ రోషన్ ప్రకటించారు.

‘ఇల్తెజా మెరీ’ పేరిట రూపొందిన తన తొలి పాటను 2022 మేలో రిషి విడుదల చేశారు. ఈ పాట మెలోడి రికార్డులను సృష్టించింది.

ఇండియన్ ఐడల్ వేదికపై విజేతగా రిషి సింగ్

ఫొటో సోర్స్, SONYTVPR

ఇండియన్ ఐడల్ వేదికపై ‘కబీర్ సింగ్’ సినిమాలోని ‘పహ్లా ప్యార్’ పాటను పాడిన తర్వాత న్యాయనిర్ణేతలు నిల్చొని మరీ చప్పట్లతో ఆయనను ప్రశంసించారు.

ఆ పాటకుగాను ఆయనకు ‘గోల్డెన్ మైక్’ను అందజేశారు.

2019లో అయోధ్యలోని రామ్ కథ మ్యూజియంలో జరిగిన మ్యూజిక్ ప్రదర్శనలో కూడా రిషి పాల్గొన్నారు.

యూట్యూబ్‌లో అనేక ప్రసిద్ధ హిందీ పాటలకు కవర్ సాంగ్‌లను పాడుతూ ఆయన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

వీడియో క్యాప్షన్, గ్లోబల్ ఎరీనాపై తెలుగు నాటు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)