ఇండియన్ ఐడల్ సీజన్ 10 విజేత సల్మాన్ అలీ: పేదరికంలో పెరిగిన స్కూల్ డ్రాపవుట్

ఫొటో సోర్స్, FB / SONY Television
మెలోడీ వాయిస్‌తో మాయ చేశాడు. గాత్రంతో మంత్రముగ్ధులను చేశాడు. సుమారు 2 కోట్ల మంది మది దోచుకుని ఇండియన్ ఐడల్ 2018 అయ్యాడు. అతనే హరియాణా సంచలనం సల్మాన్ అలీ.
ఆదివారం జరిగిన ఇండియన్ ఐడల్ 10వ సీజన్ ఫైనల్స్‌లో సల్మాన్ అలీని విజేతగా ప్రకటించారు. సల్మాన్ అలీకి సుమారు రెండు కోట్ల ఓట్లు వచ్చాయి. ట్రోఫీతో పాటు 25 లక్షల నగదు, ఒక కారు గెల్చుకున్నారు.
అంకుశ్ భరద్వాజ్ రెండోస్థానంలో నిలిచారు. నితిన్ కుమార్, నీలాంజన రాయ్, విభోర్ పరాషర్ గట్టి పోటీ ఇచ్చారు.
ఇండియన్ ఐడల్ ఫైనల్స్‌కి వచ్చిన 'జీరో' మూవీ నటులు షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కంటెస్టెంట్లను ఉత్సాహపరిచారు.
షారుఖ్‌ఖాన్, సల్మాన్ అలీతో ప్రత్యేకంగా 'సజ్దా' పాటని పాడించుకున్నారు.
ఇండియన్ ఐడల్ 10వ సీజన్ జూలైలో మొదలైంది. నేహా కక్కర్, అనూమాలిక్, విశాల్ దడ్‌లానీ జడ్జిలుగా వ్యవహరించారు. 'మీటూ' ఆరోపణల తర్వాత అనూమాలిక్ వైదొలిగారు.
ఎవరీ సల్మాన్ అలీ?
తన మెలోడి స్వరంతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను కొల్లకొట్టాడు.. సల్మాన్ అలీ. ఇంతకీ సల్మాన్ అలీ ఎవరు? ఈ స్థాయికి ఎలా వచ్చారు?
సల్మాన్ అలీ, హరియాణా మీవట్‌లోని ఒక కుగ్రామం నుంచి వచ్చాడు. సల్మాన్ అలీకి ఎలాంటి సినీ, రాజకీయ నేపథ్యం లేదు. అతనిదొక మధ్యతరగతి కుటుంబం. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో ఆడి పాడటం సల్మాన్ అలీ కుటుంబం జీవనాధారం. గత నాలుగు తరాలుగా వాళ్లిదే పని చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి సల్మాన్ అలీ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. మరెన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. సల్మాన్ స్కూల్ డ్రాపవుట్. పేదరికం కారణంగా చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. సల్మాన్ తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాడు.

ఫొటో సోర్స్, FB / Sony Television
చిన్నప్పటి నుంచే తన గాత్రంతో అందర్ని మంత్రముగ్ధులను చేసేవాడు. 11 ఏళ్ల వయసులోనే గాయకుడిగా సల్మాన్ తన కెరీర్ మొదలుపెట్టాడు. స్థానికంగా జరిగే వేడుకలు, కార్యక్రమాల్లో తండ్రి, తాతలతో కలిసి పాటలు పాడేవాడు.
తన స్వరాన్ని నమ్ముకుని, ముందుకు సాగాడు. రియాలిటీ షోలో అతను పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. గతంలో 'స రి గ మ ప లిటిల్ చాంపియన్స్'లో పాల్గొన్నాడు. సింగర్ కైలాష్ ఖేర్ ఇతనికి గురువు.
ఇండియన్ ఐడల్ 10లో సల్మాన్ అలీ ఒక్క జడ్జిల అభిమానం పొందడమే కాదు.. షోకి వచ్చిన ప్రతీ ఒక్కరూ అతని ప్రతిభను ప్రశంసించారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక అభిమాని తనను చూసేందుకు వచ్చినప్పుడు సల్మాన్ అలీ చాలా ఎమోషనల్ అయ్యాడు.

ఫొటో సోర్స్, FB / Revanth
ఇండియన్ ఐడల్ రేసు.. తెలుగు వాళ్లు
ఇండియన్ ఐడల్‌లో తెలుగు గాయకులు కూడా సత్తా చాటారు. సీజన్ 9 టైటిల్‌ని ఎల్‌వీ రేవంత్ గెల్చుకున్నాడు. ఇందులోనే పీవీఎన్ఎస్ రోహిత్ మూడోస్థానంలో నిలిచారు. ఇక సీజన్ 5లో శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ గెల్చుకున్నాడు. సీజన్ 2లో కారుణ్య రన్నరప్‌గా వచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో మంచి పాటగాడిగా పేరుతెచ్చుకున్న రేవంత్... ఇండియన్ ఐడల్9వ సీజన్ విజేతగా నిలిచాడు. బాహుబలిలో మనోహరీ పాట పాడింది రేవంతే.
ఉత్తరాది నుంచి వచ్చిన సింగర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైన తట్టుకుని నిలబడ్డాడు.
క్రికెటర్ సచిన్ తెండూల్కర్ చేతుల మీదుగా టైటిల్ అందుకున్నాడు.
రెండో స్థానంలో రేవంత్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఖుదాబక్ష్ (పంజాబ్) నిలిచారు.
తెలుగు గాయకుడు పీవీఎన్ఎస్ రోహిత్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. 'పాడుతా తీయగా'లో ఎస్పీ బాలు ప్రసంశలు అందుకున్న ఈ సింగర్ ఇండియన్ ఐడల్‌లోనూ రాణించాడు.
ఇండియన్ ఐడల్ 9వ సీజన్‌లో తెలుగు గాయకులిద్దరూ మంచి ప్రతిభ చూపించారు.

ఫొటో సోర్స్, FB / Reventh
'పాటల పోటీల్లో పాల్గొనేందుకు పేపర్ బాయ్‌గా మారాడు'
రేవంత్‌కి పాటలంటే ప్రాణం. చదువుకునే రోజుల్లో పాటల పోటీల్లో పాల్గొనేందుకు డబ్బులు లేకపోతే పేపర్‌బాయ్‌గా మారాడు. అవి సరిపోక హోటల్‌లో క్యాటరింగ్ బాయ్‌గా పనికి కుదిరాడు.
రేవంత్ సొంతూరు శ్రీకాకుళం. పాటల పూదోటలో అవకాశాల వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. 'సూపర్‌సింగర్స్' కార్యక్రమంతో మంచి పేరు రావడంతో రేవంత్ పాటల ప్రయాణం మొదలైంది. సంగీత దర్శకుడు కీరవాణి 'మర్యాదరామన్న'లో అవకాశం ఇచ్చారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. బద్రీనాథ్, బాహుబలి వంటి సినిమాల్లో పాడాడు.

ఫొటో సోర్స్, sreeramachandra
ఇండియన్ ఐడల్ గెల్చుకున్న తొలి తెలుగు గాయకుడు శ్రీరామచంద్ర
తెలుగు గాయకుల్లో తొలిసారి ఇండియన్ ఐడల్ కిరీటాన్ని గెల్చుకున్న సింగర్ శ్రీరామ చంద్ర మైనంపాటి. ఇండియన్ ఐడల్ ఐదవ సీజన్ టైటిల్‌ని శ్రీరామచంద్ర అందుకున్నారు.
షో మొదటి నుంచి శ్రీరామచంద్ర అందరికీ ఫేవరేట్‌గా ఉన్నాడు.
ఓసారి శ్రీరామ్ పాడిన 'క్వాజా మేరీ క్వాజా' పాటకు సంజయ్‌దత్ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
డ్రీమ్‌గర్ల్ హేమమాలిని తెలుగులో మాట్లాడించుకుని తనకు నచ్చిన పాటను పాడించుకుంది.
నటులు బిపాసాబసు, కత్రినాకైఫ్, ప్రియాంక చోప్రా ఇలా ప్రతీ ఒక్కరూ శ్రీరామ్ పాటను మెచ్చుకున్నారు.
అమీర్‌ఖాన్ అయితే 'ఆ కిశోర్‌కుమారే' పాడుతున్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా అద్దంకిలో పుట్టిన శ్రీరామచంద్ర చదువు హైదరాబాద్‌లో సాగింది. ఇక్కడే తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ స్థాయికి ఎదిగారు. అనేక చిత్రాల్లో పాటలు పాడారు.

ఫొటో సోర్స్, FB / Karunya
చిరుసరిగమలు నుంచి ఇండియన్ ఐడల్ రన్నరప్
సీజన్ 2లో మరో తెలుగు గాయకుడు కారుణ్య రన్నరప్‌గా నిలిచాడు. సంగీత నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిన ఎన్.సి.కారుణ్య చిరుసరిగమలు ఆల్బమ్‌తో పాటల పూదోటలోకి అడుగుపెట్టాడు. అనేక తెలుగు చిత్రాల్లో పాటలు పాడి ప్రేక్షకుల మెప్పు పొందాడు. టీవీల్లోను పాపులర్ సింగర్. ఇండియన్ ఐడల్ సిరీస్- 2లో రన్నరప్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు.
ఇండియన్ ఐడల్ మ్యూజిక్ రియాలిటీ షోని 2003లో ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








