ఊర్వశి: భర్త ఆచూకీ కోసం 84 రోజులు పోరాడిన మహిళ, చివరకు ఏం తేలిందంటే...

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ కోసం
రోజూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, వందల కొద్దీ ఫోన్ కాల్స్, గువాహటీలో మూడేళ్ల కొడుకుతో నిరసనలు.. ఇలా 84 రోజుల పాటు ఊర్వశి నిరీక్షణ సాగింది.
చివరికి, ఒక గనిలో భర్త మృతదేహం దొరకడంతో ఆమె పోరాటానికి తెరపడింది.
తప్పిపోయిన భర్త కోసం పడిన ఆరాటం, 1764 గంటల నిరీక్షణ ఇంత విషాదంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు.
అస్సాంకు చెందిన ఊర్వశి కథ మనసును కలచివేస్తుంది.
తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా, లాభం లేకపోవడంతో ఊర్వశి ధర్నా ప్రారంభించారు.
దాంతో, పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది ఆమె భర్త కోసం వెతకడానికి మైనింగ్ ప్రాంతంలో భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు.
"మేం ప్రేమించి పెళ్లిచేసుకున్నాం. ఆయన కనిపించకపోతే, ఎలా ఊరుకుంటాను? నా కొడుక్కి నేను ఏం సమాధానం చెప్పాలి? నా భర్తను వెతకడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చినా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నాను" అని ఊర్వశి బీబీసీతో చెప్పారు.
24 ఏళ్ల ఊర్వశి మోరాన్, తాను గడిపిన నిస్సహాయ కాలాన్ని గుర్తుచేసుకుంటూ బీబీసీతో తన వ్యథను పంచుకున్నారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
2023 జనవరి: చివరి ఫోన్ కాల్
అస్సాంలోని తిన్సుకియా జిల్లా, లిడో పట్టణానికి సమీపంలో అనుమతులు లేని బొగ్గు గని తవ్వకాలలో ఊర్వశి భర్త ప్రాంజల్ మోరాన్ పనిచేసేవారు.
ఈ ఏడాది జనవరిలో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. జనవరి 12న చివరిసారిగా తన భర్తతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఊర్వశి చెప్పారు.
"ఆరోజు ఉదయం సుమారు 8.00 గంటలకు వేరేవాళ్ల ఫోన్ నుంచి నాకు కాల్ చేశారు. ఆయన మరో 48 గంటల్లో మా దగ్గరకు రావాల్సి ఉంది. కానీ, అదే చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు" అన్నారు ఊర్వశి.
28 ఏళ్ల ప్రాంజల్ జనవరి 14న మాఘ్ బిహు పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ, తరువాత మూడు నెలల వరకు ఆయన కనిపించలేదు. చివరికి మృతదేహం దొరికింది.
ఏప్రిల్ 7న లిడోలోని బొగ్గు గని నుంచి ప్రాంజల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం బాగా కుళ్లిపోయిందని పోలీసులు చెప్పారు.
కొన్ని రోజులుగా భర్త నుంచి ఎలాంటి వార్త రాకపోవడంతో ఊర్వశి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరువాత, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయింది.
దాంతో, ఆమె తిన్సుకియా జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకి దిగారు. సొంత ఊరి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గువాహటీ వెళ్లి, తన మూడేళ్ల కొడుకుతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. తన భర్త ఆచూకీ కోసం పలు స్థానిక సంస్థల సహాయం కూడా కోరారు.
తిన్సుకియా పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుకాని గ్రామంలో ఊర్వశి ఇంటికి మేం వెళ్లినప్పటికి, ప్రాంజల్ దహన సంస్కారాల తరువాత మూడవ రోజు కర్మలు నిర్వహిస్తున్నారు.
ఇంటి ప్రాంగణంలో ఒక టేబుల్‌పై ప్రాంజల్ ఫొటో ఉంచారు. దాని ముందు దీపం వెలుగుతోంది.
"జనవరి 12న ఫోన్ చేసినప్పుడు, ఇంటికి వస్తానని చెప్పారు. బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని, తన కోసం బెంగపెట్టుకోవద్దని చెప్పారు. ఆయన వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాను. కానీ రాలేదు. చాలా రోజుల వరకూ ఏ కబురూ తెలియలేదు. ఆయన కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. చివరిగా కాల్ వచ్చిన నంబర్‌కు వందసార్లు ఫోన్ చేసినా, ఎవరూ ఫోన్ ఎత్తలేదు" అని ఊర్వశి చెప్పారు.
ప్రాంజల్ మొదట తిన్సుకియాలోని ఇనుప ఫ్యాక్టరీలో పనిచేసేవారు. కానీ ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో గత నవంబర్‌లో లిడోలోని అక్రమ బొగ్గు గనిలో పనికి చేరారు.
"బొగ్గు గనిలో రోజుకు వెయ్యి రూపాయలకు పైగా కూలీ వచ్చేది. కానీ, చాలా ప్రమాదంతో కూడుకున్న పని అని, బొగ్గు గనుల్లో చాలా మంది కూలీలు చనిపోయారని ఆయన చెప్పేవారు" అన్నారు ఊర్వశి.
జనవరి 27న స్థానిక వార్తల్లో లిడో బొగ్గు గనిలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన విషయం విని ఆమె చాలా భయపడ్డారు.
"ఆ వార్త విని చాలా కంగారుపడ్డాను. నా భర్త అన్నయ్య, కొంతమంది గ్రామస్థులు కలిసి ఆయన ఫొటో పట్టుకుని బొగ్గు గనుల్లో వెతకడానికి వెళ్లారు. అయితే, ప్రాంజల్ జనవరి 11న జీతం తీసుకున్న తరువాత ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని అక్కడివారు చెప్పారు." అని ఊర్వశి వెల్లడించారు.
బొగ్గు గనులు ఉన్న కొండ ప్రాంతంలో వెతకడం కష్టమని, దీన్ని ఇంతటితో ముగిద్దామని కొందరు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.
"నేను ఎవరి మాటా వినలేదు. ఆయన దొరికేవరకూ వెతుకుతూనే ఉంటానని చెప్పాను."

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
2023 ఫిబ్రవరి: భర్త దొరుకుతాడనే ఆశ సన్నగిల్లిన క్షణాలు
ఫిబ్రవరి 2న మైనింగ్ యజమాని తరపున హిరేన్ గొగోయ్ అనే వ్యక్తి వాళ్ల ఇంటికి వచ్చారు. లిడో బొగ్గు గనుల్లోని కూలీలకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, ప్రాంజల్ స్థానిక యువకుడు కాబట్టి ఆయన కుటుంబానికి రూ. ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆ రోజు తన భర్త దొరుకుతారన్న ఊర్వశి ఆశ అడియాసలైంది.
"ఆ వ్యక్తి నష్టపరిహారం గురించి చెప్పినప్పుడే, నా భర్త ఇక లేరన్న విషయం నాకు అర్థమైపోయింది. కానీ, ఆయన మృతదేహాన్ని వెతకడం నాకు చాలా ముఖ్యం. మా ఇంటికి వచ్చిన వ్యక్తిని తీసుకుని గ్రామస్థులు బొగ్గు గనుల వద్దకు చేరుకున్నారు. కానీ, మైనింగ్ ప్రాంతానికి చేరేలోపే ఆయన పరారయ్యారు."
తిన్సుకియా జిల్లాలోని లిడో-మార్గరీటాలో తిలక్, తిరప్ అనే రెండు ప్రధాన బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గు గనులను ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ (ఎన్ఈసీ)కి లీజుకు ఇచ్చినప్పటికీ, ఈ ప్రాంతం చుట్టూ విస్తృతంగా అక్రమ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలు వచ్చాయి. 84 రోజుల తరువాత ప్రాంజల్ మృతదేహం లభించిన బొగ్గు గని ఎన్ఈసీలో భాగమని చెప్పారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు.. ధర్నా
ఊర్వశి ఫిబ్రవరి 3న తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి లంగ్‌కాశీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయమని చెప్పారు.
"నేను మరుసటి రోజు రిపోర్టు ఇవ్వడానికి లిడో పోలీస్ స్టేషన్‌కి వెళ్లాను. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన రెండు రోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం స్థానిక మీడియాలో రావడం ప్రారంభమైంది. ఇంతలో కొన్ని స్థానిక సంస్థలు ఆందోళన చేపట్టాయి. ఫిబ్రవరి 17 నుంచి బొగ్గు ట్రక్కులను నిలిపివేస్తూ మూడు రోజుల పాటు ఆందోళన చేశాయి. తరువాత, జిల్లా డిప్యూటీ కమిషనర్‌తో ఒక మీటింగ్ జరిగింది. నాకు రేషన్ కార్డు, అరుణోదయ యోజన కింద నెలకు రూ. 1,230, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తామని చెప్పి నా ధర్నను ఆపడానికి ప్రయత్నించారు" అని ఊర్వశి ఆరోపించారు.
అయితే, తిన్సుకియా జిల్లా యంత్రాంగం ఈ ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. బాధితురాలికి కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశామని తెలిపింది.
ఇక లాభం లేదని గౌహతి వెళ్లి ధర్నాకు కూర్చోవాలని ఊర్వశి నిర్ణయించుకున్నారు. మూడేళ్ల కొడుకును తీసుకుని, సోదరుడు ఉమానంద్, కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు గువాహటీ వెళ్లి ధర్నాచేశారు.
"అంతకుముందు, అస్సాం ప్రభుత్వ నుంచి ఒక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కిషన్, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4 లక్షల చెక్కును అందజేయడానికి మా ఇంటికి వచ్చారు. నా భర్త మృతదేహాన్ని కనుగొనమని నేను వారిని అభ్యర్థించాను."

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
2023 మార్చి: డీజీపీతో సమావేశం తరువాత ఎన్‌డీఆర్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది
మార్చి నెలలో ఊర్వశి గౌహతి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అస్సాం పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను కలిసేందుకు ప్రయత్నించారు.
ఊర్వశి పట్టుదల, పోరాటం ఎట్టకేలకు ప్రభుత్వాన్ని కదిలించింది. ప్రాంజల్ కోసం అన్వేషణ ప్రారంభమైంది.
కానీ, ఏప్రిల్ 2న అస్సాం డీజీపీ జీపీ సింగ్‌ను ఊర్వశి కలిసిన తరువాతే సెర్చ్ ఆపరేషన్ ఊపందుకుంది.
ఐజీపీ జిత్మల్ డోల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసి, ఏడు రోజుల్లో మృతదేహాన్ని వెతికిపట్టుకోవాలని డీజీపీ ఆదేశించారు.
"ఈ కేసులో పోలీసులు ఒక క్రమపద్ధతిలో అన్వేషణ సాగించారు. ఒక రహస్య సమాచారం ఆధారంగా లిడో బొగ్గు గని ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం. ప్రాంజల్ మృతదేహాన్ని బొగ్గు గనిలో దాచిపెట్టిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నాం. తరువాత, పోలీసులు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి మృతదేహాన్ని వెలికితీసేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. దీని కోసం, కోల్ ఇండియా నిపుణులు, యంత్రాల సహాయం తీసుకున్నాం" అని తిన్సుకియా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అభిజిత్ గురవ్ బీబీసీకి చెప్పారు.
ఊర్వశి తన భర్త మృతదేహం కోసం చేసిన పోరాటం గురించి గ్రామంలో అందరూ చెప్పుకుంటున్నారు.
ప్రాంజల్ తండ్రి దేబెన్ మోరాన్ కూడా తన కోడలు చేసిన ప్రయత్నాన్ని అభినందించారు.
"స్థానిక సంస్థలు, పోలీసుల పరిష్కారం కనుగొనలేకపోయారు. ఊర్వశి గొప్ప ధైర్యం చూపించింది. గువాహటీ వెళ్లి ధర్నా చేసింది. మా అబ్బాయి మృతదేహం దొరికింది కాబట్టి, ఈ రోజు తన అంత్యక్రియలు నిర్వహించగలుగుతున్నాం" అన్నారాయన.
ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో, దీన్ని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంగా భావిస్తున్నారు.
ఊర్వశి మాత్రం తన భర్త మరణానికి కచ్చితమైన కారణం కనుక్కోవడానికి తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం మందికి సంతాన సమస్యలు.. కారణం ఏంటి?
- జీసస్ దగ్గరికి వెళ్లాలని 'అడవిలో ఆకలితో చనిపోతున్నారు'
- ఏమిటీ తెల్ల బంగారం? దీని కోసం అమెరికా, చైనాల మధ్య ఇంత పోటీ ఎందుకు?
- ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వస్తున్నారని నమ్మించారు, చివరికి ఏమైందంటే..
- బుర్కా వేసుకుని మహిళా చెస్ టోర్నమెంట్లో పాల్గొన్న యువకుడు చాలామంది అమ్మాయిలను ఓడించాడు, చివరికి ఎలా దొరికిపోయాడంటే..













