జీసస్ దగ్గరికి వెళ్లాలని 'అడవిలో ఆకలితో చనిపోతున్నారు'

ఫొటో సోర్స్, Getty Images
కెన్యాలోని కోస్టల్ ప్రాంతమైన కిలిఫీ పరిధిలో విషాధ ఘటన చోటుచేసుకుంది. 'ఆకలితో చనిపోతే' త్వరగా 'స్వర్గానికి' చేరుకోవచ్చని ఓ 15 మంది అడవిలో కొన్ని రోజులుగా ఏమీ తినకుండా గడుపుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు గురువారం అడవిలోని ఘటనా స్థలానికి వెళ్లి చూడగా, చాలామంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ 15 మందిలో అప్పటికే నలుగురు చనిపోయారు.
మిగిలిన 11 మందిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
కెన్యా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
అదే అడవిలో సామూహిక సమాధులు ఉన్నాయనే కథనాలపై పోలీసులు దృష్టి సారించారు.
అయితే ఈ ఘటనకు ఒక పాస్టర్ కారణమని, ఆయనే వాళ్లందరికీ అలా ఆకలితో అలమటించి చనిపోతే స్వర్గానికి చేరుకోవచ్చని బ్రెయిన్ వాష్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అలా ఎందుకు చెబుతున్నారు?
మాకెంజీ న్తెంగే అనే వ్యక్తి కిలిఫీ పరిధిలోని గుడ్‌న్యూస్ ఇంటర్నేషన్ చర్చ్‌లో పాస్టర్.
త్వరగా స్వర్గానికి చేరుకోవాలంటే ఆకలితో అలమటించాలని పాస్టర్ మాకెంజీ కిలిఫీ తీర ప్రాంతంలోని తన ఫాలోవర్లకు చెప్పేవారని ఆరోపణలు ఉన్నాయి.
గత నెలలోనే పాస్టర్ మాకెంజీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అతను బ్రెయిన్ వాష్ చేయడం వల్లే ఇద్దరు పిల్లలు చనిపోయారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి.
ఆ పిల్లల తల్లిదండ్రులు గుడ్‌న్యూస్ ఇంటర్నేషన్ చర్చ్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే తను నిర్ధోషినని కోర్టులో వాదించి, బెయిల్‌పై బయటికొచ్చాడు మాకెంజీ.
పోలీసుల వివరాల ప్రకారం.. చర్చికి వచ్చిన ముగ్గురు పిల్లల తల్లిదండ్రులకు పాస్టర్ మాకెంజీ త్వరలో ప్రపంచం అంతమైపోతున్నట్లు చెప్పారు. త్వరగా జీసస్ దగ్గరికి చేరుకోవాలంటే ఆకలితో అలమటించి చనిపోవాలని బ్రెయిన్ వాష్ చేశారు.
పాస్టర్ ఆదేశాల ప్రకారం మొదట ముగ్గురు పిల్లలు చనిపోవాలి. తర్వాత భార్య, చివరగా భర్త చనిపోవాలి. పాస్టర్ ఆదేశాలు పాటించిన భార్యభర్తలు అలాగే చేశారు. చివరికి ఇద్దరు పిల్లలు చనిపోయారు. వారిని కిలిఫిలోని షాకహోలా అడవిలో తల్లిదండ్రులు పాతిపెట్టారు. విషయం బయటికి తెలియడంతో ఆ పాస్టర్ మాకెంజీపై కేసు నమోదయింది.
ఇపుడు మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు మృతిచెందారు. ప్రస్తుతం పాస్టర్ ఆచూకీ తెలియరాలేదు.
అయితే మరణించిన ఆ నలుగురి వివరాలు ఇంకా గుర్తించలేదు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒక యువకుడితో సహా పలువురి పరిస్థితి విషమంగానే ఉంది.
ఇళ్ల నుంచి రక్షించిన వారిలో చాలామంది అస్వస్థతతో ఉన్నారని కెన్యా జాతీయ మీడియాకు భద్రతా బలగాలు సమాచారం అందించాయి.
"మేం వారిని చాలా దారుణ స్థితిలో కనుగొన్నాం. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు" అని తెలిపాయి.

ఫొటో సోర్స్, NOTICIAS
'అదే అడవిలో 31 సమాధులు'
అంతగా తెలివిలేని పౌరులను ఒక వ్యక్తి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడని సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
ఆకలితో అలమటిస్తే జీసస్‌ను త్వరగా చేరుకోవచ్చని చెబుతున్నట్లు నిఘా సమాచారం అందడంతో గుడ్‌న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి అనుచరుల జాడ తెలుసుకోవడానికి రంగంలోకి దిగామని పోలీసులు చెప్పారు. అయితే అప్పటికే అడవిలో నలుగురు చనిపోయారు.
షాకహోలా అడవిలోని ఒక గుర్తు తెలియని ప్రదేశంలో బయటపడిన 31 మృతదేహాలకు సంబంధించిన సామూహిక సమాధులు గురించి కూడా చెప్పి, అది బ్రెయిన్ వాష్ కారణంగానే జరిగిందంటూ హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.
కెన్యా ఒక మతపరమైన దేశం. ప్రమాదకరమైన, క్రమబద్ధీకరించని చర్చిలు, ఆరాధనలు చాలానే ఉన్నాయక్కడ. వాటిలో చేరడానికి నిర్వాహకులు ప్రజలను ఆకర్షిస్తుంటారు.
ఇలాంటి ఘటనే తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో చోటుచేసుకుంది.
గత ఫిబ్రవరిలో మొజాంబిక్‌లోని ఎవాంజెలిస్ట్ చర్చి పాస్టర్ ఫ్రాన్సిస్కో బరాజాస్ ఇలాగే ఉపవాసం ఉండి మరణించారు.
'ఏసుక్రీస్తులా ఉపవాసాన్ని అనుసరించాలని ఏం తినకుండా, తాగకుండా 40 రోజుల పాటు అడవిలో ఉంటే, నిత్యజీవానికి మార్గం సుగమం చేయడానికి ఆ ఉపవాసం ఒక మార్గం' అని బరాజాస్ నమ్మారు.
అనుకున్నట్లుగానే అక్కడి అడవిలో ఉపవాస దీక్ష ప్రారంభించారు పాస్టర్ బరాజాస్. అయితే 25 రోజులకే ఆయన పరిస్థితి విషమంగా మారింది.
దీంతో ఆయనను మొజాంబిక్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే 25 రోజుల పాటు ఏం తినకుండా, తాగకుండా ఉండటతో బరాజాస్ చాలా బరువు తగ్గారు. శక్తిని కోల్పాయారు.
దీంతో ఆసుపత్రిలోనే మరణించారు బరాజాస్.
ఇవి కూడా చదవండి
- హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














