మెక్సికోలో కాథలిక్ మత బోధకులను ఎందుకు చంపేస్తున్నారు?

మగేల్ పంథాలియోన్
ఫొటో క్యాప్షన్, మగేల్ పంథాలియోన్
    • రచయిత, విల్ గ్రాంట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మగేల్ పంథాలియోన్ గత నెల కాథలిక్ చర్చి వ్యవస్థలో భాగం అయ్యారు. ఆయన యవ్వన జీవితంలో అది ఆయనకు చాలా పెద్ద రోజు.

28 ఏళ్ల మగేల్ ఇప్పుడు ప్రీస్ట్ శిక్షణలో ఉన్నారు. మతబోధకుడు కావడానికి సుమారు దశాబ్దం పాటు పాటుపడ్డారు.

పశ్చిమ మెక్సికోలో మగేల్ స్వగ్రామమైన రింకన్ డి కార్మెన్ గ్రామంలో కిక్కిరిసిన భక్తుల మధ్య డియోసెస్ బిషప్ ఆయన్ను మత గురువుగా నియమించారు.

ఆ క్షణం.. మొదటి వరసలో కూర్చున్న మగేల్ తల్లి పెట్రా ఫ్లోరెంకో కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది.

మొత్తం 13 మంది సంతానంలో మగేల్ 11వ సంతానం. మగేల్‌కు వచ్చిన ఈ కొత్త హోదా వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది.

అయితే, మగేల్ తల్లి పెట్రాకు కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రాణహాని ఉన్న మతబోధకుల వ్యవస్థలో మగేల్ భాగం అయ్యారు.

2006 నుంచి మెక్సికోలో 50 మందికి పైగా మతబోధకులు హత్యకు గురయ్యారు. అందులో తొమ్మది మంది ప్రస్తుత ప్రభుత్వ పాలనలోనే చనిపోయారు.

మాదక ద్రవ్యాల ముఠాల హింసకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు కొందరు హత్యకు గురికాగా, వివిధ క్రిమినల్ ముఠాల మధ్య ఘర్షణల మూలంగా మరికొంత మంది చనిపోయారు.

ఏ ఒక్క కేనులోనూ హత్యకు కారకులను పట్టుకున్నదీ లేదు, శిక్ష విధించినదీ లేదు. ప్రతిసారీ విచారణాధికారులు తూతూమంత్రంగా విచారణ సాగించి చేతులు దులుపుకొంటారు.

ఇందులో చాలా హత్యలు పశ్చిమ మెక్సికోలోని టియేరా కాలియింటే ప్రాంతంలో చోటు చేసుకున్నాయి.

వివిధ ముఠాలు తమ ఆధిపత్యం కోసం ఘర్షణలు పడే టియేరా కాలియింటే ప్రాంతంలోని ఒక సెమినరీలోనే మగేల్ పంథాలీయోన్ విద్యను అభ్యసించారు.

ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం హాలిస్కో న్యూ జనరేషన్ ముఠా, ఫామిలియా మికోకానా ముఠా మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

టియేరా కాలియింటే
ఫొటో క్యాప్షన్, టియేరా కాలియింటే ప్రాంతంలోని ఒక సెమినరీలోనే మగేల్ పంథాలీయోన్ విద్యను అభ్యసించారు

“టియేరా కాలియింటే ప్రాంతంలో మతబోధకుడు కావడం అంటే నా దృష్టిలో ప్రేమకు సంకేతం కావడం” అని ప్రార్ధన అయ్యాక నాతో మాట్లాడుతూ మగేల్ అన్నారు.

“ఇక్కడ ప్రజలు ఎంతో బాధలో బతుకుతున్నారు. మతబోధకుడు కావడం దేవుడిచ్చిన పిలుపు. అది ఆయన ప్రేమకు సంకేతం” అన్నారు.

టియేరా కాలియింటే ప్రాంతంలోని సియుదాద్ అల్తమిరానో అనే పట్టణం శివారులో ఉన్న సెమినరీలో మగేల్ చదువుకున్నారు.

ఆ సెమినరీలో శిక్షణలో ఉన్న 18 మంది ప్రీస్టులు రోజూ ఉదయం ప్రార్ధన కోసం చర్చిలో కలిసినప్పుడు మతబోధకులుగా వాళ్లు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో గుర్తుచేసే ఒక సమాధిని దాటుకుంటూ వెళతారు. అది ఆ సెమినరీలో పాఠాలు చెప్పిన మతబోధకుడి సమాధి. ఆయన హత్యకు గురయ్యారు.

ఆయన సమాధిపై ఇలా రాసి ఉంది- "ఫాదర్ హబాకక్ హెర్నాండెజ్ బెనిటెజ్, 1970 జనవరి 16 - 2009 జూన్ 13".

ఫాదర్ హబాకక్- 'పాడ్రే కుకో'గా అక్కడివారికి బాగా తెలుసు. మెక్సికోలో హత్యకు గురైన ఎంతో మంది మతబోధకులకు ఆయన సమాధి ఒక చిహ్నం.

పాడ్రే కుకోతోపాటు అదే సెమినరీలో పాఠాలు చెప్పిన ఫాదర్ మార్సేలినో ట్రూజిల్లో అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు.

“పాడ్రే కుకో హత్య జరిగిన సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో హింస విధానం మారింది” అని ఆయన స్నేహితుడు ఫాథర్ మార్సేలినో ట్రూజిల్లో గుర్తుచేసుకున్నారు.

“అంతకుముందు ముఠాల చర్యలు మరీ బహిరంగంగా ఉండేవి కావు. అలాగే పరిపాలనలో కూడా ఎంతో కొంత జవాబుదారీతనం ఉండేది” అని ఆయన చెప్పారు.

ఫాథర్ హబాకక్ హెర్నాండెజ్ సమాధి
ఫొటో క్యాప్షన్, ఫాదర్ హబాకక్ హెర్నాండెజ్ సమాధి

పాడ్రే కుకో హత్య జరిగి దశాబ్దం దాటినా అది ఇప్పటికీ ఒక భయానక విషాదమే.

39 సంవత్సరాల పాడ్రే కుకో తన సెమినరీలో మరో ఇద్దరితో కలిసి యువతకు సంబంధించిన ఒక కార్యక్రమానికి కారులో వెళ్తున్నారు. తుపాకులు ధరించిన కొందరు ఆ కారును చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్ళను బలవంతంగా బయటకి లాగారు. ఒక్క మాట కూడా లేకుండా రోడ్డు పక్కనే వాళ్ళందరినీ కాల్చి చంపారు.

నేటికీ వాళ్ళ హత్యకు కారణాలు స్పష్టంగా తెలియవు.

ఆ రోజు కారులో వాళ్ళతో పాటు ఫాదర్ ట్రూజిల్లో కూడా వెళ్లాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ప్లాన్ మారటంతో ఆయన సెమినరీలోనే ఉండిపోయారు.

మాదక ద్రవ్యాల ముఠాల కారణంగా ఆత్మీయులను కోల్పోవడం ఈ సెమినరీకి ఇదే మొదటిసారి కాదు.

2014లో క్రిస్మస్ రోజు కుకో కజిన్ అయిన ఫాదర్ గ్రెగారియో కూడా ఇలాగే మరణించారు. ఆయన్ను బహిరంగంగా, దిగ్భ్రాంతికర రీతిలో హత్య చేశారు. సెమినరీలోని ఒక గది నుంచి ఆయన్ను బలవంతంగా లాక్కెళ్లి, కట్టేసి టేపుతో చుట్టబెట్టారు.

“ఆయన ఊపిరాడక చనిపోయారు. మాకు అర్థమైనంతవరకు, ఆయన నుంచి డబ్బులు వసూలు చేద్దామని ముఠా సభ్యులు అనుకున్నారు. అయితే ఆయన చనిపోయారని గుర్తించి దగ్గరలో ఉన్న దట్టమైన పొలంలో పడేసి వెళ్లిపోయారు” అని మార్సేలినో చెప్పారు.

ఆంటోనియో అబేలెజ్
ఫొటో క్యాప్షన్, ఆంటోనియో అబేలెజ్

యుక్త వయస్కుడైన ఆంటోనియో అబేలెజ్ ఎన్ని ప్రమాదాలు ఉన్నా కూడా ప్రీస్ట్ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.

ఇటువంటి ఘటనలు మామూలుగా అయితే ఈ సియుదాద్ అల్తమిరానో ప్రాంతంలో మతగురువు అవ్వటానికి జంకేలా చేస్తాయి.

అయితే, అది నిజం కాదు అని కొంతమంది సెమినరీ విద్యార్థులు నాతో చెప్పారు. హత్యకు గురైన మతబోధకులు తమకు ఆదర్శమన్నారు.

“వాళ్ళ జీవితం మాకు ఒక ఉదాహరణ. వాళ్లు అన్యాయంగా చనిపోయారు. కానీ, వాళ్ల ధైర్యం మాకు స్ఫూర్తి” అని 19 సంవత్సరాల ఆంటోనియో అబేలెజ్ తెలిపారు.

సెమినరీలో శిక్షణ పొందుతున్నవారికి జాగ్రత్తగా ఉండమని చెబుతామని సెమినరీ రెక్టర్ ఆంటోనియో రైనోసో తెలిపారు.

“సంఘటిత నేర వ్యవస్థ అనేది వెయ్యి తలల రాక్షసి. మతబోధకులు తమంతట తాము ఈ సమస్యకు సమాధానం కనుగొనలేరు. అయితే దైవంపై నమ్మకం ఉంచడం ద్వారా ఈ వ్యవస్థను ఎదుర్కోవచ్చు.”

చర్చిలో చేరాలన్న నిర్ణయం సరైనదా, కాదా అని అనుమానమొచ్చిన సందర్భాలూ ఉన్నాయని కొంత మంది ప్రీస్టులు అంగీకరించారు.

“హింస, చావుల మధ్య మేం ఉంటున్నాం” అని 20లలో ఉన్న గులిమెరో కానో అనే విద్యార్ధి చెప్పారు.

“ఇక్కడ ఉన్న కొంత మందికి ఏం జరిగిందో తలుచుకుంటే, రేపు మాకు కూడా అదే గతి పడుతుందేమో అనే భయం ఉంది” అన్నారు.

మగేల్ పంథాలియోన్ మతగురువు కావడంతో రింకన్ డి కార్మెన్ గ్రామంలో సంబరాలు
ఫొటో క్యాప్షన్, మగేల్ పంథాలియోన్ మతగురువు కావడంతో రింకన్ డి కార్మెన్ గ్రామంలో సంబరాలు

మగేల్ పంథాలియోన్ ప్రీస్ట్ కావడం రింకన్ డి కార్మెన్ గ్రామంలో అందరికీ సంబరంగా మారింది.

ఆ కార్యక్రమానికి గ్రామస్థులందరూ తరలివచ్చారు. చర్చి నుంచి జాతరగా బయలుదేరి, వీధుల్లో పాటలతో, బాణాసంచాతో వేడుక చేసుకున్నారు.

తాను అన్నిటికీ సిద్ధపడే ఉన్నానని మిగెల్ అంటున్నారు.

“ఒక రోజు మాదక ద్రవ్య ముఠాను ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు. అయితే వాళ్ళతో గొడవపడను. వాళ్ళకు దైవ మార్గాన్ని చూపిస్తాను. ఎందుకంటే దేవుడు వాళ్ళకు కూడా దేవుడే” అని ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: