ఆంధ్రప్రదేశ్: అక్కడి మహిళలు నెలసరి సమయంలో ఊరొదిలి అడవిలో బతకాలి, గ్రామం నుంచి తిండీ, నీరు కూడా పంపరు

వీడియో క్యాప్షన్, నెలసరి సమయంలో మహిళలు ఊరి బయట అడవిలో ఉండాలి. తిండీ, నీరు కూడా పంపరు.
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

నెలసరి సమయంలో మహిళలను ఇంటి పనులకు, పూజలకు దూరంగా ఉంచే ఆచారాల గురించి మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాం.

కానీ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కొన్ని గ్రామాలు రుతుస్రావంలో ఉన్న మహిళలను ఏకంగా ఊరికే దూరం పెడుతున్నాయి.

సామాజిక అంశాలపై బీబీసీ ప్రత్యేక కథనాల్లో భాగంగా 2018 మార్చిలో ఇలాంటి పరిస్థితులే ఉన్న అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలో పర్యటించింది.

అక్కడ కొనసాగుతున్న ఈ వింత ఆచారంపై బీబీసీ కథనాలు ప్రచురించింది.

ఈ గ్రామాల ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాల గురించి అధికారులను ప్రశ్నించింది. అక్కడివారిలో మార్పు తీసుకొస్తున్నామని నాడు అధికారులు చెప్పారు.

కానీ, ఆ గ్రామాల్లో పరిస్థితులేమీ మారలేదని గతంలో బీబీసీకి కథనం రాసిన ప్రతిమ చెప్పారు.

అదే రకమైన దుర్భర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఉన్న ఊరినాయనపల్లి, ఊరునాయని కొత్తూరు, పాళ్యం, సలార్లపల్లితో పాటూ తమిళనాడులోని ఏకలనత్తం గ్రామాలలోనూ కొనసాగుతున్నాయి.

ఈ గ్రామాల్లో సుమారు 2,500 మంది జనాభా ఉన్నారు. రుతుక్రమంలో ఉన్న మహిళలను ఊరి బయట ఉంచే ఆచారాలను ఇప్పటికీ కొనసాగిస్తున్న ఈ గ్రామాల్లో బీబీసీ బృందం పర్యటించింది. అక్కడ ఊరికి దూరంగా ఉన్న మహిళలతో మాట్లాడింది.

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా కుప్పం మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఊరినాయనపల్లి, ఊరినాయన కొత్తూరు, సలార్లపల్లి గ్రామాలు ఉంటాయి. వాటికి కొంత దూరంలో గుడిపల్లి మండలంలో పాళ్యం గ్రామం ఉంటుంది.

ఊరినాయనపల్లి నుంచి కాలినడకన అటవీ ప్రాంతంలో 6 కిలోమీటర్లు కొండపైకి నడుచుకుంటూ వెళితే తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో ఉన్న ఏకలనాత్తం గ్రామం వస్తుంది. ఈ 5 గ్రామాల్లో వాల్మీకి నాయుళ్లు మెజారిటీగా నివసిస్తుంటారు.

మహిళలు నెలసరి సమయంలో ఊరి బయట ఉండాలనే ఆచారాన్ని వీరు అనాదిగా పాటిస్తున్నారు.

ఊరినాయనికొత్తూరు సమీపంలో పొలాల దగ్గర ముగ్గురు మహిళలు రాత్రి సమయంలో వంట చేసుకుంటూ కనిపించారు. వారిని బీబీసీ కలిసింది.

ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని వారిని అడిగింది. ఇంటికి దూరమైన మహిళలు ఇలా ఊరి బయటే ఉండే ఆచారం మా గ్రామాల్లో ఉందని వారు చెప్పారు.

ఇక ఏకలనత్తంకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కుప్పం నుంచి కృష్ణగిరి వెళ్లే రహదారిలో 30 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత మహారాజ కడై దగ్గర సకనావూరు మీదుగా కొండపైకి చేరువోవాల్సి ఉంటుంది.

ఈ కొండపై 200 ఇళ్లలో సుమారు 900 మంది జనాభా నివసిస్తుంటారు. అక్కడ కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి.

మహిళలు

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, మహిళతో మాట్లాడుతున్న బీబీసీ ప్రతినిధి తులసీ ప్రసాద్ రెడ్డి

కుంటల వద్ద నివాసం.. బండలపై నూరుకుని తినడం

ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ గ్రామాల్లో చేతి బావుల్లో నీటిని వినియోగిస్తుంటారు.

ఈ గ్రామంలో మహిళా ఆశ్రమం ఉన్నా అందులో రాత్రి సమయాల్లో మాత్రమే నెలసరి వచ్చిన మహిళలు ఉంటారు.

ఉదయం ఊరికి దూరంగా కొండ దగ్గర ఉన్న నీటి కుంట ప్రాంతానికి వెళ్లి అక్కడే వండుకోవడం, బండలపైనే పచ్చడి నూరుకుని తింటుంటారు.

ఈ గ్రామాల్లో నెలసరి వచ్చిన మహిళలు 4 రోజులు గ్రామానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎండయినా, వానయినా వాళ్లు ఊరిబయట ఆరుబయలులో ఉండాల్సిందే.

ఈ సంప్రదాయం తమ పెద్దల కాలం నుంచీ వస్తోందని మల్లిక అనే మహిళ బీబీసీతో చెప్పారు. మల్లికకు తమిళనాడు రాష్ట్రం ఏకలనత్తం పుట్టినిల్లు కాగా ఊరినాయని కొత్తూరు మెట్టినిల్లు.

పుట్టినింటా మెట్టినింటా ఇదే సంప్రదాయం కొనసాగుతోందని ఆమె చెబుతున్నారు.

“నెలసరి వస్తే ఊళ్లోకి పోవడానికి లేదు. ఈ పద్ధతి మా పెద్దల కాలం నుంచీ ఉంది. ఇంట్లో ఉండనివ్వరు. నాలుగు రోజులు ఇక్కడే ఉండాలి. నాలుగు రోజుల తర్వాతే ఇంటికి వెళ్తాం. చెట్టు కింద ఉంటాం. పెద్ద వర్షాలు వస్తే రాళ్ల కింద, చెట్ల కింద తార్పాల్ పట్ట గుడిసెలా వేసుకుని ఉంటాం. ఆ రాళ్ల కిందకి వెళ్తాం. ఇంకా దూరంగా వెళ్తే, పాములు, తేళ్లు లాంటివి ఉంటాయి. మాకు దేవుడే దిక్కు అనుకుంటాం. ఇంకేం చేయగలం. నాలుగు దినాలు ఏ బాధలు వచ్చినా అవస్థలు పడాల్సిందే” అని మల్లిక చెప్పారు.

మహిళలు

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, రాత్రి పూట పంటపొలాల్లో వంట వండుకుంటున్న మహిళలు

నెలసరి వచ్చిన మహిళలే కాదు, వారితోపాటూ వారి పిల్లలుు కూడా బయటే ఉండాలి. ఆ నాలుగు రోజులూ వారికి ఆహారం ఊరి బయటకే తెచ్చి ఇస్తున్నారు.

“నాకు ఇద్దరు బిడ్డలు.. కొడుకు, కూతురు. వీళ్లకు స్నానం చేయిస్తే ఇంటికి తీసుకెళతారు. లేకపోతే పంపకూడదు. బిడ్డలను వాళ్ళు తీసుకునే వరకు భోజనం ఉన్నా, లేకున్నా మా దగ్గరే ఉండాలి. ఇక్కడికే నాస్తా ఏమైనా తెచ్చిస్తారు. లేకపోతే చెరువుల కాడకు పోయి చేసుకొని తింటాం. ఇది పెద్దల కాలం నుంచి ఉంది. ఊరు పుట్టినప్పటి నుంచి ఇదే పద్ధతి. మూడు నెలల బిడ్డలను పెట్టుకుని అయినా బయటే ఉండాలి” అని మల్లిక చెబుతున్నారు.

మహిళలు

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, అడవిలో వంట చేసుకుంటున్న మహిళ

'రజస్వల అవుతారని అనుమానం వచ్చినా బయటకు పంపేస్తారు'

సలార్లపల్లిలో ఉన్న మహిళలదీ ఇదే పరిస్థితి. నెలసరి వచ్చిన మహిళలు నాలుగు రోజులు ఊరి బయటే ఉండాలి.

ఆడపిల్లలు రజస్వల అవుతారని అనుమానం వచ్చినప్పుడు, జాతర సమయాల్లో వారిని ఊరికి దూరంగా ఉంచుతారు.

ఇదే కాదు, మెదటిసారి వయసుకు వచ్చిన బాలికలు కూడా 10 రోజులు బయటే ఉండాలని స్థానికులు చెబుతున్నారు.

పగటి పూట పొలాల దగ్గర ఉండగలం కానీ, రాత్రిళ్లు మాత్రం దేవుడిపై భారం వేసి ఉంటామని సలార్లపల్లికి చెందిన బాలమ్మ చెప్పారు.

“ముందు కాలం అయితే ఇక్కడే ఉన్నారు. గుడిసెలు వేసుకొని మాన్ల(చెట్లు) కింద అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన తర్వాత డెలివరీ అయితే హాస్పిటల్‌కి పోతారు. ఐదు దినాలు హాస్పిటల్‌లో ఉంటారు. నీళ్లు పోసుకుని ఇంటికి వస్తారు. పెద్దమనిషి అయితే 10 దినాలు ఊరి బయట ఉంటారు. 11వ దినం ఐవోరు (పూజారి) తీసుకొచ్చి ఇంటికి పుణ్యాదానం చేసి కూర్చొని పెట్టి వదిలేసి వెళతాడు. వాళ్ళు ఇక్కడే ఉండేది. చేల దగ్గరకి, గుట్టకు పోతాం. ఇట్లా ఉండిపోతాం. మా దేవుడు అట్ల పెట్టుండేది, ఏం చేసేకి అయ్యేదిలేదు. ఈ కాలంలోనే కాదు పెద్దల కాలం నుంచి అట్ల ఉండేది. ఊరికి వచ్చిన కోడళ్ళయినా, ఇంటిలో పుట్టిన ఆడపిల్లలు అయినా బయట ఉండాల్సిందే” అన్నారు.

ఊళ్లో ఉన్నవారే కాదు, బయటి నుంచి వచ్చిన వారు కూడా నెలసరి అయితే ఐదు రోజుల పాటు ఊరి బయటే ఉండే ఆచారం సలార్లపల్లిలో ఇప్పటికీ కొనసాగుతోంది.

ఏకలనత్తం గ్రామం

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, ఏకలనత్తం గ్రామం
మహిళలు

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, కాశీమా

ఊరికి కోడళ్లుగా వచ్చినవారు ఏమంటున్నారు?

కుప్పం మండలం సరిహద్దుల్లో తమిళనాడులో ఏకలనత్తంలో మహిళలు ఊరికి దూరంగా చెరువు దగ్గర వంట చేసుకుంటున్నారని తెలిసి బీబీసీ అక్కడకు వెళ్లింది. అక్కడ కొంత మంది మహిళలు వంట చేసుకుంటూ కనిపించారు. ఎందుకు ఇక్కడ వంటచేసుకుంటున్నారని వారిని అడిగాం.

ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన ఓ కోడలు ఈ ఆచారాన్ని అసహ్యించుకుంటున్నారు. మూడు రోజులు పూజగదికి దూరంగా ఉండడం గురించి తమకు తెలుసని, కానీ ఇలాంటి ఆచారాల గురించి ఎప్పుడూ వినలేదని తంజావూరు నుంచి ఏకలనత్తంకు కోడలుగా వచ్చిన కాశీమా బీబీసీతో చెప్పారు.

“ఇక్కడ అంతా నచ్చింది కానీ ఈ విషయం నచ్చలేదు నాకు. ఇదంతా పబ్లిక్‌కు తెలియనట్టుంది. చిన్న పిల్లలకు కూడా తెలియదు ఇట్లా ఉంటారని. నాకు ఒక మాదిరి అసహ్యంగా ఉంది. మా పుట్టినూరు తంజావూరులో ఈ విధంగా లేదు. దేవుడు గదిలోకి వెళ్లం. మూడు రోజులు ఇంట్లోనే ఉంటాం. ఇక్కడకు వచ్చిన తర్వాత ఇలా ఊరి బయటకు పోవాలని తెలిసింది. నాకు పెళ్లయి రెండు సంవత్సరాలు అయింది. పెళ్లి కాకముందు ఈ విషయం తెలియదు. పెళ్లయి ఇక్కడికి వచ్చాకే తెలిసింది’’ అని ఆమె చెప్పారు.

అత్తింటి గ్రామంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయన్న విషయం పుట్టింట్లో కూడా చెప్పలేదని ఆమె తెలిపారు.

‘‘మా ఊర్లో నేను చెప్పలేదు. చెప్తే ఏమన్నా అనుకుంటారని చెప్పలేదు. ఇక్కడకు వచ్చేశాం, ఇక సర్దుకుపోవడమే అని ఊరుకున్నా. మా ఊరికి పోయినా కూడా చెప్పుకోం. నాకైతే ఇది నచ్చలేదు కానీ, ఈ ఊరి ఆచారం ఇదేనని చెప్తున్నారు. నచ్చకపోయినా ఎక్కడికి పోగలం? ఈ కళాచారం(ఆచారం) అసహ్యంగా ఉంది. ఇది మారాలి. వాళ్ళ కాలంలో అయితే అలా జరిగిపోయింది. మా కాలంలో కూడా ఇలా ఉంటే ఎలా? ఇలా ఉండలేం. మా పిల్లలు కూడా ఇవే బాధలు అనుభవించాలా? అందుకే మారాలి’’ అని కాశీమా అన్నారు.

మూఢ విశ్వాసాలు

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, మునిరాజు బాబు

సామాజిక కార్యకర్తల కృషి ఎంత వరకూ ఫలించింది?

ఈ గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురాతన ఆచారాలను మార్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

గత ఏడేళ్లుగా కొంత మార్పు తీసుకొచ్చామని, ఇంకా చాలా మారా ల్సి ఉందని కుప్పం ప్రజా వేదిక సామాజిక కార్యకర్త మునిరాజ్ బాబు బీబీసీతో చెప్పారు.

‘‘2016 నుంచీ మేం వర్క్ చేస్తున్నాం. మా కుప్పం ప్రాంతంలోని నాలుగు గ్రామాలు, తమిళనాడు ప్రాంతంలోని కృష్ణగిరి జిల్లా ఏకలనత్తంలో ఒక గ్రామంలో మూఢనమ్మకాలు ఉన్నాయి. దాంతో, తరచూ డాక్టర్లను, ద్రావిడ యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్ పీజీ స్టూడెంట్స్‌ను పిలిపించి ఊరివాళ్లతో మాట్లాడిస్తున్నాం. గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులతో కలిసి వాళ్లకి కొన్ని సౌకర్యాలు కల్పిస్తూ, వాళ్ళల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కొద్ది కొద్దిగా మార్పు అయితే వస్తోంది. ఇంకా మార్పు చెందాల్సినవి చాలా ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

మహిళలు

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, మహిళాశ్రమంలో కూర్చున్న మహిళలు

గ్రామస్థులతో మమేకమై పనిచేసినప్పుడే వారిలో మార్పు తీసుకురాగమని మునిరాజ్ లాంటి వారు భావిస్తున్నారు.

"సుమారు నాలుగు దశాబ్దాల నుంచి పలు ఎన్జీఓలు, రాజకీయ నేతలు వచ్చి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామ పెద్దల్లో, ఆ మహిళల్లో క్రమంగా మార్పు తీసుకురావాలి. ఊర్లో దేవుడు నగలు ఉంటాయి కాబట్టి, ఆ సమయంలో ఊరి నుంచి దూరంగా ఉండాలని వాళ్ళ పెద్దలు చెప్పడం, వీళ్ళు కూడా దేవుడిపైన నమ్మకంతో నెలసరి సమయంలో ఊర్లో ఉంటే మనకేదైనా జరుగుతుందని దూరంగా ఉంటున్నారు. వీళ్లల్లో మార్పు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం" అని ఆయన అన్నారు.

ఊరి ఆచారాలను గౌరవిస్తూనే, మహిళల సంక్షేమం, భద్రత కోసం కొన్ని గ్రామాల్లో ఊరి బయట దాతల సాయంతో పక్కా భవనాలు కూడా కట్టించామని మునిరాజ్ బాబు చెప్పారు.

“దీని గురించి ఇంగ్లిష్ పేపర్లో రావడంతో అమెరికాలో ఉండే విజయవాడకు చెందిన కురగంటి రవిశంకర్ మమ్మల్ని కాంటాక్ట్ చేసి కుప్పం వచ్చి వాళ్లకు పక్కా బిల్డింగ్ కట్టించారు. ఊరినాయనపల్లి, తమిళనాడులో ఉన్న ఏకలనత్తంలో పక్కా బిల్డింగులు కట్టించారు. ఆడబిడ్డలు ఇట్లా అడవిలో వచ్చి ఉండకూడదు, వాళ్లకు రక్షణ ఉండాలి, అనారోగ్యం పాలుకాకూడదనే ఉద్దేశంతో పక్కా బిల్డింగ్ కట్టించాం. ముట్టు గుడిసె పేరు మార్చి, మహిళా ఆశ్రమం అని పిలుస్తున్నాం. ఇది తొలి అడుగు’’ అని చెప్పారు.

మూఢ విశ్వాసాలు

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

ఫొటో క్యాప్షన్, ఊరినాయనిపల్లి గ్రామపెద్ద తాయప్ప

అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది?

ఈ గ్రామాల ప్రజలంతా వ్యసాయంపై ఆధారపడి బతుకుతారు. అందరూ ఆవులు, గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

ఇప్పటికీ ఈ గ్రామాల్లో చెప్పులు వేసుకోరు. కానీ, నేటి యువతలో కొంత మార్పు వచ్చింది. బయట పనులపై వెళ్లే యువత చెప్పులు వేసుకుంటున్నారు.

అయితే, ఉత్సవాల సమయంలో స్వామివారి నగలు తాకే వారు మాత్రం కచ్చితంగా కాళ్లకు ఎప్పుడూ చెప్పులు వేసుకోరు. అలా చెప్పులు వేసుకుంటే చెడు జరుగుతుందని వారు భావిస్తారు.

ఈ ఐదు గ్రామాలూ అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉంటాయి. కొన్ని దేవాలయాలు అటవీ ప్రాంతంలో ఉంటాయి.

జాతర సమయంలో తప్ప మిగతా సమయాల్లో స్వామివారికి సంబంధించిన ఆభరణాలు, వస్తువులను గ్రామ పూజార్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచుతారు కాబట్టి అంటు, ముట్టు ఉండకూడదని వీరు భావిస్తారు.

‘‘మేం కదిరి లక్ష్మీ నరిసింహస్వామికి పూజార్లం. స్వామివారు మా గ్రామాలపై నుంచి నడుచుకుంటూ వెళ్లి ఆ కొండపై వెలిశారు. మా దేవుడికి అంటు, ముట్టు ఉండకూడదు. దేవుడి ఉత్సవం జరిగేటప్పుడు బహిష్టు అయిన మహిళ మా గ్రామంలో ఉండడం వల్ల దేవుడికి వాయిస్తున్న డోలు పగిలిపోయిందట. దాన్ని అపచారంగా భావించి.. అప్పటినుంచి మా పెద్దలు ఈ ఆచారాలు పెట్టారని చెబుతారు. మా దేవుడికి సంబంధించిన నగలు ఐదు ఊరల్లో ఉంటాయి కాబట్టి, మా గ్రామాల్లో ఈ సంప్రదాయం ఉంది. మా తాతల కాలం నుంచీ మేం మా గ్రామాల్లో చెప్పులు వేసుకోం. బాలింతలు, బహిష్టు అయిన మహిళలు ఊరికి దూరంగా ఉండాలి అనే నియమాలు ఉన్నాయి’’ అని ఊరునాయని పల్లికి చెందిన తాయప్ప బీబీసీతో చెప్పారు.

నెలసరి వచ్చిన మహిళలకు గ్రామంలో వండిన భోజనం, నీరు కూడా అందించరు. వీరు గ్రామానికి దూరంగా ఉన్న చెరువు, కుంటల్లో నుంచి నీటిని తెచ్చుకుని భోజనం వండుకుంటారు. అత్యవసరమైతే హోటళ్ల నుంచి భోజనాలు తెచ్చిస్తారు. ఆ మహిళలు గ్రామంలో ఏ వస్తువును తాకినా అపచారంగా భావిస్తారు.

మహిళలు

ఫొటో సోర్స్, BBC/THULASI PRASAD REDDY

అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ నాలుగు గ్రామాల్లో మూఢ నమ్మకాల వల్ల మహిళలు నెలసరి సమయంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉండాల్సి వస్తోందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజల్లో మార్పు వచ్చేవరకూ ఇలాంటి ఆచారాలను మార్చడం కష్టమని కుప్పం ఆర్డీవో శివయ్య బీబీసీతో అన్నారు.

“పూర్వీకులు, సంప్రదాయాలు అని చెప్పి, నెలసరి సమయంలో వేరుగా ఉండాలని ఊరి బయటకు పంపిస్తున్నారు. దానివల్ల ఆ మహిళలకు ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే చీకటిలో పురుగులు, పాములు వచ్చినా సమస్యే. అందుకే వాళ్లను బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంచుకునే విధంగా అవగాహన కల్పించడానికి ప్రతి గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి యువతలో కొంత మార్పు వచ్చింది” అన్నారు.

నెలసరి అయిన మహిళలు ఇళ్లలో ఉండడం వల్ల ఎలాంటి నష్టం, చెడు జరగదు అని గ్రామసభల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, పౌష్టికాహారం అందించాల్సిన సమయంలో వారిని ఊరికి దూరం పెట్టడం మంచిది కాదని చెబుతున్నామని శివయ్య వివరించారు.

“మన ప్రయత్నాలు ఎలా ఉన్నా, మహిళలు నెలసరి సమయంలో ఇంట్లో ఉంటే ఎలాంటి కీడు జరగదు అని వాళ్లకు నమ్మకం వస్తే తప్ప మార్పు రాదు" అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, రుతుస్రావం సమయంలో మహిళలను ఊరి బయట ఉంచుతున్న కొన్ని గ్రామాలు...

ఇవి కూడా చదవండి: