ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వస్తున్నారని నమ్మించారు, చివరికి ఏమైందంటే..

వరల్డ్ స్టార్టప్

ఫొటో సోర్స్, COURTESY SACHIN CHAUHAN

    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

దిల్లీ శివారులోని నోయిడా వేదికగా మార్చి 24 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ‘‘వరల్డ్ బిగ్గెస్ట్ ఫండింగ్ ఫెస్టివల్’’ కార్యక్రమానికి వందల మంది వర్ధమాన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

అయితే, ఈ కార్యక్రమం మొదలైన కొన్ని గంటల్లోనే చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

తప్పుడు హామీలతో తమను ఆకర్షించి మోసం చేశారని చాలామంది సభ్యులు, కొంతమంది స్పాన్సర్లు ఆరోపించారు. ఈవెంట్ నిర్వాహకులు రూ. 98 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఆరోపణలను కార్యక్రమ నిర్వాహకులు ఖండించారు.

అసలేం జరిగిందంటే..

‘‘వరల్డ్ స్టార్టప్ కన్వెన్షన్ (డబ్ల్యూఎస్‌సీ)’’ పేరిట జరిగిన ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలను తమ ఆలోచనలతో ఆకట్టుకుంటే నిధులు లభిస్తాయని కొత్తగా స్టార్టప్‌లు ప్రారంభించినవారు ఆశించారు.

2021తో పాటు 2022లో భారత స్టార్టప్‌లలోకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. కంపెనీలు రికార్డు స్థాయిలో నిధులు సేకరించడంతో పాటు యూనికార్న్‌లు పుట్టుకొచ్చాయి. చాలామంది పారిశ్రామికవేత్తలు రాత్రికిరాత్రే మిలియనీర్లుగా మారారు.

కానీ, ప్రపంచ పారిశ్రామిక రంగ పరిస్థితులు పెట్టుబడిదారులను అప్రమత్తం అయ్యేలా చేశాయి. లిక్విడిటీని తగ్గించాయి.

అందుకే డబ్ల్యూఎస్‌సీ సమావేశంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

కార్యక్రమం మొదటి రోజున, సచిన్ చౌహాన్‌తో పాటు ఆయన బృందం చాలా ఉత్సాహంగా సమావేశానికి వచ్చారు.

ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో వచ్చిన డబ్ల్యూఎస్‌సీ ప్రకటనలు చూసిన తర్వాత, హరియాణా వ్యాపారవేత్త అయిన చౌహాన్ ఈ ఈవెంట్‌లో పాల్గొనడం కోసం పాస్‌లు కొన్నారు.

వరల్డ్ స్టార్టప్ కన్వెన్షన్

ఫొటో సోర్స్, WORLD STARTUP CONVENTION

కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మాన్సుక్ మాండవీయలతో పాటు భారత అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులుగా రానున్నారని డబ్ల్యూఎస్‌సీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఇతర అతిథుల జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నారు.

గడ్కారీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో ఈవెంట్‌లో ఆయన ప్రసంగానికి సంబంధించిన పోస్ట్‌లు కనిపించాయి.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియోల్లో ప్రముఖ వ్యక్తులు అయిన అంకుర్ వారికో, ప్రఫుల్ బిల్లోర్, రాజ్ షమానీ, చేతన్ భగత్ కనిపించారు.

ఈ సమావేశానికి 1,500 మంది వెంచర్ క్యాపిటలిస్టులు, 9000 మంది ఇన్వెస్టర్లు వస్తారని, 75,000 స్టార్టప్ కంపెనీలు పాల్గొననున్నాయని పేర్కొన్నారు.

‘అప్నా మెకానిక్’ అనే బైక్ సర్వీసింగ్, రీపెయిర్ యాప్ సహ వ్యవస్థాపకుడు అయిన చౌహాన్, తనతో పాటు తన నలుగురు సహోద్యోగుల కోసం రూ. 20,000 ఖర్చుపెట్టి టిక్కెట్లు కొన్నారు.

ఇన్వెస్టర్లతో తమ ఆలోచనలను పంచుకోవడం కోసం ఒక ప్రెజెంటేషన్‌తో వారు సమావేశానికి వచ్చారు. అయితే, వారి ఉత్సాహం ఎక్కువసేపు నిలవలేదు.

‘‘మేం అక్కడికి వెళ్లి గంటలు గడిచాయి. కానీ, మాకు పెద్దగా ఇన్వెస్టర్లు కనిపించలేదు’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.

రిప్రోక్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు బెరవ్ జైన్ వేలాది కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడు నుంచి నోయిడాకు వచ్చారు.

‘‘అక్కడున్న గుంపులో స్టార్టప్‌ల వ్యవస్థాపకులే ఉన్నారు. అందులో ఒక్కరైనా ఇన్వెస్టర్ ఉండి ఉంటారని నేను అనుకోను’’ అని ఆయన అన్నారు.

ముఖ్య అతిథుల జాబితా

ఫొటో సోర్స్, SCREENSHOT/WSC

ఫొటో క్యాప్షన్, ముఖ్య అతిథుల జాబితా

షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మంత్రి గడ్కరీ వర్చువల్ ప్రసంగ కార్యక్రమం రద్దు అయినట్లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రకటించడంతో అక్కడికి వచ్చిన వారిలో అసంతృప్తి పెల్లుబికింది.

చాలా మంది స్టేజీ దగ్గరకు వెళ్లి, తమకు సరైన వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

‘‘ఇన్వెస్టర్లు ఎక్కడ ఉన్నారని అక్కడికి వచ్చిన వారందరూ అడగడం మొదలుపెట్టారు. కానీ, దీనికి సమాధానం లేకపోవడంతో అక్కడికి వచ్చిన వారందరూ గందరగోళంలో పడ్డారు’’ అని చౌహాన్ చెప్పారు.

సమావేశం నిర్వాహకులు తమను మోసం చేసి, తమ నమ్మకాన్ని వమ్ము చేశారంటూ చౌహాన్, జైన్ సహా 19 మందితో కూడా వ్యాపారవేత్తల బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డబ్ల్యూఎస్‌సీ సమావేశాన్ని నిర్వహించిన ‘క్యూవో ఫౌండర్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ సహ వ్యవస్థాపకులు ల్యూక్ తల్వార్, అర్జున్ చౌదరీ ఈ ఆరోపణలు అన్నింటినీ ఖండించారు.

బీజేపీ వ్యతిరేక ఎజెండాతో వచ్చిన కొద్దిమంది వ్యక్తులు ఈ ఈవెంట్‌ను నాశనం చేశారని, వారి వల్ల పోలీసులను పిలవాల్సి వచ్చిందని బీబీసీతో వారు చెప్పారు.

దీని గురించి బీజేపీ నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు.

ప్రోమో వీడియో

ఫొటో సోర్స్, SCREENSHOT/WSC

ఫొటో క్యాప్షన్, ఈవెంట్ ప్రోమో వీడియోల్లో ప్రముఖ ఇన్‌ఫ్లూయన్సర్లు

గడ్కారీ ప్రసంగాన్ని కూడా వారివల్లే రద్దు చేయాల్సి వచ్చిందని బీబీసీతో అర్జున్ చౌదరీ చెప్పారు. పోలీసుల భద్రతతో మిగతా సమావేశాన్ని ప్రణాళిక ప్రకారమే నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

‘‘ఇన్టెస్టర్ల సంఖ్య తక్కువే కావొచ్చు. కానీ, అక్కడికి ఇన్వెస్టర్లు వచ్చారు’’ అని ఆయన తెలిపారు.

భారత అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ, పెట్టుబడుల సంస్థ యూనీకార్న్ ఇండియా వెంచర్స్, ఆర్థిక సేవల కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, సాఫ్ట్‌వేర్ టైకూన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సంస్థ ఆ సమావేశానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

డబ్ల్యూఎస్‌సీలో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి కొంతమంది సోషల్ మీడియాలో తీవ్రమైన పోస్టులు చేశారు. నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు.

ఆ ఈవెంట్‌ను స్పాన్సర్ చేసేలా తమను తప్పుదారి పట్టించారని కొన్ని కంపెనీలు ఆరోపించాయి.

సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న అంకుర్ వరికూ, రాజ్ షమానీ కూడా తమ అనుమతి తీసుకోకుండానే తమ వీడియోలను ప్రమోషన్‌లలో వాడారని ఆరోపిస్తున్నారు. నిర్వాహకులు వీటిని తిరస్కరించారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

బెంగళూరుకు చెందిన ‘బాంబ్ర్యూ’ అనే ప్యాకేజింగ్ కంపెనీ తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.

ఈ ఈవెంట్‌ను స్పాన్సర్ చేయడం కోసం రూ. 36 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు బాంబ్ర్యూ వ్యవస్థాపకుడు వైభవ్ అనంత్ చెప్పారు.

‘‘మేం ట్రాప్‌లో పడిపోయాం. భారీగా పెట్టుబడులు పెట్టాం. స్పాన్సర్‌గా ఉండటమే కాకుండా మిగతా వాటిలో కూడా చాలా డబ్బు కుమ్మరించాం’’ అని వైభవ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యహరించిన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘బిల్డర్.ఏఐ’ కూడా డబ్ల్యూఎస్‌సీలో జరిగిన ఘటనతో తాము తీవ్ర నిరాశలో ఉన్నట్లు వ్యాఖ్యానించింది.

తమ డబ్బు తిరిగి చెల్లించి, ఈవెంట్‌లో స్పాన్సర్ల జాబితా నుంచి తమ కంపెనీ పేరును తొలగించాలని నిర్వాహకులను కోరినట్లు ఆయన తెలిపారు.

కానీ, ‘బిల్డర్.ఏఐ’ కంపెనీ పేరు, లోగో ఇప్పటికీ డబ్ల్యూఎస్‌సీ వెబ్‌సైట్‌లో అలాగే కనిపిస్తున్నాయి.

వరల్డ్ స్టార్టప్ కన్వెన్షన్

ఫొటో సోర్స్, WORLD STARTUP CONVENTION

ఇతర స్పాన్సర్లు కూడా బిల్డర్.ఏఐ కంపెనీ తరహాలోనే ట్వీట్లు చేశారు.

విస్తృతమైన మీడియా కవరేజీ తమ జీవితాలను నాశనం చేసిందని చౌదరీ అన్నారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరు అవుతారని తాము అనుకున్నట్లు కొంతమంది స్పాన్సర్లు, సభ్యులు చెప్పారు.

అంకుర్ వరికూ వంటి ఇన్‌ఫ్లూయన్సర్ల ప్రమేయం కారణంగానే స్టార్టప్‌ల యజమానులు ఆశతో ఆ ఈవెంట్‌కు వచ్చారని వారి తరఫు లాయర్ రఘుమన్యు తనేజా అన్నారు. భారత ఎండార్స్‌మెంట్ నిబంధనల ప్రకారం ఇన్‌ఫ్లూయన్సర్లు ఇప్పుడు జరిమానాలు ఎదుర్కోవచ్చని బీబీసీతో రఘుమన్యు చెప్పారు.

అయితే, అంకుర్ వరికూ దీనిని ఖండించారు.

తల్వార్

ఫొటో సోర్స్, WSC/INSTAGRAM

ఫొటో క్యాప్షన్, తల్వార్

ఈవెంట్ నిర్వాహకులు రూ. 98 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవెంట్‌కు తరలివచ్చిన స్టార్టప్ కంపెనీల సంఖ్య ఆధారంగా వారు ఇంత స్థాయి మోసం జరిగినట్లు అంచనాకు వచ్చారు.

‘‘ఒకవేళ అది నిజంగా స్కామ్ అయితే, మేం ఇప్పటికే డబ్బుతో పారిపోవాలి కదా? మరి నేను డబ్బుతో ఎందుకు పారిపోలేదు. ఈవెంట్‌ కోసం పోగు చేసిన డబ్బు కూడా వారు ఆరోపించిన మొత్తంలో చాలా స్వల్ప స్థాయిలో ఉంటుంది’’ అని చౌదరీ అన్నారు.

తల్వార్ చెప్పినదాని ప్రకారం, ఈవెంట్‌లో 4000 మంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)