బుర్కా వేసుకుని మహిళా చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న యువకుడు చాలామంది అమ్మాయిలను ఓడించాడు, చివరికి ఎలా దొరికిపోయాడంటే..

ఫొటో సోర్స్, CHESS KENYA
కెన్యాలో 25 ఏళ్ల చెస్ క్రీడాకారుడు బుర్కా ధరించి 'మహిళా ఓపెన్ చెస్ టోర్నమెంట్'లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
స్టాన్లీ ఒమొండి అనే ఈ చెస్ ఆటగాడు బుర్కా, కళ్లద్దాలు ధరించి మిల్లిసెంట్ అవుర్‌గా తన పేరును పోటీల్లో నమోదు చేసుకున్నాడు. అంతేకాదు బలమైన మహిళా ప్రత్యర్థులపై గెలిచాడు.
అయితే, మిల్లిసెంట్ అవుర్ అనే ఈ కొత్త అమ్మాయి అలా సీనియర్ మహిళా చెస్ క్రీడాకారిణులపై విజయం సాధిస్తుండటంతో నిర్వాహకులకు అనుమానం వచ్చింది.
కానీ, వారి మత సంప్రదాయం దృష్ట్యా ప్రశ్నించడానికి మొదట్లో సంశయించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా దొరికాడు?
కెన్యా రాజధాని నైరోబీలో గతవారం ఈ కెన్యా ఓపెన్ టోర్నమెంట్ జరిగింది.
చెస్ పోటీల్లో పాల్గొనడానికి 22 దేశాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో దాదాపు 99 మంది మహిళా కేటగిరిలో రిజస్టర్ చేసుకున్నారు.
ఈ విభాగంలో గెలుపొందిన విజేతకు రూ. 2.5 లక్షల ప్రైజ్‌మనీ ప్రకటించారు.
ఒమొండి ఒక బలమైన చెస్ ఆటగాడు. అమ్మాయి పేరుతో రిజిస్టర్ చేసుకుని అమ్మాయిలతో చెస్ ఆడాడు. నిర్వాహకులు గుర్తించి, పట్టుకున్నారు.
అనంతరం అతడు ఓ లేఖ విడుదల చేశారు. తనకు ఆర్థిక సమస్యలుండటంతోనే అలా చేశానని, క్షమించాలని, ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఒమొండి చెప్పాడు. దీనిపై ఒమొండితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
'అతనిపై తప్పకుండా కొన్ని సంవత్సరాల బ్యాన్ పడుతుంది'' అని కెన్యా చెస్ ప్రెసిడెంట్ బెర్నార్డ్ వంజాలా చెప్పారు.
''మాకు మొదట్లో ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే అతను హిజాబ్ ధరించి వచ్చాడు. అయితే స్ట్రాంగ్ ప్లేయర్స్‌పై గెలిచాడు. ఎప్పుడూ ఇలాంటి టోర్నమెంట్‌లో ఆడని వ్యక్తి అలా గెలిచే అవకాశం లేదు. ఆ వ్యక్తి పాదరక్షలూ అనుమానం కలిగించేలా ఉన్నాయి.
ఆ వ్యక్తి మహిళలు కాకుండా పురుషులు ధరించే బూట్లు వేసుకున్నాడు. ఇక ఆ వ్యక్తి మాట్లాడటం లేదనీ మేం గమనించాం. తన ట్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినపుడు కూడా ఆ వ్యక్తి మాట్లాడలేదు.
మామూలుగా ఆట ఆడుతున్న ప్రత్యర్థితోనైనా మాట్లాడుతారు. ఎందుకంటే చెస్ గేమ్ అనేది యుద్ధం కాదు స్నేహం'' అని వంజాలా బీబీసీ స్పోర్ట్స్ ఆఫ్రికాతో చెప్పారు.
అయితే అధికారులకు కొద్దిగా అనుమానం ఉన్నా.. మతపరమైన వస్త్రధారణ కారణంగా ఆ వ్యక్తిని గేమ్ ఆడటానికి అనుమతించారు. చివరికి ఆ వ్యక్తిని నాలుగో రౌండ్‌లో పట్టుకున్నారు.

ఫొటో సోర్స్, CHESS KENYA
'నా ఇబ్బందులు తీరుతాయనే ఇలా చేశా'
''ఒక బలమైన ప్రత్యర్థిపై అతను గెలిచిన తర్వాత మేం పిలిచాం. అతనేమీ ఆశ్చర్యపోలేదు. అతను పురుషుడినని అంగీకరించాడు. జరిగిన దానికి పశ్చాత్తాపపడ్డాడు. క్షమాపణలు కూడా చెప్పాడు.
తనకు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఈ పని చేశానన్నాడు'' అని వంజాలా చెప్పారు.
కెన్యాలో గతంలో వయసు తక్కువ చెప్పి ఆడిన ఘటనలున్నాయని, ఇలాంటి మోసం మొదటిదని వంజాల తెలిపారు. ఒమొండి మంచి చెస్ ఆటగాడని వంజాలా అంగీకరించారు.
కాగా, ఈ కేసును క్రమశిక్షణా కమిటీలో ఫిర్యాదు చేశారు. రాబోయే రెండు రోజుల్లో తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
"ఇది తీవ్రమైన కేసు, తీర్పులో నిషేధం ఉండవచ్చు. నేను జీవితకాల నిషేధాన్ని సమర్థించను. కానీ అతనిపై చెస్ ఆడకుండా కొన్నేళ్ల నిషేధం పడవచ్చు" అని వంజాలా వ్యాఖ్యానించారు.
ఈ కేసును అంతర్జాతీయ ఫెడరల్‌కు కూడా నివేదిస్తామని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
- హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














