ఫేస్‌బుక్ రేపిస్ట్: చనిపోయినట్లు నమ్మించి జైలు నుంచి తప్పించుకున్న హంతకుడు, ఎలా గుర్తించారంటే...

ఫేస్‌బుక్ రేపిస్ట్

ఫొటో సోర్స్, GALLO IMAGES

ఫొటో క్యాప్షన్, థాబో బీస్టర్ (కుడి) చనిపోయినట్లు నటించి జైలు నుంచి పారిపోయాడు.
    • రచయిత, క్యాథరీన్ ఆమ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చనిపోయినట్లు నటించి, దక్షిణాఫ్రికా జైలు నుంచి తప్పించుకున్న ఓ రేపిస్ట్‌ టాంజనియాలో అరెస్ట్ చేశారు.

థాబో బీస్టర్ అనే నేరస్తుడు జైలు సెల్‌లో తనకు తాను నిప్పంటించుకుని, చనిపోయినట్లు అందర్ని నమ్మించాడు.

అయితే, జైలు అధికారులు తాజాగా చేపట్టిన పోస్ట్‌మార్టంలో ఆ మృతదేహం అతనిది కాదని తేలింది. దీంతో బీస్టర్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.

బీస్టర్ శుక్రవారం తన ప్రేయసి, మరొక వ్యక్తితో కలిసి ఉండగా, టాంజనియాలో పట్టుబడ్డాడు. వారిని ప్రస్తుతం దక్షిణాఫ్రికా తరలించనున్నారు.

ఈ ముగ్గురు కలిసి పక్కనే ఉన్న కెన్యాకు పారిపోవాలని చూస్తున్నారని పోలీసులు చెప్పారు.

బీస్టర్‌కి ‘‘ఫేస్‌బుక్ రేపిస్ట్’’గా పేరుంది. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను వాడుతూ బాధితులకు ఎర వేసేవాడు.

మోడల్, తన గర్ల్‌ఫ్రెండ్ నోమ్‌ఫుండో టైహులును అత్యాచారం చేసి, హత్య చేసినందుకు అతనికి 2012లో శిక్ష పడింది.

ఈ ఏడాదికి ముందు, మరో ఇద్దర్ని అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

అయితే, బ్లూమ్‌ఫౌంటేన్‌ నగరంలోని మాంగ్వాంగ్ కరెక్షనల్ సెంటర్‌లో అతను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గతేడాది మే నెలలో జైలు అధికారులు పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికాలో లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన (ఫైల్ ఫొటో )

కానీ స్థానిక మీడియా సంస్థలు మాత్రం బీస్టర్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చాయి.

చనిపోయింది బీస్టర్ కాదని కొన్ని పరీక్షలు నిర్ధారించడంతో, మార్చి నెలలో పోలీసులు బీస్టర్ మరణంపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మరోసారి పోస్ట్ మార్టం చేశారు.

బ్రిటన్‌కు చెందిన సెక్యూరిటీ కంపెనీ జీ4ఎస్‌ ఉద్యోగులు అతను జైలు నుంచి పారిపోయేందుకు సహకరించినట్లు ఆరోపణలున్నాయి.

ఈ సంఘటనతో ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.

ఈ వారం ప్రారంభంలో బీస్టర్ పారిపోయిన విషయంపై పార్లమెంట్‌లో నిర్వహించిన సమావేశానికి జీ4ఎస్‌ ప్రతినిధులు హాజరు కాలేదు.

ఈ విషయంపై స్పందించేందుకు జీ4ఎస్ సంస్థను బీబీసీ సంప్రదించింది.

గత ఏడాది కాలంగా బీస్టర్‌ను కనిపించినట్లు పలు వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి.

జోహన్నెస్‌బర్గ్ ప్రాంతంలోని ఒక గ్రోసరీ షాపింగ్‌లో కనిపించాడని, అక్కడే ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

బీస్టర్ తప్పించుకుని పారిపోవడంపై దక్షిణాఫ్రికాలో నిరసనలు వ్యక్తమయ్యాయి.

ప్రపంచంలో అత్యంత ఎక్కువగా లైంగిక వేధింపులు జరిగే ప్రాంతాల్లో ఒకటిగా దక్షిణాఫ్రికాకు పేరుంది.

ఇవి కూడా చదవండి: