అతీక్ అహ్మద్: ఈ బాహుబలి క్రిమినల్ భార్య, పిల్లలు, సోదరుడి క్రైమ్ కథలు మీకు తెలుసా?

అతీక్ అహ్మద్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, అనంత్ ఝణాణే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌పై కాల్పులు జరిగాయి.

మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అష్రఫ్ జైలు పాలు కాగా, రాజుపాల్ హత్య కేసులో సాక్షి ఉమేష్ పాల్ హత్యకు సంబంధించి విచారణ కోసం ప్రయాగ్‌రాజ్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో వారిపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు.

అంతకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని ఎస్‌టీఎఫ్ గురువారం మధ్యాహ్నం అతీక్ అహ్మద్ కుమారుడు అసద్‌తో పాటు మరో 'షూటర్' గులామ్‌ను హతమార్చింది.

ఝాన్సీలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉమేష్ పాల్ హత్య దర్యాప్తుకు సంబంధించి ఇదొక పెద్ద విజయమని ఉత్తరప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు.

అయితే, ఇది బూటకపు ఎన్‌కౌంటరని, దీనిపై విచారణ జరపాలని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌ పార్టీలు డిమాండ్ చేశాయి.

ఈ నేపథ్యంలో, అతీక్ అహ్మద్ అతని కుటుంబ సభ్యుల నేర చరిత్ర ఏంటి? ఆయన కుటుంబంపై ఎలాంటి ఆరోపణలు, ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈ అంశాల గురించి పోలీసులు, అధికారులు, డాక్యుమెంట్ల ఆధారంగా తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.

అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్

ఫొటో సోర్స్, UP POLICE HANDOUT

అతీక్ అహ్మద్ మూడో కుమారుడు అసద్ అహ్మద్

ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎస్‌టీఎఫ్ చేతిలో అసద్ హతమయ్యారు. అతీక్ అహ్మద్ మూడో కుమారుడు అసద్ అహ్మద్.

ఉత్తరప్రదేశ్ పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, అసద్‌పై ఒకే కేసు నమోదై ఉంది. ఉమేష్ పాల్, అతని ఇద్దరు గన్‌మెన్‌ల హత్యకు సంబంధించి అసద్‌పై కేసు ఉంది. ఉమేష్ పాల్ హత్య తర్వాత అసద్ పరారీలో ఉన్నారు.

ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో, అసద్ కాల్పులు జరుపుతూ కనిపించారని పోలీసులు తెలిపారు.

2003 సెప్టెంబర్‌లో అసద్ జన్మించారని, ఆయన వయస్సు 19 ఏళ్లు అని పోలీసులు వెల్లడించారు.

అసద్, ప్రయాగ్‌రాజ్‌లో ప్రాథమిక విద్యను చదివారు. తర్వాత లఖ్‌నవూలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మిగతా చదువును పూర్తి చేశారు.

అసద్ విదేశాల్లో ‘లా’ విద్య చదవాలనుకున్నాడని, అందుకు పాస్‌పోర్ట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నాడని అతీక్ అహ్మద్ తరపు న్యాయవాది విజయ్ మిశ్రా తెలిపారు.

కానీ, పోలీసుల వెరిఫికేషన్‌లో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అతనికి పాస్‌పోర్ట్ రిజెక్ట్ అయిందని, ఆ కారణంగానే అతను విదేశాలకు వెళ్లి చదువుకోలేకపోయారని విజయ్ మిశ్రా చెప్పారు.

అతీక్ అహ్మద్

ఫొటో సోర్స్, FACEBOOK/SANSAD ATEEQ AHMAD YOUTH BRIDGE/BBC

అతీక్ అహ్మద్‌పై100 కంటే ఎక్కువ కేసులు

అతీక్ అహ్మద్‌, సబర్మతి జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న 50కి పైగా కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతోంది.

అయితే, మొత్తంగా అతీక్ అహ్మద్ పేరు మీద 100కు పైగా కేసులు ఉన్నాయి.

ప్రయాగ్‌రాజ్ ప్రాసిక్యూషన్ అధికారులు చెప్పినదాని ప్రకారం, 1996 నుంచి అతీక్ అహ్మద్‌పై 50 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

మరో 12 కేసుల్లో అతీక్, అతని సోదరుడు అష్రఫ్ లాయర్లు పిటిషన్లు దాఖలు చేయడంతో, ఈ కేసుల్లో వారిపై అభియోగాలు నమోదు చేయలేదని ప్రాసిక్యూషన్ పేర్కొంది.

బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. ఈ కేసును ఇప్పుడు సీబీఐ విచారిస్తోంది.

ప్రయాగ్‌రాజ్‌లోని ఎంపీఎంఎల్‌ఏ కోర్టు ఈ ఏడాది మార్చి 28న అతీక్ అహ్మద్‌ను దోషిగా నిర్ధరించింది.

2006లో ఉమేష్‌పాల్‌ను కిడ్నాప్ చేసిన కేసులో అతీక్ అహ్మద్‌ను దోషిగా నిర్ధరించి జీవిత ఖైదు విధించింది.

తొలుత రాజుపాల్ హత్యకేసులో ఉమేష్ పాల్‌ను ప్రాథమిక సాక్షిగా పరిగణించారు. కానీ, తర్వాత ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ, ఉమేష్ పాల్‌ను సాక్షిగా పరిగణించలేదు.

షాయిస్తా పర్వీన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అతీక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్

షాయిస్తా పర్వీన్

అతీక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్. ఉమేష్ పాల్ హత్య కేసులో పర్వీన్ కూడా నిందితురాలు.

షాయిస్తా పర్వీన్‌పై 2009లో ప్రయాగ్‌రాజ్‌లోని కల్నల్‌గంజ్‌లో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అవి ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

షాయిస్తా పర్వీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆమె డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది.

ఎన్నికల్లో పర్వీన్‌ను తమ అభ్యర్థిగా ఈ ఏడాది జనవరి నెలలో బీఎస్పీ ప్రకటించింది. అయితే, కొద్ది రోజుల క్రితం మాయావతి ఆమె టిక్కెట్‌ను రద్దు చేశారు. అతీక్ అహ్మద్ కుటుంబంలోని ఎవరికీ పార్టీ టిక్కెట్ ఇవ్వబోమని మాయావతి ప్రకటించారు.

ఉమేష్ పాల్ హత్య కేసు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ చిత్రం

ఉమర్ అహ్మద్

అతీక్ అహ్మద్ పెద్ద కొడుకు పేరు ఉమర్ అహ్మద్.

లఖ్‌నవూ వ్యాపారవేత్త మోహిత్ జైస్వాల్ కిడ్నాప్ కేసులోని ప్రధాన నిందితుల్లో ఉమర్ అహ్మద్ కూడా ఒకరు.

2022 ఆగస్టులో ఉమ్మర్ అహ్మద్, లఖ్‌నవూలో లొంగిపోయారు.

నిజానికి అతీక్‌తో పాటు ఉమర్‌పై 2018లోనే మోహిత్ జైస్వాల్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

మోహిత్ జైస్వాల్‌ను లఖ్‌నవూ నుంచి కిడ్నాప్ చేసి, ఆయనను తీవ్రంగా కొట్టి, కంపెనీలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని వారిపై ఆరోపణలు నమోదయ్యాయి.

ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి వచ్చాక, ఉమర్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

ఉమర్ ‘లా’ చదివారు. ప్రస్తుతం లఖ్‌నవూ జైలులో ఉన్నారు. ఆయన కేసు లఖ్‌నవూలోని సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉంది.

అలీ అహ్మద్

అతీక్ అహ్మద్ రెండో కుమారుడు అలీ అహ్మద్. అతనిపై ప్రయాగ్‌రాజ్‌లో మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ప్రయాగ్‌రాజ్‌లో దోపిడీకి సంబంధించిన కేసు.

ప్రయాగ్‌రాజ్‌లోని జీషన్ అనే ప్రాపర్టీ డీలర్ నుంచి డబ్బు వసూలు చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడని అలీపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణల ప్రకారం, ఆయనపై అల్లర్లు, హత్యాయత్నం కేసులను నమోదు చేశారు.

2021 జూలైలో అలీ ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ జైలులో ఉన్నారు.

ఉమేష్ పాల్, రాజు పాల్

ఫొటో సోర్స్, PRABHAT VERMA AND PUJA PAL

ఫొటో క్యాప్షన్, ఉమేష్ పాల్ (ఎడమ), రాజు పాల్ (కుడి)

అతీక్‌ మరో ఇద్దరు కుమారులు మైనర్లు

తన ఇద్దరు మైనర్ కుమారులను పోలీసులు అక్రమంగా ఇంటి నుంచి తీసుకెళ్లి ఎక్కడో ఉంచారని అతీక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్ ఆరోపించారు. ఉమేష్ పాల్ హత్య తర్వాత నుంచి ఆమె పరారీలో ఉన్నారు.

తన ఇద్దరు కుమారుల పేరిట ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన కుమారులిద్దరినీ కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం, మహిళా పోలీసు లేకుండానే పోలీసులు బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించి తన కొడుకులిద్దరినీ అక్రమంగా గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని పర్వీన్ ఆరోపించారు.

తనను కూడా శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపారు.

అష్రఫ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అష్రఫ్

అష్రఫ్

అతీక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ అలియాస్ ఖాలిద్ అజ్మీ. అష్రఫ్‌పై 52 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య, హత్యాయత్నం, అల్లర్లు తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఉమేష్ పాల్ హత్య కేసులో అష్రఫ్ కూడా నిందితుడిగా ఉన్నారు.

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు తీర్పులో అష్రఫ్‌ను నిర్దోషిగా తేల్చడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ కేసులో అతీక్‌తో పాటు మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించి, మరో ఆరుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు.

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో కూడా అష్రఫ్ నిందితుడు. లఖ్‌నవూలోని సీబీఐ కోర్టులో ఈ కేసు నడుస్తోంది.

అష్రఫ్‌ను బరేలీ జైలులో ఉంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)