అతీక్, అష్రఫ్ హత్యకు కొద్దిసేపు ముందు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం వారిని పోలీసులు ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు.
అతీక్ అహ్మద్, అతని సోదరుడి హత్య చేసిన ముగ్గుర్ని ఘటనా స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ హత్య వెనుకున్న అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.
నిందితుల కుటుంబ సభ్యులు ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
తన కొడుకు నిరుద్యోగి అని, డ్రగ్స్‌కి బానిసయ్యాడని ముగ్గురు నిందితుల్లో ఒకరైన లవ్‌లేష్ తివారి తండ్రి యజ్ఞ తివారి ఏఎన్ఐతో చెప్పారు.
‘‘అతను నా కొడుకు. టీవీలో మేం ఈ ఘటనను చూశాం. లవ్‌లేష్ ఏం చేస్తున్నాడన్నది మాకు తెలియదు. అతను అక్కడికి ఎలా వెళ్లాడన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. మాకు అతని గురించి ఏమీ తెలియదు. మాతో ఉండటం లేదు.
కనీసం కుటుంబం గురించి కూడా పట్టించుకోవడం లేదు. అతను మాతో ఏమీ చెప్పడు. ఐదారు రోజుల క్రితం అతను ఇక్కడికి వచ్చాడు. ఎన్నో ఏళ్లుగా మేం అతనితో మాట్లాడటం మానేశాం. ఇప్పటికే అతనిపై ఒక కేసు రిజిస్టర్ అయి ఉంది. ఆ కేసులో జైలులో ఉన్నాడు’’ అని లవ్‌లేష్ తండ్రి యజ్ఞ తివారి చెప్పారు.
మరో నిందితుడు సన్నీ సింగ్ సోదరుడు పింటు సింగ్‌తో కూడా ఏఎన్ఐ మాట్లాడింది.
సన్నీ సింగ్ కూడా ఏమీ చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడని తన సోదరుడు పింటు సింగ్ చెప్పారు.
తాము వేరుగా ఉంటున్నామని, అతనెలా క్రిమినల్‌గా మారాడో తనకు తెలియదన్నారు.
ఈ సంఘటన గురించి తమకు ఎలాంటి అవగాహన లేదన్నారు.

ఫొటో సోర్స్, ANI
దాడి చేసిన వారు హత్యను అంగీకరించినట్లు దైనిక్ జాగరణ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
‘‘మాఫియా అతీక్‌కి పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయి. అతీక్, ఆయన గ్యాంగ్ సభ్యులు ఎంతో మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. దోపిడీ పేరుతో ఎంతో మందిని చంపారు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారికి కనీసం సమయం కూడా ఇవ్వరు. ఆయన సోదరుడు అష్రఫ్ కూడా అలానే చేస్తుండేవారు. అందుకే ఇద్దర్ని మేం చంపేశాం’’ అని దుండగులు పోలీసుల ముందు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు దైనిక్ జాగరణ్ పేర్కొంది.
కాల్పులకు పాల్పడ్డ వారు ఇప్పటికే వివిధ కేసుల్లో జైలుకి వెళ్లొచ్చారు. వీరెప్పుడు ప్రయాగరాజ్‌కి వచ్చారు, ఎలా వచ్చారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు దైనిక్ జాగరణ్ తెలిపింది.
జైలులో ఈ ముగ్గురికి స్నేహం
ఈ ముగ్గురు కూడా క్రిమినల్స్ అని హిందీ డైలీ హిందూస్తాన్ కథనం పేర్కొంది. హత్య, దొంగతనం వంటి పలు సీరియస్ కేసుల్లో ఈ ముగ్గురు జైలుకి వెళ్లొచ్చారని తన కథనంలో చెప్పింది.
జైలులో ఉన్నప్పుడే ఈ ముగ్గురికి స్నేహం కుదిరిందని ఈ వార్తాపత్రిక పేర్కొంది. అతీక్ అహ్మద్, అష్రఫ్‌లను చంపడం ద్వారా ముగ్గురు డాన్‌లుగా ఎదగాలని అనుకున్నారని చెప్పింది.
ఈ ముగ్గురు దుండగుల్లో ఒకరిది హమీర్‌పూర్, మరొకరిది కాస్‌గంజ్, మూడో వ్యక్తిది బాందా అని తెలిపింది.
చిన్నాచితకా నేరాలు చేసి జైలుకి వెళ్తే తమకెలాంటి పేరు రావడం లేదని, ఏదైనా పెద్ద నేరం చేయాలని వారు అనుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయని ఈ వార్తాపత్రిక కోట్ చేసింది.
‘‘పోలీసు కస్టడీలో ఉన్న అతీక్, అష్రఫ్‌లను హాస్పిటల్‌కి తీసుకొస్తున్నట్లు మాకు తెలిసింది. మేం కూడా జర్నలిస్ట్‌ల మాదిరిగా వ్యవహరిస్తూ, వారి మధ్యలోనే ఉండటం ప్రారంభించాం. ఇద్దర్ని చంపాలని మేం ప్లాన్ చేసుకున్నాం’’ అని అతీక్, అష్రఫ్‌లను హత్య చేసిన నిందితులు చెప్పినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, ANI
ఈ ముగ్గురు ప్రణాళిక ప్రకారమే ఈ హత్యకు పాల్పడ్డారని, దాడికి ముందు శుక్రవారం హాస్పిటల్‌కి చేరుకున్న వీరు రెక్కీ నిర్వహించారని తెలిసింది.
శనివారం అతీక్, అష్రఫ్‌లను హాస్పిటల్‌కి తీసుకొచ్చిన సమయంలో జర్నలిస్ట్‌ల మాదిరి వచ్చి, అత్యంత సమీపం నుంచే కాల్పులు జరిపారు.
కాల్పులు జరిపిన వారి నుంచి మూడు పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారంలో వారి వద్ద మరికొన్ని ఆయుధాలు ఉన్నట్లు కూడా గుర్తించారు.
కాగా, శనివారం రాత్రి అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షల కోసం కాల్విన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ ఇద్దరికి ఐదు రోజుల రిమాండ్ విధించారు.
మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సమయంలో అతీక్, అష్రఫ్‌లపై కాల్పులు జరిగాయి. అతీక్ అహ్మద్‌ని పాయింట్ బ్లాంక్ పిస్టల్‌తో కాల్చాడు ఒక దుండగుడు. వెంటనే అష్రఫ్‌పై పలుమార్లు కాల్పులు జరిపారు.
ఈ దాడి తర్వాత దుండగులు పోలీసులకు సరెండర్ అయిపోయారు.
ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్, జర్నలిస్ట్ కూడా గాయాలు పాలయ్యారు.
అతీక్ హత్య తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమంతా సెక్షన్ 144 విధించారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
అతీక్ అహ్మద్ మాజీ ఎంపీ. ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే. ఈ ఇద్దరికి నేర చరిత్ర ఉంది. వీరిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
హత్యకు కొద్దిసేపు ముందు ఏం జరిగింది?
అతీక్ అహ్మద్, అష్రఫ్‌లు హత్య కావడానికి కొద్ది సేపు ముందు, వారిద్దర్ని పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రయాగరాజ్‌లోని కాల్విన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఆస్పత్రి ముందు పోలీసు జీపు ఆగిన వెంటనే, ముందు వైపు సీట్లలోంచి కొందరు పోలీసులు దిగారు. వారు వెనక్కి వచ్చి నిల్చున్నారు. ఆ తర్వాత వెనుక సీటు నుంచి మరికొందరు పోలీసులు దిగారు.
తొలుత అష్రఫ్ జీపు నుంచి దిగారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో అతీక్ అహ్మద్ బయటికొచ్చారు.
అష్రఫ్ బ్లాక్ టీ షర్ట్, పాయింట్ వేసుకుంటే, అతీక్ అహ్మద్ తెల్ల కుర్తా వేసుకున్నారు.
అతీక్, అష్రఫ్‌లు పోలీసు జీపు దిగిన పది సెకన్లలోనే వారిద్దర్ని మీడియా చుట్టుముట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఆస్పత్రి నుంచి 10-15 మీటర్ల దూరంలో వీరిద్దరూ కనిపిస్తున్నారు. ఇద్దర్ని మీడియా పలు ప్రశ్నలు వేయడం ప్రారంభించింది.
‘‘మీరు ఏమైనా చెప్తారా.. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు?’’
వెంటనే అష్రఫ్ స్పందిస్తూ.. ‘‘ఏం చెప్పాలి, దేని గురించి ఏం చెప్పాలి?’’
‘‘ఈ రోజు జరిగిన అంత్యక్రియలు మీరు వెళ్లలేదు. దాని గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?’’ అంటూ ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు.
‘‘ఒకవేళ తీసుకెళ్లకపోతే, మీరు వెళ్లరు కదా.’’ అని అతీక్ అహ్మద్ అన్నారు.
‘‘అసలు విషయం ఏంటంటే..’’ అంటూ అష్రఫ్ ఏదో చెప్పబోయారు.
కెమెరాలో ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నట్లు కనిపించింది. కానీ ఆ సమయానికే ఒకవైపు నుంచి అతీక్ అహ్మద్ తల దగ్గర పిస్టల్ పేలి, బుల్లెట్ దిగింది.
ఆ తర్వాత వారిద్దరిపై పలు మార్లు కాల్పులు జరిగాయి. దీంతో వాళ్లు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















