పోలీసుల ఘోర తప్పిదంతో టీనేజర్‌కు మరణశిక్ష, 28 ఏళ్లు జైల్లోనే..చివరికెలా బయటపడ్డారంటే?

భారత్‌లో 25 ఏళ్ల క్రితం ఒక టీనేజ్ బాలుడికి పొరపాటున మరణ శిక్ష విధించారు. ఆయనను వయోజనుడిగా భావించి హత్య కేసులో ఈ శిక్షను వేశారు.
హత్య జరిగిన సమయంలో అతను టీనేజర్ అని ధ్రువీకరిస్తూ ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీం కోర్టు ఆయనకు జైలు నుంచి విముక్తి కల్పించింది.
ఆ వ్యక్తితో మాట్లాడటం కోసం బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్, రాజస్థాన్‌లోని జలబ్సర్ గ్రామానికి వెళ్లారు.
ప్రస్తుతం ఆ వ్యక్తి వయస్సు 41 ఏళ్లు. ఆయన పేరు నిరాణారామ్ చేతన్‌రామ్ చౌధరీ.
ఆయన మరణ శిక్ష నుంచి బయటపడి ఇటీవలే ఆయన ఇంటికి వచ్చారు. హారాష్ట్రలోని నాగ్‌పూర్ జైలులో ఆయన ఇన్నాళ్లు శిక్షను అనుభవించారు.
చేతన్‌రామ్ 28 ఏళ్ల 6 నెలల 23 రోజుల పాటు కస్టడీలోనే గడిపారు. అంటే మొత్తం 10,431 రోజులు ఆయన జైలులో ఉన్నారు. 18 ఏళ్లు నిండకముందే ఆయనకు శిక్ష పడింది.
పుణేలో ఏడుగురిని హత్య చేసిన కేసులో చేతన్‌రామ్‌కు మరణశిక్ష విధించారు. 1994లో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు హత్యకు గురయ్యారు.
ఈ కేసులో మరో ఇద్దరితోపాటు ఆయనను రాజస్థాన్‌లోని ఆయన స్వగ్రామం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయన వయస్సును 20 ఏళ్లుగా భావించి 1998లో మరణశిక్షను వేశారు.
చేతన్‌రామ్ దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు మార్చి నెలలో సుప్రీం కోర్టు తెరదించింది.
ఈ 30 ఏళ్లలో ఆయన కేసు మూడు కోర్టుల చుట్టూ తిరిగింది. లెక్కలేనన్ని విచారణలు జరిగాయి. చట్టాలు మారాయి. అప్పీళ్లు, క్షమాబిక్ష పిటిషన్, వయస్సు నిర్ధరణ పరీక్షలు, ఆయన పుట్టినతేదీ పత్రాల కోసం అన్వేషణ వంటి ప్రయత్నాలు చేశారు.
నేరం జరిగినప్పుడు చేతన్‌రామ్ వయస్సు 12 ఏళ్ల 6 నెలలు అని చివరకు జడ్జిలు తేల్చారు. ఆయనను బాలనేరస్థుడిగా పరిగణించారు.
భారతీయ చట్టాల ప్రకారం బాలనేరస్థుడికి మరణశిక్షను విధించరు. అన్ని రకాల నేరాలకు బాల నేరస్థులకు గరిష్టంగా మూడేళ్ల శిక్ష ఉంటుంది.

ఒక టీనేజర్‌కు మరణశిక్ష విధించేంత ఘోరమైన తప్పిదం న్యాయవ్యవస్థలో ఎలా జరిగింది?
చేతన్‌రామ్‌ను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఆయనకు సంబంధించిన పేరు, వయస్సు వివరాలను తప్పుగా నమోదు చేశారు.
అరెస్ట్ సమయంలో పోలీసులు తయారు చేసిన మెమోలో ఆయన పేరును నారాయణ్ అని రాశారు.
‘‘ఆయన అరెస్ట్ రికార్డులు చాలా పాతవి. ఒరిజినల్ ట్రయల్ పేపర్లు ఇంకా సుప్రీం కోర్టుకు అందలేదు’’ అని శ్రేయ రస్తోగి అన్నారు.
దిల్లీలోని జాతీయ లా యూనివర్సిటీ అమలు చేస్తోన్న క్రిమినల్ జస్టిస్ ప్రోగ్రామ్ ‘‘ప్రాజెక్ట్ 39 ఎ’’ లో శ్రేయ పని చేస్తున్నారు.
ప్రాజెక్ట్ 39 ఎ ప్రోగ్రామ్ 9 ఏళ్ల పాటు చేసిన కృషి కారణంగానే చేతన్‌రామ్ విడుదల అయ్యారు.
ఆశ్చర్యకరంగా, ఆయన పుట్టినతేదీ తప్పుగా రాశారన్న విషయం, బాలనేరస్థుడనే విషయాలను కోర్టులు, ప్రాసిక్యూటర్లు, డిఫెన్స్ లాయర్లు 2018 చివరి వరకు లేవనెత్తలేదు.
జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల చాలామంది భారతీయులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి తాము ఏ తేదీన, ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు. అలాంటి వారిలో నిరాణారామ్ కూడా ఒకరు.

పాఠశాలలోని ఒక పాత రిజిస్టర్ చివరకు ఆయనను కాపాడింది. నిరాణారామ్ చదివిన పాఠశాలలోని ఆ రిజిస్టర్‌లో 1982 ఫిబ్రవరి 1న ఆయన జన్మించినట్లు రాసి ఉంది.
టీసీలో కూడా పాఠశాలలో చేరిన రోజు, పాఠశాల నుంచి బయటకు వెళ్లిన తేదీల ప్రస్తావన ఉంది. పోలీసులు అరెస్ట్ చేసిన నారాయణ్ అనే వ్యక్తే నిరాణారామ్ అని ధ్రువీకరిస్తూ గ్రామ మండలి అధ్యక్షుడు రాసిచ్చిన పత్రం కూడా ఉంది.
‘‘వ్యవస్థ మొత్తం విఫలమైంది. ప్రాసిక్యూటర్లు, డిఫెన్స్ లాయర్లు, కోర్టులు, ఇన్వెస్టిగేటర్లు అందరూ విఫలమయ్యారు. నేరం జరిగినప్పుడు ఆయన వయస్సు ఎంత ఉందో నిర్ధారించడంలో అందరూ విఫలమయ్యారు’’ అని రస్తోగి అన్నారు.
గతవారం మేం రాజస్థాన్ రాష్ట్రం బికనీర్‌లోని బలబ్సర్ గ్రామానికి వెళ్లాం. అక్కడ 600 ఇళ్లలో 3,000 మంది నివసిస్తున్నారు. నిరాణారామ్ తండ్రి రైతు. తల్లి గృహిణి.
నిరాణారారామ్ నలుగురు సోదరుల కుటుంబాలు అక్కడే ఉంటాయి. వారందరితో కలసి ఉండేందుకు నిరాణారామ్ బలబ్సర్‌కు వచ్చారు.
‘‘నాకే ఇలా ఎందుకు జరిగింది? ఒక చిన్న పొరపాటు కారణంగా నా జీవితంలో ఎక్కువ భాగాన్ని కోల్పోయాను. నేను పోగొట్టుకున్న నా జీవితానికి ఎవరు పరిహారం ఇస్తారు?’’ అని నిరాణారామ్ అన్నారు.
నిరాణారామ్ విషయంలో జరిగిన తప్పుకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారాన్ని ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, AFP
1998లో నిరాణారామ్ తో పాటు సహ నిందితుడికి శిక్ష వేస్తున్నప్పుడు ఇది ‘‘అత్యంత అరుదైన కేసు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. నిరాణారామ్ ఇప్పుడు బయటకు రాగా, మరో వ్యక్తి జీవితఖైదు అనుభవిస్తున్నారు.
1994 ఆగస్టు 26న పుణేలో ఒక కుటుంబాన్ని కత్తితో హత్య చేశారు. బాధితుల ఇంట్లో దొంగతనానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ హత్యలు జరిగాయి.
బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఒక వ్యక్తి, నగరంలోని తమ స్వీట్ షాపులో పనిచేసేవారు.
హత్యలు జరగడానికి వారం రోజుల ముందే ఆయన పని నుంచి తప్పుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. (ఆ తర్వాత ఆయన అప్రూవర్‌గా మారి ప్రాసిక్యూషన్‌కు సహాయం చేసి జైలు నుంచి విడుదల అయ్యారు)
టీనేజర్ నిరాణారామ్ సహా మిగతా ఇద్దరు నిందితుల గురించి ఆ బాధిత కుటుంబీకులకు తెలియదు.
‘‘వారు దొంగతనం చేయడం కోసమే వచ్చి ఉంటే, ఇంట్లోని అందర్నీ చంపాల్సిన అవసరం ఏంటి?’’ అని 2015లో వార్తా పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో బాధిత కుటుంబానికి చెందిన సంజయ్ రాతి అన్నారు.
తన గ్రామంలోని పాఠశాలలో మూడో తరగతి చదివిన తర్వాత ఇంటి నుంచి పారిపోయినట్లు నిరాణారామ్ చెప్పారు.
ఇంటి నుంచి ఎందుకు పారిపోయారు? అని అడగగా ‘‘నాకేం గుర్తు లేదు. నేను ఎవరితో పారిపోయానో కూడా గుర్తు లేదు. పుణేకు చేరుకున్నాక అక్కడ టైలరింగ్ షాపులో పని చేశాను’’ అని నిరాణారామ్ తెలిపారు.
నిరాణారామ్ ఎందుకు ఇంటి నుంచి పారిపోయాడో ఆయన సోదరుల్లో ఎవరికీ గుర్తు లేదు.
హత్యల సంగతి ఏంటి?
‘‘నేరానికి సంబంధించి కూడా నాకేం గుర్తులేదు. నన్ను పోలీసులు ఎందుకు పట్టుకున్నారో కూడా తెలియదు. అరెస్ట్ చేశాక వారు నన్ను కొట్టింది మాత్రం గుర్తుంది. ఎందుకు కొడుతున్నారని పోలీసులు అడిగితే మరాఠీలో వారు ఏదో అన్నారు. నాకు అప్పుడు మరాఠీ ఏమీ తెలియదు’’ అని నిరాణారామ్ చెప్పారు.
నేరం ఒప్పుకున్నారా?
‘‘నాకు గుర్తు లేదు. కానీ, పోలీసులు నాతో చాలా పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారు. నేను అప్పుడు చాలా చిన్నవాడిని. నన్ను అన్యాయంగా ఇరికించారని నేను అనుకుంటున్నా.’’
అంటే మీరేం నేరం చేయలేదని అంటున్నారా అని నేను అడగగా ఆయన ఇలా బదులిచ్చారు.
‘‘నేను నేరాన్ని ఒప్పుకోవట్లేదు, తిరస్కరించట్లేదు. నాకు ఏదైనా గుర్తొస్తే నేను దానికి సంబంధించి మరింత బాగా చెప్పగలను. కానీ, నాకు ఏ జ్ఞాపకాలు లేవు, నా ఫ్లాష్‌బ్యాక్‌లు గుర్తు రావడం లేదు’’ అని నిరాణారామ్ అన్నారు.
12 ఏళ్ల బాలుడు ఇంతటి ఘోరమైన నేరాన్ని చేయగలడా? అని గత నెలలో ఆయన విడుదల సందర్భంగా సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

జైలులోని తొలి రోజులు ఎలా గడిచాయో తనకు గుర్తులేదని నిరాణారామ్ అన్నారు. తోటి ఖైదీలు, జైలు సిబ్బంది తనను తిట్టడం గుర్తుందని చెప్పారు.
నాగ్‌పూర్ జైలులో ఖైదీ నంబర్ 7432గా ఉన్న సమయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పుణే జైలులో కూడా ఆయన గడిపారు.
భయం కారణంగా తోటి ఖైదీలతో స్నేహం చేయలేదని ఆయన చెప్పారు. ఒంటరితనంపై పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
జైలులో ఉంటూనే చదువుకుంటూ పరీక్షలు రాసి పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు వెల్లడించారు. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు.
జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఆయన పొలిటికల్ సైన్స్ చదవడం కోసం సన్నద్ధం అవుతున్నారు.
ఏదో ఒక రోజు విడుదలైతే భారత్ మొత్తం తిరగాలని అనుకున్నట్లు చెప్పారు. అందుకే టూరిజం స్టడీస్‌లో ఆరు నెలల కోర్సును చదివినట్లు తెలిపారు.
‘గాంధీయన్ థాట్స్’పై కోర్సు చేయడంతో పాటు జైలులో ఉన్నప్పుడు పుస్తకాలే తనకు మంచి స్నేహితులని ఆయన చెప్పారు.
చాలా ఉత్సాహంగా పుస్తకాలు చదివేవాడినని తెలిపారు. గాంధీ రచనలతో పాటు భారత ప్రముఖ రచయితలైన చేతన్ భగత్, దుర్జోయ్ దత్తా పుస్తకాలు, షిడ్నీ షెల్డన్ థ్రిల్లర్లు చదివినట్లు చెప్పారు.
ప్యోడర్ డోస్తోవస్కీ రాసిన ‘‘క్రైమ్ అండ్ పనిష్‌మెంట్’’ పుస్తకం తనకు నచ్చిందని అన్నారు. జాన్ గ్రీషమ్ రచించిన ‘‘ద కన్ఫెషన్’’ నవల తన ఫేవరెట్ పుస్తకం అని తెలిపారు.

తనకు రెండు ఇంగ్లీషు వార్తా పత్రికలే బయటి ప్రపంచాన్ని చూపించాయని నిరాణారామ్ చెప్పారు. వాటిని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివే వాడినని, అందులో వచ్చే ప్రకటనల్లో ఒకటైన వీన్ డీజిల్‌ను చూసి తాను కూడా జుట్టును అలా షేవ్ చేసుకున్నానని వెల్లడించారు.
యుక్రెయిన్ యుద్ధం గురించి కూడా తాను పత్రికల ద్వారానే తెలుసుకున్నానని, ప్రపంచమంతటికీ ఆమోదయోగ్యమైన నాయకత్వం లేకపోవడం వల్ల రెండు దేశాల మధ్య చర్చలకు అవకాశం లేకుండా పోయిందని రస్తోగీకి రాసిన లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘నేను చదివేవాడిని, రాసేవాడిని, అలాగే బోర్ ఫీలయ్యే వాడిని’’అని నిరాణారామ్ అన్నారు.
ఇప్పటికే ఇంగ్లీష్, మరాఠీ, హిందీ, పంజాబీ భాషలను నేర్చుకున్న నిరాణారామ్, మలయాళం నేర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.
అయితే రాజస్థాన్‌లో తన తల్లిదండ్రులు , బంధువులు మాట్లాడే మాతృభాషను మాత్రం మర్చిపోయారు.
చాలా ఏళ్ల తర్వాత తన కొడుకు తిరిగి వస్తున్నాడన్న సంతోషంతో నిరాణారామ్ 70ఏళ్ల తల్లి అన్నీదేవి డీజే సంగీతానికి డాన్సు చేశారు. చివరకు తన కొడుకును చూసే సమయం వచ్చేసరికి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.
కానీ, కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్న మాటలు ఇద్దరికీ అర్థం కాలేదు. ( నిరాణారామ్ తండ్రి 2019లో మరణించారు)
"మేము ఒకరినొకరు చూసుకున్నాం. ఆమె చాలా మారిపోయింది" అని నిరాణారామ్ అన్నారు.

ఈ ఏడాది మార్చి చివరిలో నిరాణారామ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతదేశం ఎంతగా మారిపోయిందో అతనికి అర్ధమైంది.
"రోడ్డు మీద కొత్త కొత్త కార్లు ఉన్నాయి, ప్రజలు అందమైన దుస్తులు ధరించారు, రోడ్లు బాగున్నాయి" అంటూ ఆయన నవ్వారు.
"సినిమా స్టార్లు మాత్రమే కొనగలరని నేను భావించే హయబుసా బైక్‌ల మీద యువకులు రయ్ మంటూ దూసుకుపోతున్నారు. నిజంగానే దేశం చాలా మారిపోయింది’’ అన్నారాయన.
ఇంటికొచ్చాక అందరిలో కలిసిపోవడానికి భాష ఆయనకు అవరోధంగా మారింది. అతను మరాఠీ, ఇంగ్లీష్, హిందీలను మాత్రమే మాట్లాడగలడు. కానీ, అతని కుటుంబీకులు, బంధువులకు ఇంగ్లీష్, మరాఠీ తెలియవు. హిందీని కొద్ది కొద్దిగా అర్ధం చేసుకోగలరు.
ప్రతిరోజూ తల్లీ కొడుకూ ఒకరినొకరు చూసుకుంటూ కాసేపు గడుపుతారు. హిందీని అర్ధం చేసుకోగల అతని మేనల్లుడు వారి మధ్య అనువాదకుడిగా వ్యవహరిస్తుంటాడు.
"నేను నా సొంత ఇంట్లోనే అపరిచితుడిగా మారిపోయాను’’ నిరాణారామ్ చెప్పారు.
జనంలో కలిసిపోవడం, విశాలమైన ప్రదేశాలకు వెళ్లడం తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని నిరాణారామ్ చెప్పారు.
"పబ్లిక్ ప్లేసులకు వెళ్లడానికి, ఎక్కువమందిని కలవడానికి ఇబ్బంది పడుతున్నాను. జైళ్లలో చిన్న చిన్న గదులలో, చాలాకొద్ది మందితో గడిపిన అనుభవం నాది. మరణశిక్ష పడ్డవారికి విధించే ఏకాంతవాసం మనల్ని సామాజికంగా ఒంటరివారిని చేస్తుంది. ఒక స్వేచ్ఛా జీవిగా ఎలా బతకాలో నేర్చుకోవాలి’’ అని నిరాణారామ్ అన్నారు.
ప్రజలతో ముఖ్యంగా మహిళలతో ఎలా మాట్లాడాలో తనకు తెలియదని నిరాణారామ్ అన్నారు.
"ఆడవారితో ఎలా మాట్లాడాలో నేర్పించమని నేను ఎవరినైనా ఎలా అడగగలను? అందుకే వారితో ఇంటరాక్ట్ అయ్యే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి" అన్నారాయన.

నిరాణారామ్ ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. కుటుంబం ఆయనకు మొబైల్ ఫోన్ కొనిచ్చింది. దానిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్నారు.
మేనల్లుళ్లు ఆయనకు ఫేస్‌బుక్, వాట్సాప్ అకౌంట్‌లు ఓపెన్ చేశారు. అతని సోదరులు వ్యవసాయం చేస్తుంటారు. కానీ నిరాణారామ్ లా చదివి సామాజిక సేవ చేయాలని కోరుకుంటున్నారు.
దానిద్వారా విధివంచితులైన ఖైదీలకు సహాయం చేయాలన్నది ఆయన కోరిక.
నిరాణారామ్ తమ గ్రామంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారని, మరణశిక్ష నుంచి బయటపడ్డ ఆయన్ను చూడటానికి అనేకమంది వస్తున్నారని మేనల్లుడు రాజు చౌదరి చెప్పాడు.
తన సోదరుడి ఇంటిలో ఉంటూ మేనల్లుళ్లకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు నిరాణారామ్. జైలులో జీవితం చాలా నెమ్మదిగా ఉంటుందని, వేగవంతమైన ఈ బయటి ప్రపంచానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని అన్నారాయన.
"నేను గతం, భవిష్యత్తుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాను. ఇప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని నేను ఆలోచిస్తున్నా. ఇది నానా భావోద్వేగాల సంగమం" అన్నారు నిరాణారామ్
(అదనపు సమాచారం: అంతరిక్ష్ జైన్)
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














