'యువరానర్... సాక్ష్యాలను కోతులు ఎత్తుకెళ్లాయ్'- కోర్టు ముందు పోలీసుల వివరణ

కోతి, ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, మోహర్ సింగ్ మీనా
    • హోదా, జైపూర్ నుంచి

"హత్యకు సంబంధించిన ఆధారాలు అన్నింటినీ కోతులు ఎత్తుకెళ్లాయి"

పోలీసులే స్వయంగా ఈ విషయం చెప్పారు. అది కూడా కోర్టుకు.

ఒక హత్య కేసును విచారిస్తోన్న జైపూర్ ట్రయల్ కోర్టుకు రాజస్తాన్ పోలీసులు చెప్పిన సమాధానం ఇది.

హత్యకు వాడిన కత్తితో సహా సాక్ష్యాలన్నింటినీ కోతులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కోర్టుకు చెప్పారు.

2016 నాటి హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రవేశపెట్టాలని గత విచారణ సందర్భంగా పోలీసులను కోర్టు ఆదేశించింది.

దాంతో హత్యకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలు ఇప్పుడు తమ వద్ద లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు.

సాక్ష్యాధారాలను కోతులు ఎత్తుకెళ్లినట్లు జైపూర్ రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మనీశ్ అగర్వాల్ రాతపూర్వకంగా కోర్టుకు వివరణ ఇచ్చారు.

''ఈ కేసు 2016 నాటిది. 2017లో సాక్ష్యాలను కోతులు ఎత్తుకెళ్లినట్లు సాక్ష్యాధారాలను భద్రపరిచే కేంద్రం అప్పటి ఇన్‌చార్జ్ రికార్డుల్లో నమోదు చేశారు. సాక్ష్యాధారాలకు సంబంధించిన ఎస్‌ఎఫ్‌ఎల్ దర్యాప్తు నివేదిక వచ్చింది. జైపూర్ అదనపు ఎస్పీ దీనిపై దర్యాప్తు చేస్తున్నారు'' అని ఎస్పీ మనీశ్ అగర్వాల్ బీబీసీతో చెప్పారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం హత్యకు సంబంధించిన కత్తి, రక్తంతో కూడిన దుస్తులు, ఘటన జరిగిన ప్రాంతంలో సేకరించిన మట్టి నమూనాలు, రక్త నమూనాలు, చెప్పులు, మొబైల్ ఫోన్ ఇలా 15 కీలక ఆధారాలను ఒక డబ్బాలో భద్రపరిచారు. ఈ డబ్బాను జైపూర్ రూరల్ చంద్‌వాజీ పోలీస్‌ స్టేషన్‌లోని సాక్ష్యాధారాలను భద్రపరిచే కేంద్రంలో ఉంచారు. అక్కడి నుంచి వాటిని కోతులు ఎత్తుకెళ్లాయని చెబుతున్నారు.

సాక్ష్యాధారాల విషయంలో పోలీసుల వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

సాక్ష్యాలకు సంబంధించిన ఎస్‌ఎఫ్‌ఎల్ నివేదికను కోర్టులో ప్రవేశపెట్టినట్లు జైపూర్ రూరల్ అడిషనల్ ఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. దీనిపై తదుపరి కోర్టు విచారణ మే 13న జరుగనుంది.

జైపూర్ రూరల్ ఎస్పీ మనీశ్ అగర్వాల్

ఫొటో సోర్స్, BBC/MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, జైపూర్ రూరల్ ఎస్పీ మనీశ్ అగర్వాల్

బాధ్యులు ఎవరు?

చంద్‌వాజి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే దిలీప్ సింగ్ దీని గురించి బీబీసీతో మాట్లాడారు.

''హత్యకు సంబంధించిన సాక్ష్యాలను మాల్ఖానా (సాక్ష్యాధారాలను భద్రపరిచే కేంద్రం)లో ఉంచారు. అక్కడున్నప్పుడే వాటిని కోతులు ఎత్తుకెళ్లాయి. ఇప్పుడు అక్కడ పనిచేసే సిబ్బంది మారిపోయారు. ఇన్‌చార్జ్ కూడా రిటైర్ అయ్యారు. హత్యకు వాడిన కత్తి, దుస్తులు, చెప్పులు ఇలా అన్నింటినీ ఒకే దగ్గర పెట్టారు. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి'' అని ఆయన వివరించారు.

సాక్ష్యాధారాల డబ్బాను కోతులు ఎత్తుకెళ్లాయని, అప్పటి మాల్ఖానా ఇన్‌చార్జ్ హనుమాన్ సహాయ్ యాదవ్ పోలీస్‌స్టేషన్ జర్నల్‌లో నమోదు చేశారని కోర్టుకు పోలీసులు తెలిపారు.

రిటైర్మెంట్ అనంతరం హనుమాన్ సహాయ్ యాదవ్ 2021లో మరణించారు.

పోలీసుల వివరణపై ప్రశ్నలు లేవనెత్తిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ అంశంలో న్యాయపరమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

రాజస్తాన్ పోలీస్ కార్యాలయం

ఫొటో సోర్స్, BBC/MOHAR SINGH MEENA

సాక్ష్యాలు కనిపించకపోవడంపై దర్యాప్తు

సాక్ష్యాలను కోతులు ఎత్తుకెళ్లిన ఘటనపై జైపూర్ రూరల్ అడిషనల్ ఎస్పీ ధర్మేంద్ర విచారణ చేపట్టారు.

''సాక్ష్యాలు ఉంచిన డబ్బాను కోతులు ఎత్తుకెళ్లినట్లు అప్పటి ఇన్‌చార్జ్ రికార్డుల్లో నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయగా మాల్ఖానా ఇన్‌చార్జ్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలింది. ఈ ఘటన జరిగిన తర్వాత దీని గురించి ఆయన తన పై అధికారులకు కూడా చెప్పలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగా ఆయనపై చర్య తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ, రిటైర్మెంట్ అనంతరం ఆయన 2021లో మరణించినట్లు తెలిసింది'' అని బీబీసీతో ధర్మేంద్ర తెలిపారు.

2016లో శశికాంత్ శర్మ హత్యకు గురయ్యారు

ఫొటో సోర్స్, BBC/MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, 2016లో శశికాంత్ శర్మ హత్యకు గురయ్యారు

హత్య కేసులో ఇద్దరు నిందితులు

చంద్‌వాజీలోని సీకర్ ప్రాంతానికి చెందిన శశికాంత్ శర్మ, 2016లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చనిపోయి కనిపించారు. నేరస్థులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు దిల్లీ-జైపూర్ హైవేపై నిరసన కార్యక్రమాలు చేశారు. దీనిపై వివాదం ముదరడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్యారోపణలతో చంద్‌వాజీకి చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

హత్య చేసేందుకు వాడినట్లుగా భావిస్తోన్న ఒక కత్తిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అనేక ఆధారాలను సేకరించారు.

ఇదే కేసుపై జైపూర్ ట్రయల్ కోర్టు (ఏడీజే)లో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు, సాక్ష్యాలను కోరగా... పోలీసులు కోతులు ఎత్తికెళ్లినట్లుగా చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, భీమడోలులో పోలీసు కస్టడీలో అనుమానితుడి ఆత్మహత్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)